కథ : అనుకోకుండా ఒక రోజు | anukokunda oka roju story | Sakshi
Sakshi News home page

కథ : అనుకోకుండా ఒక రోజు

Published Sun, Mar 2 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM

కథ : అనుకోకుండా ఒక రోజు

కథ : అనుకోకుండా ఒక రోజు


 .చీమలమర్రి శ్రీనివాసమూర్తి
  తీరా భువనగిరిలో మెలకువ వచ్చి చూస్తే, ఆ పెద్దమనిషి లేడు. పేపర్ ఏమైందో తెలీదు. ఒకరిద్దరి చేతుల్లో పేపర్లు ఉన్నాయిగానీ, అవి నావేననటానికి నిదర్శనం లేదు. అయినా ఉండబట్టలేక ఒకాయనను అడిగితే అది తన పేపరేనన్నాడు.
 
 
 ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఆంధ్రుడిని గుర్తుపట్టడంలో ఆట్టే శ్రమపడాల్సిన అవసరం లేదని వెనుకటికి ఒక రచయిత అన్నట్లు గుర్తు. ఆంధ్రుల లక్షణాలలో కొన్నిటిని ఉదహరించాడు కూడా. పబ్లిక్‌లో పెద్దగా రాజకీయాలు మాట్లాడటం, ఎవడైనా పైకి ఎక్కుతున్నాడంటే కాళ్లు పట్టుకుని కిందకు లాగడం, అడగకపోయినా అలవోకగా గోడ మీద నుంచి సలహాలు విసరటం వగైరా వగైరాలు పుట్టుకతో అబ్బిన విద్యలట. కానీ వాటికితోడు మరో గుణం కూడా ఉంది. అదేమంటే కొనుక్కోగలిగిన స్తోమత ఉండి కూడా కొనుక్కోకుండా పక్కవారి వార్తాపత్రికలను, మాస, వారపత్రికలను అడిగి కొన్నిసార్లు, అడక్కుండా కొన్నిసార్లు లాగేసుకోవడం!
 
 ఈ గుణం గురించి సదరు రచయిత చెప్పాడో లేదో తెలియదు గానీ నేను మాత్రం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మొదట చెప్పిన లక్షణాలను భరించగలుగుతాను గానీ, ఈ పత్రికల విషయంలో మాత్రం నేను అస్సలు సహించలేను. వందలు, వేలు ఖర్చు చేస్తారుగానీ, చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోవటానికి, నాలుగు రూపాయలు పెట్టి ఒక పేపర్ కొనుక్కోరు. సాహిత్యం పట్ల లేని ఉత్సుకత చూపుతారు కానీ, పది రూపాయలు పెట్టి కనీసం ప్రయాణం సమయంలోనైనా పత్రికను మాత్రం కొనరు. ఆ ఆలోచనే తట్టదు. పరాయివాళ్ల పత్రిక చూడంగానే వార్తల మీద అకస్మాత్తుగా ధ్యాస పుట్టుకొస్తుంది. స్తోమత లేనివాళ్ల విషయం వేరు. వాళ్లను క్షమించొచ్చు. కానీ స్తోమత ఉన్నవాళ్లు అరువు పత్రిక కోసం అర్రులు చాస్తే అస్సలు క్షమించకూడదు. నా ఈ కడుపు మంటకు కారణం ఉంది. నా ఆరోపణలకు ఆధారాలు, అనుభవాలు ఉన్నాయి.
 
 ఒకరోజు ఉదయాన్నే వరంగల్ నుండి హైదరాబాద్ బస్సెక్కాను. తోడుగా ఉంటుందని ఒక న్యూస్ పేపర్‌ను కొన్నాను. ఇంటికి రోజూ తెలుగు, ఇంగ్లిష్ పత్రికలు వస్తాయి. ప్రయాణాల్లో అదనంగా కొన్ని పత్రికలను మ్యాగజైన్లను కొని చదవటం అలవాటు. బస్ బయలుదేరేవరకు హెడ్డింగ్స్‌ను చూసి, బయలుదేరిన తరువాత కుదుపులకు చదవలేక, గతుకులు దాటిన తరువాత చదువుదామని పక్కన పెట్టుకున్నాను. అసలే కొత్తగా మొదలైన చత్వారం. కళ్లు ఇంకా పాడవుతాయేమోననే భయం. అదే రైల్లో అయితే ఈ బాధ ఉండదు. నిక్షేపంగా చదువుకోవచ్చు. జేమ్స్ హెడ్లీ చేస్, పెర్రీ మేసన్, ఇర్వింగ్ వాలెస్, హెరాల్డ్ రాబిన్స్‌లు రాసిన నవలలన్నీ రైలు ప్రయాణాల్లో చదివినవే. ప్రయాణాల్లో పుస్తకం కంటే మించిన మిత్రుడు మరొకరు దొరకరు. రాత్రి సరిగా నిద్రలేకపోవటం చేతనో, పచ్చనిపొలాల మీది నుండి వొస్తున్న ప్రత్యూష పవనాలు కిటికీలో నుండి పలకరించటం చేతనో కళ్లు మగతగా మూతపడసాగాయి. (ఇలాంటి గాలి ఊరొదిలి పెడితే తప్ప దొరకదు. ప్రకృతి ప్రసాదించిన గాలి వెలుతురు నీళ్లు లాంటి వాటికి కూడా ఈ దరిద్రపు ప్రభుత్వాల మీద ఆధారపడాల్సిన దౌర్భాగ్యంలో మనమున్నామంటే మనమీద మనకే జాలేస్తుంది.)
 
 ఎప్పుడు నేను పేపర్ మడిచి పక్కన పెడతానా అని గోరికాడ నక్కలా అవతలి సీటులో కూర్చున్నాయన ఎదురుచూస్తున్నాడులా వుంది, నేను పక్కన పెట్టగానే చూసిస్తానంటూ ఇచ్చేలోపే తీసేసుకున్నాడు. చేతికి రెండు చొప్పున నాలుగు ఉంగరాలు, ఖరీదైన బట్టలు, రిస్ట్ వాచ్. చూడబోతే మూడు నాలుగు రూపాయలకు ఠికాణ లేనివాడిలా లేడు. ఇవ్వనని ముఖం మీదనే మొండిగా చెప్పాలనిపించింది గానీ మర్యాద అడ్డమొచ్చింది. నేను ఇవ్వకముందే తీసుకుంటుంటే చూస్తూ ఉండిపోయాను. నిద్రాదేవి మారాం ఎక్కువవటంతో అలాగే సీటుకు జారగిలబడి నిద్రపోయాను.
 తీరా భువనగిరిలో మెలకువ వచ్చి చూస్తే, ఆ పెద్దమనిషి లేడు. పేపర్ ఏమైందో తెలీదు. ఒకరిద్దరి చేతుల్లో పేపర్లు ఉన్నాయిగానీ, అవి నావేననటానికి నిదర్శనం లేదు. అయినా ఉండబట్టలేక ఒకాయనను అడిగితే అది తన పేపరేనన్నాడు. దాదాపు రెండు గంటల ప్రయాణ కాలంలో అది ఎన్ని చేతులు మారిందో, ఎన్ని ముక్కలైందో తెలియదు. నా ముఖం చూసిన ఒకాయన ‘‘ఇది మీదా సార్?’’ అంటూ లోకల్ ఎడిషన్ ముక్కనొకదానిని అందించాడు.
 
 ఏం చేసుకోను? వుసూరుమంటూ కూర్చుండిపోయాను. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలని ముందే గ్రహించి ఆచరిస్తే ఇప్పుడు ఈ నిట్టూర్పు విడవాల్సిన అవసరముండేది గాదు. తీరా ఘట్కేసర్ రైల్వే క్రాసింగ్ దగ్గర పల్లీలు అమ్మే కుర్రవాడికి కసిగా మిగిలిన పేపర్ ముక్కల్ని ఇచ్చేసి కోపం తగ్గించుకున్నాను. అది మొదలు ఎవరైనా పేపర్ గానీ పత్రిక గానీ, అరువడిగితే నిర్మొహమాటంగా, ‘‘ఇవ్వను’’ అని చెప్పటం అలవాటు చేసుకున్నాను. నోటితో కాకపోతే నొసటితో తిరస్కరించటం నేర్చుకున్నాను. పేపర్ అడిగి లేదు అనిపించుకున్న వాడి ముఖం చూడటం నాకు పరమానందంగా ఉంటుంది. శాడిస్ట్ కింద నన్ను జమ చేసినా ఫర్వాలేదు.
 
