ఆదర్శ దేశం
అదిగో అల్లదిగో... అల్జీరియా
ఆఫ్రికా, అరబ్ దేశాల్లో అతి పెద్ద దేశం అల్జీరియా. దీనికి ఈశాన్యంలో టునీషియా, తూర్పులో లిబియా, దక్షిణంలో మొరాకో దేశాలు ఉన్నాయి. ఉత్తర ఐరోపాకు అల్జీరియా ఎక్కువ మొత్తంలో సహజవాయువులను సరఫరా చేస్తుంది. ఆఫ్రికాలో చమురు నిల్వలు అధికంగా ఉన్న దేశాల్లో అల్జీరియా రెండవ స్థానంలో ఉంది. సుదీర్ఘ కాలం పాటు ఈ దేశం ఫ్రెంచ్ అధీనంలో ఉంది. ఆ కాలంలో ఫ్రాన్సు నుంచి ఎంతో మంది అల్జీరియాకు వచ్చి ఎన్నో నగరాల్లో స్థిరపడ్డారు. ఈ ప్రభావంతో అల్జీరియా సంస్కృతి, ఆర్థికవ్యవస్థ, సమాజంపై ఫ్రెంచ్ ప్రభావం బలంగా కనిపిస్తుంది.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రాన్సుకు వ్యతిరేకంగా ఎందరో నాయకులు తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఫ్రెంచ్ పాలనకు వ్యతిరేకంగా రకరకాల గ్రూపులు ఒక్కటయ్యాయి. ముఖ్యంగా ‘అల్జీరియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ ‘నేషనల్ లిబరేషన్ ఫ్రంట్’ ఏర్పాటుతో అల్జీరియా చరిత్ర కీలకమైన మలుపు తిరిగింది. 1962లో ఫ్రాన్స్ నుంచి అల్జీరియాకు స్వాతంత్య్రం వచ్చింది. వేలాది మంది అల్జీరియాను వదిలి తమ సొంతదేశం వెళ్లిపోయారు. ఫ్రాన్స్‌తో జరిగిన పోరులో అల్జీరియా బాగా దెబ్బతిన్నది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. నిరుద్యోగం బాగా పెరిగిపోయింది.
1962 జూలై 1న అల్జీరియాలో జరిగిన రెఫరెండం ద్వారా కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
ఈ పరీక్షా సమయంలో అధైర్యపడకుండా, నిరాశపడకుండా ప్రజలందరూ ఐకమత్యాన్ని ప్రదర్శించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి పూనుకున్నారు.
పట్టుదల, నిబద్ధతతో ఆఫ్రికాలోని ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది అల్జీరియా. అయితే జీవవైవిధ్యంలో మాత్రం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అంతరించి పోయే ప్రమాదంలో ఉన్న మొక్కలు, పక్షులు, జంతువుల విషయంలో తగిన ప్రణాళికలను రూపొందిస్తుంది.
ఆధునిక అల్జీరియా సాహిత్యంపై అరబిక్, ఫ్రెంచ్ ప్రభావం బలంగా ఉంది. అల్జీరియా సంగీతం ‘రాయ్’కి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. క్రీడా రంగంలో ప్రతిభ చూపుతున్న ఆఫ్రికాలోని ముఖ్యమైన దేశాలలో అల్జీరియా ఒకటి. ఎందరో వరల్డ్ ఛాంపియన్‌లు, ఒలింపిక్ పతకాలను గెలుచుకున్న క్రీడాకారులు ఈ దేశంలో ఉన్నారు. ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, బాక్సింగ్, వాలీబాల్, బాస్కెట్‌బాల్... మొదలైనవి ఈ దేశంలో ప్రాచుర్యం పొందిన ఆటలు.
అల్జీరియాలో బహుళ పార్టీలు ఉన్నాయి. అయితే ఏ పార్టీ కూడా తనకు తానుగా అధికారాన్ని కైవసం చేసుకునే స్థితిలో లేదు. అందుకే పార్టీల మధ్య పొత్తు అనేది తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ‘నేషనల్ లిబరేషన్ ఫ్రంట్’, ‘వర్కర్స్ పార్టీ’, ‘నేషనల్ ర్యాలీ ఫర్ డెమోక్రసీ’, ‘ర్యాలీ ఫర్ కల్చర్ అండ్ డెమోక్రసీ’, ‘సొసైటీ ఫర్ పీస్’... మొదలైనవి అల్జీరియాలో ప్రధాన రాజకీయ పార్టీలు.
టాప్ 10
1. అల్జీరియా జాతీయపతాకంలో ఎరుపు రంగు ప్రజల త్యాగాన్ని, ఆకుపచ్చ రంగు ప్రకృతిని, తెలుపు రంగు శాంతిని ప్రతిబింబిస్తాయి.
2. ప్రఖ్యాత రచయిత అల్బర్ట్ కామూ అల్జీరియాలోని కోస్తా పట్టణం మండోవిలో జన్మించారు.
3. అధికార భాష అరబిక్‌తో పాటు దేశంలో ఫ్రెంచ్ భాష ఎక్కువగా మాట్లాడతారు. స్థానిక మాండలికం ‘దర్జా’ను అరవైశాతం మంది మాట్లాడతారు.
4. సహారా ఎడారిలో కనిపించే ‘ఫెనిక్ ఫాక్స్’ అల్జీరియా జాతీయ జంతువు.
5. అతిథికి ఖర్జూరాలు, పాలు ఇచ్చి స్వాగతం పలకడం అల్జీరియాలో సంప్రదాయం.
6. అల్జీరియాలో పొడవైన నది... చెలిఫ్.
7. వ్యవసాయ ప్రాంతాలలో ‘ల టోయిజ’ పేరుతో జరిగే ఉత్సవంలో రైతులకు సహాయంగా ప్రజలు స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తారు.
8. ఆఫ్రికా దేశాలలో అల్జీరియా అతి పెద్ద రక్షణ బడ్జెట్ కలిగిన ఉన్న దేశం.
9. ‘అల్జీర్స్’ అనే నగరం పేరు నుంచి దేశానికి ‘అల్జీరియా’ అనే పేరు వచ్చింది.
10. అల్జీరియా తొలి అధ్యక్షుడు అహ్మద్ బెన్ బెల్లా. అయితే రెండు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాడు.