సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది జులై నుంచి ప్రారంభమయ్యే బ్యాచ్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా ఐఐటీల్లో 550 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతిష్టాత్మక జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో పురుషులకు దీటుగా మహిళలను ప్రోత్సహించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఐఐటీ అడ్మిషన్లలో ప్రతి పదిమందిలో కేవలం ఒక మహిళ ఉండటంతో ఈ పరిస్థితిని చక్కదిద్దాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది.
2018 బ్యాచ్‌లో కనీసం 14 శాతం సీట్లు మహిళలకు కేటాయించాలని మంత్రిత్వ శాఖ 23 ఐఐటీలను ఇటీవల ఆదేశించింది. అయితే మహిళల కోటాను 14 శాతానికి తీసుకురావాలంటే 550 అదనపు సీట్లు అవసరమని ఐఐటీ ఢిల్లీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఛైర్మన్ ఆదిత్య మిట్టల్ పేర్కొన్నారు. మరోవైపు 2020 నాటికి ఇంజనీరింగ్ కాలేజీల్లో మహిళలకు కనీసం 20 శాతం సీట్లు లభించాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా దీన్ని అధిగమించాలంటే మరిన్ని అదనపు సీట్లను కేటాయించాలని ఐఐటీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అదనపు సీట్ల మంజూరుతో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురవకుండా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ న్యాయమంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ పొందింది. మరోవైపు ఐఐటీల్లో యువతుల సంఖ్యను పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశ్రమ స్వాగతించింది.
ఇది గొప్ప నిర్ణయమని ఐబీఎం ఇండియా యూనివర్సిటీ రిలేషన్స్ హెడ్ మోనా భరద్వాజ్ పేర్కొన్నారు. అయితే ఐఐటీల్లో తక్కువ సంఖ్యలో మహిళలు చేరడం వెనుక తల్లితండ్రుల వైఖరితో పాటు సామాజికాంశాలు దాగిఉన్నాయని ఓ ఐఐటీకి చెందిన ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment