
తపాలా: గార్డెన్లో ‘కాళింగ మర్దనం’
మా పండుకు అప్పుడు మూడేళ్లు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని హడావుడిగా చేస్తూ, ఇల్లంతా తిరుగుతూ ఉండేది.
అలాంటిది ఒకరోజు చాలాసేపటినుంచీ కనిపించ లేదు. ఎటువంటి శబ్దాలూ లేవు. ‘‘ఎక్కడున్నావురా పండూ?’’ అని పిలిచాను. అది చెప్పిన సమాధానం విని తూలిపడబోయి నిలదొక్కుకున్నాను. ‘‘అమ్మా! నేనిప్పుడు కాళింగుడు పాముని చంపేస్తున్నాను.’’
ఏ పాముని పట్టుకుందో ఏమో అనుకుంటూ గార్డెన్‌లోకి పరుగుతీశాను. చూస్తే అక్కడ పాము ఏమీ లేదు. పామెక్కడ అని అడిగితే, తన పాదం పక్కకు జరిపి చూపించింది. అక్కడ ఒక చిన్న మిల్లీపొడ్ (రోకలిబండ అనే పురుగు) ఉంది. అది పాములాగా కనిపించేసరికి ఈమె అంతకుముందురోజే వాళ్ల అమ్మమ్మ చెప్పిన కాళింగుడు - కృష్ణుడు కథలోని కృష్ణ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసిందన్నమాట!
మా పిల్లల తీపిగుర్తులు మళ్లీ ఇలా రీవైండ్ చేసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.
- డా॥సి.ఎం.అనూరాధ,
అనంతపురం
ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి.
మా చిరునామా: తపాలా, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1,
రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com