 ఒక్కోమారు పేపరో, పత్రికో చదవడం అయిపోయినా పక్కవాడు అడుగుతాడనే అనుమానం కలిగినప్పుడు, ఇంకా తిరగేస్తూనే ఉండిపోతాను. లేదా జాగ్రత్తగా మడిచి అవతలివాడు అడిగే అవకాశం ఇవ్వకుండానే బ్రీఫ్‌కేస్‌లో దాచేస్తాను. నా బ్రీఫ్ కేస్ తెరిచి తీసుకోలేడు గదా. ఒకవేళ అడిగినా పట్టించుకోనట్లు మౌనంగా ఉండిపోయేవాడిని. ఎదురుచూస్తున్నవాళ్లని ఆసాంతం నిరుత్సాహానికి గురిచేయటం నాకు సరదాగా ఉంటుంది. ‘‘అదో తుత్తి’’.
 
 ఒక ఫేట్ ఫుల్ రోజు నేను కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాను. కాజీపేటలో ఎక్కి, డోర్నకల్లో దిగి 10.30కు అక్కడి నుండి బయలుదేరే ప్యాసింజర్ ట్రైన్ పట్టుకొని కొత్తగూడెం చేరాలి. వరంగల్ నుండి డోర్నకల్ ప్రయాణం ఒక ఎత్తు, అక్కడి నుండి కొత్తగూడెం ప్రయాణం మరో ఎత్తు. 10.30కి బయలుదేరే ప్యాసింజర్ అనే ఎడ్లబండి ఏ ఒంటి గంటకో ఒకటిన్నరకో గానీ కొత్తగూడెం చేరదు. ప్రయాణాన్ని సునాయాసం చేసుకోవడానికి నాకు ఉన్న ఒకే ఒక మార్గం పుస్తకాలు, పత్రికలు. నాకిష్టమైనవాటిని ముందే ఇంటి నుండి తెచ్చుకున్నాను. స్టేషన్లో రెండు మూడు మ్యాగజైన్లని కొనుక్కుని చంకకు తగిలించుకునే సంచిలో ఉంచుకున్నాను. సాధారణంగా నేను సాహిత్యపరమైన పత్రికలను ఎక్కువగా చదువుతాను. అవి మిగతావాటిలాగా బుక్ స్టాల్స్‌లో దొరకవు. నేరుగా చందాకట్టి తెప్పించుకుంటాను.
 
  కేంద్ర సాహిత్య అకాడమీ వారి ‘ఇండియన్ లిటరేచర్’ రచన, చినుకు, ప్రతిభ ఇండియా పత్రికలనూ, వాటితోపాటే హెచ్.ఇ.బేట్స్ కథల పుస్తకాన్నీ సంచీలో వేసుకుని ఇంటి నుండి బయలుదేరాను. సంచీలో ఉంచుకుంటే మార్గమధ్యంలో తీయటం, పెట్టటం సులభం. స్టేషన్‌లో రైలు ఆగంగానే, సీటు రిజర్వ్ చేసుకోవటం కోసం, కిటికీలో నుండి పుస్తకాల సంచీని సీటు మీద గిరవాటేసి, ఎదురు సీట్లో కూర్చున్న పెద్దమనిషిని చూస్తుండమని చెప్పాను. క్రాసింగ్ వల్లనో ఏమో రైలు పది నిమిషాలు కాజీపేట్‌లోనే ఆగింది. నేను ప్లాట్‌ఫారం మీదనే నిలబడి, అప్పుడే తీసుకున్న ‘హిందూ’ను తిరగేస్తున్నాను. రైలు కూత వినిపించగానే లోపలికి వెళ్లి కూర్చున్నాను. కిటికీలో నుండి వేయటం వల్లనో ఏమో సంచీలో నుండి పుస్తకాలు కొద్దిగా బయటకు తొంగిచూస్తున్నాయి. వాటిని సర్ది బేట్స్ కథల పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాను.
 
  నా ఎదురుగా కూర్చున్న పెద్దమనిషి చేతిలో - ఎప్పుడు తీసుకున్నాడో ఏమో - నా ‘ఇండియన్ లిటరేచర్’ పత్రిక కనిపించింది. నిమిషం కాలం అసహనానికి గురైనాను. కనీసం నేను వచ్చిన తర్వాత అడిగి తీసుకోవాలనే మర్యాద కూడా పాటించని మనిషిని ఏమనగలను? అంతగా సాహిత్యాభిలాష ఉంటే, చందా కట్టి తెప్పించుకొని చదువుకోవాలి. ఇలా మేనర్స్ లేకుండా అడక్కుండా పరాయి వస్తువును తీసుకోవటం... ఛీ... ఛీ... ఏం మర్యాద?
 
 ఇందాక సీటులో సంచీని ఉంచినప్పుడు చూస్తుండమని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. బహుశా ఆ కర్టెసీకి ప్రతిఫలంగా పుస్తకం తీసుకోవటానికి ఆయనకు హక్కు ఏర్పడిందనుకున్నాడేమో! చూడబోతే మర్యాదస్తుడిలా ఉన్నాడు. అతని చేతిలోని పత్రికను లాగేసుకోవాలనిపించింది గానీ మర్యాదగా ఉండదని మిన్నకుండిపోయాను. దారిపొడవునా బేట్స్ చదువుతున్నా ఈ విషయం పదే పదే మనసులో మెదులుతూనే ఉంది. ఇంతలో రైలు డోర్నకల్ చేరింది. బ్రీఫ్‌కేస్, సంచీ తీసుకున్నాను. ఎదురు సీట్లో ఆ పెద్దమనిషి లేడు. బహుశా ఆయన ప్రయాణం కూడా డోర్నకల్ వరకేనేమో! నా పత్రిక మాత్రం ఆయన కూర్చున్నచోట పెట్టి ఉంది. ఇంకా నయం. దిగిపోయేటప్పుడు తనతో పాటు తీసుకెళ్లి సొంతం చేసుకోలేదు.
 
  పత్రికను తీసుకుని సంచీలో వేసుకుని రైలు దిగాను. వెంబడే రైలు కదిలి వెళ్లిపోయింది. నా ప్యాసింజర్ విజయవాడ నుండి రావాలి. పక్కనున్న వ్యక్తిని అడిగితే అర్ధగంట ఆలస్యంగా నడుస్తున్నదని అనౌన్స్ చేశారని చెప్పాడు. మామూలుగా అక్కడ ఆగంగానే ఒక టీ తాగి ప్లాట్‌ఫారం మీదనే ఉన్న రావిచెట్టు నీడలో కూర్చున్నాను. అర్ధగంట అన్నది గంట కాదని గ్యారంటీ లేదు. ఈ ఎదురుచూడటాలు నాకు కొత్త కాదు. పుస్తకమనే మిత్రుడు పక్కనే ఉంటే ఎంత నిరీక్షణనైనా సహిస్తాను. ఆనందంగా భరిస్తాను. అర్ధగంట లేటు అన్నది అరవై నిమిషాలైంది. తర్వాత ముక్కుతూ, మూలుగుతూ మూడో నంబరు ప్లాట్‌ఫారం మీదికొచ్చింది. అక్కడ ఇంజెన్ మారుతుంది. మరో పది పదిహేను నిమిషాలు ఆగక తప్పదు. సీట్లు దొరకడం కష్టం కాదు. ఒక్కోసారి పడుకుని ప్రయాణించటం నాకు అలవాటే.
 
 రైలు బయలుదేరేముందు నింపాదిగా కూర్చున్న తర్వాత సంచీ తెరిచి, ‘ఇండియన్ లిటరేచర్’ను చేతికి తీసుకుని ఓపెన్ చేసి చూసి అవాక్కయ్యాను. అడక్కుండా పత్రిక తీసుకోవటమే కాకుండా పేపర్‌పై పేరు కూడా రాసేసుకున్నాడు. పట్టరాని కోపం వచ్చింది. ఆ మనిషి నా ఎదురుగా ఆ క్షణం ఉండుంటే లాగి లెంపకాయ కొట్టుండేవాణ్ని. మరోమారు నా మనసంతా అతని మీద అసహ్యత ఆవహించింది.
 దాదాపు గంటన్నరకు పైగా పత్రికలో లీనమైన నాకు కొత్తగూడెంలో కంపార్టుమెంటు ఖాళీ అవుతుండటంతో ఈ లోకంలోకి వచ్చాను. హడావుడిగా సంచీ తెరిచి పత్రికను లోపల పెట్టబోతుంటే కనిపించిన దృశ్యం నన్ను నోరెళ్లబెట్టించింది.
 నా ‘ఇండియన్ లిటరేచర్’ పత్రిక నా సంచీలోనే పదిలంగా ఉంది.
 
 రైలు బయలుదేరేముందు నింపాదిగా కూర్చున్న తర్వాత సంచీ తెరిచి, ‘ఇండియన్ లిటరేచర్’ను చేతికి తీసుకుని ఓపెన్ చేసి చూసి అవాక్కయ్యాను. అడక్కుండా పత్రిక తీసుకోవటమే కాకుండా పేపర్‌పై పేరు కూడా రాసేసుకున్నాడు. పట్టరాని కోపం వచ్చింది. ఆ మనిషి నా ఎదురుగా ఆ క్షణం ఉండుంటే లాగి లెంపకాయ కొట్టుండేవాణ్ని.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement