ఈ వారం యూట్యూబ్ హిట్స్ | youtube hits in this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్

Published Sun, Aug 28 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

ఈ వారం    యూట్యూబ్ హిట్స్

ఈ వారం యూట్యూబ్ హిట్స్

బ్రిట్నీ స్పియర్స్ : కార్‌పూల్ కరావోకే
నిడివి : 9 ని. 49 సె. : హిట్స్ : 1,30,44,074

అమెరికన్ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్.. ప్రముఖ టెలివిజన్ హోస్ట్ జేమ్స్ కింబర్లీ కార్డెన్‌తో కలిసి లాస్ ఏంజెల్స్ వీధుల్లో కార్‌పూలింగ్ చేస్తూ ఆలపించిన తన హిట్ గీతాల వీడియో యూట్యూబ్‌లో ఇప్పుడు తాజా సంగీత సంచలనం. వీడియో చూస్తున్నంత సేపూ వాళ్లిద్దరితో కలిసి మనమూ ట్రావెల్ చేస్తున్నట్లు ఉంటుంది! జేమ్స్ డ్రైవ్ చేస్తుంటే బ్రిట్నీ పక్కనే కూర్చొని ఉంటారు. టీవీ చానళ్ల వంటల కార్యక్రమంలో యాంకర్ వంట చేయిస్తూ, మధ్యమధ్యలో ఆ వంట చేస్తున్న గృహిణి వివరాలను కనుక్కుంటున్నట్లు... ఈ కార్‌పూలింగ్‌లో బ్రిట్నీ స్పియర్స్ జీవిత విశేషాలను కనుక్కుంటూ, ఆమెను నవ్విస్తూ, కవ్విస్తూ వీక్షకులకు వినోదం కలిగిస్తూ ఉంటారు  జేమ్స్. బ్రిట్నీతో ఇంటర్వ్యూ దొరకడం కష్టం. ఇలాంటి సరదా ఇంటర్వ్యూ దొరకడం మరీ కష్టం. ప్రఖ్యాత అమెరికన్ లేట్ నైట్ షో ‘ది లేట్ లేట్ షో’ హోస్ట్ కాబట్టి జేమ్స్‌కి ఇది సాధ్యమైంది. అన్నట్లు వీడియో చివర్లో జేమ్స్ మీకు చిన్న పాటి షాక్ ఇస్తారు. శాంపిల్ షాక్ కావాలంటే ఫొటోలో బ్రిట్నీ పక్కన ఎవరున్నారో చూడండి.
 
క్రిస్ బ్రౌన్ : గ్రాస్ ఈజ్ నాట్ గ్రీనర్
నిడివి : 4 ని. 53 సె. : హిట్స్ : 22,27,945

అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ క్రిస్ బ్రౌన్ లేటెస్ట్ వీడియో సాంగ్ ‘గ్రాస్ ఈజ్ నాట్ గ్రీనర్’ రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ అయింది. అప్పట్నుంచీ అప్‌బీట్‌లో ఉంది! కొరియోగ్రఫీతో పాటు, ఫొటోగ్రఫీ అదిరిపోయింది. టైటిల్‌లో గ్రీన్ ఉన్నా, పాటలో ఎక్కువగా ఎరుపు, నీలమే కనిపిస్తుంది. అందుకు కారణాన్ని లిరిక్‌లో మీరు వెదికి పట్టుకోవచ్చు. త్వరలో విడుదల కాబోతున్న క్రిస్ ఎనిమిదో సోలో ఆల్బమ్ ‘హార్ట్‌బ్రేక్ ఆన్ ఎ ఫుల్ మూన్’ లోని సింగిల్ లీడ్ ఈ.. ‘గ్రాస్ ఈజ్ నాట్ గ్రీనర్’. క్రిస్, అతడి స్నేహితులు ఓ నైట్ క్లబ్లులోకి వెళ్లి, అక్కడ అమ్మాయిల వెదకులాటలో పడడం అనేది థీమ్. తర్వాత ఏం జరిగింది, ఫ్యాంటసీలో ఎవరి ఆలోచనలు ఎన్ని మలుపులు తిరిగిందీ వీడియోలో వీక్షించవచ్చు. ‘యు ఆర్ నాట్ ది గర్ల్ దట్ యు యూజ్డ్ టు బి..’ అంటూ మొదలై, ‘దట్ గ్రాస్ ఈజ్ నాట్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్..’ అంటూ పూర్తయ్యే ఈ పాట... అమ్మాయిల్ని నిందించడం అనే (మగవాళ్ల) మనస్తత్వానికి తగ్గట్టుగా ఉంటుంది. గర్ల్ అంటే ఇష్టం లేనివాళ్లు... గర్ల్స్‌ని మరీ ఎక్కువగా ఇష్టపడేవాళ్లు ఈ పాటను ఎంజాయ్ చేసి తీరుతారు. బెట్.
 
 
నచ్‌దే నె సారే : బార్ బార్ దే ఖో
నిడివి : 2 ని. 34 సె. : హిట్స్ : 65,62,252

పెళ్లి సందడి అలా ఉంచండి. దాన్ని మించినది పెళ్లికి ముందరి సందడి ! కుటుంబం అంతా ఒకటే హడావిడి. ఆటలు, పాటలు. కనీసం హమ్మింగ్. ఈ ‘నచ్‌దే నె సారే’ కూడా అలాంటి సాంగే. ‘బార్ బార్ దేఖో’ చిత్రంలో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో, అన్ని క్యారెక్టర్లూ ఈ పెళ్లి పాటను ఎత్తుకుంటాయి. సిద్దార్థ మల్హోత్రతో కలిసి కత్రీనా కైఫ్ వేసే స్టెప్పులకు జతకలపడానికి మీకు రెండు కాళ్లు చాలవు. (సాంగ్ చూడడానికి ఎలాగూ రెండు కళ్లు సరిపోవు). సెప్టెంబర్ 9న రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న ‘బార్ బార్ దేఖో’లోని ఈ బృందగానానికి సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్... నన్ అదర్ దేన్ కత్రీనా. ఈ అమ్మాయి ఎంత చక్కగా, ఎంత సన్నగా ఉందంటే... అసలు ఆమె కోసమే మళ్లీ మళ్లీ సినిమా చూడాలనిపించేంత! ఈ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్‌ని నిత్యా మెహ్రా డెరైక్ట్ చేస్తున్నారు. మ్యూజిక్‌కి అయితే పెద్ద టీ మే ఉంది! బాద్షా, బిలాల్ సయీద్, అమాల్ మల్లిక్, ఆర్కో ప్రావో ముఖర్జీ, జస్లీల్ రాయల్.. ఇదో పెద్ద లిస్ట్. బై ది వే... జూలైలో విడుదలైన టీజర్ ‘కాలా చష్మా’ సాంగ్ కూడా అదరగొట్టేసింది. (అదీ ఇదే సినిమాలోనిది).
 
కాంప్లిమెంటింగ్ గర్ల్స్ : ప్రాంక్
నిడివి : 2 ని. 20 సె. : హిట్స్ : 4,03,677

‘ఫంక్ యు’ గ్రూప్ మళ్లీ ఒక కొత్త ప్రాంక్‌తో యూట్యూబ్‌లోకి వచ్చేసింది. గతంలో ప్లాస్టిక్ పాముల్ని కాలేజ్ కాంపౌండ్‌లోకి, క్లాస్‌రూమ్‌లలోకి తీసుకెళ్లి భయపెట్టి కామెడీ పండించిన ఈ మిత్ర బృందం.. ఈసారి సొగసైన ఐడియాతో యూత్‌ని ఆకట్టుకుంది. ఈ టీమ్‌లోని ఐదుగురు సభ్యులు (ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు. అంతా బిలో 20) ఇద్దరిద్దరుగా లేదా ఒకరొకరిగా విడిపోయి ప్రాంక్‌లను చేస్తుంటారు. తాజాగా వీళ్లు ఎన్నుకున్న టాపిక్.. అమ్మాయిల్ని కాంప్లిమెంట్ చెయ్యడం. క్లాస్‌లు అయ్యాక గర్ల్ స్టూడెంట్స్ మెట్లు దిగుతూ ఉంటారు. వాళ్లలో ఒకరి ఎదురుగా వెళ్లి ఈ టీమ్‌లోని అబ్బాయి కాంప్లిమెంట్ ఇస్తుంటాడు. ‘యు ఆర్ సో హాట్’ అనీ, ‘యు ఆర్ క్రేజీ’ అనీ, ‘ఐ లవ్యూ’ అనీ.. మీద మీదకి వెళ్తారు. అవతలి వైపు అమ్మాయి ఆశ్చర్యపోతుండగానే వెనుక నుంచి ఇంకో అమ్మాయి వచ్చి (టీమ్‌లోని అమ్మాయే) ఈ కుర్రాడిని హగ్ చేసుకుంటుంది. కాంప్లిమెంట్ తనకే అనుకుని పొరపడిన అమ్మాయి నవ్వుకుంటూ వెళ్లి పోతుంది.  అది చూసి మనమూ పడీ పడీ నవ్వుతాం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement