
అత్యున్నత ఆదర్శవాది!
మహారాష్ర్టలోని మారుమూల పల్లెటూరు రాలేగావ్ సిద్ధిలో జన్మించిన కిషన్ బాబూరావ్ హజారే... అన్నా హజారేగా మారడం వెనుక ఆయన నమ్మిన విలువలు, ఆచరించే ఆదర్శాలు, వివేకానందుని స్ఫూర్తి, గాంధీ మార్గం, దాదాపు నాలుగు దశాబ్దాల జీవితం ఉంది
విశ్లేషణం
అన్నాహజారే... స్వాతంత్య్ర పోరాటం తర్వాత జాతిని కదిలించిన ఒకే ఒక్కడు. యువతలో పోరాట స్ఫూర్తిని నింపిన భారతీయుడు. గ్రామ స్వరాజ్యంపట్ల ఆయనకున్న విజన్, సమాజం పట్ల చిత్తశుద్ధి ఆయనను దేశానికే అన్నా (తండ్రి)గా నిలిపాయి.
మహారాష్ర్టలోని మారుమూల పల్లెటూరు రాలేగావ్ సిద్ధిలో జన్మించిన కిషన్ బాబూరావ్ హజారే... అన్నా హజారేగా మారడం వెనుక ఆయన నమ్మిన విలువలు, ఆచరించే ఆదర్శాలు, వివేకానందుని స్ఫూర్తి, గాంధీ మార్గం, దాదాపు నాలుగు దశాబ్దాల జీవితం ఉంది. గ్రామ స్వరాజ్యంపట్ల అన్నాకు ఓ విజన్ ఉంది. అది ఆయన మాటల్లో, చేతల్లో స్పష్టంగా కనబడుతుంది. అన్నా మాట్లాడేటప్పుడు గమనించండి... ఆయన చేతి కదలికలు కంటికంటే పై స్థాయిలో ఉంటాయి. అవి ఆయనది విజువల్ వ్యక్తిత్వమని చెప్తాయి. ఈ వ్యక్తిత్వమున్నవారు చురుగ్గా ఉంటారు, విలువలు పాటిస్తారు, అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటారు. ఏదైనా పని పూర్తికాకపోతే, లక్ష్యం సిద్ధించకపోతే సహించలేరు. ఈ అసహనం అన్నా వ్యక్తిత్వంలో మనం గమనించవచ్చు. అన్నా మాట్లాడేటప్పుడు తరచూ తన హృదయాన్ని తాకుతారు, అరచేతులను అభయహస్తంలా చూపుతారు. అంటే ఆయన మనసులో ఉన్నదే మాట్లాడుతారని, ఓపెన్‌గా ఉంటారని అర్థమవుతుంది. అయితే చూపుడువేలును చూపిస్తూ మాట్లాడటం ఆయనలోని బెదిరింపు తత్వానికి, నిరంకుశ ధోరణికి అద్దం పడుతుంది. అన్నా తరచుగా పిడికిలి బిగించడం గమనించారా? అవి ఆయనలోని ఆవేశానికి, చిత్తశుద్ధికి ప్రతీకగా నిలుస్తాయి. బిగించిన పిడికిలి శరీరాన్నీ, మనసునూ పోరాటానికి సన్నద్ధం చేస్తుంది. ఆ పోరాటపటిమ అన్నాలో స్పష్టంగా గమనించవచ్చు.
మొదట లోపాలనే చూస్తాను...
బాడీ లాంగ్వేజ్‌తోపాటు మాట్లాడే మాటలు కూడా వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. అన్నా మాటలు గమనిస్తే ఆయన వ్యక్తిలోనైనా సమాజంలోనైనా మొదట లోపాలనే చూస్తారని, ఆ తర్వాతే సానుకూలాంశాలను గ్రహిస్తారని తెలుస్తుంది. కావాలంటే ఈ మాటలు చూడండి: - ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం రాలేదు. కేవలం తెల్లవారి స్థానంలో నల్లవారు వచ్చారంతే. - స్పందనలేని ఈ నాయకుల చేతుల్లో దేశం ఏమవుతుందోనని భయంగా ఉంది. కానీ జనశక్తితో వారిని మార్చగలం. - గ్రామ స్వరాజ్యం లేకుండా మనదేశం అభివృద్ధి చెందడం అసాధ్యం. ఆ స్వరాజ్యం సామాన్యుని భాగస్వామ్యం, సామాజిక నిబద్ధత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వీటన్నింటిలోనూ ఆయన మొదట నెగెటివ్ కోణాన్ని ప్రస్తావించి, ఆ తర్వాతే పరిష్కారం గురించి చెప్పారు. తన సన్నిహిత సహచరుడు కేజ్రీవాల్ రాజకీయ పార్టీ పెట్టడాన్ని మొదట వ్యతిరేకించినా, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని ఆహ్వానించడం కూడా ఇలాంటిదే.
తీవ్ర ఆదర్శవాది
అన్నా... తాను నమ్మిన విలువలకోసం, తన ఊరికోసం, సమాజంకోసం వివాహాన్నే త్యాగం చేసిన ఆదర్శమూర్తి. అంతేకాదు ఆ ఆదర్శాలను మరువకుండా కొనసాగించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. కాకపోతే ఆయన కొంత తీవ్రమైన ఆదర్శవాది. తాను ఆచరించే ఆదర్శాలను అందరూ పాటించాలని కోరుకుంటాడు. అందులో సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించడు. వ్యక్తుల ఇష్టాయిష్టాలను పట్టించుకోడు. అవి తన ఆదర్శాలు మాత్రమేనని, అందరూ పాటించాల్సిన అవసరం లేదని గుర్తించడు. తన ఆదర్శాలను ఇతరుల మీద రుద్దడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని అంగీకరించడు. ఆదర్శాలు పాటించనివారిని శిక్షించాలంటాడు. అందుకు అవసరమైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి కూడా వెనుకాడడు. శరద్‌పవార్‌పై దాడి జరిగినప్పుడు... ఒక్క దెబ్బేనా? అని వ్యాఖ్యానిస్తాడు. ప్రధాని కావడానికి ఒకరోజు గుడిసెలో గడిపితే సరిపోదని రాహుల్‌గాంధీని ఎద్దేవా చేస్తాడు. ఇవన్నీ ఆయనలోని తీవ్ర ఆదర్శ ధోరణికి నిదర్శనం. కానీ ఈ లోపాలన్నీ సూర్యునిలాంటి ఆయన ఆదర్శజీవనం ముందు మిణుగురు పురుగుల్లా తేలిపోయాయి.
- విశేష్, సైకాలజిస్ట్