నిందలకు ఎవరతీతం?
జ్యోతిర్మయం
మహర్షి రమణకు ఎవరి యెడలా శత్రుత్వ భావం ఉండేది కాదు గానీ, ఆయన యెడల శత్రుత్వం ప్రకటించిన వారు, ఆయనకు హాని తలపెట్టిన వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఆయన సహాయకుడైన పెరుమాళ్‌స్వామి తిరగబడి, ఆయన్ని అవమానిం చడం, ఆశ్రమానికి వారసుణ్ణి తానేనని కోర్టులో కేసు నడపడం చేశాడు. నెగ్గలేకపోయాడన్నది వేరే విషయం. అజ్ఞానం వల్ల మనుషులు తమ మనస్సులు ప్రవర్తించే తీరును బట్టి, వదంతులు సృష్టించేవారు. ఒక మహిళ.. రమణుడు సిద్ధపురుషుడనీ, అలాంటి వాళ్లు, సామాన్య వస్తువులను బంగారంగా మారు స్తారన్న నమ్మకంతో, నేలమీద రాళ్లను బంగారంగా మారుస్తున్నాడని ప్రచారం మొదలెట్టింది. ఈ కథలన్నీ అజ్ఞాన జనితమని కొట్టిపారేసినా, రమణుడి మీద అనేక మందికి అనుమానాలు పుట్టేట్లు చేస్తుండేవి.
ఎవరో ఆశ్రమంలో నకిలీ నోట్ల ముద్రణ సాగిపోతుం టుందని ఊహించారు. ఒకడు ఏనాడూ టైప్‌మిషన్ చూసిన వాడు కాదు. శ్రీనివాసరావు అనే శిష్యుడు టైప్ మిషిన్ మీద పని చేస్తుండడం చూసి, నకిలీ నోట్లు ముద్రించే మిషిన్ ఇదేనని నిశ్చయించుకుని, అలా చెప్పడం మొదలెట్టాడంటాడు అన్నామలై. ఆశ్రమానికి వచ్చిన భక్తులు తమతోపాటు తెచ్చుకున్న సంచులు ఆశ్ర మంలో ఎవరో కాపలాదారుకు అప్పజెప్పి, శ్రీరమ ణున్ని దర్శించుకోడానికి వెళితే, ఆ సంచులు పెట్టిన గది కాపాడుతూ ఉండే వాచ్‌మాన్‌ని చూసి గదిలోని బంగారపు సంచుల్ని రక్షిస్తున్నాడని వదంతి పుట్టించారు.
ఆ ప్రచారమంతా అజ్ఞాన కారణంగానే జరిగి ఉండవచ్చు. కానీ దీని వెనకాల ఆధ్యాత్మికతను గురించి మనకున్న విపరీతాభిప్రాయాలు కూడా దోహదం చేస్తాయి. వేలాది సంవత్సరాలుగా మన దేశంలో క్షుద్రలోహాలను బంగారంగా మార్చే విద్య ఒకటున్నదని, గట్టి నమ్మకమున్నది. దీని నిజా నిజాల గురించి నేనేమీ చెప్పగలిగిలేను కానీ, గతంలో శ్రీ విద్యారణ్యస్వామి ఈ విద్యను ప్రయోగించే చాలా బంగారం నిల్వ చేశాడనీ, దానితోనే విజయనగర సామ్రాజ్యం స్థాపించాడనీ నమ్మే వారున్నారు. సిద్ధ పురుషులు, తమకెవరూ భోజనం పెట్టకపోతే, తిండికి మరే ఏర్పాటు లేకపోతే, చిన్న మొత్తం బంగారం తయారు చేసి, దానితో ఆ పూటకు సరిపడే గ్రాసం మాత్రం శిష్యుని ద్వారా తెప్పించుకుని ఆ పూట వెళ్లదీసేవారంటారు. ఇలాంటివి చెప్పగా విన్నాను కానీ నా దీర్ఘాను భవంలో, నిజంగా చేసిన వాళ్లని చూడలేదు.
కానీ ఈ నమ్మకం బలంగా గ్రామీణుల్లో నాటుకున్నందువల్ల, శ్రీరమణులంతటివాడికి ఈ విద్య కరతలామలకం అయి ఉంటుందని నమ్మి, తమ మౌఢ్యంలో, నిజానిజాలు తేలకుండా ఇలా మాట్లాడి ఉంటారు. రమణ వ్యతిరేకులు, శత్రువులు దీనికి బహుళ ప్రచారం కల్పించి ఉంటారు. నిజమేమిటంటే, రమణశ్రమానికి వారూ వీరూ విరాళాలివ్వకపోతే, ఆశ్రమంలోని మేనేజర్ చిన్నస్వామి ధనికుల్ని అడిగి డబ్బు స్వీకరించేవాడు.
- నీలంరాజు లక్ష్మీప్రసాద్