చావుపుట్టుకలు లేనిది
జ్యోతిర్మయం
టోజూ అనే జెన్ మాస్టర్ తన జీవితం పొడుగూతా మౌనంగా ఉండేవాడట. మన సంప్రదాయంలో కూడా దక్షిణాదిలో మౌనస్వామి అనే ఆయన ఉండే వాడు. ఆయన మాట్లాడకుండానే ఆశ్రమ జీవితం గడుపుతుండేవాడు. ఈ జెన్ మాస్టర్ విషయంలో కూడా ఇతడు చిన్నప్పుడే మౌనం వహించనారం భించినందువల్ల, ఇతడికి మాటలు రావేమో అని అనుకునేవారు. కానీ పిల్లవాడు ఎంత తెలివిగా ఉండేవాడంటే, ఇతడు మూగకాదనీ, మౌనం పాటిస్తున్నాడని కనుగొన్నారు. బహుశా ఏ పూర్వ జన్మలోనో మౌనంగా బతకాలని తీర్మా నించుకొని, దానిని ఈ జన్మలో వ్రతరూపంగా ఆచరిస్తున్నా డేమోనని అంటుండేవారు.
తాను చనిపోయే రోజున, మొదటిసారిగానూ, ఆఖరిసారిగానూ నాలుగు మాటలు పలికాడు. మరణిస్తానన్న పొద్దున తన అనుచరులను అందరినీ ఒక చోట చేర్చాడు. మామూ లుగా అతడేమీ మాట్లాడకపోయినా, వారందరి అనుభవమేమిటంటే, అతడు ‘దేనినో’ జీవిస్తున్నాడని నమ్మేవారు. ఆ జీవిస్తున్న పదార్థం వారందరికీ అత్యంత ముఖ్యమైనది. అందువల్ల అతడ్ని అంటిపె ట్టుకు తిరుగుతుండేవారు. వారంతా టోజు చుట్టూ పర్యవేక్షించి ఉండేవారు. అతడి నిశ్శబ్ద భావప్రసా రానికి గురవుతూ ఉండిపోయేవారు. వారిలో చాలా మంది ఆ కారణంగా పరివర్తన చెందారు.
వారందరితో అతడు ‘ఇవాళ సూర్యాస్తమ యానికి నేను మరణిస్తాను. ఇదే నా ప్రథమ మరియు ఆఖరి ప్రకటన’ అన్నాడు. అప్పుడు అతడి అనుచరుల్లో ఒకరు ‘మీరు మాట్లాడగలిగి ఉన్నప్పుడు, జీవితమంతా మౌనంగా ఎందుకుండిపోయారు?’ అని అడిగాడు.
‘జీవితంలో అన్నీ అనిశ్చితమైనవే. మరణం ఒక్కటే నిశ్చయంగా సంభవిస్తుంది. నేను నిశ్చితమైన దానిని గురించే మాట్లాడాలని నిశ్చయించుకున్నాను’ అన్నాడు.
ఈ మాటల గురించి శ్రీరజనీష్ వ్యాఖ్యానిస్తూ ‘జీవితానికి రెండు ధ్రువాలుంటాయి. పుట్టటం సకారాత్మక ధ్రువమైతే, మరణం నకారాత్మకధ్రువం. నకారాత్మకధ్రువాన్ని లేకుండా చేయలేం. అయస్కాం తం ఎంత పొడుగుపాటిదైనా, రెండు ధ్రువాలూ తప్పవు.
పుట్టావంటే, మరణించక తప్పదు. కానీ పుట్టేట టువంటి ఈ ‘అహం’ వెనకాల, పుట్టనటువంటిది ప్రవహిస్తూనే ఉంది. నువ్వు ఆ పుట్టనిదానిని చూసి అనుభూతి పొందగలిగావంటే, మరణించే భయం తొలిగిపోతుంది. మరణ భయాన్ని మరేరకంగానూ తొలగించలేవు.
మరణం నిశ్చయం. పుట్టింది ‘అహం’ కాబట్టి, అహంతో అమృతత్వం సాధించలేవు. అహం యొక్క ప్రారంభం వెనక్కు చూస్తే, అంటే ఈ కెరటం వెనుక ఉన్న సముద్రాన్ని చూస్తే, మనిషి అమృతత్వాన్ని సాధిస్తాడు. ఆ ‘అహంపుట్టక ముందున్నది’ ఏనాడూ పుట్టలేదు, ఏనాడూ చావలేదు. ఇలా పుట్టినటువంటిదానిని మనిషి తెలుసుకున్న వరకు, దాని అనుభూతి చెందేవరకు, మనిషి మరణాన్ని దాటలేడు, అమృతత్వాన్ని అందుకోలేడు.
- నీలంరాజు లక్ష్మీప్రసాద్