అధ్యక్షపదవి అభ్యర్ధిగా ట్రంప్ కొనసాగుతారా?
అధ్యక్షపదవి అభ్యర్ధిగా ట్రంప్ కొనసాగుతారా?
Published Wed, Oct 12 2016 11:39 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షపదవి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ మంగళవారం సొంత పార్టీపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. మహిళల గురించి ట్రంప్ అసభ్యంగా మాట్లాడిన వీడియో బయటపడిన తర్వాత సొంతపార్టీ నేతలు ఆయన్ను దూరం పెడుతున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ ట్విట్టర్ లో రిపబ్లికన్లను దుర్భాషలాడారు. కుటిలమైన హిల్లరీ కంటే విధేయత లేని రిపబ్లికన్లే డేంజర్ అని అన్నారు.
రిపబ్లికన్లకు ఎలా గెలవాలో తెలియదని వాళ్లకు గెలుపు అంటే ఎంటో తాను చూపిస్తానని విమర్శించారు. హౌస్ స్పీకర్ పాల్ ర్యాన్ బలహీనుడని ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని వ్యాఖ్యానించారు. సెనేటర్ జాన్ మెక్ కెయ్ న్ కు మాట్లాడం రాదన్న ట్రంప్, ప్రాథమిక ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని తన బిచ్చగాడిలా బతిమాలారని అన్నారు.
తనకు సంకెళ్లు తెగిపోయాయని మరో ట్విట్టర్ పోస్టులో వ్యాఖ్యానించిన ట్రంప్ ఇక అమెరికన్ల కోసం తాను పూర్తి స్వతంత్రతో పోరాడుతానని చెప్పారు. మహిళలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను 30మందికి పైగా రిపబ్లికన్ గవర్నర్లు, నేతలు తీవ్రంగా పరిగణించారు. ట్రంప్ కు అనుకూలంగా ఓటు వేయమని వీరందరూ తేల్చిచెప్పారు.అయితే, ట్రంప్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయని రిపబ్లికన్ హౌస్ స్పీకర్ పాల్ ర్యాన్ తాను ఆయనకు అనుకూలం కాదు అలాగని వ్యతిరేకం కూడా కాదని ఓ సమావేశంలో పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఫాక్స్ న్యూస్ ఇచ్చిన ఓ ఇంటర్వూలో స్పందించిన ట్రంప్ తనకు పాల్ ర్యాన్ మద్దతు అవసరం లేదని అన్నారు. తాను ప్రజల కోసం గెలవాలనుకుంటున్నానని చెప్పారు. ప్రజల బాధలను ర్యాన్ పట్టించుకోవడం లేదని అన్నారు. సరిహద్దు వివాదాలు, బడ్జెట్లు తదితరాలను గాలికి వదిలేశారని విమర్శించారు. గత శుక్రవారం ట్రంప్ కు తన మద్దతును ఉపసంహరించుకున్న అరిజోనా సెనేటర్ జాన్ మెక్ కెయిన్ పైనా ట్రంప్ విరుచుకుపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా అధికార ప్రతినిధి సైతం మహిళలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని అన్నారు. ఇవి లైంగిక వేధింపులకు వస్తాయని చెప్పారు. మొత్తం 331మంది సెనేటర్ల కలిగిన రిపబ్లికన్ పార్టీలో సగం మందికి పైగా ట్రంప్ వ్యాఖ్యలను ఖండించారు. వీరిలో 10శాతం మంది ట్రంప్ వెంటనే అధ్యక్షపదవి అభ్యర్ధి రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
దీంతో అధ్యక్ష పదవి అభ్యర్ధిగా ట్రంప్ ను రిపబ్లికన్ పార్టీ తొలగిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సాంకేతికంగా మాత్రం అధ్యక్షపదవి అభ్యర్ధి రేసు నుంచి ట్రంప్ ను తొలగించే అవకాశాలు కనిపించడం లేదు. రిపబ్లికన్ జాతీయ కమిటీ నిబంధనల ప్రకారం అధ్యక్షపదవి అభ్యర్ధి మరణించినా లేదా మరేదైనా కారణంతోనో తొలగించి వేరొకరిని ఆ స్ధానంలో నిలబెట్టొచ్చు. కానీ, ఈ అవకాశాన్ని రిపబ్లికన్ పార్టీ గత ఆగష్టు నెలలోనే పోగొట్టుకుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఓట్లు వేయడం పూర్తికావడంతో ట్రంప్ ను అధ్యక్ష రేసు నుంచి తొలగించే అవకాశం లేదు.
Advertisement
Advertisement