వంద పడితే లక్ష వచ్చినట్టే! | 100days movies will easliy lakhs money | Sakshi
Sakshi News home page

వంద పడితే లక్ష వచ్చినట్టే!

Published Sun, Feb 2 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

వంద పడితే లక్ష వచ్చినట్టే!

వంద పడితే లక్ష వచ్చినట్టే!

 జ్ఞాపకం

  నువ్వు నాగేశ్వరరావు ఫేవరెట్టువా, ఎన్టీ రామారావు ఫేవరెట్టువా? కొత్తగా ఆ వూరికి బదిలీ అయి వచ్చిన ఉద్యోగుల పిల్లలు కావచ్చు; సమీప గ్రామాల్లో హైస్కూలు చదువు పూర్తి చేసుకొని కాలేజీలో చేరిన వారు కావచ్చు.. తొలి పరిచయం కాగానే ఎదురయ్యే మొదటి ప్రశ్న ఇదే. ‘‘నాకు ఇంట్రెస్ట్ లేదండీ..’’ అంటేనో, ‘‘నాకు ఇద్దరూ సమానమే’’ అంటేనో వాడు కచ్చితంగా అబద్ధమాడుతున్నాడనో, ఏమన్నా గొడవవుతుందని లౌక్యంగా తప్పించుకుంటున్నాడనో భావించే రోజులు. ఇవాళ్టికి 30 సంవత్సరాల క్రితం వరకూ పాతికేళ్ల పాటు తెలుగునాట విద్యార్థి లోకం పరిస్థితి ఇదీ..
 
 కాస్త చదువుకున్న కుర్రాళ్లు నాగేశ్రావు, రామారావు అని; అసలు చదువుకోనివాళ్లు నాగ్గాడు, ఎన్టీవోడు అనీ; కాలేజీ చదువుకొచ్చాకా ఏయన్నార్, ఎన్టీఆర్ అనీ మాట్లాడేవారు వాళ్ల వాళ్ల అభిమానులు. సినిమాహాల్లో తెరమీద టైటిల్స్‌లో వాళ్ల పేరు పడిన దగ్గరా, పాటలొచ్చినప్పుడూ, ఫైటింగ్ చేస్తున్నప్పుడూ గొంతు చించుకుని జేజేలు, ఈలలు, చప్పట్లు, అరుపులు.. మాటలు, పాటలు కూడా వినపడనంతగా..!
 
 ఇద్దరు మిత్రులు.. నాగేశ్వర్రావు డబల్ ఫోజు. రాముడు భీముడు... ఎన్టీ రామారావు డబల్ ఫోజు. (రెండేళ్లు ఆలస్యం) బుద్ధిమంతుడు.. నాగేశ్వరరావు డబల్ ఫోజు. భలే తమ్ముడు.. ఎన్టీ రామారావు డబల్ ఫోజు (కొద్ది రోజుల తేడా). గోవుల గోపన్న.. నాగేశ్వరరావు డబల్ ఫోజు. తిక్క శంకరయ్య.. ఎన్టీ రామారావు డబల్ ఫోజు (రోజులే తేడా). సోలో చిత్రాలు సరే సరి.. ఇలా ద్విపాత్రాభినయ చిత్రాలు కూడా ఆయా నిర్మాతలు పోటీ పడి నిర్మించారు.
 
 ఏ సినిమా ఎక్కువ రోజులాడిందీ.. అనే దానిపై ఆ హీరో, హీరోయిన్లు, నిర్మాత, దర్శకుల కంటే ఎక్కువ ఆసక్తి...
 
 ఒరే.. ఎన్టీ రామారావు ఫేవరెట్లు నలుగురు చావదొబ్బుతున్నార్రా... నువ్వు అర్జంటుగా రారా బాబు అంటే వెళ్లాను.
 
 మనోడు...‘ఏమంటి రేమంటిరీ.. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే.. కాకూడదు.. (దాన వీరశూరకర్ణ) ఆ డైలాగు చెప్పమను మీ వాణ్ణి.. ఎన్టీఆర్ అభిమాని సవాల్.
 
 అంత పెద్ద పాఠం దేనికి....‘ల్లతా....’ (ప్రేమనగర్) అనమను.. అని నేను ఏఎన్నార్ తరపున ప్రతి సవాల్.
 వీరిద్దరి కొత్త సినిమా కాపీ విడుదల... ‘ఈ దిగువ కేంద్రాలలో..’ అన్న పేజీని దాచిపెట్టి ఏదైనా కొత్త సినిమా వచ్చే ముందు రోజు థియేటర్ల లిస్టు పేపర్లో చూసుకుంటూ, ఏ వూళ్లో మావోడి సినిమా ఎన్ని రోజులాడిందో లెక్కలేసే వాళ్లం.   ‘వంద’ పడ్డం కోసం కళ్లు కాయలు కాసేలా చూసేవాళ్లం. ‘వంద’ పడిందంటే చాలు మాకు లాటరీలో లక్ష వచ్చినట్టో, ఫస్ట్‌క్లాస్‌లో పరీక్ష పాసయినట్టో కాలరెగరేసే వాళ్లం.
 
 కాలేజీ బయట కేంటీన్లలో సిగరెట్లు లాగించేస్తూ వాదులాడుకుంటుంటే  మూడు పదులు దాటిన పెద్ద వాళ్లు ‘సుభాషితాలు’ చెప్పేవారు. మాక్కూడా ‘ముప్పై’లు దాటాక జ్ఞానోదయమయింది. ఇద్దరూ సినిమా పరిశ్రమకు రెండు కళ్లు అనీ, పోటీకి పర్యాయ పదాలనీ, వారికి వారే సాటి అనీ తెలిసొచ్చింది.
 ఇంత పోటాపోటీ వీరిద్దరి అభిమానులకే పరిమితం. ముందు తరంలోని నాగయ్య, సీహెచ్ నారాయణరావుల విషయంలో లేదని చెప్పేవారు. తర్వాత కృష్ణ, శోభన్‌బాబుల విషయంలో కూడా ఇంతగా లేదు.
 - లక్ష్మణ్
 
 ఆపరేషన్ సక్సెస్  - ఇంద్రుడు ‘సేఫ్’
 
 1974లో ఏయన్నార్‌కి అమెరికాలో గుండె ఆపరేషన్ అని తెలిసింది. అభిమానుల్లో కంగారు. ఇష్టదైవాలకు మొక్కుకున్నాం. మొత్తానికి ఆయన క్షేమంగా తిరిగొచ్చారు. ఒకవేళ నాగేశ్వర్రావు మరణిస్తే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వంటి దేవలోక సుందరీ మణులు తనను వదిలేసి నాగేశ్వర్రావు వెంట పడతారనీ, తన పదవికే మప్పు వస్తుందని భయపడి దేవేంద్రుడు బ్రహ్మ దేవుడితో ఏయన్నార్‌ని గండం గట్టెక్కించమని ప్రార్థించాడనీ, పూర్ణాయువు ప్రసాదించమని వేడుకున్నాడనీ, అందుకే ఆయన క్షేమంగా సంపూర్ణారోగ్యవంతుడై వచ్చాడనీ ఓ కథ అల్లుకుని మురిసిపోయాం. ఇద్దరిలో ఎవరు లేకపోయినా నటనలో ఇక పోటీ అన్నమాటకే అర్థం ఉండదంటూ ఎన్టీఆర్ అభిమానులు కూడా మాతో తొలిసారి ఏకీభవించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement