women quota
-
మహిళా రిజర్వేషన్ బిల్లుపై... శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
పూణే: లోక్‌సభ, శాసన సభల్లో మహిళల రిజర్వేషన్ విషయమై కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో ఉత్తర భారతదేశం సానుకూలంగా లేదని, వాళ్లు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఈ మేరకు శనివారం పూణే డాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన కుమార్తె లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలేతో పాల్గొని ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలోనూ అన్ని రాష్ట్రాల శాసన సభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉండాలని రూపొందించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. ఈ విషయలో దేశం ఇంకా మానసికంగా సిద్ధంగా లేనట్టుంది అని శరద్ పవర్‌ని మీడియా ప్రశ్నించగా...దీనికి ఆయన సమాధామిస్తూ...తాను కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి పార్లమెంట్లో ఈ అంశంపై మాట్లాడుతున్నానని పవార్ అన్నారు. ముఖ్యంగా అందుకు ఉత్తర భారతదేశం సుముఖంగా లేదని స్పష్టం చేశారు. తాను ఒకసారి ఈ అంశంపై ప్రసంగిస్తుంటే తమ పార్టీకి చెందిన మెజార్టీ ఎంపీలు లేచి వెళ్లిపోయారని చెప్పారు. ముఖ్యంగా తమ పార్టీకి చెందిన వారే దీన్ని జీర్ణించుకోలేకపోత్నురని తనకు అప్పుడే స్పష్టమైందని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తూనే ఉండాలని శరద్‌పవార్ అన్నారు. అంతేగాదు తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ..జిల్లా పరిషిత్, పంచాయితీ సమితి వంటి స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టానని, మొదట్లో వ్యతిరేకించిన తర్వాత ప్రజలే దానిని ఆమోదించారని చెప్పుకొచ్చారు. (చదవండి: యడ్డి తనయుడిపై లోకాయుక్తాలో కేసు) -
మా వాటా మాకిచ్చారా?
భారత జాతీయోద్యమంలో స్త్రీల ఉనికి, వారి భాగస్వామ్యం, దక్కిన ఫలితాలను గమనిస్తే మహిళల క్రియాశీలతకు జోహార్లు. కానీ, భారత రాజకీయాల్లో వారికి దక్కిన వాటా, గుర్తింపు... అప్పుడూ, ఏడున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడూ... అంతంత మాత్రమే. స్వాతంత్య్రానంతరం పాలనా రాజకీయాలలో మహిళలకు దక్కినదానికీ, జాతీయోద్యమంలో వారి భాగస్వామ్యానికీ పోలికే లేదు. రాజ్యాంగ రచనలో దుర్గాబాయమ్మ, దాక్షాయణీ వేలాయుధన్లు చేసిన కృషి ఎంత ఉన్నా రాజకీయాధికారంలో సమభాగస్వామ్యాన్ని స్త్రీలు పొందలేకపోయారు. స్వతంత్ర భారతంలో పితృస్వామ్యం కొత్త రూపాలతో స్త్రీలను మళ్ళీ ఇళ్ళలోకి నెట్టివేసింది. 33 శాతం రిజర్వేషన్‌ను పొందగలమనే ఆశ క్షీణిస్తుండడం విచారకరం. ► ఇవాళ స్వాతంత్య్రోద్యమ పునర్మూల్యాంక నంలో స్త్రీల పాత్ర గురించి ఆలోచించడమంటే ఉద్యమ అజెండాలో స్త్రీలను ఏ విధంగా వాడుకోవాలనుకున్నారు, స్త్రీలు ఆ పరిధులలోనే ఉన్నారా, వాటిని ఛేదించుకొని మార్పు కోసం తమ స్వతంత్రం కోసం ఏమైనా ప్రయత్నాలు చేశారా? స్వాతంత్య్రో ద్యమ నాయకత్వం ఏ మేరకు ఆమోదించింది? ఏ పరిమితులు విధించింది? మొత్తంగా జాతి సాంస్కృతిక అస్తిత్వంగా భావించిన దానిలో తమ ఉనికి, స్థానాలలో మార్పును స్త్రీలు సాధించుకో గలిగారా? ఈ ప్రశ్నలకు 75 ఏళ్ళ తర్వాతనైనా మనం సమాధానాలు చెప్పుకోలేకపోతే, కనీసం వాటి కోసం అన్వేషించకపోతే స్త్రీల స్థితి గతులలో గుణాత్మకమైన మార్పులు రాలేదని అర్థం. ► ఒక దేశంగా, జాతిగా భారతదేశం, భారతీయులు వెనుకబడి ఉన్నారనీ, తమను తాము పరిశీలించుకునే అర్హత లేని అనాగరి కులుగా ఉన్నారనీ బ్రిటిష్ పాలకులు చేసిన వాదనలకు వారు చూపించిన ఉదాహరణ– స్త్రీలు. సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతు పునర్వివాహ నిషేధం, విద్యాలేమి, విడాకుల అవకాశం లేకపోవడం, పరదా పద్ధతి... ఇలాంటివి చూసి వలస పాలకులు భారతీయులను అనాగరికులంటూ ముద్ర వేశారు. అప్పుడు భారతీయుల ముందున్న కర్తవ్యం– ఆ ముద్రను తొలగించుకోవడం! దానికి రెండు దారులున్నాయి. ఒకటి– ఆ అనాగరికత నుంచి స్త్రీలను తప్పించడం. రెండు– ‘అది అనాగరికత కాదు, అదే మా నాగరికత వైభవం’ అని సమర్థించుకోవడం! ఆ వాదన మీద జాతి నిర్మాణాన్ని చేయడం! స్వాతంత్య్రోద్యమ నాయకత్వం ఆనాటి ఉద్యమ అవసరా లకు అనుగుణంగా రెండు దారులలోనూ ప్రయాణించింది. స్త్రీలూ వారి వెంబడి నడిచారు. నడుస్తూ, నడుస్తూ తమ స్వతంత్ర మార్గాన్ని తాము వేసుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కొన్ని మార్పులను తీసుకురాగలిగారు. ► వలస పాలకులు ‘భారతీయ స్త్రీలు, స్త్రీత్వము’ అంటూ ప్రవేశ పెట్టిన భావనలను సవాలు చేయవలసిన అవసరం ముఖ్యంగా మధ్యతరగతి స్త్రీల మీద పడింది. దానివల్ల కింది వర్గపు స్త్రీల నుండి వేరుపడి కొత్త ఆదర్శాలతో, కొత్త బాధ్యతలతో కొత్త మధ్యతరగతి మహిళ రూపొందింది. పాశ్చాత్య వలస పాలకులు ఆధునికతకు ఇచ్చిన నిర్వచనాలకు అనుగుణంగా దేశాన్ని ఆధునికీకరించడం జాతీయోద్యమానికి కీలక సమస్యగా ముందుకు వచ్చింది. ఆధ్యాత్మిక – భౌతిక విషయాలను వేరుచేయగలగడం, లోపలి ప్రాంతాన్నీ – వెలుపలి ప్రాంతాన్నీ వేరు చేయడం అనే పనిని వారు తప్పనిసరిగా చేయవలసి వచ్చింది. ఆధ్యాత్మిక ప్రపంచానికీ, లోపలి ప్రైవేట్ ప్రపంచానికీ స్త్రీలను ప్రతినిధులుగా చేసి, భౌతిక, బాహ్యప్రపంచం లోకి పురుష నాయకులు ప్రతినిధులుగా నిలబడడంలో వింత లేదు. అది పితృస్వామ్యబద్ధ ప్రణాళిక ప్రకారం జరిగింది. అందువల్ల మనకు స్త్రీల నాయకత్వం అతి తక్కువగా కనిపిస్తుంది. ► తొలి తరంలో స్త్రీవిద్య, వితంతు వివాహాల వంటి సంస్కరణలకు కూడా ఇదే పరిస్థితి. స్త్రీవిద్య గురించి స్త్రీలు కన్న కలలేమిటి? తమ జీవితాలలో వారు కోరుకున్న మార్పులేమిటి అనేది మనకంతగా తెలియదు. వీరేశలింగం పంతులుగారి కంఠస్వరమే వినిపించి, రాజ్యలక్ష్మి చాలాకాలం పాటు ఇంటికే పరిమితమైంది. వీరేశలింగం గారు తన ఆత్మకథలో ఆమె క్రియాశీలక పాత్ర గురించి రాస్తేనే, అది చదివినవారికే ఆమె నాయకత్వ పటిమ తెలిసింది. సంస్కరణోద్య మాల పరిస్థితే ఇలా ఉంటే ఇక ప్రత్యక్ష రాజకీయ ఉద్యమాలలో స్త్రీల పరిస్థితి మనం తేలికగానే అర్థం చేసుకోవచ్చు. అయితే, స్త్రీలు తమ కార్యాచరణతో చరిత్రను తమ చేతులలోకి తీసుకోవాలని ప్రయత్నిం చడం స్వాతంత్య్రోద్యమ కాలమంతా కనిపిస్తుంది. స్వేచ్ఛ, సమానత్వ భావనలు స్త్రీల జీవితాలలోకి అనివార్యంగా ప్రవేశించి, వారిని ముందుకు నడిపించాయి. ► 1917లో మార్గరెట్ కజిన్సు, సరోజినీ నాయుడుల నాయకత్వంలో పట్టభద్రులైన మహిళలు మాంటేగ్‌ను కలిసి తమకు ఓటుహక్కు కావాలని అడగడంతో మొదటిసారి స్త్రీలు తమ రాజకీయ అవసరాలను గుర్తించారు. 1917లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ మహాసభలలో మహిళా చైతన్యం పెరిగింది. 1921లో ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా జరిగిన ‘చీరాల – పేరాల సత్యాగ్రహం’లో రావూరి అలివేలు మంగతాయా రమ్మ అరెస్టయింది. రాజకీయ నేరస్థురాలిగా జైలుకు వెళ్ళిన మొదటి స్త్రీ ఆమె. నాలుగు నెలలపాటు జరిగిన ‘చీరాల–పేరాల’ ఉద్యమంలో గ్రామాలనూ, ఇళ్ళనూ వదిలి నాలుగు నెలలపాటు వేరేచోట ఉండ వలసిన పరిస్థితుల్లో స్త్రీలు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, వారి జీవితాలలో వచ్చిన మార్పులేమిటి అని రికార్డు చేసినవారు లేరు. అప్పటి స్త్రీల అనుభవాలు చరిత్రకెక్కి ఉంటే భవిష్యత్తు మరొక విధంగా ఉండేది. పల్నాడులో పుల్లరి ఉద్యమంలో పోలీసుల లాఠీలకు ఎదురు నిల్చి తీవ్ర గాయాలపాలైన గంగమ్మ, అచ్చమ్మల నాయకత్వ పటిమ ఎలాంటిది? ఆ నాయకత్వ స్ఫూర్తిని తర్వాత తరాలకు ఎందుకు అందనివ్వలేదనే ప్రశ్నలు కూడా రాలేదు చాలాకాలం పాటు! ► 1923లో కాకినాడలో కాంగ్రెస్ మహాసభ జరిగింది. ఆ మహాసభకు దేశమంతటి నుంచీ స్త్రీలు వచ్చారు. వాలంటీర్లుగా వందలమంది స్త్రీలు పనిచేశారు. స్త్రీలు ఇళ్ళను వదిలి, తమ ఊళ్ళను వదిలి కొత్త వాతావరణంలో తమపై కుటుంబ పెత్తనం లేకుండా జీవించడం, అతి కొద్దికాలమైనా సరే వారిపై గొప్ప ప్రభావాన్ని చూపింది. వారిలో అనేక విధాలైన స్వేచ్ఛాకాంక్షలను మేల్కొలిపింది. అయితే ఆ స్త్రీలను నియంత్రించే విధానం కూడా ఇంకోపక్క తయారై పోతూనే ఉంది. స్వేచ్ఛాకాంక్షకూ, నియంత్రణకూ మధ్య నలిగి పోయిన స్త్రీల జీవిత పోరాటాలను గుర్తించినవారు లేరు. ఆ సమయం లోనే దువ్వూరి సుబ్బమ్మ, పొణకా కనకమ్మ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ అశేష ప్రజానీకాన్ని తమ ఉపన్యాసాలతో ఆకర్షించి జాతీయో ద్యమాన్ని ప్రచారం చేశారు. 1922లో ఏర్పడిన మహిళా కాంగ్రెస్ మహిళల నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేసినా, వారికి ఖద్దరు ప్రచారోద్యమ బాధ్యతలు తప్ప మరే కీలక రాజకీయ బాధ్యతలూ దక్కలేదు. ఆ స్త్రీల ప్రవర్తన గురించి అటు వలస పాలకులూ, ఇటు స్వదేశీయులు విమర్శలు గుప్పించారు. స్వదేశీయులు వెలి వంటి వాటిని ఉపయోగిస్తే, వలస పాలకులు జైలుశిక్షలు విధించారు. ► ఉప్పు సత్యాగ్రహ సమయంలో గాంధీ ఆ సత్యాగ్రహానికి స్త్రీలు దూరంగా ఉండాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్త్రీలు పట్టించుకోలేదు. దండి యాత్ర మార్గమధ్యంలోనే గాంధీని కలిసిన సరోజినీ నాయుడు దండిలో గాంధీతో పాటు ఉప్పు తయారు చేశారు. దుర్గాబాయమ్మ, కొండా పార్వతమ్మ మరెంతమందో వేలాదిగా స్త్రీలు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, ఇంట్లోని పాలకులనూ, బయటి వలస పాలకులనూ ఎదిరించి స్వేచ్ఛగా జైలు జీవితాన్ని కోరుకున్నారు. అఖిల భారత మహాసభను నిర్వహించుకొని కొనసాగారు. తెలంగా ణాలో నవజీవన మహిళా మండలితో మొదలై బ్రిజ్‌రాణి గౌడ్, ప్రేమాతాయి, సర్జూబెన్ వంటివారు వామపక్ష ఉద్యమాలలోకి నడిచారు. గిరిజన పోరాటాలలో కొమురం సోంబాయి నాయకురాలై నిలబడింది. చిట్యాల ఐలమ్మ తన భూమి సాగు చేసుకోవడానికి చేసిన పోరాటంతో తెలంగాణలో జాతీయోద్యమం, రైతాంగ విముక్తి ఉద్యమం – రెండింటికీ రెండు మార్గాలేర్పడ్డాయి. రైతాంగ ఉద్య మంలో మల్లు స్వరాజ్యం వంటి ఎందరో నాయకులు తయార య్యారు. స్త్రీల పోరాట వ్యూహాలు కొత్తగా రూపొందాయి. స్త్రీలు చేసిన త్యాగాలతో సరిసమానమైనవి లేవన్నంతగా స్త్రీలు ఆ ఉద్యమంలో మమేకమయ్యారు. ► ఎంతగా స్త్రీలను ఇంటికి పరిమితం చేయాలనుకున్నా, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతినిధులుగా నిలబెట్టాలన్నా... జాతీయోద్య మంలో అది కుదరలేదు. పోరాటయోధులుగా వారు తమను తాము నిర్వచించుకోగలిగారు. రూపుదిద్దుకోగలిగారు. కానీ స్వాతంత్య్రానం తరం పాలనా రాజకీయాలలో వారికి దక్కినదానికీ, జాతీయోద్య మంలో వారి భాగస్వామ్యానికీ పోలికే లేదు. రాజ్యాంగ రచనలో దుర్గాబాయమ్మ, దాక్షాయణీ వేలాయుధన్లు చేసిన కృషి ఎంత ఉన్నా రాజకీయాధికారంలో సమభాగస్వామ్యాన్ని స్త్రీలు పొందలేక పోయారు. పితృస్వామ్యం స్వతంత్ర భారతదేశంలో కొత్త రూపాలతో స్త్రీలను మళ్ళీ ఇళ్ళలోకి నెట్టివేసింది. ఇప్పటికీ ఈ 75 ఏళ్ళ ఉత్సవాల సందర్భంలో కూడా స్త్రీలకు దక్కవలసిన రాజకీయ భాగస్వామ్యం సాధించుకోవలసిన విషయంగానే మిగిలింది. ► 33 శాతం రిజర్వేషన్‌ను పొందగలమనే ఆశ రోజురోజుకీ క్షీణించిపోతోంది. ఇక స్త్రీలపై హింస పెరగడం, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతినిధులుగా స్త్రీలను తీర్చి దిద్దే ప్రయత్నాలు ఒకవైపు, మార్కెట్ అవసరాలకు తగిన కొనుగోలు దారులుగా చేసే ప్రయత్నాలు మరొకవైపు వారిని గందరగోళంలోకి నెడుతున్నాయి. కొత్త కొత్త రూపాలలో స్త్రీల స్వేచ్ఛను హరిస్తున్నాయి. ఇప్పుడు స్త్రీలు తమ అస్తిత్వాన్ని కొత్తగా నిర్వచించుకుని, కుల, మత, జాతి వివక్షలను దాటి, రాజ్యాంగ ఆశయాలను మరింత విస్తృత పరుచుకుంటూ కొనసాగే మార్గంలో ఉన్నారు. ప్రస్తుతం ఆ మార్గం చిన్నదిగా, ఆటంకాలతో కూడినదిగా ఉన్నప్పటికీ, రాబోయే కాలంలో స్త్రీల మార్గమే స్వతంత్ర పోరాట, ఉద్యమ ఆశయాలను సామాన్య ప్రజల జీవితాల్లో సాకారం చేయగలుగుతుంది. ఆ ఆలోచనలకు ఈ స్వతంత్ర భారత 75 వసంతాల సందర్భం ఒక ప్రారంభమైతే బాగుంటుంది! ఓల్గా, వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత -
ఎక్కువ శాతం మహిళలకు టిక్కెట్లు సబబేనా?
సాక్షి, న్యూఢిల్లీ : బిజూ జనతాదళ్ నాయకుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయడానికి 33 శాతం మంది మహిళలకు టెకెట్లు కేటాయించగా, బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ ఏకంగా 40 శాతం ఎంపీ టిక్కెట్లను మహిళలకు కేటాయించిన విషయం తెల్సిందే. ఎందుకు వారు మహిళలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు? మహిళల్లో అక్షరాస్యతతోపాటు రాజకీయ అవగాహన పెరిగిందా ? వారయితేనే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయా ? ఉంటే ఎందుకు ఉంటాయి ? వారు తీసుకున్న నిర్ణయం సబబేనా? నేడు భారత దేశంలో ప్రాథమికే కాదు, మాధ్యమిక విద్యను పూర్తి చేస్తున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం దేశంలో మాధ్యమిక విద్యను పూర్తి చేస్తున్న మహిళల సంఖ్య 75.8 శాతం కాగా, పురుషుల సంఖ్య74.59 శాతం ఉంది. ఆ మహిళల్లో ప్రతి పది మందిలో ఏడుగురు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇక వారిలో ప్రతీ నలుగురిలో ముగ్గురు ఏ వత్తిని చేపట్టాలో ముందుగానే నిర్ణయానికి వస్తున్నారు. మహిళలు కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని మహిళల్లో 68 శాతం మంది కోరుకుంటున్నట్లు ‘లోక్‌నీతి–సీఎస్డీఎస్’ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. వారిలో ప్రతి ఐదుగురిలో ముగ్గురు కుటుంబ సభ్యుల ప్రభావానికి లోనుకాకుండా స్వతంత్ర నిర్ణయం మేరకు అభ్యర్థులకు లేదా పార్టీలకు ఓటు వేస్తామని చెప్పారు. పంచాయతీ రిజర్వేషన్లతోనే చైతన్యం పంచాయతీలు, స్థానిక సంస్థల్లో 40 శాతానికిపైగా సీట్లను మహిళలకు కేటాయిస్తూ 1992లో 73, 74 రాజ్యాంగ సవరణలను తీసుకరావడం వల్ల మహిళల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. పంచయతీరాజ్ లెక్కల ప్రకారం నేడు పంచాయతీరాజ్ సంస్థల్లో 46 శాతం సీట్లకు మహిళలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది పంచాయతీ రాజ్ పదవులకు పోటీచేసి విజయం సాధించగా, మరో 20 లక్షల మంది మహిళలు పోటీచేసి ఓడిపోయారు. ఓటర్ల చైతన్యం గురించి గ్రామ స్థాయిలో జరగాల్సిన అభివద్ధి కార్యక్రమాలు, ఇతర సమస్యల గురించి నేడు మహిళలకు ఎక్కువ అవగాహన ఉందని ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో విమెన్స్ స్టడీస్ డివిజన్‌కు నాయకత్వం వహిస్తున్న బిద్యుత్ మొహంతీ తెలిపారు. స్వచ్ఛందంగా మహిళా పోలింగ్ నేడు మహిళా ఓటర్లలో కూడా ఎంతో చైతన్యం పెరిగిందని, ఎవరి ప్రభావం వల్లనో కాకుండా మహిళా సాధికారితను సాధించడంలో భాగంగా స్వచ్ఛందంగా మహిళా ఓటర్లు ముందుకు వచ్చి ఓటేస్తున్నారని బ్రూకింగ్స్ ఇండియా డైరెక్టర్ శామిక రవి చెప్పారు. 1962 నాటి ఎన్నికల్లో పురుషులు, మహిళా ఓటర్ల మధ్య వ్యత్యాసం 15 శాతం ఉండగా, అది 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నాటికి 1.5 శాతానికి పడిపోయింది. 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషులకన్నా మహిళల పోలింగ్ శాతం పెరిగింది. ‘బీమారు’గా వ్యవహరించే వెనకబడిన రాష్ట్రాలైన బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మహిళా ఓటర్ల సంఖ్య పెరగడం విశేషం. 1960 దశకంతో పోలిస్తే 2000 దశకం నాటికి దేశంలో దేశంలో లింగ నిష్పత్తి బాగా పెరగ్గా, పోలింగ్‌లో నిష్పత్తి బాగా తగ్గడం గమనార్హం. హింస తగ్గడం, సదుపాయాలు పెరగడం పోలింగ్ కేంద్రాల వద్ద హింస తగ్గడం, మహిళలకు సదుపాయాలు పెరగడం, మహిళల ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం 1990 నుంచి ఎన్నికల కమిషన్ ప్రత్యేక డ్రైవ్ కొనసాగించడం తదితర కారణాల వల్ల మహిళల పోలింగ్ శాతం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఓటర్లుగా నమోదు చేయించుకోవడంలో కొంత మంది మహిళలు విఫలమవుతున్నప్పటికీ వారి సంఖ్య పురుషులకన్నా తక్కువగా ఉండడం విశేషం. ఎన్నికల కమిషన్ మార్చి నెలలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం 4.35 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు కోసం తమ పేర్లను నమోదు చేసుకోగా 3.80 కోట్ల మంది పురుషులు కొత్తగా ఓటు హక్కు పొందారు. లోక్‌సభలో 12.1 శాతం మహిళల ప్రాతినిధ్యం దేశం మొత్తం జనాభాలో 48.1 శాతం మంది మహిళలు ఉండగా, లోక్‌సభలో మాత్రం ప్రస్తుతం మహిళల ప్రాతినిధ్యం మాత్రం 12.1 శాతం మాత్రమే. పార్లమెంట్ ఉభయ సభలతోపాటు రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఇప్పటికీ పార్లమెంట్లో పెండింగ్‌లో ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బిజూ జనతాదళ్, తృణముల్ కాంగ్రెస్ పార్టీలు తీసుకున్న స్వచ్ఛంద నిర్ణయం ఎంతో హర్షనీయం. -
రైళ్లలో మహిళా ప్రయాణికులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : మహిళా ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ శుభవార్త అందించింది. నిరుపయోగ సీట్ల (అన్‌యుటిలైజ్డ్ బెర్తులు) విషయంలో మహిళా కోటాను అమలు చెయ్యబోతోంది. దీని ప్రకారం రిజర్వేషన్ తర్వాత మిగిలిపోయిన సీట్లలో తొలి ప్రాధాన్యం మహిళలకు ఉంటుంది. సాధారణంగా రైల్వే శాఖ రిజర్వేషన్ ఛార్ట్ తయారు చేసే సమయంలో సీట్లు మిగిలిపోతే వెయిట్-లిస్ట్‌లో ఉన్నవారికి కేటాయిస్తుంది. కోటా ప్రకారం తొలి ప్రాధాన్యం సీనియర్ సిటిజన్లకు.. తర్వాతి ప్రాధాన్యం ముందుగా ఎవరు బుక్ చేసుకునే వారికి ఉంటుంది. కానీ, ఇకపై ఆ జాబితాలో ముందుగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ మేరకు ఫిబ్రవరి 15న రైల్వే బోర్డు ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. బెర్తులు మిగిలిపోయే సమయంలో సీట్ల కేటాయింపును లింగ నిష్పత్తి ద్వారానే కేటాయించాలని సర్క్యులర్‌లో పేర్కొంది. ముందు వృద్ధులకు, తర్వాత మహిళలకు సీట్లు కేటాయించాలి. త్వరలోనే ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ప్రస్తుతం అన్ని రైళ్లలో ఆరు లోయర్ బెర్తులు, ఏసీ3 టైర్-ఏసీ2 టైర్ లలో మూడు లోయర్ బెర్తులను సీనియర్సిటిజన్లు, మహిళా ప్రయాణికులు (45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే), గర్భవతులకు కేటాయిస్తున్నారు. -
ఐఐటీల్లో మహిళలకు అదనపు సీట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది జులై నుంచి ప్రారంభమయ్యే బ్యాచ్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా ఐఐటీల్లో 550 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతిష్టాత్మక జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో పురుషులకు దీటుగా మహిళలను ప్రోత్సహించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఐఐటీ అడ్మిషన్లలో ప్రతి పదిమందిలో కేవలం ఒక మహిళ ఉండటంతో ఈ పరిస్థితిని చక్కదిద్దాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. 2018 బ్యాచ్‌లో కనీసం 14 శాతం సీట్లు మహిళలకు కేటాయించాలని మంత్రిత్వ శాఖ 23 ఐఐటీలను ఇటీవల ఆదేశించింది. అయితే మహిళల కోటాను 14 శాతానికి తీసుకురావాలంటే 550 అదనపు సీట్లు అవసరమని ఐఐటీ ఢిల్లీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఛైర్మన్ ఆదిత్య మిట్టల్ పేర్కొన్నారు. మరోవైపు 2020 నాటికి ఇంజనీరింగ్ కాలేజీల్లో మహిళలకు కనీసం 20 శాతం సీట్లు లభించాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా దీన్ని అధిగమించాలంటే మరిన్ని అదనపు సీట్లను కేటాయించాలని ఐఐటీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అదనపు సీట్ల మంజూరుతో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురవకుండా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ న్యాయమంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ పొందింది. మరోవైపు ఐఐటీల్లో యువతుల సంఖ్యను పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశ్రమ స్వాగతించింది. ఇది గొప్ప నిర్ణయమని ఐబీఎం ఇండియా యూనివర్సిటీ రిలేషన్స్ హెడ్ మోనా భరద్వాజ్ పేర్కొన్నారు. అయితే ఐఐటీల్లో తక్కువ సంఖ్యలో మహిళలు చేరడం వెనుక తల్లితండ్రుల వైఖరితో పాటు సామాజికాంశాలు దాగిఉన్నాయని ఓ ఐఐటీకి చెందిన ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. -
జాతకాలు ఖరారు
♦ మహిళల కోటాలో ఆరు మార్కెట్లు ♦ ప్రధాన మార్కెట్లు జనరల్ కేటగిరీలో... ♦ మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ♦ నిర్ణయించిన సర్కారు అధికార పార్టీ నాయకుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. మార్కెట్ కమిటీ పదవుల కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న నాయకులు రిజర్వేషన్ల ఖరారుతో ఎగిరి గంతేస్తున్నారు. అయితే, ఈ రిజర్వేషన్లు కొందరికి పదవిని దూరం చేశాయి. అనుకున్నవారికి అనుకూలంగా రిజర్వేషన్లు రాకపోవడంతో వారంతా నిరాశలో ఉన్నారు. ఏదేమైనా స్థానిక నాయకులకు కూడా పదవులు దక్కుతాయన్న ఆశ ఎక్కువమందిలో ఉంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. మొత్తం మార్కెట్ కమిటీల్లో 33 శాతం పదవులను మహిళలకు కేటాయించింది. ఈ మేరకు గురువారం రాష్ర్టస్థాయిలో మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లను ఖరారు చేశారు. దీంతో జిల్లాలోని 15 మార్కెట్లలో ఆరింటిని మహిళలకు కేటాయించారు. కాగా, ప్రధాన మార్కెట్లయిన తాండూరు, ఇబ్రహీంపట్నం, వికారాబాద్లను జనరల్‌గా నిర్దేశించారు. మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ఖరారు చేయడంతో అతి త్వరలోనే వీటిని భర్తీ చేసే అవకాశముంది. గతేడాది కాలంగా మార్కెట్ కమిటీల కుర్చీలపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించడంతో వీరికి లైన్ క్లియరైంది. అదేసమయంలో రిజర్వేషన్లతో జాతకాలు తారుమారు కావడం ఆశావహులను నిరాశకు గురిచేసింది. నామినే టెడ్ పదవుల్లోను రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం.. అందులో తొలుత మార్కెట్ కమిటీల తోనే ఈ విధానానికి శ్రీకారం చుట్టడంతో పదవులపై గంపెడాశలు పెట్టుకున్నవారిని నైరాశ్యంలో పడేసింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయడంతో ఆయా మండలాల్లో మార్కెట్ పీఠాలపై కన్నేసిన అధికార పార్టీ దిగువశ్రేణి నాయకులకు అసంతృప్తి మిగిల్చింది. లాటరీ ప్రాతిపదికన రిజర్వేషన్లను ఖరారు చేశామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, జిల్లాలో ఏయే మార్కెట్ కమిటీ ఏ కేటగిరి కింద రిజర్వ్ అవుతుందో ముందే లీకయింది. ఈ క్రమంలోనే ఆయా మార్కెట్ కమిటీలను ఆశిస్తున్నవారి జాబితాను ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు వడపోశారు. ఈ మేరకు పదవుల వడ్డింపు కూడా దాదాపుగా పూర్తి చేశారు. ఈ తరుణంలో రిజర్వేషన్లను ప్రకటించడంతో పదవుల పంపకం కూడా సాధ్యమైనంత త్వరగా జరిగే అవకాశముంది. ఎక్కడయినా ఆశావహుల మధ్య పోటీ తీవ్ర ంగా ఉంటే తప్ప.. కమిటీల కూర్పు వచ్చే నెలలో పూర్తయ్యే అవకాశముందని అధికారపార్టీ ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించారు.