అమ్మో అనబెల్! | 1970 New York | Sakshi
Sakshi News home page

అమ్మో అనబెల్!

Published Sun, Aug 30 2015 1:50 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

అమ్మో అనబెల్! - Sakshi

అమ్మో అనబెల్!

న్యూయార్క్... 1970.
 చకచకా మెట్లు దిగుతోంది డోనా. ఆరోజు ఆమె పుట్టినరోజు. అందుకే కొత్త డ్రెస్‌లో కళకళలాడిపోతోంది. ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. గ్రౌండ్ ఫ్లోర్‌లోకి వస్తూనే అక్కడ నిలబడి ఎదురుచూస్తోన్న మహిళ దగ్గరకు పరుగు పరుగున వెళ్లింది డోనా. ‘‘మమ్మీ’’ అంటూ ఆమెను గట్టిగా వాటేసుకుంది. ఆవిడ డోనాని హత్తుకుని ఒళ్లంతా ప్రేమతో నిమిరింది. ‘‘హ్యాపీ బర్త్‌డే డియర్’’ అంది డోనా నుదుటిపై ఆప్యాయంగా ముద్దాడుతూ. ‘‘థాంక్యూ మమ్మీ. చాలా పని ఉంది, రాలేకపోవచ్చు అన్నావ్ కదా. నిజంగా రావేమోనని బెంగపడ్డాను’’ అంటూ బుంగమూతి పెట్టింది డోనా.  కూతుర్ని అలా చూసి ముద్దొచ్చింది తల్లికి. ‘‘పరిస్థితులు అలానే అనిపించాయి బేబీ. కానీ మనసు ఒప్పలేదు. ఇప్పటి వరకూ నేను నీ ప్రతి పుట్టినరోజునా నీ పక్కనే ఉన్నాను. ఇప్పుడు లేకుండా ఉండాలంటే నావల్ల కాలేదు. అందుకే వచ్చేశాను. నీకో గిఫ్ట్ కూడా తెచ్చాను.’’
 
 ‘‘గిఫ్టా... ఏదీ?’’... చిన్నపిల్లలా సంబరపడింది డోనా.
 వెంటనే వాళ్ల మమ్మీ తన వెనుక దాచిన ఓ బొమ్మను తీసి డోనా చేతిలో పెట్టింది. దాన్ని చూస్తూనే ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది డోనాకి. ‘‘వావ్ మమ్మీ... సూపర్‌గా ఉంది’’ అంటూ చేతిలో ఉన్న బొమ్మను తేరిపార చూసింది. ఓ ఆడపిల్ల బొమ్మ అది. చక్కని గౌను వేసి ఉంది. బంగారు రంగు జుత్తు రెండు జడలుగా అల్లారు. ఆ రెండు జడలకూ రెండు రిబ్బన్లు కట్టి ఉన్నాయి. చూడటానికి ఎంతో అందంగా ఉంది.‘‘మమ్మీ... నువ్వు ఇప్పటివరకూ ఇచ్చిన డాల్స్ అన్నింట్లోకీ ఇదే బెస్ట్’’ అంది డోనా బొమ్మను గుండెకు హత్తుకుంటూ.‘‘ఓహ్ బేబీ... నువ్వు పెద్దదాని వయ్యావు. నర్సింగ్ చదువుతున్నావు. ఇంకా ఈ బొమ్మల పిచ్చేంటి నీకు’’ అంది తల్లి నవ్వుతూ.
 
 ‘‘నేను ఎంత పెద్దదాన్ని అయినా చిన్నపిల్లనే అని నువ్వే అంటావుగా మమ్మీ. మరి మళ్లీ అదేం ప్రశ్న’’ అంటూ కన్ను కొట్టింది డోనా. కూతురి చిలిపి చేష్టకి నవ్వేసింది తల్లి.కానీ పాపం వారికప్పుడు తెలియదు. ఏ బొమ్మ వారిద్దరినీ అంత నవ్వించిందో, అది తర్వాత తమను చాలా ఏడిపించ బోతోందని!
        
 ‘‘డోనా... డోనా... లే డోనా’’
 ఉలిక్కిపడి లేచి కూర్చుంది డోనా. మంచి నిద్రలో ఎవరు తనని పిలిచారో ఒక్కక్షణం అర్థం కాలేదు. కళ్లు నులుముకుని చూసింది. మంచానికి ఎదురుగా నిలబడింది తన రూమ్మేట్, స్నేహితురాలు యాంజీ.
 ‘‘ఏంటి యాంజీ... ఏమైంది? నిద్రపోలేదా’’ అంది డోనా మంచం దిగుతూ.
 ‘‘నిద్రపోయాను. కానీ ఎవరో గొంతు నొక్కినట్టు అనిపిస్తే భయపడి లేచాను.’’
 ‘‘గొంతు నొక్కారా? నేను నీకంటే ముందే నిద్రపోయాను. ఇంకెవరున్నారు రూమ్‌లో?’’ అంది అయోమయంగా.
 ‘‘బొమ్మ.. నీ బొమ్మే నా పీక నొక్కింది.’’
 
 ‘‘వ్వాట్’’... అరిచినట్టే అంది డోనా. ‘‘బొమ్మ నీ పీక నొక్కిందా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి యాంజీ?’’
 ‘‘నాకు తెలుసు. అదే నన్ను చంపబోయింది. నువ్వు పడుకున్నప్పుడు దాన్ని నీ పక్కనే పెట్టుకున్నావు కదా! కానీ ఇప్పుడది నా మంచమ్మీద ఉంది. కావాలంటే చూడు’’... అంటూ తన మంచం వైపు చూపించింది యాంజీ. చూసి ఉలిక్కిపడింది డోనా. నిజమే. తన బొమ్మ యాంజీ మంచమ్మీద ఉంది. అక్కడికెలా వెళ్లింది?
 ‘‘నువ్వు ఏమైనా అనుకో డోనా. ఈ బొమ్మ వచ్చినప్పట్నుంచీ మనకి మనశ్శాంతి లేకుండా పోయింది. జీవితం నరకమైపోయింది. దయచేసి దీన్ని ఎక్కడైనా పారెయ్. ఇంకో క్షణం ఇది ఇక్కడున్నా నేను ఈ రూమ్‌లో ఉండను’’ అరిచినట్టే అంది యాంజీ.
 
 ‘‘అది కాదు యాంజీ... అది కేవలం ఒక బొమ్మ. దాని గురించి నువ్విలా...’’
 ‘‘అది బొమ్మ కాదు. రాక్షసి. మనల్ని ఏదో ఒకటి చేసిగానీ వదలదు. ఏదైనా జరిగిన తర్వాత బాధపడే బదులు ముందే మేలుకో’’ అనేసి విసవిసా వెళ్లి ముసుగు తన్ని పడుకుంది యాంజీ.
 డోనా మనసు చివుక్కుమంది. అది తన పుట్టినరోజుకి మమ్మీ ఇచ్చిన బహుమతి. దాన్ని పారేయడమంటే, అమ్మ ఆశీర్వాదాన్ని వదులుకున్నంత బాధ తనకి. కానీ యాంజీ ఏమో పదే పదే ఆ బొమ్మ మీద కంప్లయింట్ చేస్తోంది. అది కదులుతోందట. కాలేజీకి వెళ్లి వచ్చేసరికి పెట్టిన చోట కాకుండా వేరే చోట ఉంటోందట. యాంజీ నోట్‌బుక్‌లో ఏవో పిచ్చి రాతలు రాస్తోందట. ఇలా ఏవేవో చెప్తోంది తను. ఒక బొమ్మ ఇలా చేయ గలదా ఎక్కడైనా! అమెరికా లాంటి అభి వృద్ధి చెందిన దేశంలో ఉండి, చదువుకుని కూడా ఇలాంటివి ఎలా నమ్మడం!
 
 ఇలానే ఆలోచించింది డోనా. అలా చాలా రోజులు ఆలోచిస్తూనే ఉండి పోయింది. అదే ఆమె చేసిన తప్పు. యాంజీ గొడవ చేసిన రోజునే  బొమ్మను వదిలించు కుని ఉంటే, కొన్ని భయంకర అనుభవాలను చవి చూడాల్సి వచ్చేది కాదు వాళ్లకి. డోనాకి లో అనే ఫ్రెండ్ ఉన్నాడు. తను అప్పుడప్పుడూ డోనా రూమ్‌కి వచ్చేవాడు. అయితే ఆ బొమ్మ వచ్చిన తర్వాత అతడికి రూమ్‌కి రావడానికే భయం పట్టుకుంది. ఎందుకంటే వచ్చి నప్పుడల్లా అతనికి ఏదో ఒక చెడు జరిగేది. ఊహించని విధంగా కాలికో చేతికో దెబ్బ తగిలి రక్తం వచ్చేది. లేదంటే ఉన్నట్టుండి తల పగిలిపోయేంత తల నొప్పి వచ్చేది. ఒళ్లంతా ఎవరో కొట్టినట్టు దెబ్బలు తేలేవి. తర్వాత అవే మాయమై పోయేవి. మొదట్లో ఏం జరుగుతోందో అర్థమయ్యేది కాదు. కానీ ఎప్పుడైతే బొమ్మ కదలడం, తనని చూసినప్పుడు దాని ముఖం వికృతంగా మారడం గమనించాడో... అదంతా బొమ్మ వల్లే అని తెలిసి వచ్చింది. వెంటనే డోనాతో చెప్పాడు కానీ ఆమె నమ్మలేదు. అయితే ఆమె నమ్మే రోజు ఎట్టకేలకు వచ్చింది.
 
 ఒకరోజు సాయంత్రం డోనా, యాంజీ కాలేజీ నుంచి వచ్చేసరికి డోనా మంచం మీద ఉన్న దుప్పటి, దిండు కవర్లు రక్తపు మరకలతో ఉన్నాయి. మొదట ఏదైనా రంగు ఒలికిందేమో అనుకున్నారు. కానీ కడుపులో తిప్పేలా వెగటు వాసన రావడంతో ఆ రంగు రక్తం వల్ల వచ్చిందని అర్థమైంది. హడలిపోయారు ఇద్దరూ. అది బొమ్మ పనే అని యాంజీ అనడంతో బొమ్మను పరిశీలించింది డోనా. బొమ్మ చేతులకు, గౌను మీద, చివరికి ఆమె పెదవుల నిండా కూడా రక్తమే. అదిరి పడింది డోనా. ఇన్నాళ్లూ యాంజీ, లో చెప్పినదంతా నిజమేనని అప్పటికి అర్థమైంది ఆమెకి. కానీ అంత రక్తం ఎక్కడి నుంచి వచ్చింది, ఏం జరిగింది అనేది మాత్రం అంతు పట్టలేదు.
 ఇక ఆలస్యం చేయలేదు డోనా. ప్రముఖ పారానార్మల్ డిటెక్టివ్స్ అయిన ఎడ్, వారెన్ దంపతులను రమ్మంది. ఆనబెల్‌ను వారి చేతుల్లో పెట్టింది. వాళ్లిద్దరూ డోనా బొమ్మపై పరిశోధనలు చేశారు. ఆ బొమ్మలో ఓ చిన్నపిల్ల ఆత్మ ఉందని కనిపెట్టారు. ఇంతకీ ఆ ఆత్మ ఎందుకు వచ్చిందో తెలుసా... డోనా కోసం!
    
 ‘‘ఏమంటున్నారు సర్. ఆ ఆత్మ నాకోసం వచ్చిందా?’’... షాకైపోయి అడిగింది డోనా.
 ‘‘నమ్మడం కష్టమైనా ఇది నిజమే డోనా. నీకు ఆనబెల్ గుర్తుందా?’’... అడిగింది వారెన్.
 ‘‘ఆనబెల్... అంటే మా ఊరిలో, మా అపార్ట్‌మెంట్లో ఉండేది. తనే కదా?’’
 అవునన్నట్టు తలూపింది వారెన్. ‘‘అవును... తనే. ఈ బొమ్మలో ఉన్నది తన ఆత్మే.’’
 అవాక్కయ్యింది డోనా. అలాంటి మరిన్ని నిజాలను ఎడ్, వారెన్‌లు చెప్తుంటే ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయింది.

 డోనా వాళ్ల అపార్ట్‌మెంట్‌లో ఏడేళ్ల పాప ఉండేది. తన పేరు ఆనబెల్ హిగ్గిన్స్. పాపం తనని ఎవరో చంపేశారు. దాంతో ఆమె దెయ్యమైంది. డోనా పుట్టినరోజుకి గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ల అమ్మ బొమ్మను కొని ఇంటికి తెచ్చినప్పుడు ఆనబెల్ ఆత్మ అందులో ప్రవేశించింది. తర్వాత ఆ బొమ్మ ద్వారా డోనా దగ్గరకు చేరింది. అయితే డోనాకి చెడు చేయాలనే ఉద్దేశం ఆనబెల్‌కి లేదు. పైగా డోనా అంటే తనకి చాలా ఇష్టం. తనతోనే ఎప్పటికీ ఉండా లన్నది ఆమె ఆశ. అందుకే యాంజీ, లో డోనాకి సన్నిహితంగా ఉంటే తట్టుకోలేక పోయేది. వాళ్లని చాలా ఇబ్బంది పెట్టేది. ఎడ్, వారెన్ చెప్పిన ఈ విషయాలను నమ్మలేకపోయింది డోనా. ఇలాంటివి చాలా సినిమాల్లో చూసింది. పుస్తకాల్లో చదివి ఎంజాయ్ చేసింది. కానీ తనను వెతుక్కుంటూ ఓ ఆత్మ వచ్చిందనేసరికి భయంతో వణికిపోయింది. ఆనబెల్‌ను తన నుంచి దూరం చేయమని కోరింది.
 
 ఎడ్, వారెన్‌లు ఆనబెల్ ఆత్మ ఉన్న బొమ్మను ఓ సంచిలో పెట్టి గట్టిగా కట్టే శారు. దాన్ని తీసుకెళ్లి కనెక్టికట్ ప్రాంతంలో ఉన్న తమ మ్యూజియంలో... ఓ గాజు పెట్టెలో బంధించారు. ఆ బొమ్మ ఇప్పటికీ అక్కడే ఉంది. అందులో ఆనబెల్ ఆత్మ కూడా ఇప్పటికీ ఉందని అంటుంటారు. అది నిజమో కాదో తెలియదు. తెలుసు కునే ధైర్యం కూడా ఎవరికీ లేదు!     
     
 వారెన్ మ్యూజియమ్‌లో ఆనబెల్‌ను బంధించిన గాజు పెట్టె మీద ఓ హెచ్చరిక ఉంటుంది... పెట్టెను తెరవొద్దు అని. కానీ ఓసారి ఓ వ్యక్తి దాన్ని నిర్లక్ష్యం చేశాడు. పెట్టెను తెరిచి ఆనబెల్‌ను తాకి మరీ చూశాడు. మ్యూజియం నుంచి ఇంటికి వెళ్లే దారిలో యాక్సిడెంట్ అయ్యి అతడు దుర్మరణం పాలయ్యాడు. దాంతో తర్వాత మరెవ్వరూ అలాంటి దుస్సాహసం చేయలేదు. డోనా, ఆనబెల్‌ల మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా ఆనబెల్, ద కన్జ్యూరింగ్ లాంటి కొన్ని సినిమాలు తెరకెక్కాయి. వాటిలో ఆనబెల్ ఆత్మ ఉన్న బొమ్మ లాంటి బొమ్మని తయారుచేసి వాడారు తప్ప నిజమైన బొమ్మను వాడే ధైర్యం ఏ దర్శకుడూ చేయలేదు. ఆనబెల్ అంటే ఉన్న భయం అలాంటిది మరి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement