చిత్రానికి నమస్సులు
జ్యోతిర్మయం
‘శ్రీరామకృష్ణ పరమహంస చిత్రాన్ని లిఖిస్తానంటూ ఒక గొప్ప చిత్రకారుడు ఆయన వద్దకొచ్చాడు’ అని ఓ ఉదంతం చెప్తాడు శ్రీరజనీష్. పరమహంస అను మతించాడు. చిత్రకారుడు చిత్రాన్ని తయారు చేసిన తర్వాత, దానిని శ్రీరామకృష్ణ వద్దకు తెచ్చాడు. అది ఉదయం వేళ. చిత్రకారుడు రామకృష్ణుల చిత్రాన్ని ఆయన ముందుపెట్టాడు. రామకృష్ణ దానిని చూసి, ఆ తైలవర్ణ చిత్రపాదాలకు నమస్కరించాడు! చిత్రకారు డు, అక్కడ కూచోనున్న శిష్యులు, తదితరులు అంద రూ విస్మయులైనారు. చిత్రకారుడు రామకృష్ణునితో ‘అయ్యా, నాకు జ్ఞానయోగుల విషయం ఆట్టే తెలియదను కోండి. కానీ ఈ చిత్రం సాక్షా త్తు మీ చిత్రమే. దాని పాదాలకే మీరు నమస్కరించడం చాలా ఆశ్చర్యంగా ఉంది’ అన్నారు.
అందుకు రామకృష్ణుడు సమాధానం చెప్తూ, ‘నువ్వు చిత్రం గీస్తున్నప్పుడు సమాధిలో ఉన్నాను. అందుచేత ఇది కేవలం నా చిత్రమే కాదు; ‘సమాధి’ చిత్రం కూడాను. నేను ప్రధా నం కాదు. అక్కడ చిత్రంలోని ఆ సమాధి స్థితి ప్రధానం. నా ముందుకు ‘సమాధి స్థితిని’ తీసుకొస్తే - అది ఎవరి సమాధి స్థితి అవనీ.. దానికి మొక్కకుండా ఉండలేను. లోకమంతా నన్ను ఉన్మాదిగా భావించి నా, సమాధిస్థితిని గౌరవించకుండా ఉండలేను. చిత్రంలో నా ఆత్మవికాసాన్ని ప్రదర్శించగలిగావు. నా హృదయంలోని శాంతిని ఆ చిత్రంలో ప్రస్ఫుటంగా చూపించావు. నువు ధన్యుడివి’ అన్నాడు.
గౌతమబుద్ధుడు, తన పూర్వ జన్మల్లోని ఒక జన్మలో, ఓ మహాజ్ఞాని వద్దకు వెళ్లాడు. ఆయన్ని ఎన్నో ప్రశ్నలు అడగడానికి ఆత్రపడుతున్నాడు. కానీ ఆ మహా జ్ఞాని వద్దకు వెళ్లేసరికి, అతడి ప్రశ్నలన్నీ మాయ మయ్యాయి. వంగి, పాదాభివందనం చేశాడు. కానీ తాను గౌరవంతో నమస్కరించి లేచి నుంచు నేసరికి, ఆ మహాజ్ఞానే తన పాదాలు ముట్టుకొని నమస్కరిం చడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. ‘ఏం చేస్తున్నారండీ? మీరు ఆత్మసాక్షాత్కారమొందినవారు. ఇక నేనో? ప్రాథమిక దశలో ఉన్నవాణ్ణి. నాకేమనాలో తోచడం లేదు.’ జ్ఞాని నవ్వాడు. ‘ఆశ్చర్యపోకు. నేను స్పృశిం చింది నీ కాళ్లను కాదు. నేను నీ భవిష్యత్తుకు అభివం దనం చేస్తున్నాను. నిన్న, నేను మేల్కొన్న వాణ్ణికాదు; రేపటికి నువు మేలుకుంటావు. మనిద్దరికీ ఉన్న తేడా ఏమిటి? అదీకాక నీవొక మహాజ్ఞానిగా విరాజిల్లగల వని, నీ భవిష్యత్తును చూడగలిగాను. కోట్లాది జనులు నిన్ను అనుసరిస్తారు’ అన్నాడు.
అరుణాచలరమణుడి దృష్టిలో, ప్రపంచంలో అజ్ఞానులు అంటూ ఎవరూ లేరు. తానూ ఒకప్పుడు పదిహేడేళ్ల వయసులో అజ్ఞానే. ఒక్క ‘మరణా నుభవంతో’ తన భవిష్యత్తు మారిపోయింది. జ్ఞాన మార్గం తొక్కాడు. తపస్సు చేశాడు. లోనుండి మహాజ్ఞానం పుట్టుకొచ్చింది. ప్రతి మానవుడి భవిష్యత్తు ఇదే. అంత వరకూ మానవునిగా జన్మిస్తూనే ఉంటాడు.
- నీలంరాజు లక్ష్మీప్రసాద్