నిన్ను నువ్వు తెలుసుకో... | Find out yourself ... | Sakshi
Sakshi News home page

నిన్ను నువ్వు తెలుసుకో...

Published Sun, Dec 29 2013 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM

నిన్ను నువ్వు తెలుసుకో...

నిన్ను నువ్వు తెలుసుకో...

అది ఓ ఆరునక్షత్రాల సమూహం. ఆ ఆరు నక్షత్రాలను కలిపి కృత్తిక అంటారు. ఆ కృత్తికా నక్షత్రాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మనం కొలిచే దైవం. శివపార్వతుల పుత్రుడు. ఈ నక్షత్రం నుంచి ఈ భూమిపైకి ఎందరెందరో దివ్యపురుషులు, రుషులు, మహర్షులు అవతరించారు. అలా అవతరించిన సుబ్రహ్మణ్య అంశే వెంకట రమణ. ధ్యాన నిమగ్నుడైన ఆయనను మొదటిసారిగా చూసి, దివ్యదృష్టితో దర్శించి, రమణ మహర్షిగా సంబోధించి, స్తుతించి, స్తోత్రం చేసినవారు కావ్యకంఠ గణపతిముని. ఆ తరువాత ఎందరో అధికార, అనధికార ప్రముఖులు, పెద్దలు రమణాశ్రమంలో  ఆయనను దర్శించుకుని తమ సమస్యల నుంచి ఉపశాంతి పొందారు.
 
 క్రీ.శ. 1879, డిసెంబర్ 29 అర్ధరాత్రి అంటే తెల్లవారితే 30న మదురైకి 30 మైళ్ల దూరంలోని తిరుచ్చలికి చెందిన సుందరేశ్వర్, అళగమ్మాళ్ దంపతులకు వారి కులదైవమైన వెంకటేశ్వరస్వామి అనుగ్రహంతో జన్మించిన వెంకట రమణే, అనంతర కాలంలో రమణ మహర్షిగా, అరుణాచల రమణుడిగా పేరొంది, ఖండాంతర ఖ్యాతిగాంచారు.
 భగవంతుణ్ణి నీ అంతర్నేత్రంలో దర్శించడానికి తగిన ఉత్తమమైన, సరళమైన ఆధ్యాత్మికమార్గం మౌనమే అని తన జీవితం ద్వారా మనకు రుజువు చేసిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్ రమణ మహర్షి. నిశ్శబ్దాన్ని ఆశ్రయంగా చేసుకుని చేసే మౌనసాధన వల్లే ఈశ్వర సాక్షాత్కారమవుతుందంటారాయన.
 
 రమణ మహర్షి అరుణాచలంలో అడుగిడినప్పటినుంచి చాలాకాలం వరకు మౌనంలోనే ఉన్నారు. ఆయనకు చదవనూ రాయనూ వచ్చనే సంగతి ఎవరికీ తెలియదు. భక్తులు అడిగిన ఆధ్యాత్మిక సంబంధమైన ప్రశ్నలకు ముత్యాల్లాంటి చేతిరాతలో సమాధానాలు రాసి చూపుతూ ఉండేవారు. కొన్నాళ్ల తర్వాత జిజ్ఞాసువులైన భక్తులపట్ల ఆదరంతో పెదవి విప్పి పరిమితంగా మాట్లాడేవారు. అవి భక్తుల సందేహాలను తీర్చేవి. కాని వారి సహజస్థితి మౌనమే. వారి మౌనం దక్షిణామూర్తి రూపాన్ని తలపింపచేసేది. మౌనం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని, ఆత్మానందాన్ని, చిత్తశాంతిని భక్తులకు అనుగ్రహించిన దివ్యజ్యోతి స్వరూపులు భగవాన్ రమణులు. రమణుల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేసినవారిలో ప్రధానమైనవాడు పాల్ బ్రింటన్.
 
 ఎన్నో ప్రశ్నలు భగవాన్‌ను అడుగుదామని అనేక సంశయాలతో రమణుల చెంతకు అరుణాచలం వచ్చాడు పాల్ బ్రింటన్. దాదాపు రెండుగంటలసేపు మహర్షి సమక్షంలో కూర్చున్నారు. వారిద్దరి మధ్యా మౌనమే తప్ప మాట లేదు. తాను అడగదలచుకున్న ప్రశ్నలు ఏవీ ఆయనను అడగలేదు బ్రింటన్. అయితేనేం, అప్రతిహతమైన శాంతి ప్రవాహం అన్ని దిక్కుల నుండి అతనిలోకి వెల్లువలా ప్రవేశించింది. మనస్సు సంపూర్ణశాంతితో నిండి నిశ్చలస్థితిలో నిలిచింది. రమణ మహర్షి దీర్ఘమౌనంలోని అంతరార్థాన్ని గ్రహించిన బ్రింటన్ ఆయనకుశిష్యుడై భగవాన్ జ్ఞానసంపదను ప్రపంచానికి పంచారు.
 
 అత్యుత్తమ జ్ఞానసాధనమైన మౌనాన్ని గురించి రమణ మహర్షి  ఇలా చెబుతారు. ‘గురువు అనుగ్రహానికి ఉత్తమోత్తమ రూపం మౌనమే. అదే అత్యుత్తమ ఉపదేశం కూడా. మౌనంలోనే సాధకుని ప్రార్థన పరాకాష్ఠకు చేరుతుంది. గురువు మౌనంలో ప్రతిష్థితుడైతే, సాధకుని మనస్సు దానంతట అదే విశుద్ధిని పొందుతుంది’’ అన్నది రమణుల మౌనబోధ. ఆయన సందేశమూ, ఉపదేశమూ ఎప్పుడూ ఒకటే. ‘నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు ఎవరో తెలిస్తే ఈ సమస్తం తెలుస్తుంది. దేహమే నేను అనే సంకుచిత భావనే అహానికి, ప్రారబ్ధకర్మలకు కారణమవుతుంది. జన్మజన్మల కర్మబంధానికి హేతువు అవుతుంది. ఒక్కసారి దేహభావన తొలగిందంటే కర్మబంధం పటాపంచలవుతుంది’
 
 అరుణాచలంలో అడుగిడినప్పటి నుండి సిద్ధిని పొందేవరకు అణగారినవారు, ఉన్నతకులాలవారు, పశువులు, పక్షులు, జంతువులు, వృక్షాలు అనే భేదం లేక అందరినీ సమానంగా ప్రేమించి, ఆదరించి, వెలలేని ఆధ్యాత్మిక జ్ఞానసంపదను అందించిన రమణ మహర్షి సిసలైన స్థితప్రజ్ఞులు. కేవలం తన ఉనికిమాత్రం చేతనే భక్తుల జీవితాలలో వెలుగు నింపారు. నేటికీ ఎందరో భక్తుల హృదయాలలో వెలుగుతున్నారు. అరుణాచలంపై ఇప్పటికీ రమణీయంగా వెలుగొందుతున్నారు.
 
 - శింగమల బ్రహ్మానందరెడ్డి
 
 మనస్సే అన్నింటికీ మూలం. అది పుట్టగానే అన్నీ పుడతాయి. అది అణిగితే అన్నీ అణుగుతాయి. అన్నింటికీ కారణమైన ఆ మనస్సును అదుపులో పెట్టుకోవడమే ఆధ్యాత్మిక సాధన.
 - భగవాన్ రమణ మహర్షి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement