అడ్డాకుల/భూత్పూర్ : పశువుల ఎముకలతో ఎలాంటి అనుమతులు లేకుండానూనె తయారు చేస్తున్నారు. తద్వారా వచ్చే కలుషితనీరు, దుర్గంధభరిత వాసనను భరిం చలేక సమీప గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఐదేళ్లుగా ఈ అక్రమదందా కొనసాగుతోంది. స్థానికుల ఫిర్యాదుల మేరకు బుధవారం ఉదయం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కంపెనీపై దాడిచేసి.. నిర్వహణకు ఇచ్చిన పత్రాలను పరిశీలించారు. భూత్పూర్ మండలం తాటికొండ శివారులో ఉన్న లిబర్టీ ప్రొటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొనసాగుతున్న ఈ కంపెనీని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీచేశారు.
ఎముకలతో తయారు చేసిన నూనెను పరిశీలించారు. అడ్డాకుల, భూత్పూర్ మండలాలకు చెందిన తహశీల్దార్‌లు జె.రాంకోటి, జె.పాండు, ఎస్‌ఐలు ముత్తినేని వెంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి, అడ్డాకుల జెడ్పీటీసీ సభ్యుడు జి.రామన్‌గౌడ్‌తో కలిసి కంపెనీని పరిశీలించారు. ఎమ్మెల్యే లోపలికి వెళ్లడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు వెంటనే పరారయ్యారు. కంపెనీలో కలి య తిరిగిచూడగా గుట్టలు పేరుకుపోయిన జంతువుల ఎముకలు, వీటి ఆధారంగా తయారుచేసే ఆయిల్, మహిళలు ధరించే పూసలు కనిపించాయి.
ఈ కంపెనీలో అస్సాంకు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. కంపెనీకి సరైన అనుమతి పత్రాలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కంపెనీని సీజ్‌చేసి విచారణ చేపట్టాలని తహశీల్దార్‌లను ఆదేశించారు. అదేవిధంగా దాని పక్కన టైర్లతో ఆయిల్ తయారుచేసే మరో కంపెనీని ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించడం లేదని తెలిసి యజమానిపై మండిపడ్డారు. దీనిపై కూడా విచారణకు ఆదేశించారు. మూడు గంటల పాటు తీవ్ర దుర్గంధంలో కంపెనీలను పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట తాటికొండ సర్పంచ్ శ్రీధర్‌రెడ్డి, నాగార్జున్‌రెడ్డి, ఇంద్రయ్యసాగర్, శివరాములు, నర్సింహారెడ్డి, నారాయణగౌడ్, మురళీధర్‌గౌడ్, మద్ద తిరుపతయ్య యాదవ్ ఉన్నారు.
నకిలీ అనుమతిచ్చిన కార్యదర్శి..!
ఎముకలతో నూనె తయారీ కంపెనీ నిర్వాహణకు తాటికొండ సర్పంచ్ శ్రీధర్‌రెడ్డి సంతకం లేకుండా 2014 ఏప్రిల్ 10న అప్పటి పంచాయతీ కార్యదర్శి నకిలీ వృత్తి వ్యాపార లెసైన్స్‌ను జారీ చేశారు. దీన్ని గుర్తించిన ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి కార్యదర్శి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గుట్టల సమీపంలో ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేసుకోవడంతో పాటు గుట్టల నుంచి కలపను అక్రమంగా వాడుకుంటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. కల్తీనూనె వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడనుందని, నూనె విక్రయాలపై కూడా అధికారులు దృష్టి సారించాలని కోరారు.
ఎముకలతో నూనె తయారీ
Published Fri, Aug 29 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement
Advertisement