బారిష్ మే భరోసా | Waterproof smart and strong watches Phones | Sakshi
Sakshi News home page

బారిష్ మే భరోసా

Published Wed, Aug 6 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

బారిష్ మే భరోసా

బారిష్ మే భరోసా

చినుకు పడితే సిటీలో కామన్‌మెన్ వణికిపోతున్నారు. వానజల్లు గిల్లితే జలుబు చేస్తుందనో.. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోతాననో కాదు.. ఎక్కడ తన స్మార్ట్ ఫోన్ తడిసిపోతుందోనని. వేలకు వేలు పోసి కొన్న స్మార్ట్ గాడ్జెట్స్‌కు నీటి ముల్లు గుచ్చుకుంటుందోనని హడలిపోతుంటారు. ఇలాంటి వారి కోసమే సరికొత్త స్మార్ట్ గాడ్జెట్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. వాటర్‌ప్రూఫ్ కవచంతో బీ స్మార్టే కాదు.. బీ స్ట్రాంగ్‌గా ఉంటున్నాయి. అవి సొంతం చేసుకుంటే చాలుగాలివానలో.. వాన  నీటిలో.. మీ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.
 -  శిరీష చల్లపల్లి
 
 స్మార్‌‌ట టెక్నాలజీ కాలాన్ని శాసిస్తోంది. ఏ క్లాస్ నుంచి సీ క్లాస్ పీపుల్ వరకు అందరూ స్మార్ట్‌గా బతికేయాలని ఆరాటపడుతున్న రోజులివి. అందుకే మార్కెట్‌లోకి ఏ కొత్త మోడల్ స్మార్ట్ గాడ్జెట్స్ వచ్చినా.. నిమిషాల్లో వారి చేతుల్లో కనిపిస్తున్నాయి. క్రెడిట్ కార్డులు గీకి మరీ వేలకు వేల విలువ చేసే స్మార్ట్ గూడ్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అవి తీసుకున్న నాటి నుంచి.. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. వాన వచ్చినా, అలా జారి ఇలా నీటిలో పడినా.. స్మార్ట్ గాడ్జెట్స్ కాస్తా టర్న్ ఆఫ్ కావడం మామూలే. వాటి సర్వీసింగ్‌కు మళ్లీ వేలు వెచ్చించడం తలకు మించిన భారంగా మారుతోంది. ఇలాంటి చికాకులకు పుల్ స్టాప్ పెడుతూ బడా కంపెనీలు వాటర్ ప్రూఫ్ గాడ్జెట్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి.
 
 సోనీకా తోఫా..
 రకరకాల స్మార్ట్ ఫోన్లతో ఇప్పటికే జనాల మనసులు గెలిచిన సోనీ.. ఎక్స్‌పీరియా జెడ్ సిరీస్ పేరుతో స్మార్ట్ ఫోన్లు రిలీజ్ చేసింది. స్మార్ట్ ఫీచర్లతో అదరగొట్టే ఈ ఫోన్ ఐదు మీటర్ల లోతు నీళ్లలో అరగంట ఉంచినా చెక్కుచెదరదు. 12.7 సెంటీమీటర్ స్క్రీన్‌తో.. 20.7 మెగా పిక్సల్ కెమెరాతో కొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. బ్లాక్, వైట్, పర్పుల్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆపిల్, సామ్‌సంగ్ కంపెనీల వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్లు కూడా మార్కెట్లో మంచి బిజినెస్ చేస్తున్నాయి.
 
 వానకారు కెమెరా
 ఇప్పటికే వాటర్ ప్రూఫ్ కెమెరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే స్మార్ట్ టెక్నాలజీతో సోనీ హెడీఆర్ ఏఎస్ 30 మోడల్ సరికొత్తగా క్లిక్ కొడుతోంది. ఈ హైస్పీడ్ కెమెరా.. ఆరు మీటర్ల లోతు నీళ్లలోనూ అరగంట పాటు హెడీ క్వాలిటీతో ఫొటోలు తీస్తుంది.  శాంసంగ్ కూడా వాటర్ ప్రూఫ్ స్మార్ట్ కెమెరాలు రిలీజ్ చేసింది.
 
 వానా‘కాలం’
 ఉందిలే మంచి కాలం ముందు ముందునా అంటున్నాయి వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్‌లు. శాంసంగ్, సోనీ వంటి బడా కంపెనీలు కాలాన్ని స్మార్ట్‌గానే కాదు.. సేఫ్టీగా కూడా మార్చేస్తున్నాయి. వాన హోరులో.. వరద జోరులో కూడా క్షణం తీరిక లేకుండా ఇవి టిక్ టిక్ అని అంటూనే ఉంటాయి. వీటి ధర రూ.15 వేల వరకు పలుకుతోంది.
 
 జలకాలాటలలో.. గలగల పాటలు
 స్నానాల గదిలో కూని రాగాలు తీయడం కాదు.. జలకాలాడుతూ వాక్‌మెన్‌లో పాటలు వినేయొచ్చు. వాటర్ ప్రూఫ్ వాక్‌మెన్ వచ్చేశాయి. ఇంకేముంది ఇయర్ ఫోన్స్ తగిలించుకుని టబ్ బాత్ చేస్తూ మ్యూజిక్ ఎంజాయ్ చేసేయొచ్చు. ఈ వాక్‌మెన్ ఉంటే మోట బావిలో కూడా పాటలు వింటూ ఓ గంట పాటు ఈత కొట్టొచ్చు.
 
 ఎనీ ప్లేస్.. వర్క్స్ నైస్
 మామూలుగా అయితే ల్యాప్‌టాప్‌లు పనిచేయాలంటే కండిషనల్ వెదర్ ఉండాల్సిందే. ఈ వాటర్ ప్రూఫ్ ల్యాప్‌టాప్‌లు నీళ్లలో కూడా ఎక్స్‌లెంట్‌గా పని చేస్తాయి. టఫ్‌బుక్ సీఎఫ్ 19 ల్యాప్‌టాప్ టెక్నాలజీ నీటి దూకుడును తట్టుకుని మరీ పని చేస్తోంది. ఇవే కాదు స్మార్ట్ గాడ్జెట్స్‌లో రాజ్యమేలుతున్న యునిక్ గాడ్జెట్స్ కూడా వాటర్ ప్రూఫ్ వేసుకుంటున్నాయి. స్పీకర్లు, స్మార్ట్ బాండ్, చార్జర్లు.. ఇలా రకరకాల స్మార్ట్ గాడ్జెట్స్ మరింత మన్నికగా పని చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement