ఖానాగారం | restaurant in cell | Sakshi
Sakshi News home page

ఖానాగారం

Published Mon, Mar 30 2015 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM

ఖానాగారం

ఖానాగారం

ఆ రెస్టారెంట్‌కు వెళ్తే.. అరెస్ట్ చేస్తారు. ఆరాలు తీస్తారు.. కృష్ణజన్మస్థానానికి తరలిస్తారు.. ఆపై సత్తు పళ్లాల్లో ఇంత ముద్ద పడేసి.. చుక్కలు చూపిస్తారు. ఇదేంరెస్టారెంట్‌రా బాబోయ్ అని అనుకుంటున్నారా? ‘ట్రీట్‌మెంట్’ మాత్రమే ఇలా.. విందు మాత్రం పసందే. బేగంపేటలో కొత్తగా వెలిసిన విలేజ్ రెస్టారెంట్ డిఫరెంట్ థీమ్‌తో సిటీ భోజనప్రియులకు పసందైన రుచులతో పాటు పల్లె జ్ఞాపకాలనూ కొసరి వడ్డిస్తోంది. అంతేకాదు.. కస్టమర్లను అరెస్ట్ చేసి ససురాల్ కీసన్మాన్‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 ..:: శిరీష చల్లపల్లి
 
రచ్చబండ.. చిన్న బస్‌స్టాప్.. తలపాగా చుట్టుకున్న పెద్దమనుషులు.. ప్రభుత్వ పాఠశాల.. పక్కనే అంగన్‌వాడి కేంద్రం.. ముందుకెళ్తే.. లేడీస్ టైలర్ షాప్. ఇంకో రెండడుగులు వేస్తే పాలకేంద్రం.. చేదబావి.. రికార్డింగ్ డ్యాన్స్ సెంటర్.. కల్లు దుకాణం.. ఇవి దాటాక పోలీస్ ఠాణా.. ఇదీ ఈ రెస్టారెంట్‌లోని పల్లెటూరి సీన్.
 
యూ ఆర్ అండర్ అరెస్ట్
రెస్టారెంట్‌లో అడుగుపెట్టే కస్టమర్లు మొదట ‘రికార్డింగ్ డ్యాన్స్ సెటప్’ దగ్గర ఆసీనులవుతారు. అక్కడ ‘కల్లు కొట్టు సెటప్’ నుంచి వచ్చిన వెల్‌కమ్ డ్రింక్స్‌ను టేస్ట్ చేస్తుండగానే ఓ దొంగ పరిగెత్తుకుంటూ వస్తాడు. అతడిని వెంబడిస్తూ పోలీసూ వస్తాడు. దొంగను కాదని.. ఈ కస్టమర్లను ‘యూ ఆర్ అండర్ అరెస్ట్’ అని షాక్ ఇస్తాడు. వారిని ఠాణాకు తీసుకెళ్లి.. ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ‘ఇక్కడకు మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చార’ంటూ వాంటెడ్ లిస్ట్ చూపిస్తూ ఆరా తీస్తాడు. తర్వాత అసలు కథ మొదలవుతుంది.
 
ఖైదీ సర్వర్
బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో ఉన్న గజదొంగ కస్టమర్లు పారిపోకుండా కాపలాగా ఉంటాడు. ఇందాక వాంటెడ్ లిస్ట్‌లో వీరు మార్క్ చేసిన దొంగను పోలీసులు రప్పిస్తారు. తెల్లచొక్కా.. తెల్ల నిక్కర్‌లో ఉన్న ఖైదీ వారి ముందు వినయంగా నిల్చుంటాడు. ‘మీకు ఏమేం కావాల’ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫైల్ చేస్తాడు పోలీస్ అధికారి. ఆ ఆర్డర్‌ను ఖైదీగారికి అప్పగిస్తాడు. కట్ చేస్తే... కాసేపటికి వాళ్లు ఆర్డర్ చేసిన పదార్థాలను వేడివేడిగా తీసుకొస్తాడు ఆ ఖైదీ. వాటిని ఖైదీలకు మళ్లే సత్తుప్లేట్లలో వడ్డించి వారి ముందుంచుతాడు. ఈ అంకంలో స్టాటర్స్.. నాన్స్.. వంటి లైట్‌ఫుడ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఇవి తిన్నాక.. పోలీసులు వీళ్లను కారాగారానికి తరలిస్తారు. అక్కడ సెంట్రల్ జైలును తలపించే అట్మాస్పియర్‌లో వీరిని ట్రీట్ చేస్తారు. జైల్లో క్యూ కట్టిన ఖైదీలకు సత్తుప్లేట్లో.. గరిటతో వడ్డించినట్టుగానే.. ఇక్కడ బఫెట్‌లో కూడా గరిటతోనే సర్వ్ చేస్తారు. కిచిడి, దంపుడు బియ్యం రైస్.. సాంబార్ వంటి వెరైటీలుంటాయి. ఇక, కిచెన్‌లో జైల్లో చేసినట్టే, పెద్దపెద్ద రాతివెండి గుండీల్లో చేసే దృశ్యం కనిపిస్తుంది. భోజనం పూర్తయ్యాక కస్టమర్లను విడుదల చేస్తారు. ఈ తంతు జరుగుతుండగానే.. హోటలంతా సైకిల్‌పై చక్కర్లు కొట్టుతూ ఓ చాయ్‌వాలా.. చాయ్.. చాయ్ అంటూ టీ అమ్ముతుంటాడు.
 
రిలీజ్ ఫెస్ట్..
జైలు నుంచి బయటపడిన సంతోషంలో ఉన్న వీరికి అక్కడే ఉన్న పాలకేంద్రంలోని మిఠాయిలు రా రమ్మని స్వాగతం పలుకుతాయి. అక్కడ మరో డ్రామా మొదలవుతుంది. ఓ పాలేరు గేదె బొమ్మకు పాలుపితికినట్టు కలరింగ్ ఇస్తాడు. ఎదురుగా ఉన్న స్వీట్ షాప్ సెటప్‌లోకి వెళ్లి.. కాసేపటికి.. రసగుల్లా, కలాకాన్, గులాబ్‌జామ్, జిలేబీ వంటి మిఠాయిలు తీసుకొస్తాడు. జైలు నుంచి రిలీజైనందుకు వారి నోరు తీపి చేస్తాడు. ఇక్కడే పిల్లల కోసం ఏర్పాటు చేసిన స్కూల్, అంగన్‌వాడి కేంద్రాలు స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తాయి. అంతేకాదు ఐస్‌గోళీలు అందించి వారిని  ఉత్సాహపరుస్తారు.

మళ్లీ టెన్షన్..
ఇక్కడ సెలబ్రేషన్‌లో వీరుండగానే.. ఓ దొంగ హడావుడిగా టైలర్‌షాప్ సెటప్‌లోకి దూరతాడు. అతగాడ్ని పట్టుకోవడానికి పోలీసులు మళ్లీ ఎంట్రీ ఇస్తారు. దీంతో పోలీసులు తమ కోసమే వచ్చారనుకుని సదరు కస్టమర్లు బ్యూటీపార్లర్‌లోకి వెళ్లి దాక్కుంటారు. అలా వచ్చిన వారికి నెయిల్ పాలిష్, నెయిల్ ఆర్ట్స్, మెహెందీ వంటి సౌందర్యపోషణ చేస్తారు. బయట పోలీసులు దొంగను తీసికె ళ్లడం చూసి.. సంతోషంగా బయటకు వచ్చిన కస్టమర్లు.. పంచాయతి రచ్చబండ దగ్గరికి చేరుకుంటారు. తిరునాళ్ల సెటప్‌తో ముస్తాబైన రచ్చబండ దగ్గర తోలుబొమ్మలాటను వీక్షించి.. దాండియా కర్రలతో కాసేపు సరదాగా ఆటాడుకుంటారు. చివరగా.. పాన్‌షాప్‌లో తాంబూలం తీసుకుని.. నోరుపండగా.. పండుగ చేసుకుంటూ వెళ్లిపోతారు.
 
కొత్తదనం కోసం..
మాకు విలేజ్ సెటప్ రెస్టారెంట్లు దేశవ్యాప్తంగా 23 ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇదే ఫస్ట్. సిటీవాసులు కేవలం ఫుడ్‌నే కోరుకోవట్లేదు. కొత్తదనం కావాలనుకుంటున్నారు. అది వాళ్లు మిస్ అవుతున్న ఫీలింగ్‌ను దూరం చేసేదై ఉండాలి. చాలా మందికి జైలులో ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంటుంది. అలాగని ఏ నేరమో చేసి జైలుకు వెళ్లలేరు కదా. వారిలోని కుతూహలాన్ని బేస్ చేసుకుని ఈ కాన్సెప్ట్‌ను డిజైన్ చేశాం. కస్టమర్లు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.
 - రోషన్ కమలాకర్, రెస్టారెంట్ మేనేజర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement