నిండుకళ | full of art | Sakshi
Sakshi News home page

నిండుకళ

Published Sun, Mar 22 2015 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 11:14 PM

నిండుకళ

నిండుకళ

వేసవిలో దాహం తీరాలంటే కుండలో నీళ్లే దివ్యౌషధం. ఇక మొన్నే జరిగిన ఉగాది పండుగకు షడ్రుచుల పచ్చడి చేయడానికి మట్టి కుండనే శ్రేష్టమైనదని తెలుసు. వీటిని స్వయంగా మనమే తయారు చేసుకుంటే.. సికింద్రాబాద్‌లోని అవర్ సాక్రెడ్ స్పేస్‌లో ఇటీవల జరిగిన పాటరీ వర్క్‌షాప్ ఇందుకు వేదికైంది. ఇంత మట్టి అంటితేనే షిట్ అంటూ చేతులను శుభ్రపరుచుకునే వాళ్లు..  కుమ్మరి చక్రం గిరగిరా తిప్పారు. మట్టి ముద్దను ముట్టుకోవడమే కాదు.. దానిని ముచ్చట గొలిపే రీతిలో మలిచారు.  
 ..:: చీకోటి శ్రీనివాస్
 
పెళ్లయినా, బోనాల పండుగైనా, దీపావళి వేడుకైనా మట్టి పాత్రల కోసం కుమ్మరివాడలకు పరుగులు తీసేవారు ఊళ్లలో. కుమ్మరి చక్రం గిరగిరా తిరుగుతుండగా.. మట్టిముద్ద నుంచి కుండలు, ప్రమిదలు ఆకృతి దాల్చే విధానం చూస్తే అచ్చెరువనిపిస్తుంది. సిటీలో అన్ని రకాల మట్టి పాత్రలు లభ్యమవుతున్నా.. వాటి తయారీ ఎలాగో ఈ తరానికి తెలియదు. పట్నవాసంలో మట్టి వాసన ఎరగని మనుషులకు పల్లెల్లోని బతుకుదెరువు ఆటవిడుపుగా మారింది. కులవృత్తులను ప్రోత్సహించడంతో పాటు మట్టి పాత్రల తయారీపై అవగాహన కలిగించడానికి అవర్ సాక్రెడ్ స్పేస్‌లో నిర్వహించిన పాటరీ వర్క్‌షాప్ ఈ తరానికి ఓ పాఠమే నేర్పింది.
 
వింత అనుభూతి
‘మమ్మీ పాట్ ఎలా తయారవుతుందో చూడు, డాడీ మనమూ ట్రైచేద్దాం! అంకుల్ ప్లీజ్ గివ్ మీ వన్ చాన్స్... ఎక్సలెంట్’ అంటూ మురిసిపోయిన చిన్నారి నియతి నుంచి.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కార్మెల్ వరకు ఎవరి అనుభూతులు వాళ్లవే! నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన కుమ్మరి ముత్యాలు.. వీళ్లందరికీ ఇన్‌స్ట్రక్టర్‌లా మారాడు. ఆయన సారె సాయంతో మట్టిపాత్రలు తయారు చేస్తుంటే... చూసి వావ్ అని అశ్చర్యపోవడమేకాదు, తయారీలోనూ భాగస్వాములయ్యారు. చిన్నా పెద్దా అంతా కలిసి.. మట్టి వాసనను ఆస్వాదించారు. సారెను తిప్పుతూ రకరకాల పాత్రల తయారీకి ప్రయత్నించారు. తాము సృష్టించిన పాత్రలను చూసుకుని మురిసిపోయారు.
 
బాల్యం గుర్తొచ్చింది
‘మట్టి పాత్రల తయారీ చూస్తుంటే బాల్యం గుర్తొచ్చింది. చిన్నప్పుడు మారేడ్‌పల్లిలో కుండల తయారీ చూస్తే ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉండేది. ఇప్పుడు అలాంటి దృశ్యాలు చూడటం భాగ్యమైపోయింది. ఇలాంటి ప్రదర్శనల ద్వారా కొత్త తరం పిల్లలకు మన సంస్కృతి గురించి తెలియజెప్పిన వారమవుతాం’ అంటోంది అనుపమ. ‘అమేజింగ్... నేను కూడా పాట్ తయారు చేశా. మెత్తని బంకమట్టితో చక్రంపై పాట్స్ తయారు చేయడానికి ఎంత ఏకాగ్రత కావాలో! ముత్యాలు అంకుల్ కుండలు తయారు చేస్తుంటే అద్భుతం అనిపించింది. మట్టిపాత్రల తయారీ పట్ల పూర్తి అవగాహన వచ్చింది’ అని చెబుతోంది విద్యార్థిని శ్వేత. ‘అందరు పాట్స్ చేస్తుంటే చూశా. నాకూ ఒక చాన్స్ ఇమ్మన్నా.

ఎంతో చక్కటి పాట్‌ను తయారు చేసుకున్నా, ఇంటికి వెళ్లాక చక్రం, మట్టి కొనుక్కుని నేనే అందమైన పాట్స్ తయారు చేసి, వాటిపై పెయింటింగ్స్ వేసి మా ప్రెండ్స్‌కి గిఫ్ట్ ఇస్తా’ అంటున్నాడు థర్డ్ క్లాస్ చదువుతున్న అరవ్. ‘పదిహేను నిమిషాలు కష్టపడ్డాను. పాట్ తయారు చేస్తుంటే చాలాసార్లు షేప్ మారింది. పూర్తయ్యేవరకు టెన్షన్ ఫీలయ్యా. మొత్తానికి నేననుకున్న తరహాలో పాట్ బయటకు తీశా. తయారు చేసుకోవడం ఒకెత్తయితే చక్రం నుంచి కట్‌చేసి బయటకు తీయడం మరో ఎత్తు’ అంటున్నాడు స్టూడెంట్ సంతోష్. మొత్తానికి పాట రీ వర్క్‌షాప్‌ను ఫుల్ ఎంజాయ్ చేసిన సిటీవాసులు.. తాము తయారు చేసిన మట్టిపాత్రలతో పాటు మధుర జ్ఞాపకాలనూ పదిలంగా మోసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement