కేతు విశ్వనాథరెడ్డి
‘దానాల్లో కల్లా అన్నదానం గొప్పద’ంట! ‘పెట్టే చెయ్యిని కరవకూడద’ంట! ‘చేసుకున్నోళ్లకి చేసుకున్నంత మహాదేవ’ అంట! మా తాత రోజుకు పదిసార్లన్నా యీ సామెతలను చెపుతాడు. అందుకేనేమో మా అమ్మా చెప్పింది - ఒకరికింత పెట్టడం వల్లనే తాత ఇంత ఆస్తి సంపాదించాడని. మా తాతకు చాలా పెద్ద ఆస్తి ఉంది. నిచ్చెనమెట్ల వెంకటేశం అంటే మా ప్రొద్దుటూర్లో తెలియనివాళ్లుండరు. మా తాతను అందరూ కోటీశ్వరుడని అంటారు. మా తాత మాత్రం ‘నాదేముందర్రా నా కంటే కుబేరులుండగా’’ అంటాడు.
మా తాతకు పెద్ద బజార్లో చాలా పెద్ద సరుకుల అంగడి ఉంది. వూళ్లో కల్లా పెద్ద బట్టలషాపుంది. చిన్న బజార్లో రెండు బ్రాందీ షాపులున్నాయి. మందుల షాపుంది. బస్టాండు దగ్గర పెట్రోలు బంకుంది. ఒక ఆయిలు మిల్లుంది. ఒక పత్తి జిన్నింగ్ మిల్లుంది. పెద్ద కమీషను మండీ ఉంది. ఒక సినిమా హాలు కూడా కడుతున్నారు. మా తాత చెప్పే కుబేరులకు మా తాత కంటే ఇంకా యేమేమి ఉంటాయో?మా నాయన చనిపోకముందు మా అమ్మ కూడా తిరిపెగాళ్లకు లేదనకుండా అన్నం పెట్టేది.
మాకెందుకు మా తాతలాగా ఆస్తి రాలేదో నాకు తెలియదు. మా తాత నా మాదిరి అయిదో తరగతే చదివినాడు. మా నాయన బి.ఎ. చదివినాడు. యిది నేను మా అమ్మతో అంటే, ‘‘మీ నాయనకు బతికేది తెల్దు’’ అంది.‘‘మరి నువ్వు లేదనకుండా ఒకరికి పెట్టిన దానివేనే?’’ అని అడిగినా.‘‘పోయిన జన్మలో యేం పాపం చేసినానో? అంతా మన ఖర్మ’’ అంది.మా అమ్మ మాట్లాడితే జన్మ, పాపం, పుణ్యం, కర్మ అంటుంది. నాకేమీ అర్థం కావు.
అప్పటికి నాకు తెలిసిన విషయాలు: మా నాయన నా చిన్నతనంలోనే పోయినాడు. యే ఉద్యోగంలోనూ నాలుగు రోజులు కుదురుగా లేడంట! ముక్కుకు సూటిగా పోవడమేనంట! వున్న కాస్త ఆస్తీ మా నాయనకు వచ్చిన జబ్బుకోసం ఖర్చు అయిందట! అదెంత జబ్బో నాకు తెలియదు. మా అమ్మ మా తాత తమ్ముడి కూతురు. మా నాయన పోయినాక, మాకెవరూ దిక్కులేరు. వెంకటేశం తాతే మమ్మల్ని దగ్గరకు తీసినాడు. మా తాతకు మేము చాలా రుణపడి వున్నామని మా అమ్మ అంటూ ఉంటుంది. రుణం అంటే బాకీ. నిజానికి మా తాతకు మేమేమీ బాకీలేము. మా తాతే మాకు బాకీ.
తాత వాళ్ల యింట్లో పని అంతా చేసేది మా అమ్మే. అందరికీ వంట చేసేది అమ్మే.
ఒక అత్త ఎప్పుడూ మంచం దిగదు. అదేం రోగమో! డాక్టరు దగ్గరకు పోయేటప్పుడు మాత్రం బాగా సింగారించుకుని పోతుంది. మిగతా ఇద్దరు అత్తలూ ఒక్క పని ముట్టుకోరు. రోజుకు నాలుగైదుసార్లు అద్దం ముందు నిలబడటం, కుట్లు కుట్టుకోవడం, పత్రికలు చదవడం, పాటలు వినడం, యేదో ఒకటి నములుతూ ఉండడం వాళ్ల పని. మా అత్తల కొడుకులూ, కూతుర్లూ చదువుకుంటున్నారు. వీళ్లందరి పనులూ మా అమ్మే చేయాల.నేను మా తాత చెప్పే పనులు, మామలు చెప్పే పనులూ చేయాల.మా తాత వాళ్లింటికి వచ్చిన మొదట్లో నన్ను కమీషను మండీలో పెట్టినారు. నా పని ఆఫీసు వూడ్చడం, టీలూ, కాఫీలూ తేవడం. నాకప్పుడు పదకొండేండ్లు.
మా మామ పరుపుల మీద వేసిన దిండ్లకు ఆనుకుని కూర్చునేవాడు. రెండు ఫోన్లలోనూ మాట్లాడుతూ ఉండేవాడు - హిందీలో, తెలుగులో. బొంబాయి సేట్లు వచ్చిపోతూ ఉండేవాళ్లు. కమీషను వ్యాపారంలో, మాటలతోనే చాలా డబ్బు వస్తుందని తర్వాత తెలిసింది. రాత్రిపూట పొద్దుపోయినాక మా మామ దగ్గరికి ఎవరో వచ్చేవాళ్లు. నేను బ్రాందీ తెచ్చేవాణ్ని. గంగమ్మ గుడి దగ్గర నుంచీ ‘కడ్డీ చియ్యలు’ తెచ్చేవాణ్ని. యింట్లోకి మాంసం తేకూడదు. మామ బయటే రాత్రిళ్లు తినేవాడు. మా తాతది అంతా పెద్ద నిష్ఠ. నిష్ఠ అంటే పూజలు గీజలూ అవీ కదా!
రెండేండ్ల తర్వాత నన్ను ఆయిలుమిల్లు ఆఫీసులో పెట్టినారు. నా పని ఆఫీసులో వాళ్లు చెప్పిన పనులు చేయడం. అప్పుడప్పుడూ హైస్కూలుకు పోయే వాళ్లను చూసి నాకు చదువుకోవాలని ఉండేది. అమ్మతో ఆ మాట అంటే ‘‘చదువుకొని మీ నాయనేం సంపాయించినాడు? వ్యాపారంలో అయితే ఎంతన్నా మీ తాత మాదిరి సంపాయించవచ్చు. బుద్ధిగా పని నేర్చుకో. మీ తాతకు మనసుపడి గురి కుదిరితే పని నేర్పుతూనే వ్యాపారంలో భాగం పెడతాడు. నువ్వు పైకి వస్తావు. మన కష్టాలు గట్టెక్కుతాయి’’ అని అంటుంది.మూడేండ్ల నుంచీ నేను పని నేర్చుకుంటున్నా. ఇప్పుడిప్పుడే నన్ను తూకాలు రాయమంటున్నారు. వేరుచెనక్కాయల అవుటను రాసుకోమంటున్నారు. అన్నట్లు జ్ఞాపకం వచ్చింది. మామ తూకాలు బాగా వేస్తాడు. కాటా దగ్గర నిలబడితే అదేమో గానీ, కాయల వ్యాపారస్తులు తూకాలు తగ్గిపోయినాయని ఏడుస్తారు.
‘నమ్మినవాళ్లను మోసం చేస్తారా?’ అని అడుగుతారు. ‘నమ్మినవాళ్లను గాక నమ్మనివాళ్లను మోసం చెయ్యడమెట్లా?’ అంటాడు మా మామ. లాభాలు ఇద్దరికీ వస్తాయి. కాబట్టి ఎవరూ గట్టిగా తగాదా పడరు. అయితే కాటా తూకం సంగతి వ్యాపారస్తులకు తప్ప, రచయితలకు తెలియదు. వాళ్లకు ఇంటి దగ్గర కాటాలు ఉండవు. అన్నీ గుడ్డి లెక్కలే. పైగా చాలామంది రయితులు తమ కళ్లాల్లోనే కట్టె తూకానికి అమ్ముతారు. మిల్లుకు వ్యాపారస్తులే ఎక్కువగా వస్తారు.రోజూ అవుటను చూసే కాయలను ధర్మఖాతాలోకి వేస్తారు. సంవత్సరం సంవత్సరం పదివేలకు పైగా వస్తుంది. కంపెనీ మొత్తం మీద సంవత్సరానికి లాభంలో నూటికి రూపాయ తీస్తారు. ఆ లెక్కలు నాకింకా తెలియవు.
ధర్మఖాతా డబ్బంతా తాత తిరుపతికి పోయి ఖర్చు పెడతాడు. కొంత దేవుడి హుండీలో వేస్తాడు. కొంత ఆఫీసర్లకు ఖర్చు పెడతాడు. ప్రతి దీపావళికి అన్నదానం ఏర్పాటు చేస్తాడు. శ్రీరామనవమికి పానక పందేరం, హరికథా. ఒక సంవత్సరం తాత తనొక్కడే అమ్మవారి శాలకు యాభైవేలు ఇచ్చినాడు. ‘పుణ్యాత్ముడు’ అని పేరు తెచ్చుకున్నాడు. పోయిన దసరా రోజు ఒక కవి మా తాత మీద పద్యాలు రాసి అచ్చేసి పంచినాడు. మా వూర్లో అట్లాంటి కవులంటే మా తాతకు ఇష్టం. అట్లాంటి కవులు మా తాత దగ్గరకు వస్తూ పోతూ ఉంటారు. మా తాత పాతికా పరకా ధర్మఖాతాలో నుంచి తీసి ఇస్తాడు.
మరొక రెండేండ్లు గడిచినాయి. మా తాత వ్యాపారంలో నాకింకా భాగం పెట్టలేదు. ఆయనను అడుగుదామంటే అమ్మకూ భయమే, నాకూ భయమే.ఆ మధ్య మా తాతకు పెద్ద జబ్బు చేసింది. మంచం మీదే అన్నీ. మంచం దగ్గర అమ్మ తాతకు రోజుల తరబడి సేవలు చేసింది. ఆ రోజు తాత కళ్లనీళ్లు పెట్టుకొని ‘‘నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సుబ్బమ్మా!’’ అన్నాడు. అమ్మ ఏడ్చింది. నా దిక్కు చూసి చూసి ఏడ్చింది. తాత ఆ రోజే చచ్చిపోయినాడు. ఇంట్లో అందరికంటే మా అమ్మే ఎక్కువగా యేడ్చింది.
తాత పెద్దదినం రోజు అన్నదానం జరిగింది. అంత వీధినబడిన ఆకలిని నేనెప్పుడూ చూళ్లేదు. తాతకు ఊరి బయట తోటలో పాలరాతితో పెద్ద సమాధి. సత్రం కూడా పాలీషు రాళ్లతో కట్టించినారు. యేమైందో ఏమో, తాత పోయి సంవత్సరం తిరక్కుండానే మా మామలు భాగాలు పోయినారు. ఆస్తి పంపకం రోజు అమ్మ, మా తాత నా సంగతి ఏమైనా చెప్పి పోయినాడేమోనని మా మామలను అడిగింది. ముందు ఎవరూ ఉలకలేదు, పలకలేదు. రెండో మామ నాకు నెలకు రెండు నూర్ల జీతం ఏర్పాటు చేసినాడు. నేనూ, మా అమ్మా ఒక గుడిసె తీసుకున్నాము.మాకొక గతి చూపించి పోనందుకు వెంకటేశం తాతను అమ్మ రోజుకు ఒకసారన్నా తిట్టేది. ఆమెకు నా దిగులు పెద్దదైంది. ఎక్కడ వ్యాపారంలో ఒక పైసా భాగం పెట్టినా, నా బ్రతుకు బాగుపడేది కదా అంటుంది అమ్మ. యేం లాభం? అమ్మ తాతకు స్వంత కూతురు కాదు.
