బాధలు కూడా బలమే! | Balame also suffer! | Sakshi
Sakshi News home page

బాధలు కూడా బలమే!

Published Thu, Oct 16 2014 10:46 PM | Last Updated on Fri, Nov 9 2018 6:22 PM

బాధలు కూడా బలమే! - Sakshi

బాధలు కూడా బలమే!

 ఆధ్యాత్మికం
 
కొందరు మహా భక్తులు తాముగా ఎన్నో రకాల శారీరక రోగాలను, అవకరాలను, ఈతిబాధలను కలిగి ఉండి కూడా వాటిని మౌనంగా భరిస్తూనే ఇతరులకు వాటినుంచి బయటపడేందుకు కావలసిన శక్తిని, ధైర్యాన్ని, సూచనలను అందించడాన్ని చూస్తుంటాం. శ్రీరామకృష్ణ పరమహంస, రమణ మహర్షి అందుకు ఉదాహరణ. వారు తమకు కలిగిన శారీరక కష్టానికి ఎప్పుడూ కృంగిపోలేదు సరికదా, ఆ కష్టం ద్వారా భగవంతుడు తమ పాప కర్మలను ప్రక్షాళనం చేసినట్లుగా భావించారు.

మనం ఈ శరీరంలో జీవిస్తున్నందుకు చెల్లించవలసిన పన్నులే రోగాలు, కష్టాలు అని, వాటిని చూసి బెంబేలెత్తి పోకూడదని రామకృష్ణ పరమహంస ఎప్పుడూ బోధించేవారు. అంతేకాదు, కష్టంలోనూ, సుఖంలోనూ, ఆ భగవంతుడు ఒక్కడే తమకు తోడుగా ఉన్నాడనే భావనను కలిగి ఉండటమే నిజమైన ఆధ్యాత్మికత అని కూడా ఆయన చెప్పేవారు. కష్టాలు, కడగండ్ల విషయంలో రామకృష్ణులవారు ఇంకా ఏమి చెప్పేవారంటే...
 
‘‘ఈ లోకంలో బాధలు, కష్టాలు అందరికీ ఉంటాయి. అయితే ఒక కష్టం కలగగానే, ఎవరైనా ముందు చేసే పని వెంటనే దానిని తొలగించమని భగవంతుని ప్రార్థించటం. కాని బలమైన ఆధ్యాత్మిక భావాలు కల వారు ఎప్పుడూ కూడా తమ కష్టాలను, ఇబ్బందులను తొలగించమని దేవుని కోరుకోరు. దాని బదులు ఆ బాధల్ని ఓర్చుకునే శక్తిని తమకు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తారు.

ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరిన వారు రకరకాల నొప్పులూ, అవమానాలూ, అవహేళనలూ, ఆపదలూ తదితరాలను కూడా ఉన్నతమైన ప్రయోజనాల వైపు తమని పురిగొల్పే సాధనాలుగా, ఆయుధాలుగా మలచుకుంటారు’’ అని.  కొన్ని రకాల కర్మల ఫలాలు ఆయా కష్టాలను లేదా బాధలను అనుభవించడం వల్లనే తీరతాయని పరమహంస అంటారు. వాస్తవానికి  కష్టాలనుంచి పారిపోవాలనుకునేవారు మానసికంగా, శారీకంగా చాలా బలహీనంగా తయారవుతారు.

అందుకే ఎప్పటి పాపకర్మలను అప్పుడు దగ్ధం చేసుకోవడమే సరైన మార్గం. మనలోని చెడును, కల్మషాలను కడిగి వేయడానికి లభించిన అవకాశాలుగా ఆ కష్ట నష్టాలను, అనారోగ్యాలను భావించి వాటిని అధిగమించడానికి కావలసిన మనోధైర్యాన్ని పెంచుకునే దిశగా కృషి చేయాలి. దీనిని బట్టి దైవకృప అంటే మన కష్టాలు తొలగిపోవడం మాత్రమే కాదని, దానిని భరించడానికి కావలసిన స్థిరబుద్ధిని, మానసిక నిశ్చలతను ఎదుర్కొనే బలమని కూడా గుర్తించాలి.  
 
- కృష్ణకార్తీక
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement