మేఘాదాస్ జొమాటోలో పని చేస్తారు. ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఆమె. కస్టమర్‌లకు ఫుడ్‌ని డెలివరీ చెయ్యడం కోసం రోజంతా మంగళూరు రోడ్లపై తన వాహనాన్ని పరుగులెత్తిస్తుంటారు. ఫుడ్‌ఆర్డర్‌ని టైమ్‌కి అందించకపోతే తన కంపెనీకి పేరు పోతుంది. అదీ ఆమె తొందర. అయితే ఆమె తొందరకు, ఆమె నడిపే స్కూటీ వేగానికి మంగళూరు రోడ్లపై గతుకులు, గోతులు అడ్డుపడుతూ ఉంటాయి. అవి మాత్రమే కాదు, చీకటి పడ్డాక ఆమె డ్యూటీ మరింత కఠినతరం అవుతుంది. కస్టమర్ చిరునామా కోసం బండిని ఆపి ఎవర్నైనా అడగవలసి వచ్చినప్పుడు అదేమంత సురక్షితమైన పనిలా ఆమెకు అనిపించదు.
ఆమెను అదోలా చూస్తారు. అడిగిన చిరునామా కాకుండా.. అభ్యంతరకరమైన చిరునామాల గురించి చెప్పడం మొదలుపెడతారు. ఈ స్వీయానుభవాలతో మేఘాదాస్‌కు రెండు విషయాలు స్పష్టం అయ్యాయి. ఒకటి మంగళూరు రోడ్లు బాగోలేవు. ఇంకొకటి మంగళూరు రోడ్లపై మహిళలకు భద్రత లేదు. ఎలా ఈ సమస్యను పరిష్కరించడం? తనొక్కరి వల్ల అయ్యే పని కాదు. పదిమందిని కలుపుకుని ఉద్యమించడానికి లీడర్ కాదు తను. ఫుడ్ డెలివరీ చెయ్యాలి. ఇంటికింత సంపాదించుకుని వెళ్లాలి.
మరెలా! అప్పుడు పడింది.. మంగళూరు సిటీ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్. తనూ ఎన్నికల్లో నిలబడితే! నిలబడి గెలిస్తే! తను అనుకున్నది చెయ్యొచ్చు.చేయించడానికి తన అధికారంతో ఒత్తిడి తేవచ్చు! ఆమె ఆలోచన నచ్చి కాంగ్రెస్ పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు మేఘాదాస్. ‘‘28వ వార్డుకు పోటీ చేస్తున్నాను. దేవుడి దయ వల్ల అదృష్టం బాగుండి గెలిస్తే నేననుకున్నది చేసి తీరుతాను’’ అంటున్నారు మేఘ. ఫుడ్ డెలివరీ కోసం అనువు కాని దారుల్లో కాలంతో పాటు పరుగులు తీసిన మేఘ.. మంగళూరు సిటీని దారిలోకి తెచ్చేందు ఒక్క క్షణమైనా విశ్రమించకుండా పని చేస్తారనే అనిపిస్తోంది. బెస్ట్ ఆఫ్ లక్ మేఘా.
Comments
Please login to add a commentAdd a comment