నా శ్రీశ్రీ | April 30th Sri Sri Jayanthi | Sakshi
Sakshi News home page

నా శ్రీశ్రీ

Published Sat, Apr 23 2016 11:22 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

నా శ్రీశ్రీ

నా శ్రీశ్రీ

ఏప్రిల్ 30 శ్రీశ్రీ జయంతి
ఆరోజు ఆగస్ట్ 25 (1956). మనసేం బాలేదు. ఏదో సాధించాలని ఉన్నా సరైన దారేదీ కనబడటం లేదు. తరచుగా పాటల్లో కోరస్‌గా వేస్తూ, సోలో బిట్స్ పాడిస్తూ ఎంకరేజ్ చేస్తోన్న సంగీత దర్శకుడు చలపతిరావుగారున్నారు కదా అన్న ధీమాతో లేని హుషారు తెచ్చుకుని కూర్చు న్నాను. అంతలో మర్నాడు వాహినీ స్టూడి యోలో ‘అమరదీపం’ డబ్బింగ్ పిక్చర్‌లో సోలో బిట్ రికార్డింగు ఉంది రమ్మని కబురు చేశారా యన. ఆనందానికి అవధులు లేవు. 26వ తేదీ ఉదయం... వాహినీ రికార్డింగ్ థియేటర్... నా పాట 2 గంటలకి వచ్చింది. నేను సోలో బిట్ పాడుతున్నాను. ‘మరొకసారి’ అన్నారు. పాడేను.

‘క్లీన్‌గా మరోసారి పాడ మ్మాయి’ అన్నారు. పాడేను. సరిగ్గా రావడం లేదు. ఇంతలో లోపల్నుంచి మాసిపోయిన షరాయీ లాల్చీ, కొద్దిగా పెరిగిన గడ్డం, స్నానం చేసి బహుశా మూడురోజులైనా అయివుంటుంది - ఎడంచేత్తో సిగరెట్ దమ్ము కొడుతూ, కుడి చేయి ఆడించుకుంటూ ఒకాయన వచ్చారు. ‘నువ్వు తెలుగు పిల్లవా అరవదానివా’ అని అడిగారు. ‘తెలుగుదాన్నే’ అన్నాను. ‘నేను రాసింది కై అని కాదు, కాయ్ - తలకాయ్ అని రాశాను. నువ్వు తలకై అని పాడుతున్నావు. ఏదీ ఓసారి సరిగ్గా పాడు’ అన్నారు. నాకెందుకో ఆ అవతారం చూసి చిరాకేసింది. నేను తర్వాత టేకులో కరెక్ట్‌గా పాడేస్తాను అనేసరికి వెళ్లిపోయారు. చలపతిరావుగారు వచ్చారు.

‘ఎవరన్నయ్యా ఆ పిచ్చాయన? స్నానం అయినా చేసినట్లు లేదు. ఆ బట్టలు, అవతారం’’ అన్నాను. వెంటనే అన్నయ్య... ‘‘ఆయనెవరను కుంటున్నావ్, మహాకవి శ్రీశ్రీ’’ అన్నారు. అంతే... కళ్లు తిరిగాయి. కాళ్లూ చేతులూ గడగడ వణికిపోసాగాయి. అక్కడే కూలబడిపోయాను. అదే శ్రీశ్రీతో నా పరిచయం.
   
‘‘నమస్కారం సార్’’ అన్నాను. సమా ధానం లేదు. ‘‘శ్రీశ్రీగారూ... నమస్కారమండీ’’ వెనక్కి తిరిగి ‘‘ఆ... ఎవరు?’’ అన్నారు. ‘‘నేనేనండీ... నా పేరు సరోజ. పాటలు పాడ తాను. మా చెల్లి కూడా పాడుతుంది. డ్యాన్స్ చేస్తుంది. మాకీ ఫీల్డులో ఏమైనా చాన్స్ ఉంటే ఇప్పించండి. నేను బాగా రాస్తాను, కష్టపడి పనిచేస్తాను’’ అంటూ గుక్క తిప్పకుండా అనేశాను. ‘‘నన్ను పట్టుకుంటే ఏం లాభం అమ్మాయ్. ఏ డెరైక్టర్నో ప్రొడ్యూసర్నో పట్టుకుంటే లాభం ఉంటుంది’’ అన్నారు. నాకు ఒళ్లు మండిపోయింది. ‘‘మీకు అవకాశం ఉంటే సహాయం చేయండి, లేకుంటే మానెయ్యండి. అంతేకానీ వీళ్లని పట్టుకో వాళ్లని పట్టుకో అంటారేంటి? మేం పరువు గలవాళ్లం’’ అన్నాను.
 
