ఈ వారం యూట్యూబ్ హిట్స్
పి.ఎస్.వై. డ్యాడీ : మ్యూజిక్ వీడియో
దక్షిణ కొరియా పాప్ స్టార్, వైరల్ వీడియో సంచలనం పి.ఎస్.వై. (అసలు పేరు పార్క్ జేసాంగ్) మళ్లీ ఒళ్లు విరుచుకున్నాడు! ‘గంగ్‌నమ్ స్టైల్’ డాన్స్‌తో 2012లో లోకాన్ని షేక్ చేసిన పి.ఎస్.వై. ఇప్పుడు ‘డాడీ’తో ఊపేస్తున్నాడు. ‘ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మై డాడీ’ అంటూ సాగే ఈ సాంగ్‌లో పి.ఎస్.వై. ఒక్క క్షణం కూడా తిన్నగా ఉండడు. వీక్షకులను ఉండనివ్వడు. వీడియోపై ఓపీనియన్స్ మిక్స్‌డ్‌గా ఉన్నా, రోజు రోజుకీ హిట్స్ పెరుగుతూనే ఉన్నాయి.
‘డాడీ’తో పాటే విడుదలైన పి.ఎస్.వై. దే ఇంకో వీడియో ‘నప్పల్ బాజీ’ కి పెద్దగా హిట్స్ లేకపోయినా చూడ్డానికి వెరైటీగా ఉంది.
నిడివి : 4 ని. 5 సె.
హిట్స్ : 2,63,44,794
‘ది హోల్డ్’ : హౌ టు కామ్ ఎ క్రయింగ్ బేబీ
రాబర్ట్ హామిల్టన్ యు.ఎస్.లో పేరున్న పిల్లల డాక్టర్. ముప్పై ఏళ్ల అనుభవంతో ఆయన పిల్లల బిహేవియర్‌కు సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు కనిపెట్టారు. వాటిల్లో ఒకటి : ఏడుస్తున్న పసికందును ఊరుకోబెట్టడం! ఎంత గుక్కపట్టి ఏడుస్తున్న శిశువునైనా హామిల్టర్ ఒడుపుగా చేతుల్లోకి తీసుకుని క్షణాల్లో ఏడుపు మాన్పించేస్తాడు.
ఇదెలా సాధ్యం? ఎలా సాధ్యమో ఈ వీడియోలో స్వయంగా చేసి చూపించారు ఆయన. తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఈ టెక్నిక్‌ను ఫాలో కావచ్చు. అయితే శిశువు ప్రత్యేక పరిస్థితుల్లో ఏడుస్తుంటే మాత్రం ఈ టెక్నిక్‌ను ప్రయోగించకూడదు.
నిడివి : 4 ని. 12 సె.
హిట్స్ : 98,35,913
బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్ : డాన్ ఆఫ్ జస్టిస్
వచ్చే ఏడాది మార్చి 25న థియేట ర్స్‌లోకి వస్తున్న ‘బ్యాట్‌మ్యాన్ వర్సెన్ సూపర్‌మ్యాన్ : డాన్ ఆఫ్ జస్టిస్’ చిత్రం తాజా ట్రైలర్ ఇది. బ్యాట్ మ్యాన్‌గా బెన్ అఫ్లెక్, సూపర్‌మ్యా న్‌గా హెన్రీ క్యావిల్ నటిస్తున్నారు.
సూపర్‌మ్యాన్‌పై అనుమానంతో అతడిపై పగతీర్చుకోడానికి బ్యాట్‌మాన్ బయల్దేరడంతో మానవాళికి కష్టాలు ప్రారంభం అవుతాయి. ఇద్దరి మధ్య ఉత్కంఠభరితమైన భీకర పోరాటాలు సాగుతుంటాయి. కామిక్ సూపర్ హీరో పాత్రలను అందమైన నటీనటుల రూపాల్లో చూడడం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఎంత థ్రిల్లింగా ఉంటుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
నిడివి : 3 ని. 1 సె.
హిట్స్ : 42,07,161
గేమ్ ఆఫ్ థ్రాన్స్ సీజన్ 6 : టీజర్
‘గేమ్ ఆఫ్ థ్రాన్స్’ ఫాంటసీ డ్రామా. హెచ్‌బీవోలో ఏడాదిగా ఈ సీరీస్ ప్రసారం అవుతున్నాయి. ఇప్పుడు ఐదో సీజన్ నడుస్తోంది. వచ్చే ఏప్రిల్‌లో సీజన్ 6 ప్రారంభం అవుతోంది. దాని టీజర్ రెండు రోజులు క్రితమే అఫీషియల్‌గా విడుదలైంది. టీజర్ అత్యద్భుతంగా, హాలీవుడ్ ట్రైలర్‌లా ఉంది. అమెరికన్ నవలా రచయిత జార్జి ఆర్.ఆర్.మార్టిన్ గొలుసు నవల ‘ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్’ ఆధారంగా టీవీ సీరీస్ చిత్రీకరణ జరుగుతోంది. సింహాసనం కోసం రెండు రాజవంశాల మధ్య జరిగే కుట్రలు, కుయుక్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాల కథనమిది.
నిడివి : 41 సె.
హిట్స్ : 41,52,087
జనమ్ జనమ్ : ‘దిల్‌వాలే’ న్యూ సాంగ్
కొన్ని ప్రేమ కథలకు మొదలు తప్ప తుది ఉండదు. కాలాతీతంగా ప్రేమ పరిమళాలను అవి వెదజల్లుతూనే ఉంటాయి. అలాగే ప్రేమ పాటలు. గతవారం అప్‌లోడ్ అయిన ‘దిల్ వాలే’ లోని ‘గేరువా’ సాంగ్ యూట్యూబ్‌లో బ్లాక్ బస్టర్ అయింది. ఈవారం ‘జనమ్ జనమ్’ అనే పాటను విడుదల చేసింది సోనీ మ్యూజిక్.
షారుక్‌ఖాన్, కాజోల్ నటించిన ఈ పాటకు ప్రీతమ్ సంగీతాన్ని సమకూర్చారు. అమిత్ భట్టాచార్య గీత రచన. పాడింది అరిజిత్ సింగ్, అంతర మిత్ర. వెస్ట్రన్, ఇండియన్ క్లాసిక్ మ్యూజిక్ కలగలిసిన ఈ పాట మనోరంజకంగా ఉంది. చిత్రం విడుదల డిసెంబర్ 18.
నిడివి : 2 ని. 13.
హిట్స్ : 17,52,832
‘మల్హారీ’ సాంగ్ : బాజీరావ్ మస్తానీ
ఇదొక హై-ఆక్టేన్ ట్రెడిషనల్ సాంగ్. స్వచ్ఛమైన సంప్రదాయ ఇంధనంతో జ్వలించే గీతం! బాజీరావ్ విజయోత్సాహ ఆత్మ రణవీర్ సింగ్‌ను ఆవహించినట్లే ఉంది. సంజయ్ లీలా భన్సాలీ ట్యూన్ ఇస్తే విశాల్ డడ్లానీ గీతాన్ని ఆలపించాడు. లిరిక్స్ ప్రశాంత్ ఇంగోల్. భన్సాలీ దర్శకత్వంలో డిసెంబర్ 18 విడుదల అవుతున్న ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంలోని మిగతా పాటల్లా ‘మల్హారీ’ కూడా రోమాంచితంగా ఉంది.
‘శత్రువును ఎంత ఘోరంగా ఓడించామో చూడండి. విజయ దుంధుబి మోగిస్తూ, ఆనందంతో ఆడిపాడదాం రండి’ అంటూ రణవీర్ సింగ్ పాడే గ్రూప్ సాంగ్ ఇది.
నిడివి : 3 ని. 22 సె.
హిట్స్ : 14,39,146