Ketu Vishwanatha Reddy
-
కేతు విశ్వనాథ రెడ్డి గారి తెలుగు కథలు!
నాకు ఇష్టమైన కథకుల కేతు విశ్వనాథరెడ్డి గారున్నారు. నేను ఇష్టపడిన తెలుగు కథల్లో ఆయన రెక్కలు కథ ఉంది. నాకు దక్కిన అదృష్టాల్లో చిన్నతనాననే చదువుకున్న ఆ కథకు పెద్దయ్యాకా బొమ్మ వేయడం అని రాసి పెట్టబడి ఉంది. రెక్కలు అనే ఆ కథకు నా బొమ్మ ఎంత బాగా కుదిరింది అంటే, అంతకన్నా బాగా ఇంకెవరు ఆ కథను బొమ్మల్లో చెప్పలేరన్నంతగా. కేతు గారికి నాకు వ్యక్తిగత పరిచయం తక్కువే, నన్ను ' నాయనా ' అని సంభోదిస్తూ ఆయన మాటాడేవారు. మహానుభావులకు, గొప్పవారికి, ప్రాంతీయాభిమానం లేదంటారు. నా పూర్వ జన్మ పుణ్యం కొద్ది నేను ఆ కేటగిరివాడిని కాకపోవడం వలన కేతు విశ్వనాథరెడ్డి పలకరించే ఆ ’"నాయనా" అనే పిలుపులో మా రాయలసీమ ఒక మానవ ఆకారం రూపు దాల్చి పలకరిస్తున్నట్టుగా పులకించి పోతాను నేను. పెద్దలు, ఇష్టులు, నాకు దగ్గరువారు శ్రీ మైనంపాటి భాస్కర్ గారు కూడా నన్ను అల్లానే పిలిచేవారు. నాకు ప్రాంతీయాభిమానం పుష్కల బాగా ఉంది. నాకు తెలిసిన కేతు విశ్వనాథరెడ్డి గారి ఇంకా పెద్ద గొప్పతనం ఏమిటంటే ఆయన విశాలాంద్ర వారు ప్రచురించిన కొకు సమగ్ర సాహిత్యానికి సంపాదకీయం వహించడం. తరాలు గడిచినా ఆ పుస్తకాల విలువ ఎన్నటికీ తరగనంత నాణ్యమైన పనిగా చేసి తెలుగు పాఠకుల చేతిలో పెట్టడం. కోకు గారి పుణ్యమో, లేదా నావంటి కొకు అభిమానుల పుణ్యమో తెలీదు కానీ కుటుంబరావు గారి రచనలు ఒక ఎత్తయితే దానికి వందల ఫుట్నోట్స్ చేర్చి ఆ సాహిత్యాన్ని ఇంకాస్త ఎత్తు పెంచారు కేతు గారు. రాను రాను ఇంకా మళ్ళీ మళ్ళీ కొకు రచనా సంపుటాలు వస్తున్నాయి కానీ కొత్తగా వచ్చే వాటి గురించి మాట్లాడుకోవడం శుద్ద దండగ. ఈ కొత్తగా తెచ్చే పుస్తకాల ముద్రణలో సరైన ఎడిటింగ్ లేక , అచ్చుతప్పుల పురుగు పట్టి లోపలి రచనలు ఎట్లాగూ నాశనం అయిపోతున్నాయి. చేయవలసినంత ఆ నాశనపు పని సంపూర్ణం కాగానే పుస్తకాల అట్ట మీద కుటుంబరావు గారి ఫోటో బదులుగా, టెలిఫోన్ సత్యనారాయణ గారి బొమ్మ వేసి కొకు రచనలు అని నమ్మించే, అమ్మించే నాటికి చేరుకొవడానికి తెలుగు సాహిత్యం, దాని ముద్రణ ఎన్నో అడుగుల దూరంలో లేదు. వాటిని సరైన దారిలో పెట్టగలిగిన కేతులు మరియొకరు మనకు లేరు. కేతు గారిని రచనల పరంగా మాత్రమే ఎరిగి ఉన్నప్పట్టికీ ఆయనని ప్రత్యక్షంగా తెలిసి ఉండని కాలానికి ముందే హైద్రాబాదులో ఆర్టిస్ట్ మోహన్ గారు, పతంజలి గారిని ఎరిగి ఉన్నాను నేను. పతంజలి గారి "ఖాకీ వనం" వ్రాసిన కొత్తలో దానిని విశాలాంద్ర నవలల పోటీకి పంపితే ఆ నవలను వెనక్కి పంపించారు. ఆ నవలా పోటీ న్యాయనిర్ణేతల కమిటీ లో కేతు ఉండేవారని , ఆయన ఈ నవలను కాదన్నారని మోహన్ గారికి, పతంజలి గారికి ఆయన మీద కాస్త మంట ఉండేది. మోహన్ గారిలో ఇంకో ఒక ప్రత్యేక గుణం ఉండేది. వ్యక్తిగతంగా మనకంటూ తెలియని ఎవరి మీదయినా సరే మనలోకి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలివిగా ఇంజెక్ట్ చేసేవాడు. తనకు ఇష్టమైన వ్యక్తుల గురించి అతి గొప్పగా, అయిష్టుల గురించి అతి చెత్తగా స్వీకరించడాన్ని మన బుర్రలోకి చొప్పించేవాడు. ఎవరి సంగతో ఏమో కానీ, నేను మోహన్ గారికి అత్యంత అభిమానిని కాబట్టి ఆయన ఎస్సంటే ఎస్సని, నో అన్నది నో అనే అని నమ్మేవాడిని. ఇప్పుడు కేతు గారు లేరని కాదు కానీ. ఆయన కథలు ఎప్పటి నుండో చదివి ఉండటం వలన మోహన్ గారు చెప్పారు. కదా, పతంజలి గారి నవలని తిప్పి కొట్టారు కదాని ఎందుకో కేతు గారి మీద ప్రత్యేకమైన వారి అభిప్రాయాన్ని స్వీకరించి పుచ్చుకున్నది మాత్రం జరగలేదు, ఎందుకో! బహుశా నాకు గల ప్రాంతీయాభిమానమేమో ! ఆర్టిస్ట్ చంద్ర గారికి కేతు గారు అంటే బాగా అభిమానం. కేతు గారికి కూడా చంద్ర గారు అంటే అదే. ఊరికే అటూ ఇటూ తిరిగి ప్రీలాన్సింగ్ బొమ్మలు వేసుకుంటూ ఉండే చంద్రగార్ని పట్టుకుని తను డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరుగా ఉన్న కాలంలో అదే విశ్వవిద్యాలయం లో ఆర్టిస్ట్ కమ్ డిజైనర్ గా హోదా ఇచ్చి ఆ ఇష్టం ప్రకటించుకున్నాడు. కేతు గారి ’కూలిన బురుజు" కథ అంటే చంద్ర గారికి ఇష్టం. దానిని సినిమాగా తీయాలనే కోరిక చంద్ర గారికి ఉండేది. విశ్వనాథరెడ్డిగారి పుస్తకాల కవర్లకు చంద్ర గారి కొల్లాజ్ పొకడలు నాకు ఎప్పుడూ సంభ్రమాన్నే కలిగిస్తూ ఉండేవి. విశ్వనాథరెడ్డి గారు తన కాలేజీ ఉద్యోగబాధ్యతల నుండి రిటైర్ అయ్యాకా సి. సి. రెడ్డిగారి "ఈ భూమి" పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా తన సేవలందించారు. పంజాగుట్టలో ఉండేది ఆ ఆఫీసు. నేను అప్పుడప్పుడు అటు వెళ్ళినపుడు శ్రీ కేతు గారిని కలిసేవాడిని. అక్కడే పొనుగోటి కృష్ణారెడ్డి గారిని కూడా చూసేవాడ్ని. ఆయనా ఈ భూమికి వర్క్ చేసేవారు. అయితే నాకు గుర్తుండి కృష్ణారెడ్డి గారితో ఆంద్రజ్యోతి లో నా తొలి పరిచయం. శ్రీ రమణ గారిని కలవడం కొరకు రోజూ ఆ పత్రిక అఫీసు కి వెళ్ళేవాడిని, ఆ పక్కనే శ్రీ కృష్ణారెడ్డి గారు కనపడేవారు. అదే సి. సి. రెడ్డి గారి ఆఫీస్ లో అప్పుడప్పుడూ వంశీ అని ఒక పాత దర్శకుడు గారు కూడా కనపడేవారు. నాకు గుర్తు ఉండి అప్పట్లో "తను నేనూ సావిత్రి" అనే సినిమా తీస్తున్నా, టైటిల్ ఎలా ఉంది అని నన్ను ఒకసారి అడిగారు. అప్పటి సాహితీ సభల్లో తరుచుగా కేతు గారు కనపడినా , ఊరికే భక్తి గా చూసి పలకరింపుగా నవ్వేవాడిని తప్పా అతి వేషాలు వేసి అతి చనువు నటించే పాడులూ పద్దతుల అవసరాలు నాకు ఎప్పుడూ ఉండేవి కావు. అలా అలా అలా చాలా రోజుల తరువాతా కేతు గారు ఇక ఇక్కడ లేరని, కడపకు వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయారని కబురు తెలిసింది. ఆర్టిస్ట్ చంద్ర గారికి 70 ఏళ్ళు వచ్చిన సందర్భానా నేను ’"ఒక చంద్రవంక" అనే పుస్తకం ఒకటి తీసుకు వచ్చా. ఆ సందర్భానా చాలా విరామం అనంతరం కేతు గారికి ఫోన్ చేసి చంద్ర గారిమీద ఒక వ్యాసం వ్రాసి ఇమ్మని ఆడిగా. అదే చివరి సారిగా ఆయనతో మాట్లాడ్డం. అది 2016. ఈ మధ్య కాలంలో అయితే చాగంటి తులసి గారి ముచ్చటైన రచన "ఊహల ఊట" కి కేతు గారు ముందు మాట రాస్తున్నారని ఆవిడ భలే సంతోషంగా చెప్పారు. నాకూనూ సంబరం అనిపించింది. "మంచి కథలు రాయాలనే పోటి మనస్తత్వాన్ని నా కంటే మంచి కథకుల నుంచి నేర్చుకున్నాను. మరో రకంగా కథా రంగాన్ని ఏలాలనుకునే అల్పుల మీద కోపంతో రచనకి దిగాను" అని చెప్పుకున్న విశ్వనాథరెడ్డి గారికి పొద్దస్తమానం సాహితీ చలామణిలో ఉండాలని అనుకున్న రచయిత గా మా వంటి కథా ప్రేమికులకు ఎప్పుడూ అనిపించలేదు. ఆయన జంటిల్ మేన్, ఆయన మంచి రచయిత, ఆయన మా రాయలసీమ పెద్ద మనిషి, ఆయన చల్లగా నవ్వే పెద్ద మర్రిమాను. ఈ రోజుకీ రేపటికీ కూడా ఆయన కథల అదే మాను మాదిరిగా, ఆ ఆకుల గలగల మాదిరిగా వినపడుతూ, కనపడుతూనే ఉంటాయి. అవి చదివినప్పుడల్లా మన మనసుల మీద ఆయన చల్లగాలిలా వీస్తూనే ఉంటాడు.--అన్వర్ సాక్షి(చదవండి: 'గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు ఇలస్ట్రేషన్' కాలపు మనిషి.. గోపి!) -
ఎంత చేయాలో అంత చేశారు!
జరుగుబాటున్న కుటుంబంలో పుట్టిన కేతు విశ్వనాథ రెడ్డి కడుపు నిండినవాళ్ళ కోసం రాయలేదు. కడుపు కాలినవాళ్ళ కోసం రాశారు. రాయలసీమను పట్టి పీడిస్తున్న రెండు సమస్యలు – కరువు, ముఠాతత్వం గురించి అత్యుత్తమ కథలు రాశారు. స్త్రీ పట్లగల మానవీయ దృష్టికి కూడా ఆయన కథలు నిదర్శనాలు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యాన్ని సంపుటాలుగా వింగడించి పెద్ద చలనం తీసుకొచ్చారు. సామాజిక శాస్త్రాల సహాయంతో సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిన తీరును అనేక వ్యాసాలలో స్పష్టం చేశారు. విరుద్ధ భావజాలం గలవారిపట్ల కూడా గౌరవంగా మాట్లాడేవారు. ఒకరు ఉపయోగకరమైన పని చేస్తే, ఆ కృషి కొనసాగింపునకు ప్రోత్సహించే సంస్కారి. ‘మానవతావాదులు కాని వారెవరూ కమ్యూనిస్టులు కాలేరు’ అన్నారు శ్రీశ్రీ ఒక ఇంటర్వ్యూలో. కులం, మతం, జెండర్, ప్రాంతం వంటివాటితో సంబంధం లేకుండా మనుషులను ప్రేమించడమే మానవవాదం. ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి (10 జూలై 1939– 22 మే 2023) అలాంటి మానవ వాది, మానవతావాది. లేకుంటే ‘అమ్మవారి నవ్వు’ అనే మంచికథ రాసేవారు కాదు. ‘బోధి’, ‘వేర్లు’ నవలికలు రాసేవారు కాదు. ‘శశిశ్రీ’, రహమతుల్లా, షేక్ హుస్సేన్ సత్యాగ్ని లాంటి ముస్లిం రచయితలను, హయాత్ అనే ఆచార్యుని సోదరులుగా గౌరవించేవారు కాదు. విశ్వనాథరెడ్డి వ్యవసాయక కుటుంబం నుండి వచ్చారు. బాగా జరుగుబాటున్న కుటుంబంలో పుట్టిన ఆయన కడుపు నిండిన వాళ్ళ కోసం రాయలేదు. కడుపు కాలిన వాళ్ళకోసం రాశారు. అదే ఆయన మానవత్వం. మానవతావాది కనుకనే, రాయలసీమను పట్టి పీడిస్తున్న రెండు సమస్యలు – కరువు, ముఠాతత్వం గురించి ‘జప్తు’, ‘విరూపం’, ‘సానుభూతి’ లాంటి అత్యుత్తమ కథలు రాశారు. ఆయన ఆకాంక్ష , ఆయన స్వప్నం కరువు, కక్షలు లేని రాయలసీమ. ఆయన బంధువర్గం ఫ్యాక్షన్ గొడవల్లో పడి నలిగిపోవడం చూశారు. ఫ్యాక్షన్ వల్ల ఇతర ప్రాంతాల దృష్టిలో రాయలసీమ గౌరవం దెబ్బతింటున్నదని గ్రహించి ‘వెనకా ముందు’ కథ రాశారు. ఫ్యాక్షనిస్టులు చివరికి ఒక్కటై, వాళ్ళ కోసం పేదలు బలైపోతున్న అమానుషత్వాన్ని ‘పీర్లసావిడి’ కథలో చిత్రించారు. నేను శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్న సమయం (1973–1977)లో బహుశా 1975 ప్రాంతంలో విశ్వనాథ రెడ్డి పరిచయమయ్యారు. నన్ను ‘చంద్రా’ అని పిలిచేవారు. వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఒకసారి నన్ను తిరుపతిలో కేతు ఇంటికి పిలుచుకొని వెళ్ళారు. ఆ సమయంలో కేతును గురించి వల్లంపాటి నాతో ‘ఈయన పైకి చూడడానికి నవ్వుతూ కనిపిస్తాడు కానీ, పెద్ద రౌడీ’ అన్నారు. అప్పుడు కేతు నవ్వుతూనే ‘చంద్రా! ఆయన మాటలు నమ్మొద్దు’ అన్నారు. అలా మొదలైన మా పరిచయం నిరాఘాటంగా కొనసాగింది. కేతు మార్క్సిస్టు అయినా, మార్క్సిస్టులు కాని చెరుకు పల్లి జమదగ్ని శర్మ, పేరాల భరత శర్మ వంటి సహాధ్యాపకుల గురించి ఉన్నతమైన మాటలు చెప్పేవారు. ఒకరిని చూస్తే ఇంకొకరికి పడని కాలంలో విరుద్ధ భావజాలం గలవారిపట్ల గౌరవంగా మాట్లా డడం నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఒకరు ఉపయోగకరమైన పని చేస్తే, దానిని మెచ్చుకొని, ఆ కృషి కొనసాగింపునకు ప్రోత్సహించే గొప్ప సంస్కారం ఆయనది. ‘నేను చాలా స్లో రైటర్ని’ అని విశ్వనాథరెడ్డి చెప్పుకొన్నారు. సమాజాన్ని దహించి వేస్తున్న రుగ్మతలను సమగ్రంగా మనసులో రూపుకట్టించుకొని రాయడానికి చాలా సమయమే తీసుకొనేవారు. ‘వాన కురిస్తే’ కథలో రైతు పాపయ్య, ఆయన కుటుంబమంతా వానకోసం ఎదురు చూడడంలోనే జీవితాలు గడిచిపోతాయి. కరువు కాలంలో ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే గడ్డిని ఆధిపత్య వాదులు పేదలకు అందకుండా తస్కరించే వాస్తవికతను ‘గడ్డి’ కథలో చిత్రించారు. ఈ అమాన వీయతను ‘నా బట్టా! నువ్వు రైతు కొంపల్లోనే పుట్టి నావా? కాపోడి వేనా?’ అని ఒక పేద మహిళ నిలదీస్తుంది. ఇలాంటి మాటలు రాయాలంటే రచయిత ‘అ–కులీక రణ’ (డీక్యాస్టిఫై) అయితే తప్ప సాధ్యం కాదు. అకులీకరణ చెందా లన్నా, అవర్గీకరణ చెందా లన్నా రచయిత హృదయంలోని మానవ త్వమే దారి చూపుతుంది. పులివెందుల కాలువ వస్తు వుగా ఆర్తితో రాసిన ‘పొడినిజం’ కథలో కరువుతో ఎండిపోయి,పంటలు పండని నేలను ఒక విద్యార్థి దృష్టికోణం నుండి ‘అచ్చరాలు తుడిచేసిన పలకలాగా ఉంది’ అనిపిస్తాడు. పంటలు పండించి బతికే రైతులు కరువు వల్ల సారా వ్యాపారులుగా మారి, పోటీలు పడి, ఆఖరికి ఫ్యాక్షనిస్టులుగా మారి ఒకర్నొకరు చంపుకొనే అమానుష దశకు చేరుతున్న వాస్తవమే ‘కూలిన బురుజు’ కథ. భారతీయ సమా జంలో వితంతువులు పీడిత వర్గం. వాళ్ళపట్ల సమాజం ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందో ‘ముఖదర్శనం’ కథలో చిత్రించారు. కేతు విశ్వనాథరెడ్డి రెడ్డి స్త్రీపక్షపాతి. అలా కాని రచయితలు మానవతా వాదులు కారు. ‘తారతమ్యం’, ‘మారి పోయారు’ వంటికథలు ఆయ నకు స్త్రీ పట్లగల మానవీయ దృష్టికి నిదర్శనాలు. ‘ఎందరి దయా దాక్షిణ్యాల మీద ఆడవాళ్ళు బతకాలి?’ అని ‘తారతమ్యం’ కథ ప్రశ్ని స్తుంది. ఈ కథ 1977 నాటిది. అప్పటికి తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం పుట్టలేదు. డబ్బు కొంతమంది చేతుల్లో ఉండిపోవడాన్ని వేమన వంటి ప్రాచీన కవులే గుర్తించారు. ఆధునిక కాలంలో మార్క్సిజం నేర్పిన పాఠాలతో ప్రభావితమైన అభ్యుదయ రచయితలు అసమ ఆర్థిక వ్యవస్థ çసృష్టించే వైరుధ్యాలను బలంగా చిత్రించారు. ‘డబ్బు ఈ సంఘంలో అన్నింటినీ శాసిస్తోంది’ అన్న అవగాహన విశ్వనాథరెడ్డిది. ఈ అవగాహనతో ‘చీకటితప్పు’, ‘దాపుడుకోక’, ‘చెదిరిన గుండెలు’ వంటి విలువైన కథలు రాశారు. ‘దాపుడుకోక’ కథలో చెన్నమ్మ పేదరికం మానవత్వం ఉన్నవాళ్ళను కలవరపరుస్తుంది. సంపద ఒకరి చేతిలో ఉండే వ్యవస్థలో పీడితులు కూడా సంపద తమ చేతికి వేస్తే, పీడకులుగా ఎలా మారతారో ‘సొతంత్రం’ కథలో సాయమ్మ పాత్ర ద్వారా చూపించారు. మార్క్సిజం వ్యక్తి గత ఆస్తిని వ్యతిరేకిస్తుంది. ఆ దృష్టి ఈ కథలో కనిపిస్తుంది. ఆయన కథలు చదివితే మన సంస్కారంలో ఒక కదలిక వస్తుంది. వర్తమాన ఆర్థిక రాజకీయ సాంఘిక వ్యవస్థ మీద మనల్ని పునరాలోచింప చేస్తాయి. ప్రజలకు సేవ చేయడానికి ప్రజాధనాన్ని జీతాలుగా ఇచ్చి ఉద్యోగులుగా ప్రభుత్వం నియమిస్తుంది. ఆ ఉద్యో గులు అదనపు ఆదాయం కోసం ప్రజలను పీడించడాన్ని సహించరు అభ్యుదయ రచయితలు. ‘చక్రబంధం’, ‘పద్ధతి’ (విద్యారంగం), ‘అనధికారం’, ‘ఆ రోజుల్లో వస్తే’, ‘సందాకబళం’, ‘అంతర్ముఖం’ (పోలీసు శాఖ), ‘పారు వేట’ (అటవీ శాఖ), ‘దప్పిక’ (రెవెన్యూ), ‘వైరుధ్యం’ (పంచాయతీ రాజ్) వంటి కథల ద్వారా కార్యనిర్వహణ వ్యవస్థలోని అమానుషత్వాలను ప్రతిబింబించారు కేతు. ప్రాంతాల మధ్య వైరుధ్యాలను కూడా ‘తేడా’, ‘ఒక దృశ్యం– మరొక చిత్రం’ వంటి కథల్లో ఆవిష్కరించారు. ‘శిలువ వేసిన మనుషులు’ వంటి కథలలో దళితుల జీవితాల లోని దైన్యాన్ని ప్రతిపాదించారు. పల్లెలు, నగరాలు, భారతదేశం, విదేశాలు – వీటి మధ్య తేడాలను ‘రెండు ప్రపంచాల మధ్య’, ‘దగ్గరైన దూరం– దూరమైన దగ్గర’, ‘అంత్యాక్షరి’ వంటి కథలలో కంటికి కొట్టి నట్లు చిత్రించారు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, కేతు విశ్వనాథరెడ్డి కథలు పొడినిజాల పట్ల తడిగీతాలు! కేతు శాస్త్రీయమైన సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు. ‘కడప ఊర్ల పేర్లు’ అంశం మీద పరిశోధించి, ఓనమాస్టిక్స్ అనే ప్రత్యేక అధ్య యన విభాగానికి పునాది వేశారు. సామాజిక శాస్త్రాల సహాయంతో సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిన తీరును అనేక వ్యాసాలలో స్పష్టం చేశారు. ‘దృష్టి’, ‘సంగమం’, ‘పరిచయం’ వంటి గ్రంథాలు ఆయన విమర్శన గాఢతకు నిదర్శనాలు. సార్వత్రిక విశ్వవిద్యాలయంలో తెలుగు వాచకాల్లో విప్లవం తీసుకొచ్చారు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యాన్ని సంపుటాలుగా వింగడించి విలువైన సంపాదకీయాలు రాసి పెద్ద చలనం తీసుకొచ్చారు. గొప్ప విద్యావేత్త. దూరవిద్యా విధానం మీద ఆయన చేసిన కృషి ‘భాషాబోధన, విద్య– మార్పులు, ప్రాసంగికత’ అనే పుస్తకంగా వచ్చింది. ‘రాయలసీమ రాగాలు’, ‘చదువుకోలేదు’ వంటి పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహ రించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం, అజోవిభొ కందాళై పురస్కారం వంటివి ఆయనకు దక్కాయి. ఒక మధ్య తరగతి మేధావి, ఆధునిక రచయిత తన సమాజానికి ఎంత చేయాలో అంత చేశారు! రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాసకర్త తెలుగు సాహిత్య విమర్శకులు -
అన్నదాతలు
కేతు విశ్వనాథరెడ్డి ‘దానాల్లో కల్లా అన్నదానం గొప్పద’ంట! ‘పెట్టే చెయ్యిని కరవకూడద’ంట! ‘చేసుకున్నోళ్లకి చేసుకున్నంత మహాదేవ’ అంట! మా తాత రోజుకు పదిసార్లన్నా యీ సామెతలను చెపుతాడు. అందుకేనేమో మా అమ్మా చెప్పింది - ఒకరికింత పెట్టడం వల్లనే తాత ఇంత ఆస్తి సంపాదించాడని. మా తాతకు చాలా పెద్ద ఆస్తి ఉంది. నిచ్చెనమెట్ల వెంకటేశం అంటే మా ప్రొద్దుటూర్‌లో తెలియనివాళ్లుండరు. మా తాతను అందరూ కోటీశ్వరుడని అంటారు. మా తాత మాత్రం ‘నాదేముందర్రా నా కంటే కుబేరులుండగా’’ అంటాడు. మా తాతకు పెద్ద బజార్లో చాలా పెద్ద సరుకుల అంగడి ఉంది. వూళ్లో కల్లా పెద్ద బట్టలషాపుంది. చిన్న బజార్లో రెండు బ్రాందీ షాపులున్నాయి. మందుల షాపుంది. బస్టాండు దగ్గర పెట్రోలు బంకుంది. ఒక ఆయిలు మిల్లుంది. ఒక పత్తి జిన్నింగ్ మిల్లుంది. పెద్ద కమీషను మండీ ఉంది. ఒక సినిమా హాలు కూడా కడుతున్నారు. మా తాత చెప్పే కుబేరులకు మా తాత కంటే ఇంకా యేమేమి ఉంటాయో?మా నాయన చనిపోకముందు మా అమ్మ కూడా తిరిపెగాళ్లకు లేదనకుండా అన్నం పెట్టేది. మాకెందుకు మా తాతలాగా ఆస్తి రాలేదో నాకు తెలియదు. మా తాత నా మాదిరి అయిదో తరగతే చదివినాడు. మా నాయన బి.ఎ. చదివినాడు. యిది నేను మా అమ్మతో అంటే, ‘‘మీ నాయనకు బతికేది తెల్దు’’ అంది.‘‘మరి నువ్వు లేదనకుండా ఒకరికి పెట్టిన దానివేనే?’’ అని అడిగినా.‘‘పోయిన జన్మలో యేం పాపం చేసినానో? అంతా మన ఖర్మ’’ అంది.మా అమ్మ మాట్లాడితే జన్మ, పాపం, పుణ్యం, కర్మ అంటుంది. నాకేమీ అర్థం కావు. అప్పటికి నాకు తెలిసిన విషయాలు: మా నాయన నా చిన్నతనంలోనే పోయినాడు. యే ఉద్యోగంలోనూ నాలుగు రోజులు కుదురుగా లేడంట! ముక్కుకు సూటిగా పోవడమేనంట! వున్న కాస్త ఆస్తీ మా నాయనకు వచ్చిన జబ్బుకోసం ఖర్చు అయిందట! అదెంత జబ్బో నాకు తెలియదు. మా అమ్మ మా తాత తమ్ముడి కూతురు. మా నాయన పోయినాక, మాకెవరూ దిక్కులేరు. వెంకటేశం తాతే మమ్మల్ని దగ్గరకు తీసినాడు. మా తాతకు మేము చాలా రుణపడి వున్నామని మా అమ్మ అంటూ ఉంటుంది. రుణం అంటే బాకీ. నిజానికి మా తాతకు మేమేమీ బాకీలేము. మా తాతే మాకు బాకీ. తాత వాళ్ల యింట్లో పని అంతా చేసేది మా అమ్మే. అందరికీ వంట చేసేది అమ్మే. ఒక అత్త ఎప్పుడూ మంచం దిగదు. అదేం రోగమో! డాక్టరు దగ్గరకు పోయేటప్పుడు మాత్రం బాగా సింగారించుకుని పోతుంది. మిగతా ఇద్దరు అత్తలూ ఒక్క పని ముట్టుకోరు. రోజుకు నాలుగైదుసార్లు అద్దం ముందు నిలబడటం, కుట్లు కుట్టుకోవడం, పత్రికలు చదవడం, పాటలు వినడం, యేదో ఒకటి నములుతూ ఉండడం వాళ్ల పని. మా అత్తల కొడుకులూ, కూతుర్లూ చదువుకుంటున్నారు. వీళ్లందరి పనులూ మా అమ్మే చేయాల.నేను మా తాత చెప్పే పనులు, మామలు చెప్పే పనులూ చేయాల.మా తాత వాళ్లింటికి వచ్చిన మొదట్లో నన్ను కమీషను మండీలో పెట్టినారు. నా పని ఆఫీసు వూడ్చడం, టీలూ, కాఫీలూ తేవడం. నాకప్పుడు పదకొండేండ్లు. మా మామ పరుపుల మీద వేసిన దిండ్లకు ఆనుకుని కూర్చునేవాడు. రెండు ఫోన్లలోనూ మాట్లాడుతూ ఉండేవాడు - హిందీలో, తెలుగులో. బొంబాయి సేట్లు వచ్చిపోతూ ఉండేవాళ్లు. కమీషను వ్యాపారంలో, మాటలతోనే చాలా డబ్బు వస్తుందని తర్వాత తెలిసింది. రాత్రిపూట పొద్దుపోయినాక మా మామ దగ్గరికి ఎవరో వచ్చేవాళ్లు. నేను బ్రాందీ తెచ్చేవాణ్ని. గంగమ్మ గుడి దగ్గర నుంచీ ‘కడ్డీ చియ్యలు’ తెచ్చేవాణ్ని. యింట్లోకి మాంసం తేకూడదు. మామ బయటే రాత్రిళ్లు తినేవాడు. మా తాతది అంతా పెద్ద నిష్ఠ. నిష్ఠ అంటే పూజలు గీజలూ అవీ కదా! రెండేండ్ల తర్వాత నన్ను ఆయిలుమిల్లు ఆఫీసులో పెట్టినారు. నా పని ఆఫీసులో వాళ్లు చెప్పిన పనులు చేయడం. అప్పుడప్పుడూ హైస్కూలుకు పోయే వాళ్లను చూసి నాకు చదువుకోవాలని ఉండేది. అమ్మతో ఆ మాట అంటే ‘‘చదువుకొని మీ నాయనేం సంపాయించినాడు? వ్యాపారంలో అయితే ఎంతన్నా మీ తాత మాదిరి సంపాయించవచ్చు. బుద్ధిగా పని నేర్చుకో. మీ తాతకు మనసుపడి గురి కుదిరితే పని నేర్పుతూనే వ్యాపారంలో భాగం పెడతాడు. నువ్వు పైకి వస్తావు. మన కష్టాలు గట్టెక్కుతాయి’’ అని అంటుంది.మూడేండ్ల నుంచీ నేను పని నేర్చుకుంటున్నా. ఇప్పుడిప్పుడే నన్ను తూకాలు రాయమంటున్నారు. వేరుచెనక్కాయల అవుటను రాసుకోమంటున్నారు. అన్నట్లు జ్ఞాపకం వచ్చింది. మామ తూకాలు బాగా వేస్తాడు. కాటా దగ్గర నిలబడితే అదేమో గానీ, కాయల వ్యాపారస్తులు తూకాలు తగ్గిపోయినాయని ఏడుస్తారు. ‘నమ్మినవాళ్లను మోసం చేస్తారా?’ అని అడుగుతారు. ‘నమ్మినవాళ్లను గాక నమ్మనివాళ్లను మోసం చెయ్యడమెట్లా?’ అంటాడు మా మామ. లాభాలు ఇద్దరికీ వస్తాయి. కాబట్టి ఎవరూ గట్టిగా తగాదా పడరు. అయితే కాటా తూకం సంగతి వ్యాపారస్తులకు తప్ప, రచయితలకు తెలియదు. వాళ్లకు ఇంటి దగ్గర కాటాలు ఉండవు. అన్నీ గుడ్డి లెక్కలే. పైగా చాలామంది రయితులు తమ కళ్లాల్లోనే కట్టె తూకానికి అమ్ముతారు. మిల్లుకు వ్యాపారస్తులే ఎక్కువగా వస్తారు.రోజూ అవుటను చూసే కాయలను ధర్మఖాతాలోకి వేస్తారు. సంవత్సరం సంవత్సరం పదివేలకు పైగా వస్తుంది. కంపెనీ మొత్తం మీద సంవత్సరానికి లాభంలో నూటికి రూపాయ తీస్తారు. ఆ లెక్కలు నాకింకా తెలియవు. ధర్మఖాతా డబ్బంతా తాత తిరుపతికి పోయి ఖర్చు పెడతాడు. కొంత దేవుడి హుండీలో వేస్తాడు. కొంత ఆఫీసర్లకు ఖర్చు పెడతాడు. ప్రతి దీపావళికి అన్నదానం ఏర్పాటు చేస్తాడు. శ్రీరామనవమికి పానక పందేరం, హరికథా. ఒక సంవత్సరం తాత తనొక్కడే అమ్మవారి శాలకు యాభైవేలు ఇచ్చినాడు. ‘పుణ్యాత్ముడు’ అని పేరు తెచ్చుకున్నాడు. పోయిన దసరా రోజు ఒక కవి మా తాత మీద పద్యాలు రాసి అచ్చేసి పంచినాడు. మా వూర్లో అట్లాంటి కవులంటే మా తాతకు ఇష్టం. అట్లాంటి కవులు మా తాత దగ్గరకు వస్తూ పోతూ ఉంటారు. మా తాత పాతికా పరకా ధర్మఖాతాలో నుంచి తీసి ఇస్తాడు. మరొక రెండేండ్లు గడిచినాయి. మా తాత వ్యాపారంలో నాకింకా భాగం పెట్టలేదు. ఆయనను అడుగుదామంటే అమ్మకూ భయమే, నాకూ భయమే.ఆ మధ్య మా తాతకు పెద్ద జబ్బు చేసింది. మంచం మీదే అన్నీ. మంచం దగ్గర అమ్మ తాతకు రోజుల తరబడి సేవలు చేసింది. ఆ రోజు తాత కళ్లనీళ్లు పెట్టుకొని ‘‘నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సుబ్బమ్మా!’’ అన్నాడు. అమ్మ ఏడ్చింది. నా దిక్కు చూసి చూసి ఏడ్చింది. తాత ఆ రోజే చచ్చిపోయినాడు. ఇంట్లో అందరికంటే మా అమ్మే ఎక్కువగా యేడ్చింది. తాత పెద్దదినం రోజు అన్నదానం జరిగింది. అంత వీధినబడిన ఆకలిని నేనెప్పుడూ చూళ్లేదు. తాతకు ఊరి బయట తోటలో పాలరాతితో పెద్ద సమాధి. సత్రం కూడా పాలీషు రాళ్లతో కట్టించినారు. యేమైందో ఏమో, తాత పోయి సంవత్సరం తిరక్కుండానే మా మామలు భాగాలు పోయినారు. ఆస్తి పంపకం రోజు అమ్మ, మా తాత నా సంగతి ఏమైనా చెప్పి పోయినాడేమోనని మా మామలను అడిగింది. ముందు ఎవరూ ఉలకలేదు, పలకలేదు. రెండో మామ నాకు నెలకు రెండు నూర్ల జీతం ఏర్పాటు చేసినాడు. నేనూ, మా అమ్మా ఒక గుడిసె తీసుకున్నాము.మాకొక గతి చూపించి పోనందుకు వెంకటేశం తాతను అమ్మ రోజుకు ఒకసారన్నా తిట్టేది. ఆమెకు నా దిగులు పెద్దదైంది. ఎక్కడ వ్యాపారంలో ఒక పైసా భాగం పెట్టినా, నా బ్రతుకు బాగుపడేది కదా అంటుంది అమ్మ. యేం లాభం? అమ్మ తాతకు స్వంత కూతురు కాదు. మా అత్తవైపు మార్కాపురం కుర్రవాడెవరో రావడంతో నన్ను మిల్లులోకి మార్చినారు. ఎక్స్పెల్లర్ల దగ్గరా, డికార్డిగేటర్ల దగ్గరా కూలోళ్లతో నేను పని చేయించాల.ఆ పనిలో చేరిన రోజే పప్పు చెరిగే ఒకామె నన్ను చూసి, ‘‘వీళ్ల తాత దరమదాత. బతికుంటే మిల్లులో యీ అయ్యకు భాగం పెట్టేవాడు’’ అని అంది.డికార్డిగేటర్ దగ్గర పనిచేసే రమణయ్య నవ్వుతూనే అన్నాడు: ‘‘తాతా ధర్మాత్ముడు కాదు, మామలూ కాదు, యీ అయ్య కూలోళ్ల మీద కూలోడు కావలసినవాడే.’’రమణయ్య ఎగతాళికి నాకు కోపం వచ్చింది. కసురుకున్నాను: ‘‘ముందు పనిగానీ, బెల్టు తెగిపోయింది చూడు’’ అంటూ. రమణయ్య నవ్వడం మాత్రం ఆపలేదు. బెల్టు సరిచేసి అన్నాడు: ‘‘మాలో వాడివే అని సరదాగా అన్నాను. మీ తాతా మామల భాష మాత్రం నేర్చుకోవద్దు. వాళ్లు వాళ్లే. మనం మనమే.’’ నాకు మరింత కోపం వచ్చింది. కానీ రమణయ్య నవ్వు ముఖం చూస్తే నోరు పెగల్లేదు. నా కంటే రమణయ్య ఏ అయిదేండ్లో పెద్దయి వుంటాడు. మాట్లాడకుండా అక్కడ నుంచి పోయినాను. ఆ రోజంతా రమణయ్య మాటలే జ్ఞాపకం వచ్చినాయి. రమణయ్యకూ లేదా మిల్లులోని ఇతర కూలోళ్లకూ నాకూ తేడా ఏముంది? నాకంటే రమణయ్యకు ఎక్కువ జీతం. నేను రమణయ్య కంటే యే రకంగానూ ఎక్కువ కాదు - కులంలో తప్ప. ఆ రాత్రి మా అమ్మ మామూలుగానే మా తాతమీద ఏదో సణిగింది. ఇంత భాగం పెట్టి పెళ్లి కూడా చెయ్యలేదంటూ. నాకేమైందో కానీ - మా తాతనూ, మామలనూ, డబ్బున్నవాళ్లనూ నా ఇష్టం వచ్చినట్లు తిట్టినా.ఆ రోజు తర్వాత మా అమ్మ, మా తాతను నా ముందు తిట్టడం మానేసింది. ఆ రోజు తర్వాత కూలివాళ్లను నేను కసురుకోలేదు. కూలివాళ్లను నెత్తికెక్కించుకుంటూ పని చెడగొడుతున్నానని మామ ఒకసారి కేకలు వేసినాడు. మా అమ్మ నేను లక్షాధికారి కాకుండానే, నా పెళ్లి చూడకుండానే చనిపోయింది. నా జీతం అంతవరకు ఒక్క దమ్మిడీ పెంచని మా రంగయ్య మామ, అమ్మ పెద్దదినం రోజు ఖర్చంతా భరించినాడు. నా జీతమే పెంచి వుంటే మరింత మంచి తిండి తిని మా అమ్మ మరికొన్నేండ్లు బతికి ఉండేది. నా ఒంటరి బతుక్కు యిప్పుడు రమణయ్య తోడయ్యాడు. రమణయ్య ద్వారా నాకు చాలా విషయాలు తెలిసివస్తున్నాయి. పత్తి రాట్నాల దగ్గర పనిచేసే రమణయ్య చెల్లెలు పార్వతిని నేను పెళ్లి చేసుకున్నాను.దాంతో మా తాత కుటుంబంతో వున్న ఆ కులసంబంధం కూడా తెగిపోయింది. పెళ్లయినాక, జీతం పెంచమని అడిగాను. పిండిమిల్లు కట్టడంలో చాలా ఇబ్బందులు పడుతున్నాననీ, మిగతా వ్యాపారాల్లో నష్టాలు వచ్చినాయనీ నా జీతం పది రూపాయలు పెంచినాడు. ఆ నెలలోనే మా తాత తద్దినం. పెద్ద సంతర్పణ. రాత్రి హరికథ.మరుసటిరోజే, ఎక్స్‌పెల్లరు దగ్గర పనిచేసే ఏసు ప్రమాదంలో చనిపోయాడు. ఏసుదే పొరపాటని తేల్చినారు. పెద్దమామ ఆఫీసర్లతో మాట్లాడినట్టు తెలిసింది. నష్ట పరిహారం కింద ఆరుమంది పిల్లలూ, యిద్దరు ముసిలోళ్లు వున్న ఏసు కుటుంబానికి వెయ్యి రూపాయలిచ్చినారు. ఏసు ఇరవై అయిదేండ్ల నుంచీ మిల్లులో పని చేస్తున్నాడు.రమణయ్య నేరుగా మా మామ - కాదు మా మిల్లు ఓనరు - నిచ్చెనమెట్ల రంగయ్య దగ్గరకు వెళ్లి, ‘‘చచ్చిపోయిన మీ నాయన ఖరీదులో వెయ్యో వంతు చెయ్యడా ఏసు?’’ అని అడిగినాడు. యింకా దులిపినాడు. ‘‘మీరు పెట్టే చెయ్యిని కరిచేవాండ్ల’’ని రమణయ్య మీద రంగయ్య కేకలు. ‘‘చేసుకున్నవాళ్లు, చేసుకున్నంత అనుభవిస్తార’’ని శాపనార్థాలు. ఆ భాషంతా అచ్చం మా తాతదే. తేలిపోయింది. రమణయ్యను వుద్యోగంలో నుంచి తీసివేసినారు. సమ్మె మొదలైంది. మిల్లును బలవంతంగా రంగయ్య మూసివేసినాడు. గొడవలు గొడవలుగా వుంది. రాయబారాలూ, రంపులూ. పనివాళ్ల తిప్పలను కళ్లారా చూసినా, అనుభవించినా. యీలోగా ఇండస్ట్రియల్ యెస్టేటులో రంగయ్య తెరిచిన కొత్త ఇండస్ట్రీకి మంత్రి ప్రారంభోత్సవం చేసినాడు. దానిపేరు ‘నిచ్చెన మెట్ల వెంకటేశం అండ్ సన్స్ ఫ్లోర్ మిల్’. మా తాత పేరుమీదుగా సంతర్పణ, ఒక అనాథ బాలుర అన్నదాన మందిరం ఏర్పాటు చేస్తున్నట్లు సభలో ప్రకటన, ప్రశంసలూ, పద్యాలూ - రంగయ్యది తండ్రిలాగే పెట్టే చెయ్యి... వాళ్ల వంశమే కర్ణుడు, శిబిచక్రవర్తుల వంశమని. మిల్లు మూసి మూడు నెలయింది. వెయ్యిమంది ఆడా మగా, పెద్దా చిన్నా, పిల్లా పాపా, ముసలీ ముతకా కడుపులు చేత్తో పట్టుకుని - పండగల అన్నదానం కోసం కాదు, తద్దినాల సంతర్పణ కోసం కాదు - పనికోసం, న్యాయం కోసం... నేను అందరితో కలవడం చూసి తాత వారసులు నాకు విశ్వాసం లేదంటున్నారు. నిజమే. నేను కుక్కను గానందుకు సంతోషిస్తున్నాను. దాంతో మా తాత కుటుంబంతో వున్న ఆ కులసంబంధం కూడా తెగిపోయింది. పెళ్లయినాక, జీతం పెంచమని అడిగాను. పిండిమిల్లు కట్టడంలో చాలా ఇబ్బందులు పడుతున్నాననీ, మిగతా వ్యాపారాల్లో నష్టాలు వచ్చినాయనీ నా జీతం పది రూపాయలు పెంచినాడు.