Natural cure
-
తల్లి వైద్యం
‘నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అంటారు. రూపమ్ విషయంలో మాత్రం ‘చైల్డ్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అనుకోవాలి. కూతురు కలిగించిన అవసరం కారణంగా ఆ తల్లి ఓ దివ్యౌషధాన్ని కనిపెట్టారు మరి! తెలంగాణలో ఉంటున్న రూపమ్ సింగ్ ఓ రెండేళ్ల నుంచి ఎగ్జిబిషన్లలో ఒక టేబుల్ వేసుకుని ఒక స్టాల్ పెడుతోంది. ఆమె ఒక చిన్న కుటీర పరిశ్రమ నిర్వాహకురాలిగా ప్రపంచానికి పరిచయమై నిండా ఐదేళ్లు కూడా కాలేదు. ‘‘గృహిణిగా ఉన్న మీరు పరిశ్రమ ఎప్పుడు స్థాపించారు. చిన్న పాపాయిని చూసుకుంటూ, పరిశ్రమను నడిపించడం ఇబ్బందిగా అనిపించడం లేదా’’ అని తెలిసినవారెవరైనా అడిగితే ఆమె చెప్పే సమాధానం ఒక్కటే.. నా పరిశ్రమ వయసు... పాపాయి వయసుకు ఒక ఏడాది తక్కువ. నన్ను పారిశ్రామిక వేత్తను చేసింది నా పాపాయే’’ అని నవ్వుతుంది. మరో క్షణంలో పాపాయికి ఎదురైన చర్మ సమస్య గుర్తుకు వచ్చి ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతుంది. గాలి కూడా పడేది కాదు! ‘‘మా పాపకు పుట్టినప్పటి నుంచి చర్మ సమస్య ఉంది. ఎన్ని క్రీములు రాసినా తగ్గేది కాదు. ఎంతమంది డెర్మటాలజిస్టులను కలిశానో లెక్కే లేదు. మార్కెట్లో ఉన్న రకరకాల లోషన్లు రాశాను. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే... పాపాయి పాకుతూ కార్పెట్ మీదకు వెళ్లిందంటే ఆ వెంటనే ఒళ్లంతా ఎర్రగా దద్దుర్లు వచ్చేవి. కార్పెట్‌లో దాగిన దుమ్ము కణాల వల్ల అలా అవుతుందని కార్పెట్ తీసేశాను. పాపాయి తిరిగే నేలను తళతళ మెరిసేలా తుడిచేదాన్ని. అయినా ర్యాష్ వస్తూనే ఉండేది. ఆఖరుకు నేను దగ్గరకు తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నా ... వెంటనే బుగ్గంతా గరుకు తేలి ఎర్రగా అయ్యేది. చివరకు ఇంటి నాలుగ్గోడలు దాటలేని పరిస్థితి వచ్చింది. చెట్ల గాలి కోసం పాపాయిని బయటకు తీసుకెళ్లినప్పుడు.. ఒంటికి ఏమీ తగలకుండా చూసుకున్నా కూడా గాల్లోని ఇన్ఫెక్షన్ ఒంటిని ఎర్రబార్చేది. డాక్టర్లు ఎగ్జిమా అని రకరకాల మందులిచ్చేవారు. అవి రాస్తే మరింత మంటగా అనిపించేదో ఏమో... పాపాయి ఇంకా ఎక్కువగా ఏడ్చేది. అలా తొమ్మిది నెలల వరకు బాధపడింది. నా అదృష్టమో, పాపాయి అదృష్టమో కానీ అప్పుడు ఒక డాక్టర్ ఇచ్చిన సలహా మా జీవితాలను మార్చేసింది. ఇల్లే ఔషధాలయం మా అమ్మమ్మ, నానమ్మలు మాకోసం చిన్నప్పుడు వాడిన దినుసుల జాబితా రాసుకుని వాటి కోసం మార్కెట్లో ప్రయత్నించాను. కొన్ని దొరకలేదు. దాంతో వాటిని ఇంట్లోనే తయారు చేయడానికి సిద్ధమయ్యాను. స్వచ్ఛమైన కొబ్బరి నూనె, ఆ నూనెలో మరికొన్ని దినుసులు కలిపి తైలం తయారు చేసుకుని పాపాయి ఒంటికి రాశాను. సింథటిక్ వస్త్రాలను మానేసి మెత్తటి కాటన్ దుస్తులు మాత్రమే వేశాను. ఇలా నాలుగు వారాల్లోనే చర్మంలో మార్పు కనిపించింది. రెండు నెలలకంతా పాపాయి చర్మం లేత తమలపాకులాగా మారిపోయింది. పాపాయిని చూసిన బంధువులు, పక్కిళ్ల వాళ్లు ‘‘ఏం మందులు వాడారు? ఎలా తగ్గింది?’’ అని ప్రశ్నలు. నేను చేసింది చెప్పిన తర్వాత చాలా మంది రొటీన్ స్కిన్ కేర్ కోసం క్రీమ్‌లు, తైలాలు అడిగి చేయించుకునే వారు. మొదట్లో ఫ్రీగా చేసిచ్చాను. ఇలా ఉచితంగా ఇస్తుంటే– తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, డబ్బులు తీసుకోమనేవాళ్లు. దినుసులకు అయిన ఖర్చు మాత్రం తీసుకుని చేసిచ్చాను. దీనినే ఒక బ్రాండ్‌నేమ్‌తో చేయమని మా చెల్లెలు అనుపమ్ సలహా ఇవ్వడంతో 2014లో ‘ప్రకృత’ అనే పేరుతో రిజిస్టర్ చేశాను. ప్రకృతి ఇచ్చిన సహజసిద్ధమైన వస్తువులతో, ఎటువంటి రసాయనాలు లేకుండా తైలాలు, లేపనాలు చేస్తున్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే మా పాపాయి కోసం ఎలా చేశానో, మార్కెట్ కోసం కూడా అలానే చేస్తున్నాను. ఇప్పుడు నాకిది ఒక వ్యాపకంగా మారిపోయింది’’ అని చెప్తుంది రూపమ్. ఇన్ని విషయాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లు చెప్తారామె, ఆఖరుకు తన క్రీమ్‌ల ఫార్ములాలను కూడా. తన పాపాయి పేరు తప్ప! – మంజీర -
నేచురల్ క్యూర్
చికిత్సకంటే... అది చేసే విధానంతోనే సగం జబ్బు నయమవుతుంది. అలాంటి సహజమైన చికిత్సకి పేరుమోసింది నగరంలోని నేచర్ క్యూర్ ఆస్పత్రి. రోజూవారీ ఒత్తిళ్లకు దూరంగా పచ్చని వాతావరణంలో రోగులకు సహజమైన వైద్యం. రకరకాల జబ్బులతో ఈ ఆస్పత్రికి వచ్చే రోగుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించాలనుకుంది ఆస్పత్రి యాజమాన్యం. సిబ్బంది, రోగుల్లో నూతనోత్తేజం నింపేందుకు ప్రముఖ చిత్రకారుడు, రచయిత బ్నింతో కలిసి ఆస్పత్రి ‘కళాకదంబం టాలెంట్ షో’ నిర్వహించింది. గురువారం జరిగిన ఈ కార్యక్రమం అందరిలో ఉత్సాహాన్ని నింపింది. అనువైన వాతావరణం... ‘నేచర్ క్యూర్ ఆస్పత్రి నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. మా అమ్మమ్మ, మేనత్త, చిన్నమ్మలు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అప్పుడు నా పాఠశాల కాగానే నేరుగా ఇక్కడకు వచ్చి ప్లే గ్రౌండ్లో ఆడుకునేదాన్ని. నా ఫీల్డ్‌లో ఎంతో మంది అధిక బరువున్నవాళ్లను చూశాను. తగ్గించుకునేందుకు వాళ్లు పడే కష్టాలు చూశాను. కానీ ఈ ఆస్పత్రిలో ప్రకృతి చికిత్స దొరుకుతుంది. హెల్దీగా ఉండడానికి అనువైన వాతావరణంతో పాటు అవసరమైన చికిత్స విధానాలున్నాయి. ఇక్కడిలాగే నేనూ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటాన’ంటున్నారు సినీనటి, యాంకర్ ఝాన్సీ. కళాకదంబం అందరిలో ఉన్న మానసిక ఒత్తిడి, ఆందోళనను దూరం చేయగలిగిందన్నారు. మైమరిపించిన భరణి పాటలు తనికెళ్ల భరణి. పరిచయం అక్కర్లేని పేరు. మంచి నటునిగా, రచయితగా పేరున్న ఆయన మంచి గాయకుడు కూడా. ‘కళాకదంబం’లో ఆయన పాడిన ‘ఆటకదరా శివా’, ‘ఈ జన్మకింతేరా మల్లన్నా’, ‘ఎంత గొప్పవాడివయ్యా శివా’వంటి స్వీయగీతాలు అందరినీ పరవశంలో ముంచెత్తాయి. భరణి పాడుతుంటే ఆస్పత్రి సిబ్బంది, రోగులు పాటలో లీనమైపోయారు. పాటకు కోరస్ కలిపారు. శివ తన్మయత్వంలో ఓలలాడారు. ‘ప్రకృతి చికిత్సాలయం ప్రశాంత ఆశ్రమంలా ఉందని.. బయట తినే చిరుతిళ్ల నుంచి మనం మోసుకొచ్చే రోగాలకు ఇక్కడ విముక్తి లభించడం ఆనందంగా ఉందని’ అన్నారు భరణి. ఆకట్టుకున్న మ్యాజిక్ మిమిక్రీ ఆర్టిస్టు కస్తూరి ఫణిమాదవ్ తన మ్యాజిక్‌తో అదరగొట్టాడు. జడ రిబ్బన్లు బయటకు తీయడం, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమ కలిగించేలా చేసిన డైమండ్ కార్డు షో ఆకట్టుకుంది. అంతేకాదు వెంట్రిలాక్ విజమ్ (మాట్లాడే బొమ్మ)తో తమాషా చేయించాడు. నటీమణులు ఇషా, సంధ్య స్పెషల్ స్కిట్స్ ఆకట్టుకున్నాయి. బరువున్నా ఇరగదీశాడు అతడి వయస్సు 17 ఏళ్లే. బరువు మాత్రం 120 కేజీలు. అయితేనేం సెలబ్రిటీలకు తానేమి తక్కువ కాదని కుర్రాడు వీర సమీర్ సాహు డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఒక్కసాహునే కాదు... అక్కడ ఉన్నవారంతా కాసేపు తమకున్న అనారోగ్య సమస్యలను పక్కనబెట్టి పాటలకు స్టెప్పలేశారు. - వాంకె శ్రీనివాస్