ఒక్కడు 9 క్యాచ్లు పట్టాడు!
న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో భారత్ పరాజయం పాలయింది. కివీస్ బ్యాట్స్మెన్, బౌలర్లతో పాటు వికెట్ కీపర్ కూడా విజయంలో కీలకపాత్ర పోషించాడు. న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్రాడ్లే-జాన్ వాట్లింగ్ 9 క్యాచ్లు అందుకుని జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్లో 3, రెండో ఇన్నింగ్స్లో 6 క్యాచ్లు పట్టి భారత్ పుట్టి ముంచాడు.
రెండో ఇన్నింగ్స్లోనే అర డజను క్యాచ్లు పట్టాడు. టీమిండియా టాప్ ఆర్డర్లో మొదటి నలుగురు బ్యాట్స్మెన్ వాట్లింగ్ క్యాచ్ పట్టగా అవుట్ కావడం విశేషం. ఒక టెస్టులో అత్యధిక క్యాచ్లు అందుకున్న ఘనత సాధించాడు. 9 క్యాచ్లు అందుకుని బ్రెండన్ మెకల్లమ్ సరసన నిలిచాడు. 2009 డిసెంబర్లో పాకిస్థాన్తో నేపియర్లో జరిగిన టెస్టులో మెకల్లమ్ 9 క్యాచ్లు పట్టాడు.
అయితే ఒక ఇన్నింగ్స్లో అత్యధిక క్యాచ్లు(6) అందుకున్న రెండో వికెట్ కీపర్గా వాట్లింగ్ నిలిచాడు. ఇయాన్ స్మిత్(7) అతడి కంటే ముందున్నాడు. 1991లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో స్మిత్ ఈ ఘనత సాధించాడు. రెండో ఇన్నింగ్స్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న మొదటి వికెట్ కీపర్గా ఖ్యాతికెక్కాడు వాట్లింగ్.
వ్యక్తిగత రికార్డును వాట్లింగ్ మెరుగు పరుచుకున్నాడు. ఒక ఇన్నింగ్స్లో ఆరు క్యాచ్లు పట్టడం అతడికిదే తొలిసారి. గతేడాది డిసెంబర్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఐదు క్యాచ్లు అందుకున్నాడు. భారత్పై ఒకే ఇన్నింగ్స్లో ఆరు క్యాచ్లు పట్టిన తొలి న్యూజిలాండ్ వికెట్ కీపర్గా కూడా వాట్లింగ్ రికార్డులకెక్కాడు. 28 ఏళ్ల వాట్లింగ్ మరిన్ని అద్భుతాలు సాధిస్తాడని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.