కిరణ్కు చివరి సంతకాల ఉచ్చు? | kiran kumar reddy last signatures as CM | Sakshi
Sakshi News home page

కిరణ్కు చివరి సంతకాల ఉచ్చు?

Published Mon, Mar 3 2014 4:42 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

కిరణ్ కుమార్ రెడ్డి - Sakshi

కిరణ్ కుమార్ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తన పదవీకాలం చివరలో చేసిన సంతకాలు ఉచ్చులా బిగుసుకోనున్నాయా? అధికార ప్రతిపక్ష నేతలు అందరూ ఆ సంతకాలపైనే ఆరోపణలు, పిర్యాదులు చేస్తున్నారు. చివరి సంతకాలకు సంబంధించి గతంలో ఏ ముఖ్యమంత్రిపై రానన్ని ఆరోపణలు కిరణ్పై వచ్చాయి. కిరణ్ 3 సంవత్సరాల 2 నెలల 19 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2010 నవంబర్ 25న  ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, తెలంగాణ బిల్లు పార్లమెంటు ఉభయ సభలలో  ఆమోదం పొందిన తరువాత 2014 ఫిబ్రవరి 19న  రాజీనామా చేశారు.  దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా కిరణ్ తనకు, తనకు సంబంధించినవారికి లబ్ది చేకూరే విధంగా చివరలో సంతకాలు పెట్టినట్లు విమర్శలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆ సంతకాలపై విచారణ చేపడితే ఆయన చిక్కుల్లోపడే ప్రమాదం ఉంది.

ఆయన రాజీనామా చేస్తున్నారన్న వార్తలు రాగానే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అప్రమత్తం అయ్యారు. తమ నియోజకవర్గ పనులతో పాటూ సొంత పనులకు కూడా చక్కదిద్దుకున్నారు. చివరి రోజుల్లో సిఎం వెంటబడిమరీ తమ ఫైళ్ల పై సంతకాలు పెట్టించుకున్నారు.  ఒక్క కాంగ్రెస్ వారే కాకుండా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా సీఎం చాంబర్లో  క్యూకట్టి తమ పనులు చేయించుకున్నారు. కిరణ్ కూడా ఏమనుకున్నారో ఏమో  ఫైలు తెచ్చిన వారందరికి సంతకాలు చేసేశారు.  ఈ క్రమంలో తమకు కావలసినవారికి పోస్టింగులు - ప్రత్యేక అనుమతులు ... ఇలా అనేక పనులు జరిగిపోయాయి. కిరణ్  ముఖ్యమంత్రిగా తన పదవీకాలంలో ఏ రోజూ చేయనన్ని సంతకాలు చివరి రోజున చేశారు.

కిరణ్ కుమార్ రెడ్డి చివరి రోజులలో రాత్రి పగలు సంతకాలు చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రిగా కిరణ్ చివరి రోజులలో ఏఏ ఫైళ్లపై సంతకాలు చేశారో వాటిపై విచారణ జరిపించాలని వైఎస్ఆర్ సిసి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు,  టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడుతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు  డిమాండ్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, లోక్సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్లు గవర్నర్ నరసింహన్ను కలిసి కిరణ్ చివరగా చేసిన సంతకాలను సమీక్షించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు.

ఇదిలా ఉండగా,  కిరణ్ కుమార్ రెడ్డి సిఎంగా చేసిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి డిమాండ్ చేశారు.  కిరణ్ కుమార్‌రెడ్డి అవినీతి చిట్టాను గవర్నర్ ముందు ప్రవేశపెడతామని కూడా ఆయన చెప్పారు. ఈ విధంగా సీఎంగా కిరణ్ చివరి సంతకాలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోతే విచారణకు ఆదేశించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విచారణ ఎక్కడకు దారి తీస్తుందో వేచిచూడాల్సిదే!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement