ఉరిమే ఉత్సాహం..
వాకా.. వాకా.. అంటూ షకీరా గీతాలకు నృత్యాలు, భారతీయత ఉట్టిపడే క్లాసికల్ డ్యాన్స్‌లతో హెచ్‌సీయూ ప్రాంగణం మార్మోగిపోయింది. ఉరిమే ఉత్సాహంతో కొరియా, ఆఫ్రికా, వియత్నాం కళాకారులు ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనల తో ఔరా అనిపించారు. ఇంటర్నేషనల్ యూత్ ఫెలోషిప్ (ఐవైఎఫ్) సంస్థ మూడు రోజుల వరల్డ్ క్యాంప్ హెచ్‌సీయూలో శనివారం మొదలైంది. నాట్యం, జ్యువెలరీ, పేపర్ క్రాఫ్ట్ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ప్రారంభమైంది. విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ‘సిటీప్లస్’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
కొత్త విషయాలు నేర్చుకున్నా..
ఈ క్యాంప్ ద్వారా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. వివిధ దేశాల ప్రతినిధులతో అభిప్రాయాలు పంచుకునే అవకాశం కలగటం గొప్పగా భావిస్తున్నాను. దేశరక్షణ వ్యవస్థలో యువత భాగస్వామ్యం పెరగాలి.
- ట్రాంగ్, వియత్నాం
మా దేశంలో నిర్వహిస్తా..
ఐవైఎఫ్ సదస్సులో నేర్చుకున్న అంశాలను సౌత్ కొరియా యువతకు నేర్పిస్తా. యువతలో అనేక నైపుణ్యాలున్నా ప్రదర్శించే వేదిక లేక వెనుకబడుతున్నారు. అయితే సామాజిక సేవా కార్యక్రమాల్లో
మా దేశ యువత ఎప్పుడూ ముందుంటుంది.
- స్యాంగ్ కిమ్, దక్షిణ కొరియా
- జిలుకర రాజు