
గోధూళి కాలం
ఈ దృశ్యం దక్షిణ జర్మనీలోని కొనిగ్సీ సరస్సు ఒడ్డున గల షనాఫ్ గ్రామంలోనిది. ఈ యువతీయువకులు తమ ఆలమందల్ని కొండనుంచి దిగువకు తోలుకొస్తున్నారు. ఈ వేడుకను వారు ‘ఆల్మాబ్‌ట్రీబ్’ అంటారు. ఆల్ప్స్ పర్వత దేశాలైన ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, జర్మనీల్లో వేసవికాలంలో పశువులన్నీ ఆల్ప్స్ మైదానాల్లో గడ్డిమేస్తాయి. ఎండలు చల్లబడగానే తిరిగి లోయకు వచ్చేస్తాయి.
తెగ జీవితం
ఈ సంప్రదాయ విందు దృశ్యం యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబూదబీలో జరిగిన ‘ఇంటర్నేషనల్ హంటింగ్ అండ్ ఈక్వెస్ట్రియన్ ఎగ్జిబిషన్’లోనిది. రకరకాల కారణాలవల్ల తమ సంప్రదాయ జీవనశైలికి దూరమైన ఎమిరాటి ప్రజలు తిరిగి తమ తెగ, బదావియన్(ఎడారి జీవనశైలి) మూలాల్లోకి మరలాలన్న ప్రయత్నంలో ఉన్నారు.
రాజనృత్యం
ఫొటోలోని ఈ బాలికల ప్రదర్శన ఇండోనేషియాలోని సంబవ ద్వీపంలో జరిగిన ‘క్రాటన్ నూసాంతర’ ఉత్సవాల్లోనిది. ఇండోనేషియా ఎన్నో ద్వీపాలసమూహం. ప్రభుత్వ లెక్క ప్రకారం 8,844 చిన్నాపెద్దా దీవులున్నాయి. వీటన్నింటినీ ఎందరో సుల్తాన్లు పాలించారు. తమదేశ ఘనసంస్కృతిలో ఒకప్పుడు భాగమై, ఇప్పుడు క్రమంగా క్షీణిస్తున్న రాజవంశాల ప్రాబల్యాన్ని నిలుపుకోవడం ఎలాగనే ప్రధాన లక్ష్యంతో ఈ వేడుకలు రెండేళ్లకోసారి జరుగుతాయి. ద్వీపాల్లోని 82 సామ్రాజ్యాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు ఉత్సవంలో పాల్గొన్నారు.