Auckland Test
-
ఒక్కడు 9 క్యాచ్‌లు పట్టాడు!
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలయింది. కివీస్ బ్యాట్స్‌మెన్, బౌలర్లతో పాటు వికెట్ కీపర్ కూడా విజయంలో కీలకపాత్ర పోషించాడు. న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్రాడ్లే-జాన్ వాట్లింగ్ 9 క్యాచ్‌లు అందుకుని జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు పట్టి భారత్ పుట్టి ముంచాడు. రెండో ఇన్నింగ్స్‌లోనే అర డజను క్యాచ్‌లు పట్టాడు. టీమిండియా టాప్ ఆర్డర్లో మొదటి నలుగురు బ్యాట్స్‌మెన్ వాట్లింగ్ క్యాచ్ పట్టగా అవుట్ కావడం విశేషం. ఒక టెస్టులో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఘనత సాధించాడు. 9 క్యాచ్‌లు అందుకుని బ్రెండన్ మెకల్లమ్ సరసన నిలిచాడు. 2009 డిసెంబర్లో పాకిస్థాన్‌తో నేపియర్‌లో జరిగిన టెస్టులో మెకల్లమ్ 9 క్యాచ్‌లు పట్టాడు. అయితే ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు(6) అందుకున్న రెండో వికెట్ కీపర్‌గా వాట్లింగ్ నిలిచాడు. ఇయాన్ స్మిత్(7) అతడి కంటే ముందున్నాడు. 1991లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్మిత్ ఈ ఘనత సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న మొదటి వికెట్ కీపర్‌గా ఖ్యాతికెక్కాడు వాట్లింగ్. వ్యక్తిగత రికార్డును వాట్లింగ్ మెరుగు పరుచుకున్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు పట్టడం అతడికిదే తొలిసారి. గతేడాది డిసెంబర్లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు అందుకున్నాడు. భారత్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు పట్టిన తొలి న్యూజిలాండ్ వికెట్ కీపర్‌గా కూడా వాట్లింగ్ రికార్డులకెక్కాడు. 28 ఏళ్ల వాట్లింగ్ మరిన్ని అద్భుతాలు సాధిస్తాడని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. -
టీమిండియా విజయలక్ష్యం 407 పరుగులు
ఆక్లాండ్ : ఆక్లాండ్ టెస్ట్‌లో రెండో ఇన్సింగ్స్‌లో న్యూజిలాండ్ 105 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 407 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. కాగా మూడో రోజు పిచ్ స్వభావం దారుణంగా మారిపోయింది. ఫలితంగా పదహారు వికెట్లు టప టప రాలిపోయాయి. టీమిండియా మూడో రోజు అనూహ్య రీతిలో 202 పరుగులకు ఆలౌటైతే, ఆ తర్వాత న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 105 పరుగులకు కుప్ప కూలింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకుంటే తప్ప ఈ పిచ్ మీద విజయం సాధించడం కష్ట సాధ్యమే. ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 72 మినహా మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. వాగ్నర్ నాలుగు వికెట్లు తీసుకుంటే, బౌల్ట్, సౌతీ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో టేలర్ 41 పరుగులు మినహాయిస్తే ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. షమీ మూడు, జహీర్ రెండు, ఇశాంత్ రెండు వికెట్లు పడగొట్టారు. -
విరాట్ ప్లాప్ షోకు అనుష్క కారణమా?
ఆక్లాండ్ : టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా పేలవమైన ప్రదర్శనతో మీడియాకెక్కాడు. అయితే అందుకు కారణం బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కారణం అని పుకార్లు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఫరవా లేదన్నట్టుగా ఆడిన విరాట్ కోహ్లి సడన్‌గా ఫ్లాపయ్యాడు. ఆక్లాండ్‌లో ఆటపై ఏకాగ్రత చూపలేకపోయాడు. కేవలం నాలుగంటే నాలుగే పరుగులకు తన వికెట్ పారేసుకున్నాడు. ఇంతకీ కారణమేంటో అని ఆరా తీస్తే... బాలీవుడ్ భామ అనుష్క శర్మతో మనోడు ఆక్లాండ్‌లో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నాడుట. గతంలో అనుష్కతో కలిసి అనేక యాడ్స్‌లో నటించిన కోహ్లి ... ఈ బాలీవుడ్ బ్యూటీ కారణంగా ఆటపై ఏకాగ్రత చూపడంలేదని టీమిండియా వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. -
ఒక్కడి స్కోరు కొట్టలేకపోయారు
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకు ఆలౌటయింది. దీంతో న్యూజిలాండ్‌కు 301 ఆధిక్యం లభించింది. కివీస్ కెప్టెన్ మెకల్లమ్ ఒక్కడే 224 పరుగులు చేయగా, ధోని సేన మాత్రం ఒక్కడు సాధించిన స్కోరు కూడా చేయలేక చతికిలపడింది. 130/4 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ కేవలం 72 పరుగులు జోడించి మిగతా వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 72, ధోని 10, జహీర్ ఖాన్ 14 పరుగులు చేసి అవుటయ్యారు. జడేజా 3 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. కివీస్ బౌలర్లో వాగ్నేర్ 4, బౌల్ట్ 3, సౌతీ 3 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఫుల్టన్(5), రూథర్‌ఫోర్డ్(0), విలియమ్సన్(3), మెకల్లమ్(0) అవుటయ్యారు.