మా అత్తవైపు మార్కాపురం కుర్రవాడెవరో రావడంతో నన్ను మిల్లులోకి మార్చినారు. ఎక్స్‌పెల్లర్ల దగ్గరా, డికార్డిగేటర్ల దగ్గరా కూలోళ్లతో నేను పని చేయించాల.ఆ పనిలో చేరిన రోజే పప్పు చెరిగే ఒకామె నన్ను చూసి, ‘‘వీళ్ల తాత దరమదాత. బతికుంటే మిల్లులో యీ అయ్యకు భాగం పెట్టేవాడు’’ అని అంది.డికార్డిగేటర్ దగ్గర పనిచేసే రమణయ్య నవ్వుతూనే అన్నాడు: ‘‘తాతా ధర్మాత్ముడు కాదు, మామలూ కాదు, యీ అయ్య కూలోళ్ల మీద కూలోడు కావలసినవాడే.’’రమణయ్య ఎగతాళికి నాకు కోపం వచ్చింది. కసురుకున్నాను: ‘‘ముందు పనిగానీ, బెల్టు తెగిపోయింది చూడు’’ అంటూ.
రమణయ్య నవ్వడం మాత్రం ఆపలేదు. బెల్టు సరిచేసి అన్నాడు: ‘‘మాలో వాడివే అని సరదాగా అన్నాను. మీ తాతా మామల భాష మాత్రం నేర్చుకోవద్దు. వాళ్లు వాళ్లే. మనం మనమే.’’ నాకు మరింత కోపం వచ్చింది. కానీ రమణయ్య నవ్వు ముఖం చూస్తే నోరు పెగల్లేదు. నా కంటే రమణయ్య ఏ అయిదేండ్లో పెద్దయి వుంటాడు. మాట్లాడకుండా అక్కడ నుంచి పోయినాను.
ఆ రోజంతా రమణయ్య మాటలే జ్ఞాపకం వచ్చినాయి. రమణయ్యకూ లేదా మిల్లులోని ఇతర కూలోళ్లకూ నాకూ తేడా ఏముంది? నాకంటే రమణయ్యకు ఎక్కువ జీతం. నేను రమణయ్య కంటే యే రకంగానూ ఎక్కువ కాదు - కులంలో తప్ప. ఆ రాత్రి మా అమ్మ మామూలుగానే మా తాతమీద ఏదో సణిగింది. ఇంత భాగం పెట్టి పెళ్లి కూడా చెయ్యలేదంటూ. నాకేమైందో కానీ - మా తాతనూ, మామలనూ, డబ్బున్నవాళ్లనూ నా ఇష్టం వచ్చినట్లు తిట్టినా.ఆ రోజు తర్వాత మా అమ్మ, మా తాతను నా ముందు తిట్టడం మానేసింది. ఆ రోజు తర్వాత కూలివాళ్లను నేను కసురుకోలేదు. కూలివాళ్లను నెత్తికెక్కించుకుంటూ పని చెడగొడుతున్నానని మామ ఒకసారి కేకలు వేసినాడు.
మా అమ్మ నేను లక్షాధికారి కాకుండానే, నా పెళ్లి చూడకుండానే చనిపోయింది. నా జీతం అంతవరకు ఒక్క దమ్మిడీ పెంచని మా రంగయ్య మామ, అమ్మ పెద్దదినం రోజు ఖర్చంతా భరించినాడు. నా జీతమే పెంచి వుంటే మరింత మంచి తిండి తిని మా అమ్మ మరికొన్నేండ్లు బతికి ఉండేది. నా ఒంటరి బతుక్కు యిప్పుడు రమణయ్య తోడయ్యాడు. రమణయ్య ద్వారా నాకు చాలా విషయాలు తెలిసివస్తున్నాయి. పత్తి రాట్నాల దగ్గర పనిచేసే రమణయ్య చెల్లెలు పార్వతిని నేను పెళ్లి చేసుకున్నాను.దాంతో మా తాత కుటుంబంతో వున్న ఆ కులసంబంధం కూడా తెగిపోయింది. పెళ్లయినాక, జీతం పెంచమని అడిగాను. పిండిమిల్లు కట్టడంలో చాలా ఇబ్బందులు పడుతున్నాననీ, మిగతా వ్యాపారాల్లో నష్టాలు వచ్చినాయనీ నా జీతం పది రూపాయలు పెంచినాడు.
ఆ నెలలోనే మా తాత తద్దినం. పెద్ద సంతర్పణ. రాత్రి హరికథ.మరుసటిరోజే, ఎక్స్‌పెల్లరు దగ్గర పనిచేసే ఏసు ప్రమాదంలో చనిపోయాడు. ఏసుదే పొరపాటని తేల్చినారు. పెద్దమామ ఆఫీసర్లతో మాట్లాడినట్టు తెలిసింది. నష్ట పరిహారం కింద ఆరుమంది పిల్లలూ, యిద్దరు ముసిలోళ్లు వున్న ఏసు కుటుంబానికి వెయ్యి రూపాయలిచ్చినారు. ఏసు ఇరవై అయిదేండ్ల నుంచీ మిల్లులో పని చేస్తున్నాడు.రమణయ్య నేరుగా మా మామ - కాదు మా మిల్లు ఓనరు - నిచ్చెనమెట్ల రంగయ్య దగ్గరకు వెళ్లి, ‘‘చచ్చిపోయిన మీ నాయన ఖరీదులో వెయ్యో వంతు చెయ్యడా ఏసు?’’ అని అడిగినాడు. యింకా దులిపినాడు.
‘‘మీరు పెట్టే చెయ్యిని కరిచేవాండ్ల’’ని రమణయ్య మీద రంగయ్య కేకలు. ‘‘చేసుకున్నవాళ్లు, చేసుకున్నంత అనుభవిస్తార’’ని శాపనార్థాలు. ఆ భాషంతా అచ్చం మా తాతదే. తేలిపోయింది. రమణయ్యను వుద్యోగంలో నుంచి తీసివేసినారు. సమ్మె మొదలైంది. మిల్లును బలవంతంగా రంగయ్య మూసివేసినాడు. గొడవలు గొడవలుగా వుంది. రాయబారాలూ, రంపులూ. పనివాళ్ల తిప్పలను కళ్లారా చూసినా, అనుభవించినా.
యీలోగా ఇండస్ట్రియల్ యెస్టేటులో రంగయ్య తెరిచిన కొత్త ఇండస్ట్రీకి మంత్రి ప్రారంభోత్సవం చేసినాడు. దానిపేరు ‘నిచ్చెన మెట్ల వెంకటేశం అండ్ సన్స్ ఫ్లోర్ మిల్’. మా తాత పేరుమీదుగా సంతర్పణ, ఒక అనాథ బాలుర అన్నదాన మందిరం ఏర్పాటు చేస్తున్నట్లు సభలో ప్రకటన, ప్రశంసలూ, పద్యాలూ - రంగయ్యది తండ్రిలాగే పెట్టే చెయ్యి... వాళ్ల వంశమే కర్ణుడు, శిబిచక్రవర్తుల వంశమని.
మిల్లు మూసి మూడు నెలయింది.
వెయ్యిమంది ఆడా మగా, పెద్దా చిన్నా, పిల్లా పాపా, ముసలీ ముతకా కడుపులు చేత్తో పట్టుకుని - పండగల అన్నదానం కోసం కాదు, తద్దినాల సంతర్పణ కోసం కాదు - పనికోసం, న్యాయం కోసం... నేను అందరితో కలవడం చూసి తాత వారసులు నాకు విశ్వాసం లేదంటున్నారు. నిజమే. నేను కుక్కను గానందుకు సంతోషిస్తున్నాను.
దాంతో మా తాత కుటుంబంతో వున్న ఆ కులసంబంధం కూడా తెగిపోయింది. పెళ్లయినాక, జీతం పెంచమని అడిగాను. పిండిమిల్లు కట్టడంలో చాలా ఇబ్బందులు పడుతున్నాననీ, మిగతా వ్యాపారాల్లో నష్టాలు వచ్చినాయనీ నా జీతం పది రూపాయలు పెంచినాడు.
అన్నదాతలు
Published Sun, Feb 7 2016 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM
Advertisement
Advertisement