నేచురల్ క్యూర్
చికిత్సకంటే... అది చేసే విధానంతోనే సగం జబ్బు నయమవుతుంది. అలాంటి సహజమైన చికిత్సకి పేరుమోసింది నగరంలోని నేచర్ క్యూర్ ఆస్పత్రి. రోజూవారీ ఒత్తిళ్లకు దూరంగా పచ్చని వాతావరణంలో రోగులకు సహజమైన వైద్యం. రకరకాల జబ్బులతో ఈ ఆస్పత్రికి వచ్చే రోగుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించాలనుకుంది ఆస్పత్రి యాజమాన్యం. సిబ్బంది, రోగుల్లో నూతనోత్తేజం నింపేందుకు ప్రముఖ చిత్రకారుడు, రచయిత బ్నింతో కలిసి ఆస్పత్రి ‘కళాకదంబం టాలెంట్ షో’ నిర్వహించింది. గురువారం జరిగిన ఈ కార్యక్రమం అందరిలో ఉత్సాహాన్ని నింపింది.
అనువైన వాతావరణం...
‘నేచర్ క్యూర్ ఆస్పత్రి నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. మా అమ్మమ్మ, మేనత్త, చిన్నమ్మలు ఇక్కడ ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. అప్పుడు నా పాఠశాల కాగానే నేరుగా ఇక్కడకు వచ్చి ప్లే గ్రౌండ్‌లో ఆడుకునేదాన్ని. నా ఫీల్డ్‌లో ఎంతో మంది అధిక బరువున్నవాళ్లను చూశాను. తగ్గించుకునేందుకు వాళ్లు పడే కష్టాలు చూశాను. కానీ ఈ ఆస్పత్రిలో ప్రకృతి చికిత్స దొరుకుతుంది. హెల్దీగా ఉండడానికి అనువైన వాతావరణంతో పాటు అవసరమైన చికిత్స విధానాలున్నాయి. ఇక్కడిలాగే నేనూ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటాన’ంటున్నారు సినీనటి, యాంకర్ ఝాన్సీ. కళాకదంబం అందరిలో ఉన్న మానసిక ఒత్తిడి, ఆందోళనను దూరం చేయగలిగిందన్నారు.
మైమరిపించిన భరణి పాటలు
తనికెళ్ల భరణి. పరిచయం అక్కర్లేని పేరు. మంచి నటునిగా, రచయితగా పేరున్న ఆయన మంచి గాయకుడు కూడా. ‘కళాకదంబం’లో ఆయన పాడిన ‘ఆటకదరా శివా’, ‘ఈ జన్మకింతేరా మల్లన్నా’, ‘ఎంత గొప్పవాడివయ్యా శివా’వంటి స్వీయగీతాలు అందరినీ పరవశంలో ముంచెత్తాయి. భరణి పాడుతుంటే ఆస్పత్రి సిబ్బంది, రోగులు పాటలో లీనమైపోయారు. పాటకు కోరస్ కలిపారు. శివ తన్మయత్వంలో ఓలలాడారు. ‘ప్రకృతి చికిత్సాలయం ప్రశాంత ఆశ్రమంలా ఉందని.. బయట తినే చిరుతిళ్ల నుంచి మనం మోసుకొచ్చే రోగాలకు ఇక్కడ విముక్తి లభించడం ఆనందంగా ఉందని’ అన్నారు భరణి.
ఆకట్టుకున్న మ్యాజిక్
మిమిక్రీ ఆర్టిస్టు కస్తూరి ఫణిమాదవ్ తన మ్యాజిక్‌తో అదరగొట్టాడు. జడ రిబ్బన్‌లు బయటకు తీయడం, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమ కలిగించేలా చేసిన డైమండ్ కార్డు షో ఆకట్టుకుంది. అంతేకాదు వెంట్రిలాక్ విజమ్ (మాట్లాడే బొమ్మ)తో తమాషా చేయించాడు. నటీమణులు ఇషా, సంధ్య స్పెషల్ స్కిట్స్ ఆకట్టుకున్నాయి.
బరువున్నా ఇరగదీశాడు
అతడి వయస్సు 17 ఏళ్లే. బరువు మాత్రం 120 కేజీలు. అయితేనేం సెలబ్రిటీలకు తానేమి తక్కువ కాదని కుర్రాడు వీర సమీర్ సాహు డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఒక్కసాహునే కాదు... అక్కడ ఉన్నవారంతా కాసేపు తమకున్న అనారోగ్య సమస్యలను పక్కనబెట్టి పాటలకు స్టెప్పలేశారు.
- వాంకె శ్రీనివాస్