జాతకాలు ఖరారు
♦ మహిళల కోటాలో ఆరు మార్కెట్లు
♦ ప్రధాన మార్కెట్లు జనరల్ కేటగిరీలో...
♦ మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు
♦ నిర్ణయించిన సర్కారు
అధికార పార్టీ నాయకుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. మార్కెట్ కమిటీ పదవుల కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న నాయకులు రిజర్వేషన్ల ఖరారుతో ఎగిరి గంతేస్తున్నారు. అయితే, ఈ రిజర్వేషన్లు కొందరికి పదవిని దూరం చేశాయి. అనుకున్నవారికి అనుకూలంగా రిజర్వేషన్లు రాకపోవడంతో వారంతా నిరాశలో ఉన్నారు. ఏదేమైనా స్థానిక నాయకులకు కూడా పదవులు దక్కుతాయన్న ఆశ ఎక్కువమందిలో ఉంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. మొత్తం మార్కెట్ కమిటీల్లో 33 శాతం పదవులను మహిళలకు కేటాయించింది. ఈ మేరకు గురువారం రాష్ర్టస్థాయిలో మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లను ఖరారు చేశారు. దీంతో జిల్లాలోని 15 మార్కెట్లలో ఆరింటిని మహిళలకు కేటాయించారు. కాగా, ప్రధాన మార్కెట్లయిన తాండూరు, ఇబ్రహీంపట్నం, వికారాబాద్‌లను జనరల్‌గా నిర్దేశించారు.
మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ఖరారు చేయడంతో అతి త్వరలోనే వీటిని భర్తీ చేసే అవకాశముంది. గతేడాది కాలంగా మార్కెట్ కమిటీల కుర్చీలపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించడంతో వీరికి లైన్ క్లియరైంది. అదేసమయంలో రిజర్వేషన్లతో జాతకాలు తారుమారు కావడం ఆశావహులను నిరాశకు గురిచేసింది. నామినే టెడ్ పదవుల్లోను రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం.. అందులో తొలుత మార్కెట్ కమిటీల తోనే ఈ విధానానికి శ్రీకారం చుట్టడంతో పదవులపై గంపెడాశలు పెట్టుకున్నవారిని నైరాశ్యంలో పడేసింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయడంతో ఆయా మండలాల్లో మార్కెట్ పీఠాలపై కన్నేసిన అధికార పార్టీ దిగువశ్రేణి నాయకులకు అసంతృప్తి మిగిల్చింది.
లాటరీ ప్రాతిపదికన రిజర్వేషన్లను ఖరారు చేశామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, జిల్లాలో ఏయే మార్కెట్ కమిటీ ఏ కేటగిరి కింద రిజర్వ్ అవుతుందో ముందే లీకయింది. ఈ క్రమంలోనే ఆయా మార్కెట్ కమిటీలను ఆశిస్తున్నవారి జాబితాను ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు వడపోశారు. ఈ మేరకు పదవుల వడ్డింపు కూడా దాదాపుగా పూర్తి చేశారు. ఈ తరుణంలో రిజర్వేషన్లను ప్రకటించడంతో పదవుల పంపకం కూడా సాధ్యమైనంత త్వరగా జరిగే అవకాశముంది. ఎక్కడయినా ఆశావహుల మధ్య పోటీ తీవ్ర ంగా ఉంటే తప్ప.. కమిటీల కూర్పు వచ్చే నెలలో పూర్తయ్యే అవకాశముందని అధికారపార్టీ ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించారు.