Ramana Maharshi
-
ధర్మం చెప్పింది విను..!
ధర్మం చెప్పడానికి ప్రమాణాలుగా శృతి, స్మతి, పురాణం, శిష్టాచారమ్ కాగా చిట్టచివరిది– అంతరాత్మ ప్రబోధమ్. లోపలినుంచి భగవంతుడు చెబుతుంటాడు... ఇది తప్పు.. అని చేయకు. ఇది సరైనదే..చెయ్..అన్నప్పుడు చేసేయ్. ఏది చేయమని అంతరాత్మ ప్రబోధించిందో అది ధర్మం. ఏది వద్దని హెచ్చరించిందో అది అధర్మం. అందువల్ల అంతరాత్మ ప్రబోధమ్ చివరి, అథమ ప్రమాణం. కర్తవ్యమ్... నేను చేయవలసినదేది? అక్కడ మొదలు కావాలని చెబుతుంది శాస్త్రం. నేనేమి చేయాలో నాకు తెలియాలి. అంటే దానికి చదువుకోవాలి.. ఇది దేనికోసం.. భగవంతుని అనుగ్రహం కోసం. భక్తి రెండుగా మొదలవుతుంది. భగవంతుడు వేరు, నేను వేరు అని... నా కర్తవ్యాన్ని నేను నిర్వహించడం మొదలుపెడితే.. ΄ోయి ΄ోయి నది సముద్రంలో కలిసిపోయినట్టు.. అది ఒకటవుతుంది.. అప్పుడు ఇక తానెవరో తెలిసిపోతుంది. అంటే కర్తవ్యాన్ని నిర్వహిస్తూపోతే ఒక సత్యం తెలుస్తుంది. అదేమిటి? ఇది నేను కాదు –అని. నోటితో చెబితే అది తెలిసి΄ోయిందని కాదు... అనుభవంలోకి రావాలి. ఇది.. ఈ శరీరం.. నేను కాదు, లోపల ఒకటి ఉంది. అది నేను. అదే సత్యం. అది కత్తిచేత నరకబడదు, అగ్నిచేత కాల్చబడదు, నీటిచేత తడపబడదు, వాయువు చేత కొట్టబడదు.... అదే నేను. అంతే తప్ప ఇది.. అంటే ఈ శరీరం నేను కాదు. .. అని తెలుసుకోవడం. అలా తెలుసుకున్నట్టు గుర్తు ఏమిటంటే... ఇది .. ఈ శరీరం పడిపోతున్నా... ఇది ‘నేను’ కాదు అని లోపల ఉన్న ‘నేను’ చూస్తూ సాక్షీభూతంగా ఉండడం. ఆ అనుభవంలోకి మారడం దగ్గర ఈశ్వర కృప కావాలి. ఈశ్వర కృప ఎవరికిస్తారు? ‘‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరఃసంయతేంద్రియః/ జ్ఞానం లబ్ద్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి’’ ... శ్రద్ధావాన్ లభతే జ్ఞానం... గురువుగారు చెప్పిన మాట, శాస్త్రాలు చెప్పిన సూత్రం సత్యం అనిముందు నమ్మకం ఉండాలి. ఆ విశ్వాసంతో, శ్రద్ధతో ప్రారంభం అయినప్పుడు వారికి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. చదువుకున్న దాని మీద శ్రద్ధ ఉంది కాబట్టి ఇంద్రియాలను కట్టడి చేస్తాడు. అక్కడ ‘ధర్మేచ అర్థేచ కామేచ ఏషా నాతి చరితవ్యా... అక్కడ తనను తాను ధర్మచట్రంలో ఇముడ్చుకోగలుగుతాడు. ధర్మాన్ని అతిక్రమించని అర్థకామాలు ΄పొందుతాడు. అప్పుడు ధర్మకామార్థసిద్ధయేత్... గృహస్థాశ్రమానికి ఆశీర్వచనం అయి΄ోయింది. ‘నీకు ధర్మార్థ కామములు సిద్ధించుగాక. ధర్మము నుండి విడివడిపోకుండుగాక!.. మనుష్య జన్మను సద్వినియోగం చేసుకోవడానికి పరమ తేలిక మార్గం–గహస్థాశ్రమం. అంటే నీ కర్తవ్యం తెలియడం దగ్గర మొదలయింది. కర్తవ్యం తెలియకుండా నేనెవరో తెలుసుకుంటానంటే ... అది సాధ్యం కాదు. దానికది మార్గం కాదు. భగవాన్ రమణులలాగా గోచి పెట్టుకుని... నేనెవరో నాకు తెలిసిపోతుంది .. అంటానంటే కుదరదు. మీరు జ్ఞానిని అనుకరించలేరు. సాధన పండితేనే జ్ఞానం కలుగుతుంది. సాధనకు అర్హత.. అధ్యాపనం బ్రహ్మయజ్ఞః. ఏవి నీకోసం రుషులు ఇచ్చారో వాటిని చదువు. వేదాలన్నీ చదవనక్కరలేదు. రామాయణం, భాగవతం చదువు. భారతం పంచమ వేదం. అది సమస్త పురాణ సారాంశం. అవి చదువు. ఇవి లోకం కోసం ఇస్తున్నా.. అన్నాడు వ్యాసుడు. (చదవండి: మార్పు మనుగడ కోసమే...) -
భారత్లో జరగకూడనిది!
సమకాలీన శతాబ్దాలలో భారత దేశ స్వాతంత్రోద్యమ గాథలు అత్యంత ఉత్తేజకరమైనవి. చేజారిపోయిన తమ స్వాతంత్య్రాన్ని రాబట్టుకోవడంలో భారతదేశంలో సంభవించిన త్యాగోజ్జ్వల ఘట్టాలు ప్రపంచంలో వేరే దేశాలలో కనబడవేమో! ఇతర దేశాల స్వాతంత్య్ర పోరాటాలలో భారతదేశంలో నూటికి తొంభై పాళ్లు స్వరాజ్య సాధనలో జరిగిన శాంత్యహింసలు, సత్యా గ్రహమూ ప్రస్తుత పాత్రమైనవి. అమెరికా మన దేశం కన్నా మూడు రెట్లు విస్తీర్ణంలో విశాలమైనది. అక్కడ జరిగిన ప్రజాస్వామ్య పోరాటాలలో లక్షలాదిమంది హతు లైనారు. అమెరికా స్వాతంత్య్ర పోరాట విజయానికి 465 సంవత్సరాల చరిత్ర ఉన్నది. అమెరికాలో జరిగిన అంత ర్యుద్ధం, లక్షలాది ప్రజల హననం భారతదేశంలో చోటు చేసుకోలేదు. నేటికీ అమెరికాలో సామాజిక దురన్యా యాలు, పాఠశాలలో కూడా తుపాకీ కాల్పులు జరుగు తూనే ఉన్నాయి. జార్జ్ వాషింగ్టన్, అబ్రహాం లింకన్ వంటి సముదాత్త చరిత్రులు నెలకొల్పిన వ్యవస్థలు పంకి లమవుతున్నవి. దేశాధ్యక్షులు హత్యలకు గురి అయినారు. బానిస సంకెళ్ళ విదళన కోసం భారతీయులు ఆత్మార్పణం చేశారు. గాంధీజీని అవతారమూర్తి అని భారతీయులు శ్లాఘించారు. సమస్త భారతీయ భాషలలోనూ వెలువడిన భారతీయ స్వాతంత్రోద్యమ చరిత్ర పరిణామం కొన్ని లక్షల పుటలను విస్తరించింది. భగవాన్ శ్రీ రమణ మహర్షి ప్రతిరోజూ దినపత్రిక చదివేవారు. తమను పరివేష్టించి ఉన్న పరివారానికి ప్రపంచ వార్తలు, ముఖ్యంగా జాతీయ సంఘటనలు చదివి వినిపించేవారు. భారత స్వాతంత్రోద్యమ నాయ కులెందరో ఆ మహర్షిని దర్శించి భవిష్య దర్శన ఆశావ హులైనారు. ‘‘శ్రీ రమణులు ఒక రోజున సాయంత్రం రేడియో తీసుకొచ్చి పెట్టమన్నారు. మహాత్మా గాంధీని కాల్చి చంపినట్లు మద్రాస్ రేడియోలో చెపుతున్నారు. శ్రీ రమణులు ‘పాకిస్తాన్లో ఇది జరగవలసింది. ఇక్కడే జరిగి పోయింది. ఆయన ఒక పని మీద వచ్చారు. అది నెరవేరింది. ఆయనను తీసుకుని వెళ్లటానికి ఒకరు పుట్టారు. అంతా విధి లిఖితం’’ అని మౌనం వహించారు (పుట 256– శ్రీరమణ కరుణా విలాసం). శ్రీ రమణుల మనోగతం ఏమిటో, ఆయన మాట లలోని పరమార్థం ఏమిటో! భారతదేశంలో ఇటువంటి దుర్ఘటనలు జరగకూడదని కావచ్చు. పాకిస్తాన్ ఏర్పాటు, భారత దేశం నుంచి వేర్పాటు మూలంగానే ఇటువంటి కరుణావిలమైన సంఘటన చోటుచేసుకుందని మనం అర్థం చేసుకోవాలి. – అక్కిరాజు రమాపతిరావు రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా) -
నిందలకు ఎవరతీతం?
జ్యోతిర్మయం మహర్షి రమణకు ఎవరి యెడలా శత్రుత్వ భావం ఉండేది కాదు గానీ, ఆయన యెడల శత్రుత్వం ప్రకటించిన వారు, ఆయనకు హాని తలపెట్టిన వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఆయన సహాయకుడైన పెరుమాళ్స్వామి తిరగబడి, ఆయన్ని అవమానిం చడం, ఆశ్రమానికి వారసుణ్ణి తానేనని కోర్టులో కేసు నడపడం చేశాడు. నెగ్గలేకపోయాడన్నది వేరే విషయం. అజ్ఞానం వల్ల మనుషులు తమ మనస్సులు ప్రవర్తించే తీరును బట్టి, వదంతులు సృష్టించేవారు. ఒక మహిళ.. రమణుడు సిద్ధపురుషుడనీ, అలాంటి వాళ్లు, సామాన్య వస్తువులను బంగారంగా మారు స్తారన్న నమ్మకంతో, నేలమీద రాళ్లను బంగారంగా మారుస్తున్నాడని ప్రచారం మొదలెట్టింది. ఈ కథలన్నీ అజ్ఞాన జనితమని కొట్టిపారేసినా, రమణుడి మీద అనేక మందికి అనుమానాలు పుట్టేట్లు చేస్తుండేవి. ఎవరో ఆశ్రమంలో నకిలీ నోట్ల ముద్రణ సాగిపోతుం టుందని ఊహించారు. ఒకడు ఏనాడూ టైప్మిషన్ చూసిన వాడు కాదు. శ్రీనివాసరావు అనే శిష్యుడు టైప్ మిషిన్ మీద పని చేస్తుండడం చూసి, నకిలీ నోట్లు ముద్రించే మిషిన్ ఇదేనని నిశ్చయించుకుని, అలా చెప్పడం మొదలెట్టాడంటాడు అన్నామలై. ఆశ్రమానికి వచ్చిన భక్తులు తమతోపాటు తెచ్చుకున్న సంచులు ఆశ్ర మంలో ఎవరో కాపలాదారుకు అప్పజెప్పి, శ్రీరమ ణున్ని దర్శించుకోడానికి వెళితే, ఆ సంచులు పెట్టిన గది కాపాడుతూ ఉండే వాచ్మాన్ని చూసి గదిలోని బంగారపు సంచుల్ని రక్షిస్తున్నాడని వదంతి పుట్టించారు. ఆ ప్రచారమంతా అజ్ఞాన కారణంగానే జరిగి ఉండవచ్చు. కానీ దీని వెనకాల ఆధ్యాత్మికతను గురించి మనకున్న విపరీతాభిప్రాయాలు కూడా దోహదం చేస్తాయి. వేలాది సంవత్సరాలుగా మన దేశంలో క్షుద్రలోహాలను బంగారంగా మార్చే విద్య ఒకటున్నదని, గట్టి నమ్మకమున్నది. దీని నిజా నిజాల గురించి నేనేమీ చెప్పగలిగిలేను కానీ, గతంలో శ్రీ విద్యారణ్యస్వామి ఈ విద్యను ప్రయోగించే చాలా బంగారం నిల్వ చేశాడనీ, దానితోనే విజయనగర సామ్రాజ్యం స్థాపించాడనీ నమ్మే వారున్నారు. సిద్ధ పురుషులు, తమకెవరూ భోజనం పెట్టకపోతే, తిండికి మరే ఏర్పాటు లేకపోతే, చిన్న మొత్తం బంగారం తయారు చేసి, దానితో ఆ పూటకు సరిపడే గ్రాసం మాత్రం శిష్యుని ద్వారా తెప్పించుకుని ఆ పూట వెళ్లదీసేవారంటారు. ఇలాంటివి చెప్పగా విన్నాను కానీ నా దీర్ఘాను భవంలో, నిజంగా చేసిన వాళ్లని చూడలేదు. కానీ ఈ నమ్మకం బలంగా గ్రామీణుల్లో నాటుకున్నందువల్ల, శ్రీరమణులంతటివాడికి ఈ విద్య కరతలామలకం అయి ఉంటుందని నమ్మి, తమ మౌఢ్యంలో, నిజానిజాలు తేలకుండా ఇలా మాట్లాడి ఉంటారు. రమణ వ్యతిరేకులు, శత్రువులు దీనికి బహుళ ప్రచారం కల్పించి ఉంటారు. నిజమేమిటంటే, రమణశ్రమానికి వారూ వీరూ విరాళాలివ్వకపోతే, ఆశ్రమంలోని మేనేజర్ చిన్నస్వామి ధనికుల్ని అడిగి డబ్బు స్వీకరించేవాడు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
బాధలు కూడా బలమే!
ఆధ్యాత్మికం కొందరు మహా భక్తులు తాముగా ఎన్నో రకాల శారీరక రోగాలను, అవకరాలను, ఈతిబాధలను కలిగి ఉండి కూడా వాటిని మౌనంగా భరిస్తూనే ఇతరులకు వాటినుంచి బయటపడేందుకు కావలసిన శక్తిని, ధైర్యాన్ని, సూచనలను అందించడాన్ని చూస్తుంటాం. శ్రీరామకృష్ణ పరమహంస, రమణ మహర్షి అందుకు ఉదాహరణ. వారు తమకు కలిగిన శారీరక కష్టానికి ఎప్పుడూ కృంగిపోలేదు సరికదా, ఆ కష్టం ద్వారా భగవంతుడు తమ పాప కర్మలను ప్రక్షాళనం చేసినట్లుగా భావించారు. మనం ఈ శరీరంలో జీవిస్తున్నందుకు చెల్లించవలసిన పన్నులే రోగాలు, కష్టాలు అని, వాటిని చూసి బెంబేలెత్తి పోకూడదని రామకృష్ణ పరమహంస ఎప్పుడూ బోధించేవారు. అంతేకాదు, కష్టంలోనూ, సుఖంలోనూ, ఆ భగవంతుడు ఒక్కడే తమకు తోడుగా ఉన్నాడనే భావనను కలిగి ఉండటమే నిజమైన ఆధ్యాత్మికత అని కూడా ఆయన చెప్పేవారు. కష్టాలు, కడగండ్ల విషయంలో రామకృష్ణులవారు ఇంకా ఏమి చెప్పేవారంటే... ‘‘ఈ లోకంలో బాధలు, కష్టాలు అందరికీ ఉంటాయి. అయితే ఒక కష్టం కలగగానే, ఎవరైనా ముందు చేసే పని వెంటనే దానిని తొలగించమని భగవంతుని ప్రార్థించటం. కాని బలమైన ఆధ్యాత్మిక భావాలు కల వారు ఎప్పుడూ కూడా తమ కష్టాలను, ఇబ్బందులను తొలగించమని దేవుని కోరుకోరు. దాని బదులు ఆ బాధల్ని ఓర్చుకునే శక్తిని తమకు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరిన వారు రకరకాల నొప్పులూ, అవమానాలూ, అవహేళనలూ, ఆపదలూ తదితరాలను కూడా ఉన్నతమైన ప్రయోజనాల వైపు తమని పురిగొల్పే సాధనాలుగా, ఆయుధాలుగా మలచుకుంటారు’’ అని. కొన్ని రకాల కర్మల ఫలాలు ఆయా కష్టాలను లేదా బాధలను అనుభవించడం వల్లనే తీరతాయని పరమహంస అంటారు. వాస్తవానికి కష్టాలనుంచి పారిపోవాలనుకునేవారు మానసికంగా, శారీకంగా చాలా బలహీనంగా తయారవుతారు. అందుకే ఎప్పటి పాపకర్మలను అప్పుడు దగ్ధం చేసుకోవడమే సరైన మార్గం. మనలోని చెడును, కల్మషాలను కడిగి వేయడానికి లభించిన అవకాశాలుగా ఆ కష్ట నష్టాలను, అనారోగ్యాలను భావించి వాటిని అధిగమించడానికి కావలసిన మనోధైర్యాన్ని పెంచుకునే దిశగా కృషి చేయాలి. దీనిని బట్టి దైవకృప అంటే మన కష్టాలు తొలగిపోవడం మాత్రమే కాదని, దానిని భరించడానికి కావలసిన స్థిరబుద్ధిని, మానసిక నిశ్చలతను ఎదుర్కొనే బలమని కూడా గుర్తించాలి. - కృష్ణకార్తీక -
నిన్ను నువ్వు తెలుసుకో...
అది ఓ ఆరునక్షత్రాల సమూహం. ఆ ఆరు నక్షత్రాలను కలిపి కృత్తిక అంటారు. ఆ కృత్తికా నక్షత్రాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మనం కొలిచే దైవం. శివపార్వతుల పుత్రుడు. ఈ నక్షత్రం నుంచి ఈ భూమిపైకి ఎందరెందరో దివ్యపురుషులు, రుషులు, మహర్షులు అవతరించారు. అలా అవతరించిన సుబ్రహ్మణ్య అంశే వెంకట రమణ. ధ్యాన నిమగ్నుడైన ఆయనను మొదటిసారిగా చూసి, దివ్యదృష్టితో దర్శించి, రమణ మహర్షిగా సంబోధించి, స్తుతించి, స్తోత్రం చేసినవారు కావ్యకంఠ గణపతిముని. ఆ తరువాత ఎందరో అధికార, అనధికార ప్రముఖులు, పెద్దలు రమణాశ్రమంలో ఆయనను దర్శించుకుని తమ సమస్యల నుంచి ఉపశాంతి పొందారు. క్రీ.శ. 1879, డిసెంబర్ 29 అర్ధరాత్రి అంటే తెల్లవారితే 30న మదురైకి 30 మైళ్ల దూరంలోని తిరుచ్చలికి చెందిన సుందరేశ్వర్, అళగమ్మాళ్ దంపతులకు వారి కులదైవమైన వెంకటేశ్వరస్వామి అనుగ్రహంతో జన్మించిన వెంకట రమణే, అనంతర కాలంలో రమణ మహర్షిగా, అరుణాచల రమణుడిగా పేరొంది, ఖండాంతర ఖ్యాతిగాంచారు. భగవంతుణ్ణి నీ అంతర్నేత్రంలో దర్శించడానికి తగిన ఉత్తమమైన, సరళమైన ఆధ్యాత్మికమార్గం మౌనమే అని తన జీవితం ద్వారా మనకు రుజువు చేసిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్ రమణ మహర్షి. నిశ్శబ్దాన్ని ఆశ్రయంగా చేసుకుని చేసే మౌనసాధన వల్లే ఈశ్వర సాక్షాత్కారమవుతుందంటారాయన. రమణ మహర్షి అరుణాచలంలో అడుగిడినప్పటినుంచి చాలాకాలం వరకు మౌనంలోనే ఉన్నారు. ఆయనకు చదవనూ రాయనూ వచ్చనే సంగతి ఎవరికీ తెలియదు. భక్తులు అడిగిన ఆధ్యాత్మిక సంబంధమైన ప్రశ్నలకు ముత్యాల్లాంటి చేతిరాతలో సమాధానాలు రాసి చూపుతూ ఉండేవారు. కొన్నాళ్ల తర్వాత జిజ్ఞాసువులైన భక్తులపట్ల ఆదరంతో పెదవి విప్పి పరిమితంగా మాట్లాడేవారు. అవి భక్తుల సందేహాలను తీర్చేవి. కాని వారి సహజస్థితి మౌనమే. వారి మౌనం దక్షిణామూర్తి రూపాన్ని తలపింపచేసేది. మౌనం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని, ఆత్మానందాన్ని, చిత్తశాంతిని భక్తులకు అనుగ్రహించిన దివ్యజ్యోతి స్వరూపులు భగవాన్ రమణులు. రమణుల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేసినవారిలో ప్రధానమైనవాడు పాల్ బ్రింటన్. ఎన్నో ప్రశ్నలు భగవాన్ను అడుగుదామని అనేక సంశయాలతో రమణుల చెంతకు అరుణాచలం వచ్చాడు పాల్ బ్రింటన్. దాదాపు రెండుగంటలసేపు మహర్షి సమక్షంలో కూర్చున్నారు. వారిద్దరి మధ్యా మౌనమే తప్ప మాట లేదు. తాను అడగదలచుకున్న ప్రశ్నలు ఏవీ ఆయనను అడగలేదు బ్రింటన్. అయితేనేం, అప్రతిహతమైన శాంతి ప్రవాహం అన్ని దిక్కుల నుండి అతనిలోకి వెల్లువలా ప్రవేశించింది. మనస్సు సంపూర్ణశాంతితో నిండి నిశ్చలస్థితిలో నిలిచింది. రమణ మహర్షి దీర్ఘమౌనంలోని అంతరార్థాన్ని గ్రహించిన బ్రింటన్ ఆయనకుశిష్యుడై భగవాన్ జ్ఞానసంపదను ప్రపంచానికి పంచారు. అత్యుత్తమ జ్ఞానసాధనమైన మౌనాన్ని గురించి రమణ మహర్షి ఇలా చెబుతారు. ‘గురువు అనుగ్రహానికి ఉత్తమోత్తమ రూపం మౌనమే. అదే అత్యుత్తమ ఉపదేశం కూడా. మౌనంలోనే సాధకుని ప్రార్థన పరాకాష్ఠకు చేరుతుంది. గురువు మౌనంలో ప్రతిష్థితుడైతే, సాధకుని మనస్సు దానంతట అదే విశుద్ధిని పొందుతుంది’’ అన్నది రమణుల మౌనబోధ. ఆయన సందేశమూ, ఉపదేశమూ ఎప్పుడూ ఒకటే. ‘నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు ఎవరో తెలిస్తే ఈ సమస్తం తెలుస్తుంది. దేహమే నేను అనే సంకుచిత భావనే అహానికి, ప్రారబ్ధకర్మలకు కారణమవుతుంది. జన్మజన్మల కర్మబంధానికి హేతువు అవుతుంది. ఒక్కసారి దేహభావన తొలగిందంటే కర్మబంధం పటాపంచలవుతుంది’ అరుణాచలంలో అడుగిడినప్పటి నుండి సిద్ధిని పొందేవరకు అణగారినవారు, ఉన్నతకులాలవారు, పశువులు, పక్షులు, జంతువులు, వృక్షాలు అనే భేదం లేక అందరినీ సమానంగా ప్రేమించి, ఆదరించి, వెలలేని ఆధ్యాత్మిక జ్ఞానసంపదను అందించిన రమణ మహర్షి సిసలైన స్థితప్రజ్ఞులు. కేవలం తన ఉనికిమాత్రం చేతనే భక్తుల జీవితాలలో వెలుగు నింపారు. నేటికీ ఎందరో భక్తుల హృదయాలలో వెలుగుతున్నారు. అరుణాచలంపై ఇప్పటికీ రమణీయంగా వెలుగొందుతున్నారు. - శింగమల బ్రహ్మానందరెడ్డి మనస్సే అన్నింటికీ మూలం. అది పుట్టగానే అన్నీ పుడతాయి. అది అణిగితే అన్నీ అణుగుతాయి. అన్నింటికీ కారణమైన ఆ మనస్సును అదుపులో పెట్టుకోవడమే ఆధ్యాత్మిక సాధన. - భగవాన్ రమణ మహర్షి