ఈ వింత సౌందర్యం ఎక్కడిదో! | Anywhere in the strange beauty! | Sakshi
Sakshi News home page

ఈ వింత సౌందర్యం ఎక్కడిదో!

Published Mon, Dec 1 2014 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

ఈ వింత సౌందర్యం ఎక్కడిదో!

ఈ వింత సౌందర్యం ఎక్కడిదో!

పికాసో అనే సుప్రసిద్ధ చిత్రకారుడు సముద్రతీరాన నుంచొని తైలవర్ణ చిత్రం తయారు చేస్తున్నాడు.సముద్రతీరానికి వాహ్యాళికై వచ్చే ప్రేమికులకు రోజా పుష్పాలమ్ముకునే ఒక తోటమాలి, పికాసో వేస్తున్న చిత్రాన్ని తిలకిస్తున్నాడు. కానీ ఆ చిత్రం అంతరార్థం ఏమిటో అతడికి అంతుబట్టలేదు. పికాసో తన చిత్రాన్ని పూర్తి చేసి దానికి తుది మెరుగులు దిద్దుతూ, యథాలాపంగా దాన్నొకసారి, ఒక్క అడుగు ఇవతలికి వేసి చూశాడు. ఇది తాను వేసిన చిత్రమేనా? అని ఎందుకో అనుమానం కలిగి ఆ చిత్రాన్ని మరింత పరీక్షగా చూశాడు అతడికే ఓ రకమైన సంభ్రమానందాలు కలిగినై. మరెవరో వేశారన్నట్టుంది కానీ, తాను వేసినట్లు కనిపించలేదు.
 
నిజమైన కళాకారుడు, కవి ఇలాంటి అనుభూతినే పొందుతారు. చిత్రాన్ని ఎవరో తన చేతులతో గీయించినట్లు కనిపిస్తుందే కానీ, తానే స్వయంగా చిత్రించినట్లు కనిపించదు.తోటమాలి పికాసోను సమీపించి - ‘‘అయ్యా! దీనిని మీరు చిత్రిస్తున్నప్పుడు చూస్తూ ఉండిపోయాను. మీరు మీ పనిలో పూర్తిగా లీనమై ఉన్న సమయంలో మిమ్మల్ని పలకరించడం ఇష్టం లేక ఊరుకున్నాను. నేను అడుగుదామనుకున్న ప్రశ్న ఏమిటంటే ఈ తైలవర్ణ చిత్రం అంతరార్థమేమిటి?’’ అన్నాడు.
 
పికాసో అతడి వంకకు తిరిగి ‘‘నా చిత్రానికి అర్థమేమిటని అడుగుతున్నావు. మరి నిన్ను, నీ బుట్టలోని ఆ చక్కని రోజా పుష్పాలకు అర్థమేమిటని అడిగితే నువ్వేమి చెప్తావు?’’ అన్నాడు పికాసో. ‘‘ఈ సౌందర్యమెక్కడిదో, ఏ లోకం నుండి దిగి వచ్చిందోనని ఆశ్చర్యపోతుంటాను. ఏళ్ల తరబడి ఈ ప్రశ్న నన్ను నేను వేసుకుంటూనే ఉన్నాను. వీటి సౌందర్యం వర్ణనాతీతమని నాకు తెలుసు. కానీ ఇది ఏమిటో, ఎక్కడిదో నాకు తెలియదు’’ అని గద్గద స్వరంతో అన్నాడు తోటమాలి.
 ‘‘నా పరిస్థితి కూడా అంతే బాబూ’’ అన్నాడు పికాసో.
 - నీలంరాజు లక్ష్మీప్రసాద్
 ‘చరిత్రలో ఈ పేరు మిగిలేనా’ పుస్తకం నుంచి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement