బతికిన క్షణాలు
జ్యోతిర్మయం
ఓ ఆంగ్ల కథలో ఒక మనిషి మరణ ప్రస్తావన ఉంది. ఆ విషయం తెలిసే సమయానికి భగవంతుడు ఒక సూట్‌కేస్ పట్టుకొని వస్తున్నట్లు మనిషి గమనించాడు.
‘మంచిది బాబూ! నువ్వు బయలులేరాల్సిన వేళ అయింది’ అన్నాడు భగవంతుడు. ‘ఇంత తొందర గానా ప్రభూ? నేనింకా చేయాల్సింది ఉందనుకుం టున్నా’ అన్నాడు మనిషి. ‘వెళ్లకతప్పదు, కాలం ఆసన్న మయింది’.
‘సూట్ కేస్‌లో ఏమున్నై?’ అడిగాడు మానవుడు. ‘నీ సామాను, వస్తువులు’ అన్నాడు భగవంతుడు. ‘నా వస్తువులా? అంటే నా దుస్తులు, నా డబ్బూనా?’’ అన్నా డు మనిషి. ‘అవి నీవి కావు. అవి భూమికి చెందినవి.’ ‘అయితే నా జ్ఞాపకాలు, స్మృతులా?’ ‘నీకేనాడూ అవి సొంతం కావు. అవి కాలానికి చెందినవి’ అన్నాడు భగవంతుడు. ‘అయితే నా సామర్థ్యమూ, ప్రజ్ఞాపాట వాలు అయి ఉండాలి’ అన్నాడు మనిషి. ‘అవి ఏనాడూ నీవికావు. అవి కేవలం దైవఘటన’. మనిషి కాస్త ఆలో చించి, ‘నా మిత్రులూ, కుటుంబీకులేమో’ అన్నాడు.
‘వారు ఏనాడూ నీవారు కాదు. వీరంతా నీ హృదయానికి సంబంధించిన వారు’ అన్నాడు భగవం తుడు. ఏమీ తోచక మానవుడు ‘బహుశా నా శరీరమేమో!’ అనిపించిందేదో అనే శాడు. ‘అది ఏ క్షణాన నీది కాదు, ధూళికి చెందినది’. చివరకు మనిషి తెలివిగా, ‘బహుశా నా ఆత్మ అయి వుండచ్చు’ అన్నాడు. ‘కాదు. అది మొదట్నించీ నాదే’ అన్నాడు భగవంతుడు. మృతుణ్ణి భయమావరించింది.
భగవంతుణ్ణి అడిగి ఆ సూట్‌కేస్‌ను తీసుకుని; తెరచి చూశాడు. పూర్తిగా ఖాళీ. కంటి నుంచి నాలుగు చుక్కలు రాలినై. ‘నా వద్ద ఏమీ ఉండేది కాదా?’ గద్గద స్వరంతో ప్రశ్నించాడు. ‘అవును, నీవు బ్రతికున్న క్షణం మాత్రమే నీది. జీవితం కేవలం ఒక క్షణమే, ఆ క్షణమే నీది’ అన్నాడు భగవంతుడు. మనకిచ్చిన ఈ జీవితం ఎన్ని క్షణాల పాటిదో తెలియదు. అందువల్ల ప్రతి క్షణం విలువైనదిగా గ్రహించి, ఈ ప్రపంచంలో విహరిం చాలి. క్షణం కూడా వ్యర్థం కానివ్వకుండా ఈ ఉనికి లోని అందాన్నంతా ఆహ్వానించాలి. జ్ఞానాన్ని అధ్యయ నం చేయాలి. మధుర పదార్థాలు రుచి చూడాలి.
ముఖ్యంగా, ఇక్కడి సంబంధ బాంధవ్యాలలో ప్రేమను కనుగొనాలి. అసూయతో కూడుకున్నది ప్రేమ కాదని ఎరిగి రావాలి. ఈ దోషాలేవీ అంటని ప్రేమను సూక్ష్మబుద్ధితో, తెలివితో దర్శించాలి. అప్పుడు మానవ సంబంధాలన్నీ అర్థమై, బ్రహ్మ సంబంధం తెలియనా రంభిస్తుంది. ఆ దశలో ప్రేమకై వారి వద్దా వీరి వద్దా చేయి చాచాల్సిన అవసరముండదు. ఎందుకంటే, ప్రేమను దర్శించిన వానిలో, అపరిమితమైన ప్రేమ ఆవిర్భవిస్తుంది. అది ఎందరికి అందించినా, పంచినా, ఇంకా మిగులుతూనే ఉంటుంది. ప్రేమను దర్శించిన మానవుడు, ఆ ప్రేమమయుడ్ని దర్శించిన వాడే. ఆ గుణాన్నే సంతరించుకుంటాడు. ఆ గుణంలోన ఏర్ప డితే గానీ ఆ దర్శనం జరగదు.
నీలంరాజు లక్ష్మీప్రసాద్