సాక్షి, న్యూఢిల్లీ : బిజూ జనతాదళ్ నాయకుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయడానికి 33 శాతం మంది మహిళలకు టెకెట్లు కేటాయించగా, బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ ఏకంగా 40 శాతం ఎంపీ టిక్కెట్లను మహిళలకు కేటాయించిన విషయం తెల్సిందే. ఎందుకు వారు మహిళలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు? మహిళల్లో అక్షరాస్యతతోపాటు రాజకీయ అవగాహన పెరిగిందా ? వారయితేనే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయా ? ఉంటే ఎందుకు ఉంటాయి ? వారు తీసుకున్న నిర్ణయం సబబేనా?
నేడు భారత దేశంలో ప్రాథమికే కాదు, మాధ్యమిక విద్యను పూర్తి చేస్తున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం దేశంలో మాధ్యమిక విద్యను పూర్తి చేస్తున్న మహిళల సంఖ్య 75.8 శాతం కాగా, పురుషుల సంఖ్య74.59 శాతం ఉంది. ఆ మహిళల్లో ప్రతి పది మందిలో ఏడుగురు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇక వారిలో ప్రతీ నలుగురిలో ముగ్గురు ఏ వత్తిని చేపట్టాలో ముందుగానే నిర్ణయానికి వస్తున్నారు. మహిళలు కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని మహిళల్లో 68 శాతం మంది కోరుకుంటున్నట్లు ‘లోక్‌నీతి–సీఎస్‌డీఎస్’ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. వారిలో ప్రతి ఐదుగురిలో ముగ్గురు కుటుంబ సభ్యుల ప్రభావానికి లోనుకాకుండా స్వతంత్ర నిర్ణయం మేరకు అభ్యర్థులకు లేదా పార్టీలకు ఓటు వేస్తామని చెప్పారు.
పంచాయతీ రిజర్వేషన్లతోనే చైతన్యం
పంచాయతీలు, స్థానిక సంస్థల్లో 40 శాతానికిపైగా సీట్లను మహిళలకు కేటాయిస్తూ 1992లో 73, 74 రాజ్యాంగ సవరణలను తీసుకరావడం వల్ల మహిళల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. పంచయతీరాజ్ లెక్కల ప్రకారం నేడు పంచాయతీరాజ్ సంస్థల్లో 46 శాతం సీట్లకు మహిళలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది పంచాయతీ రాజ్ పదవులకు పోటీచేసి విజయం సాధించగా, మరో 20 లక్షల మంది మహిళలు పోటీచేసి ఓడిపోయారు. ఓటర్ల చైతన్యం గురించి గ్రామ స్థాయిలో జరగాల్సిన అభివద్ధి కార్యక్రమాలు, ఇతర సమస్యల గురించి నేడు మహిళలకు ఎక్కువ అవగాహన ఉందని ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో విమెన్స్ స్టడీస్ డివిజన్‌కు నాయకత్వం వహిస్తున్న బిద్యుత్ మొహంతీ తెలిపారు.
స్వచ్ఛందంగా మహిళా పోలింగ్
నేడు మహిళా ఓటర్లలో కూడా ఎంతో చైతన్యం పెరిగిందని, ఎవరి ప్రభావం వల్లనో కాకుండా మహిళా సాధికారితను సాధించడంలో భాగంగా స్వచ్ఛందంగా మహిళా ఓటర్లు ముందుకు వచ్చి ఓటేస్తున్నారని బ్రూకింగ్స్ ఇండియా డైరెక్టర్ శామిక రవి చెప్పారు. 1962 నాటి ఎన్నికల్లో పురుషులు, మహిళా ఓటర్ల మధ్య వ్యత్యాసం 15 శాతం ఉండగా, అది 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నాటికి 1.5 శాతానికి పడిపోయింది. 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషులకన్నా మహిళల పోలింగ్ శాతం పెరిగింది. ‘బీమారు’గా వ్యవహరించే వెనకబడిన రాష్ట్రాలైన బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మహిళా ఓటర్ల సంఖ్య పెరగడం విశేషం. 1960 దశకంతో పోలిస్తే 2000 దశకం నాటికి దేశంలో దేశంలో లింగ నిష్పత్తి బాగా పెరగ్గా, పోలింగ్‌లో నిష్పత్తి బాగా తగ్గడం గమనార్హం.
హింస తగ్గడం, సదుపాయాలు పెరగడం
పోలింగ్ కేంద్రాల వద్ద హింస తగ్గడం, మహిళలకు సదుపాయాలు పెరగడం, మహిళల ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం 1990 నుంచి ఎన్నికల కమిషన్ ప్రత్యేక డ్రైవ్ కొనసాగించడం తదితర కారణాల వల్ల మహిళల పోలింగ్ శాతం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఓటర్లుగా నమోదు చేయించుకోవడంలో కొంత మంది మహిళలు విఫలమవుతున్నప్పటికీ వారి సంఖ్య పురుషులకన్నా తక్కువగా ఉండడం విశేషం. ఎన్నికల కమిషన్ మార్చి నెలలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం 4.35 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు కోసం తమ పేర్లను నమోదు చేసుకోగా 3.80 కోట్ల మంది పురుషులు కొత్తగా ఓటు హక్కు పొందారు.
లోక్‌సభలో 12.1 శాతం మహిళల ప్రాతినిధ్యం
దేశం మొత్తం జనాభాలో 48.1 శాతం మంది మహిళలు ఉండగా, లోక్‌సభలో మాత్రం ప్రస్తుతం మహిళల ప్రాతినిధ్యం మాత్రం 12.1 శాతం మాత్రమే. పార్లమెంట్ ఉభయ సభలతోపాటు రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఇప్పటికీ పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బిజూ జనతాదళ్, తృణముల్ కాంగ్రెస్ పార్టీలు తీసుకున్న స్వచ్ఛంద నిర్ణయం ఎంతో హర్షనీయం.
Comments
Please login to add a commentAdd a comment