
సాక్షి,న్యూఢిల్లీ: బంగారంలో నాణ్యతా ప్రమాణాలు కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం నూతన నిబంధనలతో ముందుకొచ్చింది. బంగారం విక్రయించేముందు దాని నాణ్యతను ధృవీకరించే హాల్‌మార్కింగ్, కారట్ కౌంట్‌ను అనివార్యం చేయనుంది. జనవరి తర్వాత కేవలం హాల్‌మార్కింగ్ బంగారాన్నే విక్రయించాలనే నిబంధన తీసుకురానున్నట్టు ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాం విలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు తాము కొంటున్న బంగారు ఆభరణాల నాణ్యత గురించి వారికి తెలియడం లేదని, జనవరి కల్లా బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేసేలా నిర్ణయం తీసుకోనున్నామని పాశ్వాన్ తెలిపారు.
కొన్ని ఆభరణాలపై బీఐఎస్ మార్క్ ఉంటున్నా అది ఆభరణాల నాణ్యతను వినియోగదారులకు స్పష్టంగా వెల్లడించేలా లేదన్నారు. నూతన నిబంధనల ప్రకారం ఆభరణాల్లో ఉపయోగిస్తున్న బంగారం కారట్ల గురించి కూడా హాల్‌మార్క్‌లో పొందుపరుస్తారు. ఆభరణాలకు 14, 18, 22 కారట్ల మూడు కేటగిరీల్లో హాల్‌మార్కింగ్ ఇస్తారని మంత్రి తెలిపారు.