యువతులకు 500 టెక్నిక్స్
దేశరాజధాని ఢిల్లీ నడిబొడ్డున కీచకుల అరాచకత్వానికి బలైన నిర్భయ త్యాగం వృధా కాలేదు. ఈ దారుణ ఘటనతో ప్రభుత్వంలోనూ, ప్రజలలోనూ, ముఖ్యంగా యువతలో స్పందన వచ్చింది. అవగాహన పెరిగింది. ఇంకా అవగాహన కలిగించవలసి ఉంది. సమాజంలో గౌరవంగా బతకాల్సిన స్త్రీని సాటి మనిషిగా చూడకపోగా అడ్డొస్తే హతమార్చడం అలవాటై పోయింది. ఢిల్లీ నిర్భయ, హైదరాబాద్ అభయ లాంటి కేసులు నిత్యకృత్యంగా మారాయి. ఇంటా, బయటా ముప్పేట దాడికి గురవుతున్న మహిళ మనగడ సాగించాలంటే ఆత్మరక్ష తప్ప మరోమార్గం లేదని బాలల హక్కుల సంఘం చెబుతోంది.
రోడ్‌సైడ్ రోమియోల వేధింపులు భరించలేకపోతున్నారా? ఆటపట్టించేవారి ఆటకట్టించాలనుందా? అసభ్యంగా ప్రవర్తించేవారి పనిపట్టాలనుందా? రోడ్డుపై ఏ దొంగో ఎటాక్ చేస్తాడని భయపడుతున్నారా? మీరు భయపడవలసి అవసరంలేదని బాలల హక్కుల సంఘం భరోసా ఇస్తోంది. మహిళలు ఇక తమను తాము రక్షించుకోవటం ఈజీ అని బాలల హక్కుల సంఘం నేతలు చెబుతున్నారు.అల్లరిచేసేవారిని ఎలా మట్టికరిపించాలి? - చేయిపట్టి లాగేవాడిని ఎలా కుళ్ళబొడవాలి? హ్యాండ్‌బాగ్‌ను, మెడలో గొలుసును లాక్కెళ్లే దొంగల దుమ్ము ఎలా దులిపేయాలి? మహిళలు తమను తాము ఎలా రక్షించుకోవాలనేదానిపై బాలల హక్కుల సంఘం హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళలపై పెరుగుతున్న నేరాలు ఏ ఏటికి ఆఏడు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహిళలపై వేధింపులు రాష్ట్రంలో మామూలైపోయాయి. వరకట్నం, మానసిక వేధింపులు, లైంగిక వేధింపులు, దోపీడి, దొంగతనాలు, కిడ్నాప్‌లకు మహిళలు నిత్యం గురవుతూనే ఉన్నారు. విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువు, కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రులు సైతం పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీతో కలిసి బాలల హక్కుల సంఘం విద్యార్థినులకు స్వీయరక్షణపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దాడి సమయంలో అవతలివ్యక్తిని మట్టికరిపించి తమను తాము కాపాడుకోడానికి 500 టెక్నిక్స్‌ను ప్రదర్శించారు. చిన్న వస్తువులతో ఎలా కాపాడు కోవాలో డ్రిల్ నిర్వహించి చూపించారు.
ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమితో కలిసి స్కూళ్లూ, కాలనీల్లో స్వీయ రక్షణపై ప్రత్యేక కార్యక్రమాన్ని బాలల హక్కుల సంఘం చేపట్టింది. దాడి సమయంలో అవతలివ్యక్తిని మట్టికరిపించి కాపాడుకోడానికి ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించి 500 టెక్నిక్స్‌ను రూపొందించి ప్రదర్శిస్తున్నారు. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే కరాటే, థైక్వాండో లాంటి ఆత్మరక్షణ విద్యలు నేర్చు కోవాడం ద్వారా రక్షణ మాత్రమే కాకుండా పిల్ల శారీరక దారుడ్యం మెరుగుపడి ఆరోగ్యానికి సైతం మేలుచేస్తుందని నిపుణులు అంటున్నారు. బాలికలు, మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించి అవగాహణ కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు, ఇండియన్ మార్షల్ అకాడమి నిర్వాహకుడు నరేందర్ చెప్పారు. మహిళల కోసం బాలల హక్కుల సంఘం చేస్తున్న కృషి ప్రశంసనీయం.