ఆమెకు 'ఇద్దరు'!
మహాభారతంలో పాండవులు ద్రౌపదిని పంచుకున్నారని చదువుకున్నాం. ఆధునిక యుగంలోనూ పాండవ సంతతి కొనసాగుతోంది. కెన్యాలో వెలుగు చూసిన ఘటన ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. ఇద్దరు పురుషులు ఓ మహిళలను వంతులువారిగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమేరకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో వీరి బాగోతం బట్టబయలయింది.
మొంబాసా కౌంటీలోని కిసానిలో ఉన్న కిసిమాని ప్రాంతానికి చెందిన సిల్వెస్టర్ వెన్డ్వా, ఎలిజహ్ కిమాని అనే ఇద్దరు వ్యక్తులు ఒకే వితంతు మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నారు. 25 నుంచి 31 ఏళ్ల వయసున్న ఈ ముగ్గురు నాలుగేళ్లకు పైగా ఈ బంధం సాగిస్తున్నారు. అయితే ఒకరి 'వ్యవహారం'లో మరొకరు తలదూర్చకూడదని వీరు ఒప్పందం చేసుకున్నారు. ఆమెకున్న కవల పిల్లలను తామే పెంచాలని నిర్ణయించుకున్నారు.
ఇంతవరకు సవ్యంగా సాగిన వీరి వ్యవహారం ఒప్పందం ఉల్లంఘనతో వీధిన పడింది. వెన్డ్వా, కిమాని ఇద్దరూ ఆమెను పెళ్లాడేందుకు సిద్ధమవడంతో తగవు వచ్చింది. ఎదురు కట్నం ఇచ్చి మరీ మనువాడేందుకు ముందుకురావడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలయింది. చివరకు రగడ పోలీసు స్టేషన్కు చేరడంతో మీడియా ద్వారా ప్రపంచమంతా పాకింది.
ఇద్దరు పిల్లల తల్లైన వితంతు మహిళ కోసం ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవడం తానెక్కడా చూడలేదని స్థానిక కమ్యూనిటీ పోలింగ్ అధికారి అబ్దుల్రహమాన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తాను ప్రయత్నిస్తున్నా అందుకు ఈ ముగ్గురు అంగీకరించడం లేదని స్థానిక కమ్యూనిటీ పోలింగ్ అధికారి అబ్దుల్రహమాన్ పేర్కొన్నారు. ఆమె లేకుండా బతలేమని వారిద్దరూ అంటున్నారని తెలిపారు. అలాగే ఆమె కూడా వీరిద్దరూ లేకుండా ఉండలేనంటుందన్నారు.
బహుభార్యత్వం(పాలిగమి) కెన్యాలో నేరం కాదు. అయితే పాలియాండ్రి(ఒక మహిళ ఎక్కువ మంది భర్తలను కలిగివుండడం) గురించి వినడం ఇదే మొదటిసారి అని కెన్యా న్యాయనిపుణులు అంటున్నారు. పాలియాండ్రి చట్టవిరుద్ధమని ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ఒక మహిళ ఎక్కువ మంది భర్తలను కలిగివుండడం అసహజమని పేర్కొన్నారు. ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.