ప్రతీకాత్మక చిత్రం
లండన్ : ఆరోగ్యకర జీవనానికి నీరు ఎక్కువగా తాగాలని తరచూ వైద్యులు చెబుతుంటారు. రోజుకు కనీసం రెండు లీటర్లు పైగా నీరు తాగాలని సూచిస్తుంటారు. అయితే రోజుకు 8 గ్లాసుల నీరు అంటే రెండు లీటర్ల నీరు తీసుకోవడం అనర్థమని, ఎంత దాహమైతే అంతవరకే నీరు తాగాలని తాజా అథ్యయనం తేల్చింది. అతిగా నీరుతాగితే అనర్థాలను కొనితెచ్చుకోవడమేనని పేర్కొంది. దాహం వేసినంత మేరకు నీరుతాగితే సరిపోతుందని, మూత్రం రంగు ఆధారంగా కూడా నీటిని తీసుకోవడంలో మార్పుచేర్పులు చేసుకోవచ్చని డీకిన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ కరెన్ డేర్ చెప్పారు. మూత్రం లేత పసుపు వర్ణంలో ఉండాలని, మరీ పచ్చగా ఉంటే డీహైడ్రేషన్‌కు గురయ్యారనే సంకేతమని అప్పుడు ఎక్కువగా నీరు తీసుకోవాలని సూచించారు. మూత్రం తెల్లగా ఉండే ఎక్కువ నీటిని తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అతిగా నీరు తీసుకోవడం ఆరోగ్యానికి ముప్పని, ముఖ్యంగా గుండె సమస్యలున్నవారు ఎక్కువ నీటిని తీసుకోరాదని సూచించారు. శరీరంలో నీటి నిల్వలను గుర్తించడంలో మూత్రపిండాలు కీలకంగా ఉంటాయని, శరీరానికి నీరు అవసరమైతే మూత్రపిండాలు మూత్రాన్ని పసిగట్టి ఎక్కువ నీరు తీసుకోవాలని మెదడుకు సంకేతాలు పంపుతాయని చెప్పారు. ఇక రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగాల్సిన అవసరం లేదని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలో అకడమిక్ గాస్ర్టోఎంట్రాలజిస్ట్ విన్సెట్ హో పేర్కొన్నారు. రోజుకు 2.5 లీటర్ల నీరు తాగాలన్న సూచన గతంలో వ్యాప్తిలో ఉందని, అయితే ఆహార పదార్ధాల్లోనూ ఉండే నీటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. నిత్యం ఆహారంలో తీసుకనే కాలీఫ్లవర్ సహా పలు కూరగాయలు, పండ్లలో అత్యధికంగా నీరు ఉంటుందని వీటికితోడు అదనంగా రెండు లీటర్ల నీరు అవసరం లేదని అన్నారు. నిర్ధిష్ట వ్యాదులు, అధిక ఉష్ణోగ్రతల్లో నివసించే వారికి మాత్రమే అదనంగా నీటిని తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment