flak
-
OU: ఓయూ తీరుపై విమర్శలు.. ‘నడకకు రేటు కడితే ఎలా..?’
సాక్షి, హైదరాబాద్: దట్టమైన అడవిని తలపించే పచ్చిక బయళ్ల మధ్య ఉస్మానియా అందాలను ఆస్వాదిస్తూ నిత్యం వేలాది మంది చేసే వాకింగ్‌కు ఓయూ అధికారులు వెలకట్టారు. ఆర్థిక వనరులను సమకూర్చుకునే పనిలో భాగంగా సెక్యూరిటీ పేరుతో యూజర్ చార్జీల వసూలుకు పూనుకున్నారు. సినిమా షూటింగ్, వాకింగ్, జిమ్, గేమ్స్ ఇలా ప్రతిదానికి ఓ రేటు నిర్ణయించారు. దీనిపై యూనివర్సిటీలో నిత్యం వాకింగ్ చేసే ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వాస్తవానికి డిసెంబర్ ఒకటి నుంచే యూజర్ చార్జీలు వసూలు చేయాల్సి ఉన్నప్పటికి మొదటి వారం తరువాత ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఓయూలో వాకింగ్.. మైమరిపించే అనుభూతి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల వారికి ఉస్మానియా ప్రకృతి ప్రసాదించిన వరం. నిజాం కాలం నుంచి ఇప్పటివరకు ఎంతో మంది తెల్లవారు జామున 5గంటల నుంచి ఉదయం 10గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఇక్కడ వాకింగ్ చేసి సేద తీరుతుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, బీపీ, షుగర్ వ్యాధులున్న వారితో పాటు అధిక బరువుతో బాధపడేవారు డాక్టర్ల సూచన మేరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేసేందుకు ఇక్కడకు వస్తుంటారు. యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల, మినీ టెక్, ఐపీఈల వెనుక దట్టమైన అడవిని తలపించే మార్గంలో వాకింగ్ చేయడం ఈ ప్రాంత వాసులకు మరిచిపోలేని అనుభూతి. పొద్దున్నే పురివిప్పి నాట్యం చేసే నెమళ్ల మధ్య నడుచుకుంటూ వెళ్తుంటే మైమరచిపోయే అనుభూతి కలుగుతుంది. సామాన్యులతో పాటు హర్యాణా గరవ్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, విద్యావేత్త చుక్కా రామయ్య ఇలా ఎంతో మంది ప్రజాప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ప్రముఖులు, ఉన్నతాధికారులు యూనివర్సిటీలో వాకింగ్ అనుభూతిని పొందినవారే. దీంతోపాటు ఓయూలోని ప్లేగ్రౌండ్స్‌లో వందలాది యువత క్రికెట్, వాలీబాల్, రన్నింగ్‌తో పాటు ఇతర ఆటలు ఆడుతూ క్రీడా స్ఫూర్తిని పొందుతున్నారు. భద్రత పేరుతో బాదుడు ఉస్మానియా యూనివర్సిటీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, భద్రత కరువైందని, నిర్మానుష్య ప్రాంతంలో పగలు, రాత్రి అనే తేడాలేకుండా ఆకతాయిలు మద్యం సేవిస్తున్నారని.. దీనిని నియంత్రించాలనే ఉద్దేశంతోనే యూజర్ చార్జీల నిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం పసలేదని వాకర్స్ కొట్టిపడేస్తున్నారు. యూనిర్సిటీలో గత కొన్నేళ్లుగా సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్న పాతవారిని ఇటీవల తొలగించి రిటైర్డ్ ఆర్మీకి చెందిన వారికి ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. వారి జీతభత్యాలను సమకూర్చుకోవడం కోసమే యూజర్ చార్జీల ఆలోచనను తీసుకువచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేలాది మందికి ప్రతిరోజూ ఆరోగ్య ప్రధాయినిగా ఉన్న యూనివర్సిటీలో ఎంతో మంది ప్రాణవాయువు ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే వారినుంచి డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశి్నస్తున్నారు. ఒకరిద్దరు అసాంఘిక శక్తులు ఉంటే వారిని కట్టడి చేయాలని, గస్తీని ముమ్మరం చేయాలని కోరుతున్నారు. కుటుంబంపై భారం నేను, నా భార్య ఎన్నో ఏళ్లుగా ఉస్మానియాలో వాకింగ్ చేస్తున్నాం. ఎప్పుడూ ఎటువంటి అభద్రతా భావం మాలో కలగలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా వాకర్స్‌కి మెరుగైన వసతులు కల్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 200 రూపాయలు వసూలు చేయడం అన్యాయం. కొంత మంది కుటుంబ సమేతంగా వాకింగ్ చేస్తారు. వారంతా నెలకు 1000 రూపాయలు వాకింగ్ కోసం చెల్లించాలంటే చాలా భారం అవుతుంది. అధికారులు ఈ నిర్ణయం పట్ల పునరాలోచన చేయాలి. –కౌండిన్యా ప్రసాద్, వాకర్ స్వేచ్ఛగా గాలి పీల్చేందుకు ఆంక్షలా..? యూనివర్సిటీ దగ్గరగా ఉందనే ఈ ప్రాంతంలో ఇళ్లు తీసుకుని ఉంటున్నాం. ప్రతి రోజు క్రమం తప్పకుండా స్నేహితులతో కలిసి వాకింగ్ చేస్తుంటా. ఇప్పుడు అకస్మాత్తుగా యూజర్ చార్జీలు వసూలు చేయడం సరైన నిర్ణయం కాదు. నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ఇక్కడ వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అసాంఘిక కార్యక్రమాలు అరికట్టాలంటే భద్రత పెంచి గస్తీని ముమ్మరం చేయాలి. అవసరం అనుకుంటే ఉచితంగా ఐడీ కార్డులను పంపిణీ చేయాలి. –ఎం.నర్సయ్య, వాకర్ -
అధ్యక్షపదవి అభ్యర్ధిగా ట్రంప్ కొనసాగుతారా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షపదవి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ మంగళవారం సొంత పార్టీపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. మహిళల గురించి ట్రంప్ అసభ్యంగా మాట్లాడిన వీడియో బయటపడిన తర్వాత సొంతపార్టీ నేతలు ఆయన్ను దూరం పెడుతున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ ట్విట్టర్ లో రిపబ్లికన్లను దుర్భాషలాడారు. కుటిలమైన హిల్లరీ కంటే విధేయత లేని రిపబ్లికన్లే డేంజర్ అని అన్నారు. రిపబ్లికన్లకు ఎలా గెలవాలో తెలియదని వాళ్లకు గెలుపు అంటే ఎంటో తాను చూపిస్తానని విమర్శించారు. హౌస్ స్పీకర్ పాల్ ర్యాన్ బలహీనుడని ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని వ్యాఖ్యానించారు. సెనేటర్ జాన్ మెక్ కెయ్ న్ కు మాట్లాడం రాదన్న ట్రంప్, ప్రాథమిక ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని తన బిచ్చగాడిలా బతిమాలారని అన్నారు. తనకు సంకెళ్లు తెగిపోయాయని మరో ట్విట్టర్ పోస్టులో వ్యాఖ్యానించిన ట్రంప్ ఇక అమెరికన్ల కోసం తాను పూర్తి స్వతంత్రతో పోరాడుతానని చెప్పారు. మహిళలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను 30మందికి పైగా రిపబ్లికన్ గవర్నర్లు, నేతలు తీవ్రంగా పరిగణించారు. ట్రంప్ కు అనుకూలంగా ఓటు వేయమని వీరందరూ తేల్చిచెప్పారు.అయితే, ట్రంప్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయని రిపబ్లికన్ హౌస్ స్పీకర్ పాల్ ర్యాన్ తాను ఆయనకు అనుకూలం కాదు అలాగని వ్యతిరేకం కూడా కాదని ఓ సమావేశంలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఫాక్స్ న్యూస్ ఇచ్చిన ఓ ఇంటర్వూలో స్పందించిన ట్రంప్ తనకు పాల్ ర్యాన్ మద్దతు అవసరం లేదని అన్నారు. తాను ప్రజల కోసం గెలవాలనుకుంటున్నానని చెప్పారు. ప్రజల బాధలను ర్యాన్ పట్టించుకోవడం లేదని అన్నారు. సరిహద్దు వివాదాలు, బడ్జెట్లు తదితరాలను గాలికి వదిలేశారని విమర్శించారు. గత శుక్రవారం ట్రంప్ కు తన మద్దతును ఉపసంహరించుకున్న అరిజోనా సెనేటర్ జాన్ మెక్ కెయిన్ పైనా ట్రంప్ విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా అధికార ప్రతినిధి సైతం మహిళలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని అన్నారు. ఇవి లైంగిక వేధింపులకు వస్తాయని చెప్పారు. మొత్తం 331మంది సెనేటర్ల కలిగిన రిపబ్లికన్ పార్టీలో సగం మందికి పైగా ట్రంప్ వ్యాఖ్యలను ఖండించారు. వీరిలో 10శాతం మంది ట్రంప్ వెంటనే అధ్యక్షపదవి అభ్యర్ధి రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అధ్యక్ష పదవి అభ్యర్ధిగా ట్రంప్ ను రిపబ్లికన్ పార్టీ తొలగిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సాంకేతికంగా మాత్రం అధ్యక్షపదవి అభ్యర్ధి రేసు నుంచి ట్రంప్ ను తొలగించే అవకాశాలు కనిపించడం లేదు. రిపబ్లికన్ జాతీయ కమిటీ నిబంధనల ప్రకారం అధ్యక్షపదవి అభ్యర్ధి మరణించినా లేదా మరేదైనా కారణంతోనో తొలగించి వేరొకరిని ఆ స్ధానంలో నిలబెట్టొచ్చు. కానీ, ఈ అవకాశాన్ని రిపబ్లికన్ పార్టీ గత ఆగష్టు నెలలోనే పోగొట్టుకుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఓట్లు వేయడం పూర్తికావడంతో ట్రంప్ ను అధ్యక్ష రేసు నుంచి తొలగించే అవకాశం లేదు. -
ఆటో డ్రైవర్ కుటుంబంపై ఖాకీ క్రౌర్యం
చెన్నై: ఓ ఆటో డ్రైవర్ కుటుంబంపై ముగ్గురు ఖాకీలు తమ ప్రతాపం చూపించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తిరువణ్ణామలై జిల్లా చెంగం లో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పంచాయితీ శానిటరీ కార్మికురాలు ఉష, ఆటో డ్రైవర్ రాజా భార్యాభర్తలు. వీరికి సూర్య (17) కొడుకు కూడా ఉన్నాడు. రాజా,ఉష మధ్య స్వల్ప తగాదా రావడంతో భార్యను చెంపమీద కొట్టాడు రాజా. అనవసరంగా బంగారం కొనుగోలు చేసిందన్నది రాజా ఆరోపణ. వారిద్దరి మధ్య వివాదం నడుస్తుండగా అక్కడే ఉన్న ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లు కల్పించుకున్నారు. అనంతరం రాజాపై చేయి చేసుకున్నారు. విషయాన్ని రాజా వివరించే లోపే మురుగనందం, విజయ కుమార్, నమ్మాజ్వార్ అనే కాని స్టేబుళ్లు రాజాపై విరుచుకుపడి వీరంగం సృష్టించారు .పట్టపగలు నడివీధిలో తమ ఖాకీ క్రౌర్యాన్ని ప్రదర్శించారు. అడ్డొచ్చిన సూర్యపైనా లాఠీ ఝళిపించారు. తన భర్తను, కొడుకుని విడిచిపెట్టమని ఉష వేడుకున్నా వినకుండా ప్రతాపాన్ని చూపించారు. అంతేకాదు ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించిన అక్కడ గుమిగూడిన వారిని కూడా లాఠీలతో చితక బాదారు. చివరికి బాధితులను అలాగే వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో ప్రమాదాన్ని పసిగట్టిన మిగతాపోలీసులు హాస్పిటల్ కు వచ్చి బాధితులతో బేర సారాలకు దిగారు. కానీ అప్పటికే ఆ దృశ్యాలన్నీ మీడియాలో హల్ చల్ చేశాయి. దీంతో వివాదం ముదిరి ..పోలీస్ ఉన్నతాధికారుల వద్దకు చేరింది. మరోవైపు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు, తొక్కవాది గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తమపై విరుచుకుపడిన ముగ్గురు పోలీసులపైనా కేసులు నమోదు చేయాలని కోరారు. దీనిపై జిల్లా ఎస్పీ ఆర్. పొన్ని ని వివరణ కోరగా విచారణ జరుగుతోందని, చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముగ్గురు నిందితులను వెల్లూరు బదిలీ చేశామని.. ఈ ఘటనపై చెంగం డీఎస్పీ పూర్తి విచారణ తరువాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. దీనిపై స్థానిక ప్రజాసంఘాలు, వామపక్షపార్టీలు విమర్శలు గుప్పించాయి. -
మోదీపై భగ్గుమన్న మహిళాలోకం
న్యూఢిల్లీ: మహిళాలోకం ఒక్కసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు. బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా అక్కడి ప్రధానమంత్రి షేక్ హసీనాను ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఆయనకు ఈ చిక్కులు తెచ్చిపెట్టాయి. మోదీ ఢాకా యూనివర్సిటీలో ఆదివారం ప్రసంగించారు. ఆ సందర్భంగా ప్రధాని షేక్ హసీనాపై ప్రశంసలు కురిపిస్తూనే.. ఆమె ఒక మహిళై ఉండి కూడా దేశంలో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారని, అలుపెరగకుండా ఆమె చేస్తున్నీ ఈ ప్రయత్నం గొప్ప ముందడుగని చెప్పారు. దీంతో మహిళలైతే ఉగ్రవాదాన్ని రూపుమాపలేరా అంటూ ట్విట్టర్లో పలువురు ప్రశ్నలు గుప్పించారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు లింగ వివక్షను ప్రదర్శించేలా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. మోదీ లింగ వివక్షను ప్రదర్శించే వ్యక్తి అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ ఝా ట్వీట్ చేశారు. మరికొందరు సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో మోదీ వ్యాఖ్యలను విమర్శిస్తూ ట్వీట్లు చేశారు.