‘‘అయితే ఈ ఫీల్డుకెందుకొచ్చావ్’’
 ‘‘బుద్ధిలేక. మీలాంటి పెద్దవాళ్లు ఇలాంటి సలహాలిస్తారని తెలీక’’ అని గట్టిగా అనేసి నోరు మూసేసుకున్నాను.
   
ఆరోజు శుక్రవారం. ఇంట్లో ఎవరూ లేరు. స్నానం చేసి అందరు దేవుళ్లనీ ఆరాధించాను. గంట చప్పుడులో వీధి తలుపు కొడుతున్న చప్పుడు వినిపించలేదు. దాంతో వచ్చినవారె వరో విసిగిపోయి గట్టిగా బాదుతున్నారు. వెళ్లి తీశాను. ఎదురుగా శ్రీశ్రీ గారు! ఓవైపు సంతోషం, ఇంకోవైపు గాభరా!
 ‘‘మహాత్మా పిక్చర్స్‌వారు గంధర్వకన్య సినిమా తీస్తున్నారు. నన్ను మాటలు, పాటలు రాయమని బుక్ చేసుకున్నారు. స్క్రిప్ట్ అక్కడికి వెళ్ల్లి రాయాలి.

ఏదైనా పనివుంటే ఇప్పించమని అడిగావు కదా! నాకు అసిస్టెంట్ కావాలి. స్క్రిప్టు అంతా ఫేర్ చేయాలి. ఆర్టిస్టులకి పోర్షన్ రాయాలి. డబ్బింగ్ జరుగుతూ ఉంటే నాతోపాటు ఫాలో అవ్వాలి. నీకిష్టమేనా’’ అని అడిగారు. ‘‘తప్పకుండా చేస్తా నండి. కానీ మీరు చెప్పిన పనుల్లో నాకెందులోనూ అనుభవం లేదు’’ అన్నాను. ‘‘నేను నీకు ట్రైనింగ్ ఇస్తాలే’’ అనేసి వెళ్లిపోయారు.
   
‘‘శ్రీశ్రీ దగ్గర పనిచేయడమేమిటమ్మా? ఇరవై నాలుగ్గంటలూ తాగుతాడు. పైగా స్త్రీ లోలుడు. ఊర్లమ్మట వెళ్లి ఆయన దగ్గర పర్మి నెంట్‌గా సెటిలయ్యావనుకో, ఎవ్వరూ నిన్ను మంచిగా అనుకోరు. ఆలోచించుకో’’ అన్నారు చలపతిరావు అన్నయ్య. ఆ తరువాత చాలా మందిని అడిగాను. అందరూ ‘‘శ్రీశ్రీ దగ్గర నీలాంటి అమ్మాయి పని చేయడం అంత మంచిగా తోచడం లేదమ్మా’’ అనే అన్నారు. శ్రీశ్రీగారి క్యారెక్టర్ గురించి ఒక్కరు కూడా మంచిగా చెప్పలేదు. కానీ నాలో ఒక గుణం ఉంది. చెప్పుడు మాటలు వినడం అంటే నాకు అసహ్యం.

ఏదైనా కళ్లారా చూడాలి. అప్పుడే నిజం అని నమ్ముతాను. అసలంత గొప్ప వ్యక్తికి ఈ చెడ్డ పేరేమిటి? బాధ, జాలి కలిగాయి. ఇది పాడు ప్రపంచం. ఎవర్నీ మంచిగా బతక నివ్వదు. నిజానిజాలు దేవుడికే తెలియాలి. మహానుభావులు, గొప్పవారు అంటూనే ఆయన్ని ఆడిపోసుకుంటున్నారంతా. అన్న వాళ్లెవరైనా ఆయనకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారా, ఒక్కరైనా అండగా నిల్చున్నారా అంటే అదీ లేదు. ఆయన్ని బాగు చెయ్యడానికి ప్రయత్నిస్తాను. వ్యసనాల నుంచి మళ్లిస్తాను. బాగుపడితే ఇద్దరం బాగుపడతాం. చెడిపోతే ఇద్దరం చెడిపోతాం. ఇది నా నిశ్చయం.
   
అర్థం లేని వాదన, చిరాకు, నిమిషానికో మూడ్... శ్రీశ్రీగారితో వేగడం కష్టమే. కానీ ఏం చేస్తాం? ఎవరి దగ్గరైనా పని చేయాల్సిందే కదా అని ఎప్పటికప్పుడు సర్దుకు పోయేదాన్ని. మూడ్ వస్తే ఆరు నెలల పని ఆరు రోజుల్లో చేసేసి ఆశ్చర్యపరిచేవారు. లేదా అసలు ఏమిటీ మనిషి అనిపించేలా ప్రవర్తించేవారు. పూర్తి నిరాడంబ రంగా ఉంటూ ఎవ్వరేమన్నా పట్టించుకోని తత్వం ఆయనది. బడాయిలు, గొప్పలు, గర్వం, అహంభావం, అహంకారం ఏ కోశానా కన బడవు. కానీ ఎవరైనా తనని కంట్రోల్ చెయ్య డానికి ప్రయత్నిస్తే మాత్రం ఎంత కోపమో!
 
ఆరోజు ఆరు గంటల యాభై నిమిషాల కల్లా థియేటర్లో అడుగుపెట్టాం. మిగిలిన ఆర్టిస్టులంతా వచ్చేశారు. జగ్గయ్యగారి కోసం వెయిటింగ్. పదకొండు వరకూ ఆయన సోలో లూప్స్ తీస్తూ ఉంటే తర్వాత సావిత్రి, కన్నాంబ, రమణారెడ్డిగార్లు వస్తారు. అలా ప్లాన్ చేసుకుని కూర్చున్నాం. ఏదైనా ప్లాన్ చేస్తే శ్రీశ్రీగారికి అక్షరాలా అలా జరగాల్సిందే. అందులోనూ టైమ్ విషయంలో వారు చాలా స్ట్రిక్ట్. తొమ్మి దిన్నర అయ్యింది. ఆయన ముఖం కందగడ్డలా అయిపోతోంది. జగ్గయ్యగారు వస్తూనే ‘నమ స్కారం శ్రీశ్రీగారూ’ అన్నారు.

ఆయన రిప్లై ఇవ్వకుండా జగ్గయ్యగారి దగ్గరకు వెళ్లి, తన వాచీ చూపించి ‘‘టైమెంత’’ అని అడిగారు. జగ్గయ్యగారు చెప్పారు. ‘‘నాక్కావలసింది అంతే, నేను వెళ్లిపోతున్నాను’’ అనేసి బైటికి వచ్చేశారు శ్రీశ్రీ. నేను వెళ్లి బతిమాలాను. ‘‘వాళ్లిప్పుడొస్తే నేను పని చేయాలా, నేను కరెక్టుగా వచ్చాను. తొమ్మిది వరకూ వెయిట్ చేశాను. అంతే. నేనీరోజు పని చెయ్యను. రా వెళదాం’’ అన్నారు. ఒకవైపు పెద్ద ఆర్టిస్టులంతా వచ్చేశారన్న హడావుడి, మరోవైపు శ్రీశ్రీగారు పేచీపెట్టి పేరు చెడగొట్టుకుంటున్నారన్న బాధ.

ఇలా చేస్తే ఇంకెవ్వరూ పిక్చర్ ఇవ్వరు. అందుకే నేను కూడా మొండికేశాను. అంతే... ఆయన కోపం తారా పథాన్ని అందుకుంది. ‘సరోజా’ అని ఒక్క అరుపు అరిచారు. ప్రొడ్యూసర్లని పిలిచారు. ‘‘నేను పని చేయాలంటే ముందు ఈవిణ్ని బయటికి గెంటి, తర్వాత నాతో మాట్లాడండి’’ అని, నన్ను చూసి ‘‘గెటవుట్’’ అన్నారు. నాకు తల తీసేసినట్టయ్యింది. అందరి దగ్గరా శెలవు తీసుకుని బయలుదేరాను.
   
ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. నేను ఏడ్చి ఏడ్చి తలనొప్పితో నడుం వాల్చాను. అమ్మ వచ్చి శ్రీశ్రీ వచ్చారని లేపింది. అందరిలో అవమానించినవారు వచ్చేసరికి ఏమనాలో తోచక లేచి వెళ్లిపోయాను. నా వెనకాల వచ్చి ‘సరోజా’ అని పిలిచారు. ఎందుకొచ్చారని అడిగాను.
 ‘‘నిన్ను చూడాలని’’
 ‘‘బతికున్నానా చచ్చానా అనా?’’
 
‘‘నేను స్టూడియోకి రావడం లేదు. నువ్వు వెళ్లకపోతే మనకీ పిక్చర్ పోతుంది. కింద కార్లో ప్రొడ్యూసర్లు కూర్చున్నారు. నేను వెళ్తున్నాను’’ అనేసి వెళ్లిపోయారు. ప్రొడ్యూసర్లు వచ్చారు. ‘‘మీరు వెళ్లిపోయారు, శ్రీశ్రీ చాలా ఫీలయ్యారు. మధ్యాహ్నం తనే వస్తుంది, నేను రాను అని చెప్పేశారు. త్వరగా వచ్చేయండి’’ అని చెప్పి వెళ్లిపోయారు. ఇప్పుడేం చేస్తావని ఇంట్లోవాళ్లు అడిగారు. ‘‘అవమానించినా దానికి తగిన గౌరవం వెంటనే ఇస్తున్నారు, ఇప్పిస్తున్నారు. ఆయన తిక్క ఏమిటో నాకు అర్థం కావడం లేదు’’ అంటూండగా సిగరెట్ దమ్ము చప్పుడు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే శ్రీశ్రీ!
   
మా స్టార్ ప్రారంభమయ్యింది. ఒక్క క్షణం తీరిక ఉండేది కాదు. ‘ఈ అమ్మాయి అడుగు పెట్టింది మొదలు శ్రీశ్రీగారి జాతకమే మారి పోయింది’ అని చెప్పుకోవడం మొదలైంది.
   
‘‘ఈరోజు సాయంత్రం నిన్ను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారమ్మా’’ అన్నారు నాన్న. నా గుండె జారిపోయింది. శ్రీశ్రీగారిని చూడకుండా, ఆయనతో మాట్లాడకుండా నేను ఉండగలనా?  ఏదేమైనా మావాళ్లు పెళ్లి చెయ్యక తప్పదు. నేనీ సినిమా ప్రపంచంతో పాటు శ్రీశ్రీగారికి కూడా మంగళం పాడక తప్పదు. అందుకే సరే అన్నాను. కానీ శ్రీశ్రీగారికి చెప్పలేదు. ఆయనకు పైల్స్ ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు.
 
పది రోజులయ్యింది. శ్రీశ్రీ కోలుకున్నారు. ఓరోజు సాయంత్రం ఆరుగంటలప్పుడు వచ్చారు. నాన్న ఇంట్లోనే ఉన్నారు. ‘‘మా సరోజకి పెళ్లి చేయాలనుకుంటున్నామండీ, సంబంధం కూడా సెటిలయ్యింది’’ అన్నారు.
 ‘‘సరోజకి పెళ్లి చేస్తారా? వీల్లేదు. సరోజ నాకు కావాలి. అది లేకుండా నేను బతకలేను. సరోజ నాకే సొంతం. అది లేకుంటే నేను చచ్చి పోతాను. మీరు సరోజని ఇంకొకడికిచ్చి చేస్తే నేను సముద్రంలో పడిపోతాను’’ అంటూ లేచి చకచకా గేటుదాటి వెళ్లిపోయారు.

‘‘ఏవండీ’’ అని పిలుస్తూ ఆయన వెంటపడ్డాను. చెయ్యి పట్టుకొని ఆపాను. ‘‘నాతో బీచ్‌కి వస్తావా?’’ అని అడిగారు. ‘‘నేను రాను’’ అన్నాను. ‘‘నీ అభిప్రాయం నాకర్థమయింది. వీడెవడను కుంటున్నావు? శ్రీశ్రీ! వస్తావా రావా?’’ అని చాలా నెమ్మదిగా అడిగారు. వెళ్లి కూర్చున్నాం.
 ‘‘నీ కోసం ఏమైనా చేస్తాను. ఐ లవ్ యూ సరోజా. నువ్వు లేకుండా నేను ఉండలేను’’ అన్నారు.
 1958లో శ్రీశ్రీగారు నా మెడలో తాళి కట్టారు.
 (‘శ్రీశ్రీ సంసార ప్రస్థానం’లో సరోజా శ్రీశ్రీ రాసిన విషయాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement