వడ్డాది పాపయ్య
తెల్లని ఖద్దరు పంచె, అదే రంగు లాల్చీ, చేతికో గడియారం కూడా లేని అతి సామాన్యుడు తెలుగు చిత్రకళా రంగంలో అసమాన్యుడు ! ఆయనవి పిల్లి కళ్ళు, నిశీధి కూడా నిశీతంగా చూసే డేగ కళ్ళు అవి ఆయన చూపు ఓ రంగుల చిత్రం ఆయన దృష్టి ఓ అద్భుత సృష్టి ఆయన పొట్టిగా ఉన్నా గీసిన గట్టి చిత్రాలు ఎన్నో ఆయన నిరాడంబరుడే కానీ ఆయన చిత్రాల్లో నాయకి, నాయకులంతా ఆడంబరులే. ఆయన చిత్రకళా యోగే కాదు, భోగి కూడా ఆయన వాస్తవం కంటే – ఊహల్లో ఎక్కువ జీవిస్తారు. ఆయనకు పగలే రాత్రి, రాత్రే పగలు. ఆయనకు పగలు విశ్రాంతి –నిశీధి నిశ్శబ్దంలో కళాసాధన. ఆయన జీవికకు సరిపడా ‘సిరి ’లేని, కళా శ్రీమంతుడు. ఆయన ఎవరికీ అభిమాని కాదు కానీ, ఆయనకు లక్షల్లో కళాభిమానులున్నారు. ఆయన చిత్రాలు తెలుగు సంస్కృతిక ప్రతీకలు. అవి అభిమానులకు రసగుల్లాలు ! అభిమానుల గుండెల్లో అమరుడు..ఆయనే కళాభిమానుల వడ్డాది పాపయ్య.. శ్రీకాకుళంలో పుట్టి, మద్రాసులో మెరిసి, కశింకోటలో కన్నుమూశారు. బుధవారం 28వ వర్ధంతితోపాటు శత జయంతి
ఉత్సవాలను చిత్ర కళాభిమానులు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిభా పాఠవాలను అవలోకిస్తే...
సాక్షి, కశింకోట (అనకాపల్లి): తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన కళను స్వయం కృషితో సాధన చేసి మహా చిత్రకారుడు కావచ్చునని వడ్డాది పాపయ్య నిరూపించారు. చిత్ర కళా జగత్తును మకుటం లేని మహారాజులా నాలుగు దశాబ్దాల పాటు ఏలారు. ఆయన 1992 డిసెంబర్ 30న కశింకోటలోని పావని నిలయంలో తనువు చాలించారు. వ.పా.గా వినుతికెక్కిన వడ్డాది పాపయ్య 1921 సెపెంబర్ 10న శ్రీకాకుళంలో మధ్య తరగతికి చెందిన వడ్డెర కుటుంబంలో జన్మించారు. అత్త వారి గ్రామమైన కశింకోటలో స్థిరపడ్డారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు ఐదో ఏట నుంచే చిత్ర కళకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి రామ్మూర్తికి చిత్రకళలో ప్రవేశం ఉంది. ఆయన చిత్రాలు గీస్తున్నప్పుడు దగ్గర ఉండి చిత్రకళలో మెళకువలను తెలుసుకొని అభ్యసించి స్వయం కృషితో సాధన చేశారు. ఐదవ ఏటనే ఆంజనేయస్వామి చిత్రాన్ని మొదటిసారిగా గాశారంటే అతిశయోక్తి కాదు. పాపయ్య కుంచె పట్టిన తొలి నాళ్లలో ప్రముఖ చిత్రకారులు రాజా రవివర్మ, దురంధర్‌ల ప్రభావం ఉండేది. తర్వాత కాలంలో తనదైన శైలిలో ‘వ.పా. శైలి అనితర సాధ్యం’ అనే రీతిలో ఇతరులెవరూ అనుకరించడానికి అవకాశం లేని విధంగా చిత్రాలే గీసేవారు. చిత్ర కళా ప్రియుల హృదయాలను దోచుకున్నారు. వ.పా.కుంచె నుంచి జాలువారేది చిత్ర కళ కాదు సాక్షాత్తూ మహిళా సౌందర్య స్వరూపమే.
పత్రికా ప్రపంచానికి వ.పా.గా సుపరిచితుడైన పాపయ్య అనేక మాస, వార పత్రికలకు ముఖ చిత్రాలను గీశారు. చందమామ, ఆంధ్రజ్యోతి, భారతి, రేరాణి, అభిసారిక, యువ, స్వాతి వంటి పలు మాస, వార పత్రికలకు ముఖ చిత్రాలను గీశారు. ఆయన గీసిన చిత్రాలు పత్రికల్లో ప్రచురితం అయి తీవ్ర సంచలనం సృష్టించాయి. ఆయన గీసిన చిత్రాల కోసమే కొన్ని పత్రికలు అమ్ముడయ్యేవంటే అతిశయోక్తి కాదు. పాపయ్యకు సంగీతం అంటే ప్రత్యేక అభిమానం. ఎన్నో రాగాలకు సంబంధించిన చిత్రాలను గీయడం ఇందుకు నిదర్శనం. నవ రసాల్లో శృంగారానికి ఇచ్చిన ప్రాధాన్యం మరే రసానికి ఇవ్వలేదు. శృంగార పరమైన గ్రామీణ మహిళల చిత్రాలు గీసి యువతను రస డోలలో గిలిగింతలు పెట్టారు. కళా దేవులపల్లి, పోతన, శ్రీశ్రీల సాహిత్యమంటే ఆయన అభిమానించేవారు. పాపయ్య చిత్రకారుడే కాదు మంచి రచయిత, ఫొటోగ్రాఫర్ కూడా. పొగడ్తలంటే గిట్టేవి కాదు.
ఇంటర్వ్యూలన్నా, కళా ప్రదర్శనలన్నా ఆమడ దూరంలో ఉండేవారు. ఎవరైనా కళను గౌరవించాలిగాని వ్యక్తులను కాదని అభిప్రాయపడేవారు. పాపయ్య ఎక్కువగా నీలి రంగు చిత్రాల పట్లే మక్కువ చూపేవారు. తైల వర్ణాల కంటే నీలి రంగు చిత్రాలు అయితే అనుకున్న ఫలితాలు సాధించడమే కాకుండా సత్వరమే చిత్రాలను పూర్తి చేయవచ్చునని అభిప్రాయపడేవారు. సుమారు నాలుగు దశాబ్దాలపాటు వర్ణ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుగా వెలుగొందిన వ.పా. నిరాడంబర జీవితాన్ని సాగించి ఇక్కడ తనువు చాలించారు. ఆయన చిత్రాలతో వ.పా. ఆర్ట్సు గ్యాలరీని ప్రదర్శనకు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కళాభిమానులు కోరుతున్నారు. అలాగే వ.పా. జన్మించి వందేళ్లు అవుతున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలను నిర్వహించి ఆయన ప్రతిభా పాటవాలను నేటి తరానికి తెలిసే విధంగా చాటాలని, ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కళాభిమానులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment