నెవర్ మైండ్...
గజిబిజీ జీవిత గమనంలో సమస్యలనేకం. ఈ టెన్షన్స్‌తో తల బొప్పి కట్టిపోతుంది. ఇంతటి భారాన్ని మోయలేక ఓ మార్నింగ్ టైమ్‌లో తలే మాయమైపోతుంది. మరి దాన్ని ఎక్కడ వెతుక్కోవాలి? ఎలా పట్టుకోవాలి? ఇదే ‘నెవర్‌మైండ్’ లఘు చిత్రం. కథ, కథనం వినూత్నంగా సాగే ఈ చిత్రానికి దర్శకత్వం వైవీ రెడ్డి. పొద్దున్నే నిద్ర లేచిన యువకుడు అద్దం ముందు నిల్చుంటే... అతడి తల కనిపించదు. బతికున్నానా.. లేదా అన్న అనుమానం అతడిలో. తలను వెతుక్కుంటూ బయలుదేరుతాడు. అతడిని అందరూ విచిత్రంగా చూస్తుంటారు. బడి, గుడి, గ్రంథాలయాల్లో గాలిస్తాడు.
చివరకు ప్రయోగశాలకు వెళతాడు. అక్కడున్న ఐప్యాడ్, సెల్‌ఫోన్, కరెన్సీ, ప్రజాస్వామ్యం, పెట్టుబడీదారి వ్యవస్థ, రాజ్యాంగం పుస్తకాలు, మద్యం సీసాలను పక్కకు తీసి చూడగా... తల కనిపిస్తుంది. దాన్ని తీసుకుని తన మెడపై పెట్టుకోగానే... అతడి ముందు మరో కొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. యాంత్రికంగా మారిన జీవితాల్లో సమస్యలకు ప్రాముఖ్యం ఇస్తూ, ఏం కోల్పోతున్నామో ఒక్క డైలాగ్ కూడా లేకుండా స్పష్టంగా చూపగలిగిందీ చిత్రం. నగ్నముని కోణంలో చెప్పాలంటే... ‘నేక్‌డ్ ఐతో చూస్తే నెవర్‌మైండ్ ఓ అద్భుత చిత్రం. పెద్దగా పట్టించుకోవద్దని టైటిల్ చెబుతున్నా... చూసిన తరువాత మేధస్సుతో ఆలోచించాల్సిన గంభీర భావగర్భితం’.