అమ్మల బాటలో అందాల భామలు | daughters follows Mothers | Sakshi
Sakshi News home page

అమ్మల బాటలో అందాల భామలు

Published Sun, Sep 22 2013 11:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM

అమ్మల బాటలో అందాల భామలు

అమ్మల బాటలో అందాల భామలు

నేడు డాటర్స్ డే
మహిళల్ని ఆకాశంలో సగం అంటారు. సృష్టిలో వారిది ప్రత్యేక స్థానం. పూజనీయ వ్యక్తులుగా తల్లి, తండ్రి, గురువు, దైవం.. ఇలా క్రమ పద్ధతిలో కొలుస్తారు. తల్లి మొదటి స్థానంలో ఉంటారు. దీన్ని బట్టే మహిళల ప్రాధాన్యం ఏంటో అర్థమవుతుంది. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇప్పుడు  అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. దేశాల్ని ఏలుతున్నారు. భూమండలాన్ని దాటి రోదసీ యాత్రలు చేస్తున్నారు. మహిళల్ని గౌరవించుకోవడానికి మహిళా దినోత్సవం ఉన్నట్లే, కుమార్తెల ప్రతిభను గుర్తించడానికి 'డాటర్స్ డే' జరుపుకొంటున్నారు. ఈరోజే 'డాటర్స్ డే'. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని వివిధ రంగాల్లో రాణించిన తల్లీకూతుళ్ల వివరాలు మీకు అందిస్తున్నాం.

అమ్మలాగే.. మేమూ: బాలీవుడ్లో తమ నటనతో అభిమానులు మెప్పించిన ప్రఖ్యాత కథానాయికలు ఎంతో మంది ఉన్నారు. అత్యుత్తమ ప్రతిమ కనబరిచిన తల్లీకూతుళ్లూ ఉన్నారు. నిన్నటి తరం తారలు బాలీవుడ్ను ఏలితే, తామేం తక్కువ కాదంటూ వారి తనయిలు దూసుకొచ్చారు. అందం, అభినయంతో చెరగని ముద్ర వేశారు. తనూజ-కాజోల్, షర్మిలా -సోహా అలీ ఖాన్, అపర్ణా సేన్- కొంకణా సేన్, హేమమాలిని-ఇషా డియోల్ ....ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా పెద్దదే అవుతుంది. తల్లీకూతుళ్లు కలసి స్క్రీన్పై సందడి చేసిన సందర్భాలు ఉన్నాయి.

తనూజ-కాజోల్: అందం కంటే అభినయంతోనే రాణించిన నటి కాజోల్. 1990ల్లో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన కాజోల్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. శ్రీదేవి, మాధురీ దీక్షిత్, జూహీచావ్లా తదితర అందాల భామల హవా నడుస్తున్న కాలంలో నటిగా నిరూపించుకుంది. హీరో అజయ్ దేవ్గన్ను పెళ్లాడిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది. ఆమె నటించిన చివరి చిత్రం 'టూన్పూర్ కా సూపర్ హీరో' 2010లో విడుదలైంది. కాజోల్ తల్లి తనూజ నిన్నటితరం ప్రసిద్ధ నటి.

షర్మిలా-సోహా అలీ: సోహా అలీ ఖాన్ సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చింది. తల్లి షర్మిలా టాగూర్ ప్రసిద్ధ నటి. ప్రస్తుతం సోహా బాలీవుడ్లో కీలక పాత్రలు పోషిస్తోంది. తల్లి షర్మిలతో కలసి నటించాలన్న సోహా కోరిక 2009లో తీరింది. వీరిద్దరూ 'లైఫ్ గోస్ ఆన్' అనే చిత్రంలో తెరపై కనిపించారు. వీరు నిజజీవితంలో స్నేహితుల్లా ఉంటారు.  

అపర్ణా-కొంకణా: నిన్నటితరం నటి, దర్శకురాలు అపర్ణా సేన్ సినీ ప్రియులకు సుపరిచితురాలు. అపర్ణా వారసురాలిగా తెరంగేట్రం చేసిన కొంకణా సేన్ అనతి కాలంలోనే నటిగా సత్తాచాటింది. 'మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్' సినిమాలో నటనకు  జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. తల్లీకూతుళ్లు కలసి '15 పార్క అవెన్యూ' అనే సినిమాలో ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇద్దరూ కలసి బెంగాలీ సినిమా 'ఇటి మృణాళిని'లో స్ర్కీన్పై  కనిపించారు.

హేమమాలిని-ఇషా: డ్రీమ్ గర్ల్ హేమమాలిని అందం, అభినయం అపురూపం. బాలీవుడ్ను ఓ ఊపు ఊపేసింది. ఆమె ముద్దుల కూతుళ్లు  ఇషా డియోల్, అహాన డియోల్ పలు సినిమాల్లో నటించారు. అంతేగాక తల్లీకూతుళ్లు కలసి ఎన్నో నృత్య ప్రదర్శనలు చేశారు. ఇంకా డింపుల్ కపాడియా కూతుళ్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా, మున్ మున్ సేన్ తనయలు రైమా, రియా సేన్ కూడా బాలీవుడ్లో మెప్పించారు. దక్షిణాదిలో కూడా సంధ్య కుమార్తె జయలలిత (తమిళనాడు ముఖ్యమంత్రి), రాధ గారాటపట్టి కార్తీక, మంజుల కూతుళ్లు శ్రీదేవి, రుక్మిణి నటీమణులే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement