ప్రేమభక్తిని కనుగొనాలి
జ్యోతిర్మయం
‘రుషులు, సాధుపుంగవులు వారి జీవితంలో భక్తిని అత్యంత ప్రధానంగా ఎందుకు ఎంచుతారు?’ అని సాధు వాస్వానీని ఎవరో అడిగారు. ఆయన సమాధా నమిది- భక్తి, మానవ పరిణామాన్ని వేగిరపరుస్తుంది. భక్తి, ప్రధానంగా ప్రేమభక్తి, కృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు వంటి మహా ఆత్మలతో మనల్ని జతపరుస్తుంది. అందు వల్ల ఆ మహా ఆత్మ కంపనలు ఈ ఆత్మకు అను సంధానమైతే ఆ ప్రభావం, ఆ ప్రేరణ మన ఆత్మ మీద ఉంటాయి. ఆ విధంగా మెల్లిమెల్లిగా, భక్తి ద్వారా ఆ భగవంతుడిలోనే ఐక్యమవుతావు.
మనిషి పుట్టింది భక్తిప్రేమను కనుగొని ఆచరించ డానికే. అది వారినీ, వీరినీ చూసి అనుకరించేది కాదు. స్వయంగా ఆ ప్రేమభక్తిని కనుగొన్న వానికే ఆత్మ నివేదిక జరుగుతుంది. అందులో నుంచి పుట్టుకొచ్చిన భక్తే స్వచ్ఛ మైంది. భక్తిలో శ్రవణ కీర్తనాదులు జోడించవచ్చు. కానీ ఆత్మ నివేద నతో కూడిన భక్తి ఉన్నప్పుడే వాటికి విలువ.
వేదాలలో ఉపాసనా శబ్దం, పురాణాల్లో భక్తి శబ్దం వాడారు. ఈ రెండూ దాదాపు ఒకటే. భక్తి అంటే ప్రేమ, ఉపాసన అంటే సామీప్యం. ఎక్కడ ప్రేమ జనిం చిందో అక్కడ ఆ వస్తువు చెంతగా కూర్చోవాలి అనుకో వడం సహజం. దైవానికి దగ్గరగా జరగడం సంభవిస్తుంది.
భక్తి ద్వారానే భగవంతుడు, అతడి చర్యలు కొద్ది కొద్దిగా అర్థమవుతాయి. శాస్త్రాలతోనే భగవల్లీలు అర్థ మవడం కష్టం. శాస్త్రాలు పఠించిన వారు పాండిత్యం కలిగి ఉంటారే కానీ భగవత్ ప్రేమ కలిగి ఉండరు. భగవత్ లీల అర్థం కానందువల్ల ‘ఉన్నది ఉన్నట్లు’ స్థితి ని ప్రేమించగలిగి ఉండరు. భగవంతుడు అనేది ఎదు రుగా, సిద్ధంగా కనిపిస్తున్నది. దీనిని అర్థం చేసుకోగ లిగిన వారికి, భగవంతుడు సవ్యంగానే పాలిస్తున్నాడు అనీ, న్యాయంగానే వ్యవహరిస్తున్నాడనీ గోచరిస్తుంది.
భక్తుడు భగవంతుణ్ణి ప్రశ్నించకుండా తనకు ప్రాప్తించిన దానితో తృప్తి పడి, భగవత్ ప్రేమను కొన సాగిస్తాడు. ఇక్కడొక విచిత్రమేమంటే, భక్తుడు భగ వంతుడికి అధీనుడై బ్రతుకు సాగిస్తూ ఉంటే, భగ వంతుడు తరచూ భక్తాధీనుడవుతాడు. భక్తుడు రాజు అయినా, దరిద్రుడైనా -ఎక్కడ భక్తి ఉంటే, అక్కడ భగ వంతుడు ఉంటాడు. అవసరానికి అద్భుత కృత్యాలు చేస్తాడు.
భగవంతుడు సృష్టినంతా కాపాడుతుంటాడు - లయ కార్యమూ సాగిపోతూనే ఉంటుంది. కానీ భక్తుల మీద ప్రత్యేక శ్రద్ధ. సతీ సక్కుబాయిని పండరీపురం పంపించడానికి ఆమె స్థానంలో అత్తగారింట్లో ఉండి పోయాడు. భక్తులు కాని వారి ఎడల ఆయనకు దయ లేక కాదు; కానీ వారి కర్మఫలాన్ని వారు అనుభవిం చక తప్పదు.
మనిషి జీవితానికి భక్తి ద్వారా తప్పితే ముక్తి లేదు. ఎన్ని విషయాల వెంబడిబడి తిరిగినా, భక్తి సాధిం చనిదే ఈ జీవితం ఫలవంతం కాదు.
భగవంతుడి వైపు మళ్లేంత వరకూ, మనిషి విశ్వా త్మ అయ్యేంతవరకూ పుడుతూనే ఉండాలి. ఆ శుభప రిణామానికి, భక్తి శీఘ్రతర మార్గం- అంటున్నాడు సాధు వాస్వానీ.
నీలంరాజు లక్ష్మీప్రసాద్