పీర్ పోరాటం
ప్రపంచ నాటక రచయితలలో ప్రముఖ పేరు ఇబ్సెన్. ఆయన రాసిన నాటకాల ప్రభావం భారతీయ నాటక, సినిమా రంగాలపై నేటికి కనిపిస్తుంది. మోడ్రన్ డ్రామా ఆద్యుడైన ఇబ్సెన్ నాటకం ‘పీర్‌గింట్’ని 5 భాషలు, 5 రీతుల్లో నగరంలో ప్రదర్శించనున్నారు. ‘ఇబ్సెన్ బిట్‌వీన్ ట్రెడిషన్ అండ్ కాంటెంపర్నిటీ’ పేరుతో ఈ ఫెస్టివల్‌ని రాయల్ నార్వేజియన్ ఎంబస్సీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, హైదరాబాద్ యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. తెలుగు ‘పీర్’ ప్లేతో ఈ ఫెస్టివల్ గురువారం ప్రారంభమైంది.
ఆధునిక నాటకాలకు ఆద్యుడు హెన్‌రిక్ ఇబ్సెన్. నార్వే జానపద కథను ఇబ్సెన్ ‘పీర్’ నాటకంగా మలిచారు. ఆ నాటకాన్ని క్లాసికల్, కాంటెంపరరీ, లోకల్, ఒరిజినల్... ఇలా రకరకాలుగా చూపించే ప్రయోగమే ఈ ఫెస్టివల్ థీమ్. పీర్‌గింట్ ప్లే ఇబ్సెన్ రాసిన ‘పీర్’కి అడాప్టేషన్. ఇబ్సెన్ రాసిన డైలాగులను అలాగే వుంచుతూ నేటి కాలమాన పరిస్థితుకు అనుగుణంగా నేటి తరానికి ఆయన నాటకాలను దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తోంది టీటర్‌జోకర్ అనే నార్వే థియేటర్ కంపెనీ. ఈ ఒరిజినల్ నాటకాన్ని ప్రదర్శించడానికి 4 గంటలు పడుతుంది. 2012లో జరిగిన ‘ఇబ్సెన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్’లో ప్రదర్శించడానికి నాటకాన్ని ఒక గంటకు కుదించి కొత్త తరహాలో రూపొందించారు. నాటి నుంచి నేటి వరకు నార్వేలో కొన్ని వందల సార్లు ఈ నాటకాన్ని ప్రదర్శించారు.
నాటకం క్లుప్తంగా...
తండ్రి దురలవాట్ల వలన ఆస్తి నష్టపోయిన కొడుకు పీర్. ఎలాగైనా పూర్వవైభవం పొందాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో సాగే కథ మిగతా నాటకం. ఈ కథనంలో అతని ప్రేమ వ్యవహారాలు, ప్రయాణాలు ఆసక్తికరంగా వుంటాయి. అయితే ‘నార్వే కథను, ఆ భాషను, ఇక్కడి వారు ఎలా అర్థం చేసుకోగలరు’ అంటే, ఎక్స్‌ప్రెషన్‌ని మించిన భాష లేదనేదే వారి సమాధానం. ‘కథను ఏ మాత్రం మార్చకుండా రెగ్యులర్ లైఫ్‌లో కనిపించే ఫోన్, ఫ్లైట్, కాసినో, కారు లాంటి అనేక మోడరన్ లైఫ్ యుటిలిటీస్‌ని ఇందులో జొప్పించాం. లాంగ్వేజ్ పాతదే వుంచినా, ఈ వస్తువులు చూసి ఏం జరుగుతుందో అర్థం చేసుకోవటం సులభం. విదేశాల్లో ఈ నాటకాన్ని ప్రదర్శించటం ఇదే మొదటిసారి’ అని నాటక దర్శకులలో ఒకరైన యాంగ్వే మార్కుస్సేన్ తెలిపారు.
ఐదు రోజుల ఫెస్ట్...
ఈ ఫెస్టివల్‌లో పీర్ ప్లేను 5 భాషల్లో.. ఈ నెల 12 నుంచి 16 తేదీల్లో ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 12న తెలుగులో చిందుభాగవతం, 14 మలయాళ కుడియాట్టం, 15న కన్నడ యక్షగానం, 16న తమిళంలో తెరుకుట్టు. రవీంద్రభారతిలో 13 సాయంత్రం 7 గంటలకు నార్వేయిన్ ప్లే.. ‘పీర్‌గింట్’.
- ఓ మధు