ప్రాణమున్నగోడలు | Mural painter Sneha Chakraborty on her journey as an NFT artist | Sakshi
Sakshi News home page

ప్రాణమున్న గోడలు

Published Wed, May 15 2024 3:50 AM | Last Updated on Wed, May 15 2024 12:57 PM

Mural painter Sneha Chakraborty on her journey as an NFT artist

బయటి గోడలు ఎలా ఉంటే ఏంటి అనుకుంటారు చాలామంది.అరె.. ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనేలా చేస్తుంది స్నేహ చక్రవర్తి. ఎత్తుగా ఉండే గోడలపై భారీ మ్యూరల్స్‌ గీయడం సవాలు.మహిళా ఆర్టిస్ట్‌గా ఆ సవాలును ఎదుర్కొంది స్నేహ.దేశంలో గొప్ప కుడ్య చిత్రకారిణిగా ఉన్నఆమె జీవన విశేషాలు.

కూర్గ్‌ కాఫీ తోటల్లో పనిచేసే కార్మికులు, కొచ్చిలో చేపలు పట్టే బెస్తవారు, బెంగళూరులో ఇడ్లీ హోటల్‌ నడిపే ముసలామె, తమిళనాడులో తిరిగే జడలు గట్టిన సాధువులు, కష్టజీవులు, శ్రామిక మహిళలు... వీరిని భారీ బొమ్మలుగా ఎప్పుడైనా గోడల మీద చూశామా? స్నేహ చక్రవర్తి ‘మ్యూరల్స్‌’ (కుడ్య చిత్రాలు– గోడ బొమ్మలు) చూస్తే వీరే కనపడతారు. ‘దేశంలో ఎవరూ గమనించని జీవన ΄ోరాట యోధులు వీరంతా. వీళ్లను బొమ్మల్లో చూపడమే నా లక్ష్యం’ అంటుంది స్నేహ చక్రవర్తి. గత సంవత్సరం ఆమె ‘ట్రావెల్‌ అండ్‌ పెయింట్‌ ఇండియా’ పేరుతో భారత దేశ యాత్ర చేసింది. కూర్గ్‌తో మొదలెట్టి హిమాచల్‌ ప్రదేశ్‌ వరకూ అనేక రాష్ట్రాల్లో తిరుగుతూ గోడల మీద భారీ చిత్రాలు గీసింది. వాటిలో ప్రధాన అంశం సామాన్యులు, సామాన్య జీవనం... దానిలోని సౌందర్యం. ‘దేశమంటే వీళ్లే’ అంటుంది స్నేహ.

సొంత ఊరు ఢిల్లీ
ఢిల్లీలో పుట్టి పెరిగిన స్నేహ అక్కడ చదువు పూర్తి చేసింది. ఆమె తండ్రి ఇంజినీర్, తల్లి గృహిణి. ‘నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు చేతుల మీద మెహందీ వేసే ఒక మహిళ వచ్చింది. ఆమె వేసిన డిజైన్లు నన్ను ఆకర్షించాయి. ఆమె మా పక్కింటికి వెళితే అక్కడకు కూడా వెళ్లి ఆమె మెహందీ వేయడం చూశాను. మరుసటి రోజే అమ్మను అడిగి మెహందీ తెచ్చి ట్రై చేశాను. నాకు మెహందీ వేయడం వచ్చేసింది. ఎనిమిదేళ్లకు మా ఏరియాలో గిరాకీ ఉన్న మెహందీ ఆర్టిస్ట్‌ను అయ్యాను. 

అయితే కళ అన్నం పెట్టదు అనే భావనతో ఏదైనా పని చేయమని నన్ను మా తల్లిదండ్రులు కోరారు. వారి కోసమని ఒక ఎయిర్‌లైన్స్‌ సంస్థలో ఇంటీరియర్‌ డిజైనర్‌గా చేశారు. కాని ఇలా ఒకరి కింద పని చేయడం నాకు నచ్చలేదు. నా మనసు అక్కడ లేదు. నేను రంగుల కోసం పుట్టాను. రంగుల్లో మునుగుతాను. నా బొమ్మలు అందరూ చూడాలి. అంటే నేను మ్యూరలిస్ట్‌గా, స్ట్రీట్‌ ఆర్టిస్ట్‌గా పేరు గడించాలి. ఆ విషయం ఇంట్లో చెప్పి 2018 నుంచి మ్యూరలిస్ట్‌గా మారాను’ అని తెలిపింది స్నేహ చక్రవర్తి.

జటిలమైన చిత్రకళ
కాన్వాస్‌ మీద బొమ్మ గీయడం వేరు... ఒక పెద్ద గోడను కాన్వాస్‌గా చేసుకోవడం వేరు. కాగితం మీద వేసుకున్న బొమ్మను పదింతలు ఇరవై యింతలు పెంచి గోడ మీద గీస్తారు. దొంతీలు కట్టుకుని గోడ మీద బొమ్మ వేస్తే మళ్లీ కిందకు దిగి దూరం నుంచి చూసుకుంటూ బొమ్మను అంచనా కడుతూ గీయాలి. సాధారణంగా మగవారు ఈ ఆర్ట్‌లో ప్రావీణ్యం సం΄ాదిస్తారు. మ్యూరలిస్ట్‌లుగా ఉన్న మహిళలు తక్కువ. వారిలో స్నేహ చక్రవర్తి పేరు పొందింది. పూణె, ముంబై స్లమ్స్‌లో ఆమె గీసిన బొమ్మలు ఆ మురికివాడలకు జీవం, ప్రాణం ΄ోశాయి. ‘అందమైన బొమ్మ ఉన్న గోడ దగ్గర ఎవరూ చెత్త వేయడానికి ఇష్టపడరు. ఉమ్మివేయరు’ అని చెప్పింది స్నేహ. 

స్త్రీలు– సందేశాలు
‘నా మ్యూరల్స్‌తో స్త్రీల సాధికారతను చూపిస్తుంటాను. స్వేచ్ఛాభావనను చూపుతుంటాను. సరైన సందేశాలు కూడా ఇస్తుంటాను. ఒకసారి ఒక పెద్ద స్త్రీ బొమ్మ గీచి ఫర్‌ సేల్‌ ఫర్‌ సేల్‌ అని చాలాసార్లు ఆ స్త్రీ బొమ్మ చుట్టూ రాశాను. ΄ోర్నోగ్రఫీ వల్ల స్త్రీ దేహం అమ్మకానికి సులువుగా దొరుకుతుందన్న భావన పురుషులలో ఉంటుంది. అలాంటి భావజాలం ఎంత దుర్మార్గమైనదో తెలిసొచ్చేలా ఆ బొమ్మ గీశాను. దానికి మంచి స్పందన వచ్చింది. గోడలు లేని ప్రపంచం లేదు. అందుకే నేను ప్రపంచమంతా తిరిగి బొమ్మలు వేస్తాను. నా బొమ్మ ప్రతి దేశం గోడ మీద మన ప్రజలను, సంస్కృతిని చూ΄ాలన్నదే నా కోరిక’ అని తెలిపింది స్నేహ. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement