ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. నాకు కండరాలు తరచుగా పట్టేస్తున్నాయి. ‘డి’ విటమిన్ లోపం వల్ల ఇలా జరుగుతుందని విన్నాను. ‘డి’ విటమిన్ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కండరాలు పట్టకుండా ఉండడానికి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా?– ఆర్.సంగీత, నెల్లిమర్ల
గర్భిణిగా ఉన్నప్పుడు చాలామందిలో కాళ్ల కండరాలు పట్టేసినట్లు ఉండడం, కాళ్ల నొప్పులు, కాళ్ల పిక్కలలో నొప్పులు ఉంటాయి. డీహైడ్రేషన్, క్యాల్షియం, మెగ్నీషియం విటమిన్స్ లోపం, బిడ్డ బరువు, తల్లి బరువు కాళ్లమీద పడడం, రక్తప్రసరణ తగ్గడం, బిడ్డ బరువు వెన్నుపూస మీద పడి, అక్కడి నుంచి కాళ్లకు చేరే సరాలు, రక్తనాళాలు ఒత్తుకుని కాళ్లనొప్పులు, కాళ్లలో నీరు చేరడం వంటి అనేక కారణాల వల్ల కండరాలు తరచుగా పట్టేస్తాయి. కేవలం విటమిన్ డి లోపం ఒక్కటే కారణం కాదు. కొన్నిసార్లు విటమిన్ డి మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా, క్యాల్షియం ఎక్కువగా రక్తంలో కండరాలలో చేరుతుంది. అధికంగా శరీరంలో క్యాల్షియం ఉండటం వల్ల కూడా కండరాలు బిగుతుగా ఉండి, కాళ్లు పట్టేసినట్లు ఉండటం జరగవచ్చు. కాబట్టి విటమిన్ డి... అవసరాన్ని బట్టి, డాక్టర్ సలహా మేరకు, కండరాలు పట్టేయడానికి తీసుకోవచ్చు. విటమిన్ డి, చేపలు, గుడ్డు పచ్చసొనలో, పాలలో ఎక్కువగా దొరుకుతుంది. కండరాలకు మసాజ్ చెయ్యడం, చిన్న వ్యాయామాలు చెయ్యడం, మధ్యాహ్నం పూట కొద్దిగా విశ్రాంతి తీసుకోవటం, మంచినీళ్లు ఎక్కువగా తాగటం, ఆహారంలో సరైన పౌష్టికాహారం తీసుకోవటం, పడుకున్నప్పుడు కాళ్ల కింద దిండు ఎత్తుగా పెట్టుకోవడం, వేడి నీళ్లతో కాపడం పెట్టడం లేదా ఐస్‌తో మసాజ్ చెయ్యడం, మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారం అంటే బీన్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవటం వంటి జాగ్రత్తలు పాటించడం వల్ల చాలామందిలోకి కండరాల సమస్య నుంచి చాలావరకు ఉపశమనం దొరుకుతుంది.
నాకు అప్పుడప్పుడు కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. ‘పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్’ వల్ల కూడా ఇలా జరుగుతుందని ఒక ఫ్రెండ్ చెప్పింది. ఇది నిజమేనా? ‘ పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్’ గురించి తెలియజేయగలరు.– బీఆర్, కర్నూల్
ఆడవారిలో పొత్తికడుపు లోపల ఉన్న గర్భాశయం, అండాశయం, ఫెలోపియన్ ట్యూబ్‌లలో ఉన్న కణజాలంలో, ఏదైనా ఇన్‌ఫెక్షన్, ఇంకా ఇతర కారణాల వల్ల వాటిలో వాపు రావడాన్ని పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ (పీఐడీ) అంటారు. దీనిలో కొందరిలో పొత్తికడుపులో నొప్పి, ఎక్కువగా యోని నుంచి తెల్లబట్ట, దురద, వాసన, జ్వరం, మూత్రంలో మంట, కలయికలో నొప్పి, పీరియడ్స్ క్రమం తప్పడం వంటి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఏర్పడవచ్చు. కొందరిలో ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు. ఇది ఎక్కువ మటుకు ఇన్‌ఫెక్షన్, కలయిక ద్వారా బ్యాక్టీరియా క్రిములు, యోని భాగం నుంచి గర్భాశయంలోకి పాకడం వల్ల వస్తుంది. చాలావరకు క్లమీడియా, గోనోరియా వంటి క్రిముల వల్ల ఈ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. పీఐడీని నిర్ధారించడానికి సీబీఎఫ్, ఈఎస్‌ఆర్, సీఆర్‌పీ, స్కానింగ్, వెజైనల్ స్వాబ్ వంటి, ఇంకా ఇతర పరీక్షలు చెయ్యవలసి ఉంటుంది. నిర్ధారణ అయిన తర్వాత అశ్రద్ధ చెయ్యకుండా, యాంటీబయోటిక్స్ మొత్తం కోర్సు వాడవలసి ఉంటుంది. అవసరమైతే దంపతులు ఇద్దరూ వాడవలసి ఉంటుంది. చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేస్తే, ఇన్‌ఫెక్షన్ బాగా ముదిరి, గర్భాశయం దెబ్బతినడం, ట్యూబ్స్ పాడవడం, అలాగే ట్యూబ్స్ మూసుకొని పోయి గర్భం రాకపోవడం, అండాశయాలు, ట్యూబ్స్‌లో చీము చేరడం, వాటిని తొలగించవలసి రావడం వంటి సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి. నీకు అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తుంది అని రాశావు. నీ వయసు ఎంత, వివాహం అయిందా లేదా అనేది రాయలేదు. అది గ్యాస్‌వల్ల కాని, యూరిన్ ఇన్‌ఫెక్షన్ వల్ల కాని ప్రేగులలో సమస్య వల్ల, గర్భాశయంలో సమస్యలు వంటి ఎన్నో కారణాల వల్ల కడుపులో నొప్పి రావచ్చు. అన్ని నొప్పులకు పీఐడీ కారణం కాదు. కాబట్టి నీ నొప్పిని అశ్రద్ధ చెయ్యకుండా డాక్టర్‌ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకోవడం మంచిది.
గర్భిణిగా ఉన్న స్త్రీలు బ్యాక్ పెయిన్, పెల్విక్ పెయిన్ సమస్యలను ఎదుర్కోవడానికి కారణం ఏమిటి? విశ్రాంతి లోపించడం వల్లే ఇలా జరుగుతుందనే మాట చాలాసార్లు విన్నాను. నిజానికి ఎక్కువగా విశ్రాంతి తీసుకున్న వారు కూడా ఈ సమస్యలను ఎదుర్కోవడం చూశాను. అసలు కారణం ఏమిటి?– కె.శాంతి, గూడూరు
గర్భిణిగా ఉన్నప్పుడు, గర్భాశయంలో 9 నెలల పాటు బిడ్డ పెరగటం వల్ల, గర్భాశయం బాగా సాగుతుంది. కండరాల మీద బరువు పెరుగుతుంది. కడుపులో గర్భాశయం... పెల్విక్ ఎముకలకు, వెన్నుపూసకి, కొన్ని లిగమెంట్స్ ద్వారా అతుక్కుని ఉంటుంది. గర్భాశయం సాగేకొద్దీ లిగమెంట్స్ ద్వారా, పెల్విక్ ఎముకలు, వెన్నుపూస మీద ఒత్తిడి పడి, అవి లాగినట్లు ఉండి, గర్భిణీలలో బ్యాక్ పెయిన్, పెల్విక్ పెయిన్ సమస్యలు రావడం జరుగుతుంది. గర్భిణీలలో ప్రొజెస్టరాన్ హార్మోన్ విడుదల వల్ల, వెన్నుపూస కండరాలు, పెల్విక్ కండరాలు వదులయినట్లు ఉండడం, నడుంనొప్పి రావడం జరుగుతుంది. కాన్పు కోసం బిడ్డ బయటకు రావటానికి సహజంగానే పెల్విక్ కండరాలు, ఎముకలు కొద్దిగా వదులు అవుతాయి. మొత్తం విశ్రాంతి తీసుకోవటం వల్ల పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం ఉండదు. ఈ నొప్పుల కోసం ఇంకా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే, కండరాలు ఇంకా పట్టేసి నొప్పి పెరుగుతుంది.డాక్టర్ సలహా మేరకు విశ్రాంతి ఎంత అవసరముంటే అంత తీసుకోవాలి. కొద్దిగా చిన్నపాటి వ్యాయామాలు, వాకింగ్ వంటివి చెయ్యడం వల్ల కొందరిలో ఈ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
డా‘‘ వేనాటి శోభ
రెయిన్‌బో హాస్పిటల్స్
కూకట్‌పల్లి హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment