తాపీగా... హ్యాపీగా...
యోగా
ఎండలు మండినంత మాత్రాన, ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నంత మాత్రాన...వ్యక్తిగత, వృత్తిగత పనులేమీ తగ్గవు. మండే ఎండలతో యుద్ధం చేయక తప్పదు. ఈ సమరంలో మనకు సాయపడి, రోజువారీ పనులను నిరాటంకంగా చేసుకునేందుకు ఉపయుక్తమైన ఆసనాలివి...
1. కటి చక్రాసన
1ఎ) శ్వాస తీసుకుంటూ కుడికాలుని పైకి తీసుకువెళ్ళి, కుడిపాదాన్ని లేదా కాలి బొటనవేలును కుడి చేత్తో పట్టుకునే ప్రయత్నం చేయాలి. దీంట్లో కుడి మోకాలును నిటారుగా ఉంచడం కష్టంగా ఉన్నట్లయితే మోకాలును కావలసినంతవరకు మడచవచ్చు. ఈ స్థితిలో ఎడమకాలు నేల మీద నిటారుగా ఉంచాలి. సయాటికా, నరాల సమస్య లేదా ఎల్1 నుంచి ఎల్ 5 వరకు ఉన్న వెన్నుపూసలలో ఏదైనా సమస్య ఉన్నా మోకాలు నిటారుగా ఉంచడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాళ్లు మోకాలు మడచవచ్చు. 3 నుంచి 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ కాలును కిందకు తీసుకురావాలి. ఇలా 5 నుంచి 10 సార్లు చేయడం వల్ల మోకాలు, మోచేతి కండరాలు విశ్రాంతి పొందుతాయి.
1 బి) పైన చేసిన ఆసన వరుస క్రమంలో కండరాలను మరింత ఫ్రీ చేయడం కోసం శ్వాస వదులుతూ కుడి కాలుని ముందుకూ, శ్వాస తీసుకుంటూ వెనుకకు ముందుకు ఊపాలి. వెనుకకు ఊపినప్పుడు కుడి మోకాలుని మడవాలి. కుడిచేత్తో కుడికాలు చీలమండను పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఒక వేళ చీలమండను పట్టుకోలేకపోతే కుడిపాదాన్ని లేదా కుడి మడమను కుడి పిరుదు భాగానికి గట్టిగా ఒత్తుతూ శ్వాసవదులుతూ కాలుని ముందుకు చాపాలి. ఈ విధంగా 5 లేదా 10 సార్లు చేయాలి.
1 ఎ, 1బిలో చెప్పిన ఆసనాలు ఎడమకాలుతోనూ 5 నుంచి 10 సార్లు చేయాలి.
ఉపయోగాలు: ఈ ఆసనాలు అన్ని కూడా వెన్నెముక సమస్యలను తేలికపరచడానికి చేసే ఆసనాలలో కొన్ని మాత్రమే. ఇవి అన్ని వయసుల వారు, ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లైనా చేయదగినవి. ఈ ఆసనాలు మోకాలు, తుంటి కండరాలకు, సయాటికా, పించ్ నరం సమస్యలకు, సర్వైకల్ సమస్యకు ఉపయోగం. తొడలు, తుంటికీలు భాగాలు, పొట్ట దగ్గర కండరాలకు మంచి వ్యాయామం జరుగుతుంది. ఎవరైనా రోజూ సాయంకాలం 5, 10 నిమిషాల పాటు తేలికగా ఉండే ఆ ఆసనాలు సాధన చేయడం మంచిది. రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల వచ్చే వెన్నెముక సమస్య, జీర్ణశక్తి సమస్యల నుండి బయటపడచ్చు.
2ఎ) ఉత్థాన పాదాంగుష్టాసన
ఆసనంలో వెల్లకిలా పడుకుని కుడికాలును నిటారుగా కిందకు ఉంచి ఎడమకాలుని పక్కకు అంటే 90 డిగ్రీల లంబంలో తీసుకువెళ్లి ఎడమపాదాన్ని ఎడమ కాలి బొటనవేలును ఎడమచేత్తో పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఫొటోలో చూపిన విధంగా చేయాలి. ఒక వేళ అలా చేయలేకపోతే పైన చెప్పిన సమస్యల వల్ల ఎడమకాలు నిటారుగా పెట్టలేని పరిస్థితిలో మోకాలును ఎంతవరకు మడిస్తే సౌకర్యంగా ఉంటుందో అంతవరకూ మడచవచ్చు. 3 లేదా 5 శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి ఎడమకాలిని కుడికాలుకి జత చేసి వెల్లకిలా పడుకుని విశ్రాంతి పొంది ఇదేవిధంగా రెండవవైపు కూడా చేయాలి.
2బి) వెల్లకిలా పడుకుని రెండుకాళ్లను కలిపి శరీరాన్ని పక్కకు అంటే 90 డిగ్రీల కోణంలో తీసుకువచ్చి, రెండు పాదాల బొటనవేళ్లను ఎడమచేత్తో పట్టుకుని తలకుడివైపు తిప్పి నడుమును బాగా తిప్పే ప్రయత్నం చేయాలి. శ్వాస వదులుతూ తిరిగి రెండు కాళ్లను సమస్థితిలోకి తీసుకువచ్చి విశ్రాంతి పొందాలి. పైన చెప్పిన 2ఎ, 2బి ఆసనాలను రెండవ వైపుకు కూడా చేయాలి. 3 లేదా 5 సార్లు ఇలా చేయవచ్చు.
ఉపయోగాలు: ఈ ఆసనాల వల్ల వెన్నెముక కండరాలు సాగి, వాటి పై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. తుంటి, పొత్తికడుపు కండరాలు విశ్రాంతి పొందుతాయి. ఛాతీ భాగం, నడుము, పిరుదల మీద ఉన్న గ్లూటియస్ కండరాలు, పొట్టభాగంలోని రెక్టస్ అబ్డామిన్ కండరాలకు శక్తి లభిస్తుంది.
పైన పేర్కొన్న ఈ ఆసనాలన్నీ ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ చేయవలసినవి. వీటి వల్ల వెన్నెముక సమస్యల నుండే కాకుండా మానసిక రుగ్మతలు, ఒత్తిడి, అలసట నుంచి విముక్తి కలిగి రోజంతా ఉల్లాసంగా ఉంటారు.అలాగే, వేసవిలో శరీరం డీ–హైడ్రేషన్ (నిర్జలీకరణ) కాకుండా ఉండటానికి ఎక్కువగా తాజా పండ్లు, జ్యూసులు, తగినన్ని మంచి నీళ్లు, ఆహారంలో క్షారత్వం కలిగిన పదార్థాలు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.
- ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్
యోగా ఫౌండేషన్
– సమన్వయం: సత్యబాబు