Neelamraju Lakshmi prasad
-
నిందలకు ఎవరతీతం?
జ్యోతిర్మయం మహర్షి రమణకు ఎవరి యెడలా శత్రుత్వ భావం ఉండేది కాదు గానీ, ఆయన యెడల శత్రుత్వం ప్రకటించిన వారు, ఆయనకు హాని తలపెట్టిన వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఆయన సహాయకుడైన పెరుమాళ్స్వామి తిరగబడి, ఆయన్ని అవమానిం చడం, ఆశ్రమానికి వారసుణ్ణి తానేనని కోర్టులో కేసు నడపడం చేశాడు. నెగ్గలేకపోయాడన్నది వేరే విషయం. అజ్ఞానం వల్ల మనుషులు తమ మనస్సులు ప్రవర్తించే తీరును బట్టి, వదంతులు సృష్టించేవారు. ఒక మహిళ.. రమణుడు సిద్ధపురుషుడనీ, అలాంటి వాళ్లు, సామాన్య వస్తువులను బంగారంగా మారు స్తారన్న నమ్మకంతో, నేలమీద రాళ్లను బంగారంగా మారుస్తున్నాడని ప్రచారం మొదలెట్టింది. ఈ కథలన్నీ అజ్ఞాన జనితమని కొట్టిపారేసినా, రమణుడి మీద అనేక మందికి అనుమానాలు పుట్టేట్లు చేస్తుండేవి. ఎవరో ఆశ్రమంలో నకిలీ నోట్ల ముద్రణ సాగిపోతుం టుందని ఊహించారు. ఒకడు ఏనాడూ టైప్మిషన్ చూసిన వాడు కాదు. శ్రీనివాసరావు అనే శిష్యుడు టైప్ మిషిన్ మీద పని చేస్తుండడం చూసి, నకిలీ నోట్లు ముద్రించే మిషిన్ ఇదేనని నిశ్చయించుకుని, అలా చెప్పడం మొదలెట్టాడంటాడు అన్నామలై. ఆశ్రమానికి వచ్చిన భక్తులు తమతోపాటు తెచ్చుకున్న సంచులు ఆశ్ర మంలో ఎవరో కాపలాదారుకు అప్పజెప్పి, శ్రీరమ ణున్ని దర్శించుకోడానికి వెళితే, ఆ సంచులు పెట్టిన గది కాపాడుతూ ఉండే వాచ్‌మాన్‌ని చూసి గదిలోని బంగారపు సంచుల్ని రక్షిస్తున్నాడని వదంతి పుట్టించారు. ఆ ప్రచారమంతా అజ్ఞాన కారణంగానే జరిగి ఉండవచ్చు. కానీ దీని వెనకాల ఆధ్యాత్మికతను గురించి మనకున్న విపరీతాభిప్రాయాలు కూడా దోహదం చేస్తాయి. వేలాది సంవత్సరాలుగా మన దేశంలో క్షుద్రలోహాలను బంగారంగా మార్చే విద్య ఒకటున్నదని, గట్టి నమ్మకమున్నది. దీని నిజా నిజాల గురించి నేనేమీ చెప్పగలిగిలేను కానీ, గతంలో శ్రీ విద్యారణ్యస్వామి ఈ విద్యను ప్రయోగించే చాలా బంగారం నిల్వ చేశాడనీ, దానితోనే విజయనగర సామ్రాజ్యం స్థాపించాడనీ నమ్మే వారున్నారు. సిద్ధ పురుషులు, తమకెవరూ భోజనం పెట్టకపోతే, తిండికి మరే ఏర్పాటు లేకపోతే, చిన్న మొత్తం బంగారం తయారు చేసి, దానితో ఆ పూటకు సరిపడే గ్రాసం మాత్రం శిష్యుని ద్వారా తెప్పించుకుని ఆ పూట వెళ్లదీసేవారంటారు. ఇలాంటివి చెప్పగా విన్నాను కానీ నా దీర్ఘాను భవంలో, నిజంగా చేసిన వాళ్లని చూడలేదు. కానీ ఈ నమ్మకం బలంగా గ్రామీణుల్లో నాటుకున్నందువల్ల, శ్రీరమణులంతటివాడికి ఈ విద్య కరతలామలకం అయి ఉంటుందని నమ్మి, తమ మౌఢ్యంలో, నిజానిజాలు తేలకుండా ఇలా మాట్లాడి ఉంటారు. రమణ వ్యతిరేకులు, శత్రువులు దీనికి బహుళ ప్రచారం కల్పించి ఉంటారు. నిజమేమిటంటే, రమణశ్రమానికి వారూ వీరూ విరాళాలివ్వకపోతే, ఆశ్రమంలోని మేనేజర్ చిన్నస్వామి ధనికుల్ని అడిగి డబ్బు స్వీకరించేవాడు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
చిత్రానికి నమస్సులు
జ్యోతిర్మయం ‘శ్రీరామకృష్ణ పరమహంస చిత్రాన్ని లిఖిస్తానంటూ ఒక గొప్ప చిత్రకారుడు ఆయన వద్దకొచ్చాడు’ అని ఓ ఉదంతం చెప్తాడు శ్రీరజనీష్. పరమహంస అను మతించాడు. చిత్రకారుడు చిత్రాన్ని తయారు చేసిన తర్వాత, దానిని శ్రీరామకృష్ణ వద్దకు తెచ్చాడు. అది ఉదయం వేళ. చిత్రకారుడు రామకృష్ణుల చిత్రాన్ని ఆయన ముందుపెట్టాడు. రామకృష్ణ దానిని చూసి, ఆ తైలవర్ణ చిత్రపాదాలకు నమస్కరించాడు! చిత్రకారు డు, అక్కడ కూచోనున్న శిష్యులు, తదితరులు అంద రూ విస్మయులైనారు. చిత్రకారుడు రామకృష్ణునితో ‘అయ్యా, నాకు జ్ఞానయోగుల విషయం ఆట్టే తెలియదను కోండి. కానీ ఈ చిత్రం సాక్షా త్తు మీ చిత్రమే. దాని పాదాలకే మీరు నమస్కరించడం చాలా ఆశ్చర్యంగా ఉంది’ అన్నారు. అందుకు రామకృష్ణుడు సమాధానం చెప్తూ, ‘నువ్వు చిత్రం గీస్తున్నప్పుడు సమాధిలో ఉన్నాను. అందుచేత ఇది కేవలం నా చిత్రమే కాదు; ‘సమాధి’ చిత్రం కూడాను. నేను ప్రధా నం కాదు. అక్కడ చిత్రంలోని ఆ సమాధి స్థితి ప్రధానం. నా ముందుకు ‘సమాధి స్థితిని’ తీసుకొస్తే - అది ఎవరి సమాధి స్థితి అవనీ.. దానికి మొక్కకుండా ఉండలేను. లోకమంతా నన్ను ఉన్మాదిగా భావించి నా, సమాధిస్థితిని గౌరవించకుండా ఉండలేను. చిత్రంలో నా ఆత్మవికాసాన్ని ప్రదర్శించగలిగావు. నా హృదయంలోని శాంతిని ఆ చిత్రంలో ప్రస్ఫుటంగా చూపించావు. నువు ధన్యుడివి’ అన్నాడు. గౌతమబుద్ధుడు, తన పూర్వ జన్మల్లోని ఒక జన్మలో, ఓ మహాజ్ఞాని వద్దకు వెళ్లాడు. ఆయన్ని ఎన్నో ప్రశ్నలు అడగడానికి ఆత్రపడుతున్నాడు. కానీ ఆ మహా జ్ఞాని వద్దకు వెళ్లేసరికి, అతడి ప్రశ్నలన్నీ మాయ మయ్యాయి. వంగి, పాదాభివందనం చేశాడు. కానీ తాను గౌరవంతో నమస్కరించి లేచి నుంచు నేసరికి, ఆ మహాజ్ఞానే తన పాదాలు ముట్టుకొని నమస్కరిం చడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. ‘ఏం చేస్తున్నారండీ? మీరు ఆత్మసాక్షాత్కారమొందినవారు. ఇక నేనో? ప్రాథమిక దశలో ఉన్నవాణ్ణి. నాకేమనాలో తోచడం లేదు.’ జ్ఞాని నవ్వాడు. ‘ఆశ్చర్యపోకు. నేను స్పృశిం చింది నీ కాళ్లను కాదు. నేను నీ భవిష్యత్తుకు అభివం దనం చేస్తున్నాను. నిన్న, నేను మేల్కొన్న వాణ్ణికాదు; రేపటికి నువు మేలుకుంటావు. మనిద్దరికీ ఉన్న తేడా ఏమిటి? అదీకాక నీవొక మహాజ్ఞానిగా విరాజిల్లగల వని, నీ భవిష్యత్తును చూడగలిగాను. కోట్లాది జనులు నిన్ను అనుసరిస్తారు’ అన్నాడు. అరుణాచలరమణుడి దృష్టిలో, ప్రపంచంలో అజ్ఞానులు అంటూ ఎవరూ లేరు. తానూ ఒకప్పుడు పదిహేడేళ్ల వయసులో అజ్ఞానే. ఒక్క ‘మరణా నుభవంతో’ తన భవిష్యత్తు మారిపోయింది. జ్ఞాన మార్గం తొక్కాడు. తపస్సు చేశాడు. లోనుండి మహాజ్ఞానం పుట్టుకొచ్చింది. ప్రతి మానవుడి భవిష్యత్తు ఇదే. అంత వరకూ మానవునిగా జన్మిస్తూనే ఉంటాడు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
చావుపుట్టుకలు లేనిది
జ్యోతిర్మయం టోజూ అనే జెన్ మాస్టర్ తన జీవితం పొడుగూతా మౌనంగా ఉండేవాడట. మన సంప్రదాయంలో కూడా దక్షిణాదిలో మౌనస్వామి అనే ఆయన ఉండే వాడు. ఆయన మాట్లాడకుండానే ఆశ్రమ జీవితం గడుపుతుండేవాడు. ఈ జెన్ మాస్టర్ విషయంలో కూడా ఇతడు చిన్నప్పుడే మౌనం వహించనారం భించినందువల్ల, ఇతడికి మాటలు రావేమో అని అనుకునేవారు. కానీ పిల్లవాడు ఎంత తెలివిగా ఉండేవాడంటే, ఇతడు మూగకాదనీ, మౌనం పాటిస్తున్నాడని కనుగొన్నారు. బహుశా ఏ పూర్వ జన్మలోనో మౌనంగా బతకాలని తీర్మా నించుకొని, దానిని ఈ జన్మలో వ్రతరూపంగా ఆచరిస్తున్నా డేమోనని అంటుండేవారు. తాను చనిపోయే రోజున, మొదటిసారిగానూ, ఆఖరిసారిగానూ నాలుగు మాటలు పలికాడు. మరణిస్తానన్న పొద్దున తన అనుచరులను అందరినీ ఒక చోట చేర్చాడు. మామూ లుగా అతడేమీ మాట్లాడకపోయినా, వారందరి అనుభవమేమిటంటే, అతడు ‘దేనినో’ జీవిస్తున్నాడని నమ్మేవారు. ఆ జీవిస్తున్న పదార్థం వారందరికీ అత్యంత ముఖ్యమైనది. అందువల్ల అతడ్ని అంటిపె ట్టుకు తిరుగుతుండేవారు. వారంతా టోజు చుట్టూ పర్యవేక్షించి ఉండేవారు. అతడి నిశ్శబ్ద భావప్రసా రానికి గురవుతూ ఉండిపోయేవారు. వారిలో చాలా మంది ఆ కారణంగా పరివర్తన చెందారు. వారందరితో అతడు ‘ఇవాళ సూర్యాస్తమ యానికి నేను మరణిస్తాను. ఇదే నా ప్రథమ మరియు ఆఖరి ప్రకటన’ అన్నాడు. అప్పుడు అతడి అనుచరుల్లో ఒకరు ‘మీరు మాట్లాడగలిగి ఉన్నప్పుడు, జీవితమంతా మౌనంగా ఎందుకుండిపోయారు?’ అని అడిగాడు. ‘జీవితంలో అన్నీ అనిశ్చితమైనవే. మరణం ఒక్కటే నిశ్చయంగా సంభవిస్తుంది. నేను నిశ్చితమైన దానిని గురించే మాట్లాడాలని నిశ్చయించుకున్నాను’ అన్నాడు. ఈ మాటల గురించి శ్రీరజనీష్ వ్యాఖ్యానిస్తూ ‘జీవితానికి రెండు ధ్రువాలుంటాయి. పుట్టటం సకారాత్మక ధ్రువమైతే, మరణం నకారాత్మకధ్రువం. నకారాత్మకధ్రువాన్ని లేకుండా చేయలేం. అయస్కాం తం ఎంత పొడుగుపాటిదైనా, రెండు ధ్రువాలూ తప్పవు. పుట్టావంటే, మరణించక తప్పదు. కానీ పుట్టేట టువంటి ఈ ‘అహం’ వెనకాల, పుట్టనటువంటిది ప్రవహిస్తూనే ఉంది. నువ్వు ఆ పుట్టనిదానిని చూసి అనుభూతి పొందగలిగావంటే, మరణించే భయం తొలిగిపోతుంది. మరణ భయాన్ని మరేరకంగానూ తొలగించలేవు. మరణం నిశ్చయం. పుట్టింది ‘అహం’ కాబట్టి, అహంతో అమృతత్వం సాధించలేవు. అహం యొక్క ప్రారంభం వెనక్కు చూస్తే, అంటే ఈ కెరటం వెనుక ఉన్న సముద్రాన్ని చూస్తే, మనిషి అమృతత్వాన్ని సాధిస్తాడు. ఆ ‘అహంపుట్టక ముందున్నది’ ఏనాడూ పుట్టలేదు, ఏనాడూ చావలేదు. ఇలా పుట్టినటువంటిదానిని మనిషి తెలుసుకున్న వరకు, దాని అనుభూతి చెందేవరకు, మనిషి మరణాన్ని దాటలేడు, అమృతత్వాన్ని అందుకోలేడు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
ప్రేమభక్తిని కనుగొనాలి
జ్యోతిర్మయం ‘రుషులు, సాధుపుంగవులు వారి జీవితంలో భక్తిని అత్యంత ప్రధానంగా ఎందుకు ఎంచుతారు?’ అని సాధు వాస్వానీని ఎవరో అడిగారు. ఆయన సమాధా నమిది- భక్తి, మానవ పరిణామాన్ని వేగిరపరుస్తుంది. భక్తి, ప్రధానంగా ప్రేమభక్తి, కృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు వంటి మహా ఆత్మలతో మనల్ని జతపరుస్తుంది. అందు వల్ల ఆ మహా ఆత్మ కంపనలు ఈ ఆత్మకు అను సంధానమైతే ఆ ప్రభావం, ఆ ప్రేరణ మన ఆత్మ మీద ఉంటాయి. ఆ విధంగా మెల్లిమెల్లిగా, భక్తి ద్వారా ఆ భగవంతుడిలోనే ఐక్యమవుతావు. మనిషి పుట్టింది భక్తిప్రేమను కనుగొని ఆచరించ డానికే. అది వారినీ, వీరినీ చూసి అనుకరించేది కాదు. స్వయంగా ఆ ప్రేమభక్తిని కనుగొన్న వానికే ఆత్మ నివేదిక జరుగుతుంది. అందులో నుంచి పుట్టుకొచ్చిన భక్తే స్వచ్ఛ మైంది. భక్తిలో శ్రవణ కీర్తనాదులు జోడించవచ్చు. కానీ ఆత్మ నివేద నతో కూడిన భక్తి ఉన్నప్పుడే వాటికి విలువ. వేదాలలో ఉపాసనా శబ్దం, పురాణాల్లో భక్తి శబ్దం వాడారు. ఈ రెండూ దాదాపు ఒకటే. భక్తి అంటే ప్రేమ, ఉపాసన అంటే సామీప్యం. ఎక్కడ ప్రేమ జనిం చిందో అక్కడ ఆ వస్తువు చెంతగా కూర్చోవాలి అనుకో వడం సహజం. దైవానికి దగ్గరగా జరగడం సంభవిస్తుంది. భక్తి ద్వారానే భగవంతుడు, అతడి చర్యలు కొద్ది కొద్దిగా అర్థమవుతాయి. శాస్త్రాలతోనే భగవల్లీలు అర్థ మవడం కష్టం. శాస్త్రాలు పఠించిన వారు పాండిత్యం కలిగి ఉంటారే కానీ భగవత్ ప్రేమ కలిగి ఉండరు. భగవత్ లీల అర్థం కానందువల్ల ‘ఉన్నది ఉన్నట్లు’ స్థితి ని ప్రేమించగలిగి ఉండరు. భగవంతుడు అనేది ఎదు రుగా, సిద్ధంగా కనిపిస్తున్నది. దీనిని అర్థం చేసుకోగ లిగిన వారికి, భగవంతుడు సవ్యంగానే పాలిస్తున్నాడు అనీ, న్యాయంగానే వ్యవహరిస్తున్నాడనీ గోచరిస్తుంది. భక్తుడు భగవంతుణ్ణి ప్రశ్నించకుండా తనకు ప్రాప్తించిన దానితో తృప్తి పడి, భగవత్ ప్రేమను కొన సాగిస్తాడు. ఇక్కడొక విచిత్రమేమంటే, భక్తుడు భగ వంతుడికి అధీనుడై బ్రతుకు సాగిస్తూ ఉంటే, భగ వంతుడు తరచూ భక్తాధీనుడవుతాడు. భక్తుడు రాజు అయినా, దరిద్రుడైనా -ఎక్కడ భక్తి ఉంటే, అక్కడ భగ వంతుడు ఉంటాడు. అవసరానికి అద్భుత కృత్యాలు చేస్తాడు. భగవంతుడు సృష్టినంతా కాపాడుతుంటాడు - లయ కార్యమూ సాగిపోతూనే ఉంటుంది. కానీ భక్తుల మీద ప్రత్యేక శ్రద్ధ. సతీ సక్కుబాయిని పండరీపురం పంపించడానికి ఆమె స్థానంలో అత్తగారింట్లో ఉండి పోయాడు. భక్తులు కాని వారి ఎడల ఆయనకు దయ లేక కాదు; కానీ వారి కర్మఫలాన్ని వారు అనుభవిం చక తప్పదు. మనిషి జీవితానికి భక్తి ద్వారా తప్పితే ముక్తి లేదు. ఎన్ని విషయాల వెంబడిబడి తిరిగినా, భక్తి సాధిం చనిదే ఈ జీవితం ఫలవంతం కాదు. భగవంతుడి వైపు మళ్లేంత వరకూ, మనిషి విశ్వా త్మ అయ్యేంతవరకూ పుడుతూనే ఉండాలి. ఆ శుభప రిణామానికి, భక్తి శీఘ్రతర మార్గం- అంటున్నాడు సాధు వాస్వానీ. నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
బతికిన క్షణాలు
జ్యోతిర్మయం ఓ ఆంగ్ల కథలో ఒక మనిషి మరణ ప్రస్తావన ఉంది. ఆ విషయం తెలిసే సమయానికి భగవంతుడు ఒక సూట్‌కేస్ పట్టుకొని వస్తున్నట్లు మనిషి గమనించాడు. ‘మంచిది బాబూ! నువ్వు బయలులేరాల్సిన వేళ అయింది’ అన్నాడు భగవంతుడు. ‘ఇంత తొందర గానా ప్రభూ? నేనింకా చేయాల్సింది ఉందనుకుం టున్నా’ అన్నాడు మనిషి. ‘వెళ్లకతప్పదు, కాలం ఆసన్న మయింది’. ‘సూట్ కేస్‌లో ఏమున్నై?’ అడిగాడు మానవుడు. ‘నీ సామాను, వస్తువులు’ అన్నాడు భగవంతుడు. ‘నా వస్తువులా? అంటే నా దుస్తులు, నా డబ్బూనా?’’ అన్నా డు మనిషి. ‘అవి నీవి కావు. అవి భూమికి చెందినవి.’ ‘అయితే నా జ్ఞాపకాలు, స్మృతులా?’ ‘నీకేనాడూ అవి సొంతం కావు. అవి కాలానికి చెందినవి’ అన్నాడు భగవంతుడు. ‘అయితే నా సామర్థ్యమూ, ప్రజ్ఞాపాట వాలు అయి ఉండాలి’ అన్నాడు మనిషి. ‘అవి ఏనాడూ నీవికావు. అవి కేవలం దైవఘటన’. మనిషి కాస్త ఆలో చించి, ‘నా మిత్రులూ, కుటుంబీకులేమో’ అన్నాడు. ‘వారు ఏనాడూ నీవారు కాదు. వీరంతా నీ హృదయానికి సంబంధించిన వారు’ అన్నాడు భగవం తుడు. ఏమీ తోచక మానవుడు ‘బహుశా నా శరీరమేమో!’ అనిపించిందేదో అనే శాడు. ‘అది ఏ క్షణాన నీది కాదు, ధూళికి చెందినది’. చివరకు మనిషి తెలివిగా, ‘బహుశా నా ఆత్మ అయి వుండచ్చు’ అన్నాడు. ‘కాదు. అది మొదట్నించీ నాదే’ అన్నాడు భగవంతుడు. మృతుణ్ణి భయమావరించింది. భగవంతుణ్ణి అడిగి ఆ సూట్‌కేస్‌ను తీసుకుని; తెరచి చూశాడు. పూర్తిగా ఖాళీ. కంటి నుంచి నాలుగు చుక్కలు రాలినై. ‘నా వద్ద ఏమీ ఉండేది కాదా?’ గద్గద స్వరంతో ప్రశ్నించాడు. ‘అవును, నీవు బ్రతికున్న క్షణం మాత్రమే నీది. జీవితం కేవలం ఒక క్షణమే, ఆ క్షణమే నీది’ అన్నాడు భగవంతుడు. మనకిచ్చిన ఈ జీవితం ఎన్ని క్షణాల పాటిదో తెలియదు. అందువల్ల ప్రతి క్షణం విలువైనదిగా గ్రహించి, ఈ ప్రపంచంలో విహరిం చాలి. క్షణం కూడా వ్యర్థం కానివ్వకుండా ఈ ఉనికి లోని అందాన్నంతా ఆహ్వానించాలి. జ్ఞానాన్ని అధ్యయ నం చేయాలి. మధుర పదార్థాలు రుచి చూడాలి. ముఖ్యంగా, ఇక్కడి సంబంధ బాంధవ్యాలలో ప్రేమను కనుగొనాలి. అసూయతో కూడుకున్నది ప్రేమ కాదని ఎరిగి రావాలి. ఈ దోషాలేవీ అంటని ప్రేమను సూక్ష్మబుద్ధితో, తెలివితో దర్శించాలి. అప్పుడు మానవ సంబంధాలన్నీ అర్థమై, బ్రహ్మ సంబంధం తెలియనా రంభిస్తుంది. ఆ దశలో ప్రేమకై వారి వద్దా వీరి వద్దా చేయి చాచాల్సిన అవసరముండదు. ఎందుకంటే, ప్రేమను దర్శించిన వానిలో, అపరిమితమైన ప్రేమ ఆవిర్భవిస్తుంది. అది ఎందరికి అందించినా, పంచినా, ఇంకా మిగులుతూనే ఉంటుంది. ప్రేమను దర్శించిన మానవుడు, ఆ ప్రేమమయుడ్ని దర్శించిన వాడే. ఆ గుణాన్నే సంతరించుకుంటాడు. ఆ గుణంలోన ఏర్ప డితే గానీ ఆ దర్శనం జరగదు. నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
అంతర్వాణి చెప్పడం వరకే
జ్యోతిర్మయం ‘ఆద్యశాంతి’ అనే భారతీయ నామాన్ని ధరించిన ఒక అమెరికన్ ప్రారంభంలో జెన్ సాధకుడు. ఆద్యశాంతి ‘ఆధ్యాత్మికంగా మేల్కొన్నాడు’ అని గురువు గమనించి, ‘ఇక ఇతర్లు మేల్కొనడానికి మార్గం చూపు’ అని దీవించి పంపాడు. అప్పటి నుంచి (1996) ఆద్య శాంతి బోధిస్తూ ఉన్నాడు. అతడితో ఒకరు జరిపిన సంభాషణ ఇక్కడ ఇస్తున్నాను. ప్రశ్న: ఇరవై ఐదేళ్ల వయసులో మీ మొదటి ‘మేల్కొనడం’ జరిగిందంటా రు. ఆ సమయాన మీకేదో కంఠధ్వని వినిపించింది అని చెప్పారు. అది ఎవరిది? మీ ‘కాన్షెన్స్’ అంతరాత్మ అంటా రా? లేక, లోనవుండేటి మరే దైనా నిశ్చల కంఠస్వరమా? ఆద్యశాంతి: అదో అంతర్వాణి. దానికి మీరే పేరైనా పెట్టండి. ప్ర: అందరికీ ఆ వాణి ఉన్నదంటారా? ఆద్య: అంతా మానవులమే కాబట్టి, అందరి లోనూ ఉండి తీరాలి. కానీ సాపేక్ష న్యాయంగా మాట్లాడితే, ఆ ధ్వని ఉన్నా అందరూ ఆలకిస్తున్నారా? అనేది ప్రశ్న. ఎక్కువ మంది వినే స్థితిలో లేరు. అంత ర్వాణి, చిత్తశుద్ధి ఈ రెండూ ఒకటే. నా యవ్వనపు అనుభవాన్ని తరచూ ఉదహరిస్తూ ఉంటాను. ఎవరో యువతిని ‘డేట్’ చేసేటప్పుడు, ‘ఈ యువతితో నీకు పొసగదు. చివరికెలాగూ ఇది విఫలమవుతుంది.’ అని అంతర్వాణి చెపుతూనే ఉంటుంది. ముందే వింటే ఏ చిక్కూ లేదు. చివరకు మీ ఇద్దరి మధ్యా సంబంధం సరిగా లేదని తెలియవస్తుంది. తీరా విఫలమైన తర్వాత, ‘పొరపాటు చేశాను’ అని కనుక్కునే బదులు, మొదట్లోనే ఆ కంఠస్వరం సత్యాన్నే పలుకుతోంది అని తెలుసుకొని ఉంటే, ఏ తంటా ఉండేది కాదు. కానీ చివరకు ఆ అంతర్వాణే నెగ్గింది. ఆ కంఠస్వరం మర్మమైనదేం కాదు. ప్రజా నీకంలో అధిక భాగం అప్పుడప్పుడూ వినే ఉంటారు. కానీ దానిని తోసిపుచ్చుతాం. ఆ స్వరం తాను అలా ఎందుకంటున్నదో సమర్థన కూడా ఇవ్వాలిని డిమాండ్ చేస్తాం. మనలోని ఆ స్వరం సత్యమైనదని నిర్ధారణగా చెప్పడానికి, అది తనని తాను సమర్థిం చుకోకుండా ఉండటమే గుర్తు. ఎందుకిలా అంటు న్నావ్ అని నీ ‘అహాన్ని’ అడిగితే, నీ అహం నీకెన్ని కారణాలైనా చెప్తుంది. శాయశక్తులా తనని తాను సమర్థించుకుంటుంది. ఈ అంతర్వాణికి నిశ్చయధ్వని ఉండదు. నమ్మించడానికి ఏ ప్రయ త్నమూ చేయదు. ఈ అంతర్వాణి ఒక వరం లాంటిది. ఒకరు వింటారు, మరొకరు వినరు. నేనెందుకు విన్నానో తెలియదు. వింటున్నందుకు ఆనందిస్తూ ఉంటాను. అన్ని సందర్భాల్లో విన్నాను అనీ చెప్పలేను. కానీ అది చెప్తూనే ఉన్నది. ప్ర: అది మార్గదర్శి లాంటిదా, రక్షణ ఇస్తుం టుందా! మన మనసులో భాగమా? ఆద్య: అవన్నీ కలసినది. అది ఉనికికి చెందిన మహా ప్రవాహం. నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
ఈ వింత సౌందర్యం ఎక్కడిదో!
పికాసో అనే సుప్రసిద్ధ చిత్రకారుడు సముద్రతీరాన నుంచొని తైలవర్ణ చిత్రం తయారు చేస్తున్నాడు.సముద్రతీరానికి వాహ్యాళికై వచ్చే ప్రేమికులకు రోజా పుష్పాలమ్ముకునే ఒక తోటమాలి, పికాసో వేస్తున్న చిత్రాన్ని తిలకిస్తున్నాడు. కానీ ఆ చిత్రం అంతరార్థం ఏమిటో అతడికి అంతుబట్టలేదు. పికాసో తన చిత్రాన్ని పూర్తి చేసి దానికి తుది మెరుగులు దిద్దుతూ, యథాలాపంగా దాన్నొకసారి, ఒక్క అడుగు ఇవతలికి వేసి చూశాడు. ఇది తాను వేసిన చిత్రమేనా? అని ఎందుకో అనుమానం కలిగి ఆ చిత్రాన్ని మరింత పరీక్షగా చూశాడు అతడికే ఓ రకమైన సంభ్రమానందాలు కలిగినై. మరెవరో వేశారన్నట్టుంది కానీ, తాను వేసినట్లు కనిపించలేదు. నిజమైన కళాకారుడు, కవి ఇలాంటి అనుభూతినే పొందుతారు. చిత్రాన్ని ఎవరో తన చేతులతో గీయించినట్లు కనిపిస్తుందే కానీ, తానే స్వయంగా చిత్రించినట్లు కనిపించదు.తోటమాలి పికాసోను సమీపించి - ‘‘అయ్యా! దీనిని మీరు చిత్రిస్తున్నప్పుడు చూస్తూ ఉండిపోయాను. మీరు మీ పనిలో పూర్తిగా లీనమై ఉన్న సమయంలో మిమ్మల్ని పలకరించడం ఇష్టం లేక ఊరుకున్నాను. నేను అడుగుదామనుకున్న ప్రశ్న ఏమిటంటే ఈ తైలవర్ణ చిత్రం అంతరార్థమేమిటి?’’ అన్నాడు. పికాసో అతడి వంకకు తిరిగి ‘‘నా చిత్రానికి అర్థమేమిటని అడుగుతున్నావు. మరి నిన్ను, నీ బుట్టలోని ఆ చక్కని రోజా పుష్పాలకు అర్థమేమిటని అడిగితే నువ్వేమి చెప్తావు?’’ అన్నాడు పికాసో. ‘‘ఈ సౌందర్యమెక్కడిదో, ఏ లోకం నుండి దిగి వచ్చిందోనని ఆశ్చర్యపోతుంటాను. ఏళ్ల తరబడి ఈ ప్రశ్న నన్ను నేను వేసుకుంటూనే ఉన్నాను. వీటి సౌందర్యం వర్ణనాతీతమని నాకు తెలుసు. కానీ ఇది ఏమిటో, ఎక్కడిదో నాకు తెలియదు’’ అని గద్గద స్వరంతో అన్నాడు తోటమాలి. ‘‘నా పరిస్థితి కూడా అంతే బాబూ’’ అన్నాడు పికాసో. - నీలంరాజు లక్ష్మీప్రసాద్ ‘చరిత్రలో ఈ పేరు మిగిలేనా’ పుస్తకం నుంచి. -
మౌనప్రేమ
పాతకథ ప్రసిద్ధ రచయిత్రి అమృతాప్రీతమ్, సుప్రసిద్ధ కవి సాహిర్ లుధియాన్వీల మధ్య గాఢమైన ప్రేమ ఉండేదని అంటారు. అమృతా ప్రీతమ్‌కు సాహిర్ వల్ల ఒక కొడుకు కూడా ఉన్నాడని మరో పుకారు. సాహిత్యలోకంలో విస్తృతంగా చక్కర్లు కొట్టే ఈ గాసిప్ వెనుక ఉన్న అసలు సంగతిని అమృతా ప్రీతమ్ మాటల్లోనే చదవండి. 1960లో నేను బొంబైలో వున్నప్పుడు నాకూ రాజేందర్‌సింగ్ బేడీకి (ప్రసిద్ధ ఉర్దూ కవి) స్నేహమేర్పడింది. తరచూ కలిసే వాళ్లం. ఒకనాడు అతడు అకస్మాత్తుగా ‘నీ కుమారుడు నవరాజ్కు తండ్రి సాహిర్ అని అందరూ అంటున్నారే’ అని పలికాడు. ‘ఊహామాత్రంగా ఆ మాట కరెట్టే; నిజానికైతే అది కరెట్టు కాదు’ అన్నాను. 13 ఏళ్ల వయసున్న నవరాజ్ కూడా ఒకసారి నాతో ‘మమ్మీ. నిన్నో ప్రశ్న అడుగుతాను నిజం చెప్తావా?’ అన్నాడు. ‘తప్పక చెప్తాను’ ‘నేను అంకుల్ సాహిర్ కొడుకునా?’ ‘కాదు’ ‘అయివుంటే చెప్పమ్మా. అంకుల్ అంటే నాకిష్టమే’ ‘నాకూ అంతే బాబూ. కానీ నువ్వనుకుంటున్నది నిజమయి వుంటే నీకు ‘నిజమే’నని చెప్పివుండేదాన్ని’ తాను సాహిర్ సంతానం కాదని నా పిల్లవాడికి నమ్మకం కుదిరింది. కానీ ఊహాజనితమైన నిజం, అసలు నిజానికేమీ తీసిపోదని అనుకుంటాను. సాహిర్ ఎప్పుడు లాహోర్ వచ్చినా నా మౌనముద్రకు సమ్మోహితుడయ్యేవాడనుకుంటాను. ఆ మౌనంలో అతడెంత భాగం పంచుకునేవాడంటే కుర్చీలో అలాగే మౌనంగా కూచునేవాడు. తాను కుర్చీలో నుంచి లేచి వెళ్లిపోయే వరకూ మాటామంతీ లేకుండా అలాగే వుండి పోయేవాడు. సిగరెట్టు వెంబడి సిగరెట్టు కాలుస్తూ వుండేవాడు. సిగరెట్టులో సగం కాల్చి, దాన్ని నొక్కి ఆర్పేసి, మళ్లీ మరొకటి వెలిగించుకునేవాడు. అతడు లేచి వెళ్లిపోయింతర్వాత, అతడు కూచున్న చుట్టుపట్టంతా సిగరెట్టు పీకలు పడి ఉండేవి. ఒక్కోసారి అతణ్ణి ముట్టుకోవాలని నాలో తీవ్రంగా అనిపించేది. కానీ నా పరిమితులు నాకు ఉండేవి; వాటిని అతిక్రమించలేకపోయేదాన్ని. ఆ కాలంలో నేను అధికంగా నా ఊహాలోకంలో జీవిస్తుండేదాన్ని. అతడు వెళ్లిపోయిన తర్వాత అక్కడ పడివున్న సిగరెట్టు పీకల్ని పోగుచేసి రహస్యంగా ఒక అల్మరాలో దాచేదాన్ని. అటు తర్వాత అడపా దడపా వాటిని ముట్టుకునేదాన్ని. ఆ సిగరెట్టు తుంపును చేత్తో పట్టుకుని, అంతకుమునుపు అతడి వేళ్లు ఆ సిగరెట్టును ముట్టుకున్నై అనేది గుర్తుంచుకొని, దానిని నేనూ ఇప్పుడు వేళ్లమధ్య ఉంచుకున్నాను కాబట్టి అతడి వేళ్లను నేను ముట్టుకున్నట్లు ఫీలయ్యేదాన్ని. సిగరెట్టు కాల్చడమనేది నాకా విధంగా అలవాటయింది. ఆ సిగరెట్టు సువాసనలో అతడు నా ముందు ఉన్నట్లు భావించుకునేదాన్ని. వెలిగించిన సిగరెట్టు నుండి ఉంగరాలు ఉంగరాలుగా పొగపైకి లేస్తుంటే, ఆ పొగలో నుండి అతడి ఆకారం తొంగి చూస్తున్నట్లుండేది. ఈ ఊహాలోకం ఎవరైతే సృష్టించుకుంటారో అది కేవలం వారికే చెందుతుంది. కానీ ఈ లోకంలోని వ్యక్తులు ఓ వింత శక్తిని సంతరించుకుంటారు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్